కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10

రాజు తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా శుద్ధీకరించాడు

రాజు తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా శుద్ధీకరించాడు

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యేసు తన అనుచరులను ఎందుకు ఆధ్యాత్మికంగా శుద్ధీకరించాడో, ఎలా శుద్ధీకరించాడో పరిశీలిస్తాం

1-3. కొంతమంది వ్యక్తులు ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నప్పుడు యేసు ఏమి చేశాడు?

 యేసుకు యెరూషలేము ఆలయం అంటే చాలా గౌరవం. ఎందుకంటే, అది ఎంతోకాలం నుండి భూమ్మీద సత్యారాధనకు కేంద్రంగా ఉంది. యెహోవా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయనకు చేసే ఆరాధన కూడా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. కానీ సా.శ. 33 నీసాను 10న యేసు ఆలయంలోకి వెళ్లినప్పుడు, కొంతమంది వ్యక్తులు దాన్ని అపవిత్రం చేస్తున్నారు. అప్పుడు యేసుకు ఎలా అనిపించివుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుంది?—మత్తయి 21:12, 13 చదవండి.

2 ఆలయంలోని అన్యుల ఆవరణలో కొంతమంది వర్తకులు, డబ్బులు మార్చేవాళ్లు, యెహోవాకు అర్పణలు అర్పించడానికి వచ్చిన ప్రజల దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. a అది గమనించిన యేసు “ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను అందర్నీ బయటికి వెళ్లగొట్టాడు; డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలక్రిందులుగా పడేశాడు.” (నెహెమ్యా 13:7-9 పోల్చండి.) తన తండ్రి ఇంటిని “దొంగల గుహగా” మారుస్తున్న ఆ స్వార్థపరుల మీద యేసు కోప్పడ్డాడు. ఆ విధంగా, ఆలయం పట్ల, సత్యారాధన పట్ల యేసు గౌరవం చూపించాడు. అంతేకాదు, తన తండ్రికి చేసే ఆరాధన పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు!

3 వందల సంవత్సరాల తర్వాత, యేసు రాజైనప్పుడు మరోసారి ఆలయాన్ని శుభ్రపర్చాడు. ఆ ఆలయం, నేడు యెహోవాను సరైన విధంగా ఆరాధించాలని కోరుకునే ప్రతీఒక్కరికీ సంబంధించినది. ఇంతకీ ఏమిటా ఆలయం?

“లేవి కొడుకుల్ని” శుద్ధీకరించడం

4, 5. (ఎ) 1914 నుండి 1919 తొలిభాగం వరకు, యెహోవా అభిషిక్త క్రైస్తవుల్ని ఎలా శుద్ధీకరించాడు? (బి) వాళ్లను శుద్ధీకరించడం అంతటితో పూర్తైందా? వివరించండి.

4 ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో చూసినట్లుగా, యేసు 1914లో రాజైన తర్వాత తన తండ్రితో కలిసి ఆధ్యాత్మిక ఆలయాన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. ఆధ్యాత్మిక ఆలయం అంటే సత్యారాధన కోసం చేసిన ఏర్పాటు. b యేసు ఆ ఆలయాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, “లేవి కొడుకుల్ని” అంటే అభిషిక్త క్రైస్తవుల్ని శుద్ధీకరించాల్సిన అవసరం ఉందని గుర్తించాడు. (మలా. 3:1-3, NW) 1914 నుండి 1919 తొలిభాగం వరకు, యెహోవా వాళ్లను శుద్ధీకరించడం కోసం ఎన్నో కష్టాలు, శ్రమలు వచ్చేలా అనుమతించాడు. సంతోషకరంగా, వాళ్లు ఆ అగ్ని పరీక్షలన్నిటిని తట్టుకుని నిలబడ్డారు. అలా శుద్ధీకరించబడిన ప్రజలు మెస్సీయ రాజుకు ఉత్సాహంగా మద్దతిచ్చారు!

5 అయితే దేవుడు తన ప్రజల్ని శుద్ధీకరించడం అంతటితో పూర్తైందా? లేదు. ఈ చివరి రోజుల్లో కూడా, తన ప్రజలు పవిత్రులుగా ఉండి ఆధ్యాత్మిక ఆలయంలో సేవ చేసేలా, యెహోవా తన మెస్సీయ రాజు ద్వారా సహాయం చేస్తున్నాడు. యెహోవా వాళ్లను నైతిక విషయాల్లో, అలాగే సంస్థకు సంబంధించిన విషయాల్లో ఎలా శుద్ధీకరించాడో తర్వాతి రెండు అధ్యాయాల్లో తెలుసుకుంటాం. ఆయన వాళ్లను ఆధ్యాత్మికంగా ఎలా శుద్ధీకరించాడో ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. తన అనుచరులు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేలా యేసు దృశ్యంగా, అలాగే అదృశ్యంగా ఎలా సహాయం చేస్తున్నాడో తెలుసుకుంటే మన విశ్వాసం బలపడుతుంది.

‘మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకోండి’

6. బబులోను చెర నుండి విడుదలౌతున్న యూదులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్ని బట్టి, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండడం గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు?

6 ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండడం అంటే ఏమిటి? దానికి జవాబు తెలుసుకోవడానికి, సా.శ.పూ ఆరో శతాబ్దంలో బబులోను చెర నుండి విడుదలౌతున్న యూదులకు యెహోవా ఏమి చెప్పాడో పరిశీలిద్దాం. (యెషయా 52:11 చదవండి.) వాళ్లు ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి, సత్యారాధనను తిరిగి స్థాపించడానికి యెరూషలేముకు వస్తున్నారు. (ఎజ్రా 1:2-4) అయితే, వాళ్లు బబులోను నుండి వస్తున్నప్పుడు, అక్కడున్న అబద్ధ మతానికి సంబంధించిన ప్రతీదాన్ని విడిచిపెట్టాలని యెహోవా కోరుకున్నాడు. అందుకే, ‘అపవిత్రమైన దేనిని ముట్టకండి,’ ‘దాని వద్దనుండి తొలగిపోండి,’ ‘మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకోండి’ అనే ఆజ్ఞల్ని ఇచ్చాడు. యెహోవాకు చేసే ఆరాధన స్వచ్ఛంగా ఉండాలి కానీ అబద్ధ ఆరాధనతో కలుషితమవ్వకూడదు. ఈ వృత్తాంతం మనకు ఏమి తెలియజేస్తుంది? ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండడం అంటే అబద్ధ మతానికి చెందిన బోధలను, దాని ఆచారాలను విడిచిపెట్టడమని అర్థం.

7. తన అనుచరులు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేలా సహాయం చేయడానికి యేసు ఏ మాధ్యమాన్ని ఉపయోగించాడు?

7 తన అనుచరులు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేలా సహాయం చేయడానికి యేసు ఒక దృశ్య మాధ్యమాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాజైన కొంతకాలానికే అంటే, 1919లో నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి నియమించాడు. (మత్త. 24:45) అప్పటికే, బైబిలు విద్యార్థులు అబద్ధ మతానికి చెందిన ఎన్నో బోధల నుండి తమను తాము పవిత్రపర్చుకున్నారు. అయినప్పటికీ, వాళ్లను ఇంకా శుద్ధీకరించాల్సిన అవసరం ఉంది. వాళ్లు విడిచిపెట్టాల్సిన కొన్ని ఆచారాల గురించి, పద్ధతుల గురించి క్రీస్తు తన నమ్మకమైన దాసుని ద్వారా క్రమక్రమంగా తెలియజేశాడు. (సామె. 4:18) వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

క్రైస్తవులు క్రిస్మస్‌ జరుపుకోవాలా?

8. క్రిస్మస్‌ గురించి బైబిలు విద్యార్థులు ఎంతోకాలం క్రితమే ఏ విషయం గ్రహించారు? కానీ ఆ సమయంలో వాళ్లు ఏమి అర్థం చేసుకోలేకపోయారు?

8 క్రిస్మస్‌ అన్య మతాల నుండి వచ్చిందని, యేసు డిసెంబరు 25న పుట్టలేదని బైబిలు విద్యార్థులు ఎప్పుడో గ్రహించారు. 1881, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ డిసెంబరు సంచిక ఇలా చెప్పింది: “అన్య మతాలకు చెందిన లక్షలమంది ప్రజలు చర్చీల్లో సభ్యులయ్యారు. అన్యమత నాయకులే క్రైస్తవమత నాయకులుగా మారారు, అన్యమత పండుగలే క్రైస్తవ పండుగలుగా మారాయి. పేరుకు మాత్రమే అవి క్రైస్తవ పండుగలు, కానీ వాటిలోని ఆచారాలు మాత్రం అన్య మతాలవే. అలాంటి పండుగల్లో క్రిస్మస్‌ కూడా ఒకటి.” 1883 వాచ్‌ టవర్‌ పత్రికలో వచ్చిన “యేసు ఎప్పుడు పుట్టాడు?” అనే ఆర్టికల్‌, యేసు అక్టోబరు నెల ప్రారంభంలో పుట్టాడని తెలియజేసింది. c అయినప్పటికీ, క్రిస్మస్‌ను జరుపుకోకూడదనే విషయాన్ని బైబిలు విద్యార్థులు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. బ్రూక్లిన్‌ బెతెల్‌లోని సభ్యులు సైతం క్రిస్మస్‌ను జరుపుకున్నారు. కానీ 1926 తర్వాత పరిస్థితులు మారాయి. ఏ విధంగా?

9. బైబిలు విద్యార్థులు క్రిస్మస్‌ జరుపుకునే విషయంలో ఏ అవగాహనకు వచ్చారు?

9 బైబిలు విద్యార్థులు క్రిస్మస్‌ మూలం గురించి, దాని ఆచారాల గురించి జాగ్రత్తగా, లోతుగా పరిశీలించిన తర్వాత నిజానికి అది దేవుణ్ణి అగౌరపరుస్తుందని తెలుసుకున్నారు. 1927, ద గోల్డెన్‌ ఏజ్‌ డిసెంబరు 14 సంచికలో “క్రిస్మస్‌ పుట్టుక” అనే ఆర్టికల్‌ వచ్చింది. క్రిస్మస్‌ ఒక అన్యమత పండుగని, అది విగ్రహారాధనను, విలాసాలను ప్రోత్సహిస్తుందని ఆ ఆర్టికల్‌ స్పష్టం చేసింది. క్రిస్మస్‌ జరుపుకోమని యేసు ఆజ్ఞాపించలేదని చెప్తూ, ఆ ఆర్టికల్‌ ఇలా ముగించింది: “ఈ లోకం, సాతాను, మన శరీరం, దీన్ని జరుపుకోమని ప్రోత్సహిస్తున్నాయి. . . . యెహోవాకు సమర్పించుకున్నవాళ్లు క్రిస్మస్‌ చేసుకోకూడదని చెప్పడానికి ఈ ఒక్క కారణం చాలు.” దాంతో, బ్రూక్లిన్‌ బెతెల్‌ కుటుంబం ఆ డిసెంబరులోనే కాదు, ఇక ఏ డిసెంబరులోనూ క్రిస్మస్‌ జరుపుకోలేదు!

10. (ఎ) 1928 డిసెంబరులో క్రిస్మస్‌ నిజస్వరూపం ఎలా బయటపడింది? ( “క్రిస్మస్‌, దాని పుట్టుక” అనే బాక్సు కూడా చూడండి.) (బి) ఇతర పండుగల విషయంలో నమ్మకమైన దాసుడు దేవుని ప్రజల్ని ఎలా హెచ్చరించాడు? ( “ఇతర అన్య మత పండుగలు, ఆచారాలు” అనే బాక్సు చూడండి.)

10 ఆ తర్వాతి సంవత్సరం, క్రిస్మస్‌ గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. 1928, డిసెంబరు 12న, ప్రధాన కార్యాలయ సభ్యుడైన సహోదరుడు రిచర్డ్‌ హెచ్‌. బార్బర్‌, ఒక రేడియో ప్రసంగంలో క్రిస్మస్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఆ స్పష్టమైన నిర్దేశానికి దేవుని ప్రజలు ఎలా స్పందించారు? సహోదరుడు ఛార్లెస్‌ బ్రాండ్‌లైన్‌, ఆయన కుటుంబ సభ్యులు క్రిస్మస్‌ జరుపుకోవడం మానేశారు. దాని గురించి ఆయన ఇలా చెప్పాడు: “అన్య మతాలకు చెందిన అలాంటివాటిని విడిచిపెట్టినందుకు మేము అస్సలు బాధపడలేదు! . . . అది, మాసిపోయిన బట్టల్ని తీసి పారేయడం లాంటిది.” అలాంటి స్ఫూర్తినే చూపించిన సహోదరుడు హెన్రీ కాంట్‌వెల్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “యెహోవా మీద ప్రేమ చూపించే ఒక అవకాశం దొరికినందుకు మాకు సంతోషంగా ఉంది.” తర్వాత ఆయన ప్రయాణ పర్యవేక్షకునిగా సేవచేశాడు. అపవిత్ర ఆరాధనకు సంబంధించిన ప్రతీ పండుగకు దూరంగా ఉండడానికి, తగిన మార్పులు చేసుకోవడానికి క్రీస్తు నమ్మకమైన అనుచరులు సిద్ధంగా ఉన్నారు. dయోహా. 15:19; 17:14.

11. మనం మెస్సీయ రాజుకు మద్దతిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

11 ఆ బైబిలు విద్యార్థులు ఎంత చక్కని ఆదర్శం ఉంచారో కదా! వాళ్ల ఆదర్శాన్ని మనసులో ఉంచుకుని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నమ్మకమైన దాసుడు ఇచ్చే నిర్దేశానికి నేను ఎలా స్పందిస్తున్నాను? దాన్ని సంతోషంగా స్వీకరించి, పాటిస్తున్నానా?’ ఆ నిర్దేశానికి ఇష్టపూర్వకంగా లోబడితే, నమ్మకమైన దాసుని ద్వారా సరైన సమయంలో ఆధ్యాత్మిక ఆహారం అందిస్తున్న మెస్సీయ రాజుకు మద్దతిస్తున్నట్లే.—అపొ. 16:4, 5.

క్రైస్తవులు సిలువను ఉపయోగించాలా?

సిలువ-కిరీటం ఉన్న గుర్తు (12, 13 పేరాలు చూడండి)

12. మొదట్లో, బైబిలు విద్యార్థులకు సిలువ విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉండేది?

12 సిలువ క్రైస్తవత్వానికి గుర్తు అని, దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదని బైబిలు విద్యార్థులు చాలా సంవత్సరాలపాటు అనుకున్నారు. అయితే, వాళ్లు దాన్ని ఆరాధించలేదు. ఎందుకంటే విగ్రహారాధన తప్పని వాళ్లకు తెలుసు. (1 కొరిం. 10:14; 1 యోహా. 5:21) 1883లోనే, వాచ్‌ టవర్‌ పత్రిక సూటిగా ఇలా చెప్పింది: “ఏ విధమైన విగ్రహారాధనను దేవుడు ఇష్టపడడు.” అయినప్పటికీ, సిలువను సరైన విధంగా ఉపయోగించడంలో తప్పేమీ లేదని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. వాళ్లు సిలువ-కిరీటం ఉన్న ఒక గుర్తును బాడ్జిలా ధరించి, దాన్ని గొప్ప గౌరవంగా భావించేవాళ్లు. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటాన్ని పొందుతారని ఆ గుర్తు సూచించేది. 1891లో, ఆ గుర్తు వాచ్‌ టవర్‌ కవరు పేజీ మీద కూడా రావడం మొదలైంది.

13. సిలువను ఉపయోగించే విషయంలో క్రీస్తు అనుచరులు ఏమి తెలుసుకున్నారు? ( “సిలువను ఉపయోగించే విషయంలో క్రమక్రమంగా వచ్చిన అవగాహన” అనే బాక్సు కూడా చూడండి.)

13 బైబిలు విద్యార్థులు ఆ గుర్తును ఎంతో గౌరవించేవాళ్లు. కానీ, 1920ల చివరి నుండి, సిలువను ఉపయోగించడం గురించి క్రీస్తు అనుచరులు క్రమక్రమంగా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. 1928లో అమెరికాలోని మిచిగాన్‌లో డెట్రాయిట్‌లో ఒక సమావేశం జరిగింది. దాని గురించి, ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసిన సహోదరుడు గ్రాంట్‌ స్యూటర్‌ ఇలా చెప్పాడు: “సిలువ-కిరీటం ఉన్న గుర్తును ధరించడం అనవసరమే కాక అభ్యంతరకరం కూడా అని మేము ఆ సమావేశంలో తెలుసుకున్నాం.” అయితే స్వచ్ఛమైన, పవిత్రమైన ఆరాధనలో సిలువకు చోటు లేదని బైబిలు విద్యార్థులు తర్వాతి సంవత్సరాల్లో అర్థం చేసుకున్నారు.

14. సిలువ విషయంలో క్రమక్రమంగా వచ్చిన అవగాహనకు దేవుని ప్రజలు ఎలా స్పందించారు?

14 సిలువకు సంబంధించి క్రమక్రమంగా వచ్చిన అవగాహనకు దేవుని ప్రజలు ఎలా స్పందించారు? అంతకుముందు ఎంతో గౌరవంగా చూసుకున్న ఆ సిలువ-కిరీటం గుర్తుకే వాళ్లు అంటిపెట్టుకుని ఉన్నారా? ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్న లీలా రాబర్ట్స్‌ అనే సహోదరి ఇలా చెప్పింది: “అది దేనికి గుర్తుగా ఉందో అర్థం చేసుకున్నాక, దాన్ని వాడడం మానేశాం.” ఉర్సులా సరెంకో అనే మరో నమ్మకమైన సహోదరి ఇలా అంది: “ఇప్పటి వరకు సిలువ మన ప్రభువు మరణాన్ని సూచిస్తుందనీ, క్రైస్తవులుగా మన భక్తిని చాటి చెప్తుందనీ అనుకున్నాం. కానీ అది అన్య మతాల నుండి వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాం. సామెతలు 4:18 చెప్తున్నట్లుగా, మన మార్గం అంతకంతకు తేజరిల్లుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.” చాలామంది సహోదరసహోదరీలు ఆమెలాగే భావించారు. అవును, అబద్ధ మతానికి చెందిన అపవిత్ర ఆచారాలన్నిటికి దూరంగా ఉండాలని క్రీస్తు నమ్మకమైన అనుచరులు నిశ్చయించుకున్నారు!

15, 16. ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణను శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

15 మనమూ అలాగే నిశ్చయించుకున్నాం. క్రీస్తు ఒక దృశ్య మాధ్యమాన్ని అంటే నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి ఉపయోగించి, తన ప్రజలు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేలా సహాయం చేస్తున్నాడు. కాబట్టి, ఫలానా ఆచారం లేదా పద్ధతి అబద్ధ మతానికి చెందినదని నమ్మకమైన దాసుడు హెచ్చరించినప్పుడు, వెంటనే ఆ నిర్దేశానికి లోబడతాం. క్రీస్తు ప్రత్యక్షతా కాలంలోని తొలిభాగంలో జీవించిన ఆ నమ్మకమైన సహోదరసహోదరీల్లాగే, ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణను పవిత్రంగా ఉంచడానికి కృషిచేద్దాం.

16 ఈ చివరి రోజుల్లో, ఆధ్యాత్మిక హాని కలిగించే వ్యక్తుల నుండి దేవుని ప్రజల్ని, వాళ్ల సంఘాలను కాపాడడానికి క్రీస్తు అదృశ్యంగా కూడా పనిచేస్తున్నాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

“నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని” వేరుచేయడం

17, 18. యేసు చెప్పిన వల ఉదాహరణలో (ఎ)  పెద్ద వల వేయడం, (బి) అన్నిరకాల చేపల్ని పట్టడం, (సి) మంచి చేపల్ని గంపల్లో వేయడం, (డి) పనికిరాని చేపల్ని పడేయడం వేటిని సూచిస్తున్నాయి?

17 ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల సంఘాలను రాజైన యేసుక్రీస్తు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. క్రీస్తు, దేవదూతలు అదృశ్యంగా పనిచేస్తూ నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేస్తున్నారు. వాళ్లు ఎలా వేరు చేస్తున్నారో, పెద్ద వల గురించిన ఉదాహరణలో యేసు తెలియజేశాడు. (మత్తయి 13:47-50 చదవండి.) ఆ ఉదాహరణ భావం ఏమిటి?

సముద్రంలోకి వేసిన పెద్ద వల, ప్రపంచమంతటా జరుగుతున్న రాజ్య ప్రకటనా పనిని సూచిస్తుంది (18వ పేరా చూడండి)

18 “సముద్రంలోకి . . . పెద్ద వల” వేయడం. సముద్రం మానవజాతిని సూచిస్తుంది. వల, ప్రపంచమంతటా జరుగుతున్న రాజ్య ప్రకటనా పనిని సూచిస్తుంది. “అన్నిరకాల చేపల్ని” పట్టడం. మంచివార్తకు అన్ని రకాల ప్రజలు స్పందిస్తారు. వాళ్లలో కొంతమంది చర్య తీసుకుని నిజ క్రైస్తవులు అవుతారు. కానీ చాలామంది, మొదట్లో ఆసక్తి చూపించినా, తర్వాత్తర్వాత సత్యారాధన పక్షాన నిలబడరు. e “మంచి చేపల్ని గంపల్లో” వేయడం. మంచి మనసున్న ప్రజలు గంపల్లాంటి సంఘాల్లోకి సమకూర్చబడుతున్నారు. అక్కడ వాళ్లు యెహోవాకు పవిత్ర ఆరాధన చేస్తున్నారు. “పనికిరాని చేపల్ని” పడేయడం. ఈ చివరి రోజుల్లో క్రీస్తు, దేవదూతలు “నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని” వేరు చేస్తున్నారు. f దానివల్ల సరైన హృదయ స్థితి లేనివాళ్లు, అంటే బహుశా తప్పుడు నమ్మకాల్ని, ఆచారాల్ని వదులుకోలేనివాళ్లు సంఘాల్లోకి రాకుండా యేసు చూస్తున్నాడు. g

19. దేవుని ప్రజల్ని, సత్యారాధనను పవిత్రంగా ఉంచడానికి యేసు చేస్తున్న కృషిని బట్టి మీకు ఏమనిపిస్తుంది?

19 యేసు తన సంరక్షణ కింద ఉన్నవాళ్లను ఎలా కాపాడుతున్నాడో తెలుసుకుని, మనం ఎంత ఊరట పొందామో కదా! సా.శ. మొదటి శతాబ్దంలో ఆలయాన్ని శుభ్రపర్చినప్పుడు ఆయనకు సత్యారాధన పట్ల, సత్యారాధకుల పట్ల ఎంత ఉత్సాహం ఉందో, ఇప్పుడూ అంతే ఉత్సాహం ఉంది. దేవుని ప్రజల్ని, అలాగే సత్యారాధనను పవిత్రంగా ఉంచడానికి క్రీస్తు చేస్తున్న కృషిని చూసి మనం ఎంతో సంతోషిస్తున్నాం! కాబట్టి అబద్ధ మతానికి దూరంగా ఉంటూ రాజుకు, రాజ్యానికి మద్దతిద్దాం.

a ఆలయాన్ని దర్శించడానికి వచ్చే యూదులు, ఆలయపన్ను కట్టడానికి, తమ డబ్బును మార్చుకోవాల్సి వచ్చేది. డబ్బు మార్చేవాళ్లు, కొంత రుసుము తీసుకుని ఆ పని చేసిపెట్టేవాళ్లు. అంతేకాదు, కొన్నిసార్లు సందర్శకులు అర్పణలు అర్పించడానికి జంతువుల్ని కూడా కొనాల్సివచ్చేది. యేసు అక్కడున్న వర్తకులను ‘దొంగలు’ అని పిలిచాడంటే, బహుశా వాళ్లు ప్రజల దగ్గర ఎక్కువ రుసుము తీసుకుంటూ, జంతువుల్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని అర్థమౌతోంది.

b భూమ్మీదున్న యెహోవా ప్రజలు, గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణలో ఆయన్ని ఆరాధిస్తున్నారు.

c యేసు చలికాలంలో పుట్టడం, “గొర్రెల కాపరులు ఆరుబయట ఉండి తమ మందల్ని కాస్తూ ఉండడం, ఒకదానికొకటి పొంతన లేవు” అని ఆ ఆర్టికల్‌ చెప్పింది.—లూకా 2:8.

d 1927, నవంబరు 14న సహోదరుడు ఫ్రెడరిక్‌ డబ్ల్యూ. ఫ్రాంజ్‌ తన వ్యక్తిగత ఉత్తరంలో ఇలా రాశాడు: “ఈ సంవత్సరం మనం క్రిస్మస్‌ జరుపుకోవట్లేదు. దాన్ని ఇక ఎప్పటికీ జరుపుకోకూడదని బెతెల్‌ కుటుంబం నిర్ణయించుకుంది.” కొన్ని నెలల తర్వాత, అంటే 1928, ఫిబ్రవరి 6న ఆయన మరో ఉత్తరంలో ఇలా రాశాడు: “సాతాను ఉపయోగిస్తున్న బబులోను సంస్థకు చెందిన అబద్ధ బోధల నుండి, ప్రభువు మనల్ని క్రమక్రమంగా శుద్ధీకరిస్తున్నాడు.”

e ఉదాహరణకు, 2013లో 79,65,954 మంది ప్రచారకులు ఉండగా, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 1,92,41,252 మంది హాజరయ్యారు.

f మంచి చేపల్ని చెడ్డ చేపల్ని వేరు చేయడం, గొర్రెల్ని మేకల్ని వేరు చేయడం ఒకటి కాదు. (మత్త. 25:31-46) గొర్రెల్ని మేకల్ని వేరు చేసి, వాటికి చివరి తీర్పు తీర్చడం అనేది రానున్న మహాశ్రమ కాలంలో జరుగుతుంది. ఈలోపు, చెడ్డ చేపలుగా ఉన్నవాళ్లు యెహోవా దగ్గరికి తిరిగొచ్చి, గంపల్లాంటి సంఘాల్లోకి సమకూర్చబడే అవకాశం ఉంది.—మలా. 3:7.

g చివరికి, చెడ్డ చేపలుగా ఉన్నవాళ్లు సూచనార్థకమైన మండే కొలిమిలో వేయబడతారు, అంటే నాశనం చేయబడతారు.