కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12

“శాంతికి మూలమైన దేవుడు” తన ప్రజల్ని సంస్థీకరించాడు

“శాంతికి మూలమైన దేవుడు” తన ప్రజల్ని సంస్థీకరించాడు

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యెహోవా తన ప్రజల్ని క్రమక్రమంగా సంస్థీకరించడం

1, 2. 1895, జనవరి జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పత్రికలో ఏ మార్పు జరిగింది? దానికి సహోదరులు ఎలా స్పందించారు?

 జాన్‌ ఎ. బోనెట్‌ అనే సహోదరుడు 1895, జనవరి జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పత్రికను అందుకోగానే చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఎందుకంటే, ఆ పత్రిక కవరు పేజీ మారింది! భీకరమైన అలలు ఎగసిపడుతున్న సముద్రం దగ్గర, చిమ్మచీకటిలో వెలుగు విరజిమ్ముతున్న ఒక లైట్‌హౌస్‌ చిత్రం ఆ కవరు పేజీ మీద ఉంది. అదే పత్రికలో వచ్చిన “అవర్‌ న్యూ డ్రస్‌” అనే శీర్షిక, ఆ మార్పు గురించి ప్రకటించింది.

2 ఆ కొత్త కవరు పేజీ చూసి సహోదరుడు బోనెట్‌ ముగ్ధుడయ్యాడు. వెంటనే అతను, “ఆ కోట చాలా బాగుంది, దానివల్ల పత్రికకే అందం వచ్చింది” అని సహోదరుడు రస్సెల్‌కు ఉత్తరం రాశాడు. జాన్‌ హెచ్‌. బ్రౌన్‌ అనే మరో సహోదరుడు ఇలా రాశాడు: “అలల తాకిడిని, తుఫాను తాకిడిని తట్టుకుని స్థిరంగా నిలబడిన ఆ కోట చాలా అద్భుతంగా ఉంది.” అయితే ఆ సంవత్సరంలో సహోదరులు చూసిన మార్పు అదొక్కటే కాదు. ఆ సంవత్సరం నవంబరులో మరో మార్పు చోటు చేసుకుంది.

3, 4. 1895, నవంబరు 15 వాచ్‌ టవర్‌ పత్రిక ఏ సమస్య గురించి ప్రస్తావించింది? సంస్థలో జరగనున్న ఏ గొప్ప మార్పు గురించి ఆ పత్రిక ప్రకటించింది?

3 భీకరమైన అలలాంటి ఒక సమస్య బైబిలు విద్యార్థుల సంస్థలో శాంతి లేకుండా చేస్తోందని 1895, నవంబరు 15 వాచ్‌ టవర్‌ పత్రిక తెలియజేసింది. స్థానిక సంఘాల్లో ఎవరు నాయకులుగా ఉండాలనే విషయంలో సహోదరుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయనీ, ఐక్యతను దెబ్బతీసే అలాంటి వైఖరిని సరిచేసుకోవడం చాలా ప్రాముఖ్యమనీ వివరించింది. అంతేకాదు, తుఫాను తాకిడిని తట్టుకునేలా ఓడలాంటి సంస్థను సిద్ధం చేయడంలో, నాయకత్వం వహించేవాళ్లు విఫలమయ్యారని నిర్మొహమాటంగా చెప్పింది. మరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?

4 ఒక సమర్థుడైన కెప్టెన్‌, ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడే ఉపకరణాలు ఓడలో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, తుఫాను సమయంలో తక్షణమే చర్య తీసుకోవడానికి ఓడ సిబ్బంది సిద్ధంగా ఉండేలా చూసుకుంటాడు. అదేవిధంగా సంస్థలో నాయకత్వం వహిస్తున్నవాళ్లు కూడా, తుఫానులాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సంఘాలన్నీ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆ ఆర్టికల్‌ తెలియజేసింది. ఈ విషయంలో జరగనున్న ఒక గొప్ప మార్పు గురించి ఆ ఆర్టికల్‌ ఇలా ప్రకటించింది: “‘మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి’ ప్రతీ కంపెనీలో పర్యవేక్షకులను తక్షణమే నియమించాలి.”—అపొ. 20:28.

5. (ఎ) సంఘ పెద్దల్ని నియమించడం సరిగ్గా సరైన సమయంలో తీసుకున్న చర్య అని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనం ఏ ప్రశ్నల గురించి పరిశీలిస్తాం?

5 సంఘ పెద్దల్ని నియమించడం, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని చెప్పవచ్చు. ఎందుకంటే, మొదటి ప్రపంచ యుద్ధం సృష్టించిన భీకరమైన అలల మధ్య, ఓడలాంటి సంస్థను ముందుకు నడిపించడానికి అది సహోదరులకు సహాయం చేసింది. ఆ తర్వాతి దశాబ్దాల్లో సంస్థలో వచ్చిన మరిన్ని మార్పులు, దేవుని ప్రజల్ని మరింత సంసిద్ధుల్ని చేశాయి. ఆ మార్పుల గురించి ఏ బైబిలు ప్రవచనం ముందే తెలియజేసింది? సంస్థలో వచ్చిన ఏ మార్పుల్ని మీరు కళ్లారా చూశారు? వాటినుండి మీరెలా ప్రయోజనం పొందారు?

‘సమాధానమును నీకు అధికారులుగా నియమిస్తున్నాను’

6, 7. (ఎ) యెషయా 60:17 లో ఉన్న ప్రవచనం అర్థం ఏమిటి? (బి) ‘అధికారులు,’ “విచారణకర్తలు” అనే పదాలను బట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు?

6 ఈ పుస్తకంలోని 9వ అధ్యాయంలో చూసినట్లుగా, తన ప్రజలు విస్తారంగా వృద్ధి చెందేలా యెహోవా చేస్తాడని యెషయా ప్రవచించాడు. (యెష. 60:22) అయితే, అదే ప్రవచనంలో యెహోవా మరో వాగ్దానం కూడా చేశాడు: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” (యెష. 60:17) ఆ ప్రవచనం అర్థం ఏమిటి? అది నేడు మనకెలా వర్తిస్తుంది?

చెడ్డదాని స్థానంలో మంచిది రావడం కాదుగానీ, మంచిదాని స్థానంలో ఇంకా మంచిది వస్తుంది

7 ఒక పదార్థం స్థానంలో మరో పదార్థం వస్తుందని ఆ ప్రవచనం చెప్తుంది. అంటే, చెడ్డదాని స్థానంలో మంచిది వస్తుందని కాదు గానీ, మంచిదాని స్థానంలో ఇంకా మంచిది వస్తుందని అర్థం. ఉదాహరణకు, ఇత్తడి స్థానంలో బంగారం, ఇనుము స్థానంలో వెండి, కర్ర స్థానంలో ఇత్తడి, రాళ్ల స్థానంలో ఇనుము వస్తాయి. తన ప్రజల స్థితి క్రమక్రమంగా మెరుగౌతుందని చెప్పడానికి యెహోవా ఆ పదచిత్రాన్ని ఉపయోగించాడు. ఇంతకీ ఆ ప్రవచనం ఏ మార్పుల గురించి మాట్లాడుతుంది? ఆ ప్రవచనంలో ‘అధికారులు,’ “విచారణకర్తలు” అనే పదాలను యెహోవా ప్రస్తావించాడు. కాబట్టి సంస్థలో వచ్చే మార్పుల గురించే ఆయన మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది.

8. (ఎ) యెషయా ప్రవచనంలో చెప్పబడిన మార్పులకు మూలం ఎవరు? (బి) ఆ మార్పుల వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం? (“ ఆయన దిద్దుబాటును వినయంగా స్వీకరించాడు” అనే బాక్సు కూడా చూడండి.)

8 సంస్థలో వచ్చే మార్పులకు మూలం ఎవరు? యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును . . . ఇనుమునకు ప్రతిగా వెండిని . . . తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను . . . నియమించుచున్నాను.” అవును, సంఘంలో అలాగే సంస్థలో వచ్చే మార్పులన్నిటికీ మూలం యెహోవాయే గానీ మనుషులు కాదు. యేసు రాజైనప్పటి నుండి, యెహోవా ఆయన ద్వారానే ఆ మార్పుల్ని తీసుకొస్తున్నాడు. వాటినుండి మనమెలా ప్రయోజనం పొందుతాం? ఆ లేఖనం చెప్తున్నట్లుగా మనం ‘సమాధానాన్ని,’ “నీతిని” అనుభవిస్తాం. ఆ మార్పుల్ని స్వీకరించి, వాటికి తగినట్లు నడుచుకున్నప్పుడు మన మధ్య శాంతి, నీతి నెలకొంటాయి. అప్పుడు, “శాంతికి మూలమైన దేవుడు” అని అపొస్తలుడైన పౌలు వర్ణించిన యెహోవా మనకు తోడుగా ఉంటాడు.—ఫిలి. 4:9.

9. సంఘంలో అన్నీ పద్ధతి ప్రకారం జరగాలన్నా, సంఘం ఐక్యంగా ఉండాలన్నా ఏమి అవసరం? ఎందుకు?

9 అపొస్తలుడైన పౌలు యెహోవా గురించి ఇలా రాశాడు: “దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాడు.” (1 కొరిం. 14:33) ఈ లేఖనంలో పౌలు శాంతిని, అన్నీ పద్ధతి ప్రకారం చేయడంతో జతచేశాడు. ఈ విషయం గమనించండి: ఒక వ్యక్తి అన్నీ పద్ధతి ప్రకారం చేసినంత మాత్రాన శాంతి సాధ్యం కాదు. ఉదాహరణకు, సైనికులు క్రమపద్ధతిగా పని చేసినంత మాత్రాన, శాంతి నెలకొనదు గానీ యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: అన్నీ క్రమపద్ధతిలో చేసే ఒక సంస్థకు శాంతి అనే పునాది లేకపోతే, అది ఎక్కువ కాలం కొనసాగదు. బదులుగా, దేవుడిచ్చే శాంతి పునాదిగా ఉంటే, అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతాయి, ఆ క్రమపద్ధతి శాశ్వత కాలం ఉంటుంది. ‘శాంతిని ప్రసాదించే దేవుడు’ మన సంస్థను నిర్దేశిస్తున్నందుకు, శుద్ధీకరిస్తున్నందుకు మనం ఎంతో సంతోషించవచ్చు! (రోమా. 15:33) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో అన్నీ పద్ధతి ప్రకారం జరగడానికి, సంఘాలన్నీ ఐక్యంగా ఉండడానికి ఆ శాంతే పునాది.—కీర్త. 29:11.

10. (ఎ) తొలినాళ్లలో సంస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? (“ పర్యవేక్షణలో వచ్చిన మార్పులు” అనే బాక్సు చూడండి.) (బి) ఇప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

10 మన సంస్థలో తొలినాళ్లలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల గురించి, “ పర్యవేక్షణలో వచ్చిన మార్పులు” అనే బాక్సు వివరిస్తుంది. ఈ మధ్యకాలంలో, యెహోవా మన రాజైన యేసు ద్వారా ‘ఇత్తడికి ప్రతిగా బంగారాన్ని’ ఎలా తీసుకొచ్చాడు? ఆ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో శాంతిని, ఐక్యతను ఎలా పెంపొందించాయి? ‘శాంతికి మూలమైన దేవుణ్ణి’ సేవించే విషయంలో ఆ మార్పులు మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేశాయి?

క్రీస్తు సంఘాలను నడిపించడం

11. (ఎ) లేఖనాల్ని లోతుగా పరిశీలిస్తున్నప్పుడు సహోదరులు ఏ విషయం తెలుసుకున్నారు? (బి) దానికి అనుగుణంగా వాళ్లు ఏమి చేశారు?

11 1964 నుండి 1971 వరకు, పరిపాలక సభ లేఖనాల్ని లోతుగా అధ్యయనం చేసి కొన్ని విషయాలు తెలుసుకుంది. అందులో ముఖ్యంగా, మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘం ఎలా సంస్థీకరించబడిందో సహోదరులు తెలుసుకున్నారు.  a ఆ సంఘాన్ని ఒక పెద్ద లేదా పర్యవేక్షకుడు కాదు గానీ, పెద్దల సభ పర్యవేక్షించేదని వాళ్లు గ్రహించారు. (ఫిలిప్పీయులు 1:1; 1 తిమోతి 4:14 చదవండి.) ఆ విషయాన్ని గ్రహించినప్పుడు, సంస్థలో తగిన మార్పులు తీసుకురావడానికి క్రీస్తే తమను నిర్దేశిస్తున్నాడని వాళ్లకు అర్థమైంది. వాళ్లు ఆ నిర్దేశానికి వెంటనే లోబడ్డారు. వాళ్లు లేఖనాల్లో ఉన్న పద్ధతికి అనుగుణంగా పెద్దల ఏర్పాటులో మార్పులు చేశారు. 1970ల తొలిభాగంలో వచ్చిన అలాంటి కొన్ని మార్పుల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

12. (ఎ) పరిపాలక సభలో ఎలాంటి మార్పులు జరిగాయి? (బి) పరిపాలక సభ ఎలా సంస్థీకరించబడిందో వివరించండి. (130వ పేజీలో ఉన్న  “రాజ్య సంబంధ విషయాలను పరిపాలక సభ ఎలా చూసుకుంటుంది?” అనే బాక్సు చూడండి.)

12 మొదటి మార్పు, పరిపాలక సభకు సంబంధించినది. అప్పటివరకు, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని ఏడుగురు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లే పరిపాలక సభగా ఉండేవాళ్లు. అయితే 1971లో, పరిపాలక సభ సభ్యుల సంఖ్య 7 నుండి 11కు పెరిగింది. అంతేకాదు పరిపాలక సభ సభ్యులకూ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకూ స్పష్టమైన తేడా చూపించబడింది. పరిపాలక సభ సభ్యులందరూ సమానమని, వాళ్లందరికీ వంతుల వారీగా సంవత్సరానికి ఒకరు చొప్పున ఛైర్మన్‌గా ఉండే అవకాశం ఉందని గుర్తించారు.

13. (ఎ) 1932 నుండి 1972 వరకు సంఘాన్ని ఎవరు పర్యవేక్షించేవాళ్లు? (బి) కానీ 1972లో ఏమి జరిగింది?

13 తర్వాత వచ్చిన మార్పు సంఘాలకు సంబంధించినది. 1932 నుండి 1972 వరకు, సంఘాన్ని ఒక్క సహోదరుడే పర్యవేక్షించేవాడు. 1936 వరకు ఆయన్ని సర్వీస్‌ డైరెక్టర్‌ అని పిలిచారు. తర్వాత్తర్వాత ఆయన్ని కంపెనీ సర్వెంట్‌ అని, కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌ అని, సంఘ పర్యవేక్షకుడు అని పిలిచారు. ఆయన సంఘ సభ్యుల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని చూసుకునేవాడు. చాలావరకు, సంఘంలోని ఇతర సేవకుల్ని సంప్రదించకుండా ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే, 1972లో పరిపాలక సభ ఒక గొప్ప మార్పుకు తెర తీసింది. ఏమిటా మార్పు?

14. (ఎ) 1972, అక్టోబరు 1న ఏ కొత్త ఏర్పాటు అమల్లోకి వచ్చింది? (బి) పెద్దల సభ సమన్వయకర్త ఫిలిప్పీయులు 2:3 లో ఉన్న సలహాను ఎలా పాటిస్తాడు?

14 1972, అక్టోబరు 1న ఒక కొత్త ఏర్పాటు అమల్లోకి వచ్చింది. అదేంటంటే, సంఘాన్ని ఇకపై ఒక్క సహోదరుడు కాదు గానీ, పెద్దల సభ పర్యవేక్షిస్తుంది. లేఖనాధార అర్హతలు ఉండి, దైవపరిపాలనా పద్ధతి ద్వారా నియమించబడిన పెద్దలు ఆ పెద్దల సభలో ఉంటారు. పెద్దల సభ సమన్వయకర్త, తనను తాను మిగతా పెద్దల కన్నా గొప్పవాణ్ణి అని అనుకోకుండా, “తక్కువవాడిలా” ఎంచుకుంటాడు. (లూకా 9:48) మన ప్రపంచవ్యాప్త సోదర బృందానికి అలాంటి వినయంగల పెద్దలు ఉండడం ఆశీర్వాదం కాదంటారా?—ఫిలి. 2:3.

మన రాజు ముందుచూపుతో, సరైన సమయంలో కాపరులను ఏర్పాటు చేశాడని స్పష్టమౌతుంది

15. (ఎ) సంఘంలో పెద్దల సభను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి? (బి) రాజు ముందుచూపుతో కాపరులను ఏర్పాటు చేశాడని ఎందుకు చెప్పవచ్చు?

15 సంఘ బాధ్యతల్ని ఒక్కరే కాకుండా, పెద్దల సభలోని పెద్దలందరూ కలిసి చూసుకోవడం నిజంగా ఒక గొప్ప ఏర్పాటు. దానివల్ల వచ్చే మూడు ప్రయోజనాల్ని పరిశీలించండి: మొదటిది, పెద్దలందరూ అంటే వాళ్లు సంఘంలో ఏ బాధ్యత నిర్వర్తించేవాళ్లైనా, యేసే సంఘానికి శిరస్సని గుర్తుంచుకోవడానికి ఆ ఏర్పాటు సహాయం చేస్తుంది. (ఎఫె. 5:23) రెండవది, “ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము” అని సామెతలు 11:14 చెప్తుంది. సంఘానికి సంబంధించిన విషయాలను పెద్దలందరూ కలిసి చర్చించుకుని, తమతమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా, బైబిలు సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. (సామె. 27:17) అలాంటి నిర్ణయాలను యెహోవా ఆశీర్వదించి, వాటిని సఫలం చేస్తాడు. మూడవది, సంఘాలు అంతకంతకూ పెరుగుతుండగా, వాటిని చూసుకోవడానికి పర్యవేక్షకులు, కాపరులు ఎంతో అవసరం. సమర్థులైన సహోదరులను పెద్దలుగా నియమించడం ద్వారా ఆ అవసరం తీరుతుంది. (యెష. 60:3-5) ఒక్కసారి ఆలోచించండి, 1971లో ప్రపంచవ్యాప్తంగా 27,000 కన్నా ఎక్కువ సంఘాలు ఉండేవి. కానీ 2013 కల్లా వాటి సంఖ్య దాదాపు 1,13,000కు పెరిగింది! కాబట్టి మన రాజు ముందుచూపుతో, సరైన సమయంలో కాపరులను ఏర్పాటు చేశాడని స్పష్టమౌతుంది.—మీకా 5:5.

‘దేవుని మందకు ఆదర్శంగా ఉండండి’

16. (ఎ) పెద్దలకు ఏ బాధ్యత ఉంది? (బి) ‘గొర్రెల్ని కాయమని’ యేసు ఇచ్చిన ఆజ్ఞను బైబిలు విద్యార్థులు ప్రాముఖ్యంగా ఎంచారని ఎలా చెప్పవచ్చు?

16 దేవుని సేవలో కొనసాగేలా తోటి విశ్వాసులకు సహాయం చేయాల్సిన బాధ్యత తమకు ఉందని పెద్దలు చాలాకాలం క్రితమే గుర్తించారు. (గలతీయులు 6:10 చదవండి.) 1908లో వాచ్‌ టవర్‌ పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌, “నా చిన్న గొర్రెల్ని కాయి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞ గురించి వివరించింది. (యోహా. 21:15-17) ఆ ఆర్టికల్‌ పెద్దలకు ఇలా చెప్పింది: “మన యజమాని అప్పగించిన పనికి, అంటే మందను కాసే పనికి ప్రాముఖ్యత ఇద్దాం. ప్రభువు అనుచరుల్ని పోషిస్తూ, వాళ్లను కాయడాన్ని అమూల్యమైన అవకాశంగా భావిద్దాం.” 1925లో, ద వాచ్‌ టవర్‌ పత్రిక కాపరి పని ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్తూ పెద్దలకు ఇలా గుర్తుచేసింది: “సంఘం దేవుని సొంతం. . . . దానిలోని సహోదరులకు సేవ చేసే బాధ్యత ఎవరికైతే అప్పగించబడిందో, వాళ్లను దేవుడు లెక్క అడుగుతాడు.”

17. పర్యవేక్షకులు సమర్థులైన కాపరులయ్యేలా యెహోవా ఎలా శిక్షణ ఇచ్చాడు?

17 మందను కాసే విషయంలో, యెహోవా సంస్థ సంఘ పెద్దలకు చక్కని శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణ ద్వారా, యెహోవా ‘ఇనుముకు ప్రతిగా వెండిని’ తీసుకువచ్చాడు. 1959లో మొదటిసారి, పర్యవేక్షకుల కోసం రాజ్య పరిచర్య పాఠశాల జరిగింది. ఆ తరగతిలో చర్చించిన ఒక అంశం, “సంఘ సభ్యులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడం.” బాధ్యతగల సహోదరులు “ప్రచారకుల ఇళ్లకు వెళ్లి, వాళ్లను కలవడానికి ప్రణాళిక వేసుకోవాలని” అది ప్రోత్సహించింది. అంతేకాదు, కాపరి సందర్శనాల ద్వారా ప్రచారకుల్ని ఎలా బలపర్చాలో కూడా నేర్పించింది. 1966లో, సవరించబడిన రాజ్య పరిచర్య పాఠశాల మొదలైంది. ఆ పాఠశాల “కాపరి పని చాలా ప్రాముఖ్యం” అనే అంశంపై చర్చించింది. సంఘంలో నాయకత్వం వహిస్తున్నవాళ్లు “దేవుని మందను ప్రేమగా చూసుకోవాలి, అదే సమయంలో తమ సొంత కుటుంబాన్ని, క్షేత్ర పరిచర్యను నిర్లక్ష్యం చేయకూడదు” అని అది నొక్కిచెప్పింది. ఈ మధ్యకాలంలో, పెద్దల కోసం ఎన్నో పాఠశాలలు జరిగాయి. ఆ పాఠశాలల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఆ శిక్షణ వల్ల, నేడు క్రైస్తవ సంఘాల్లో అర్హులైన వేలమంది సహోదరులు ఆధ్యాత్మిక కాపరులుగా సేవ చేయగలుగుతున్నారు.

1966లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన రాజ్య పరిచర్య పాఠశాల

18. (ఎ) యెహోవా ఏ ప్రాముఖ్యమైన పని కోసం పెద్దల్ని ఏర్పాటు చేశాడు? (బి) పెద్దలంటే యెహోవాకు, యేసుకు ఎందుకు ఇష్టం?

18 యెహోవా ఒక ప్రాముఖ్యమైన పని కోసం సంఘ పెద్దల్ని ఏర్పాటు చేశాడు. ఏమిటా పని? మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సమయంలో దేవుని గొర్రెల్ని నడిపించడం. (ఎఫె. 4:11, 12; 2 తిమో. 3:1) సంఘ పెద్దలకు బైబిలు ఇలా సలహా ఇస్తుంది: ‘మీ సంరక్షణలో ఉన్న దేవుని మందను కాయండి. ఇష్టపూర్వకంగా, ఉత్సాహంతో దేవుని మందకు ఆదర్శంగా ఉంటూ దాన్ని కాయండి.’ ఆ సలహాను పాటించడానికి సంఘ పెద్దలు చాలా ప్రయాసపడుతున్నారు. అందుకే వాళ్లంటే యెహోవాకు, యేసుకు చాలా ఇష్టం. (1 పేతు. 5:2, 3) క్రైస్తవ కాపరులు ఎన్నో విధాలుగా దేవుని మందకు ఆదర్శంగా ఉంటూ సంఘ ఐక్యతకు, ఆనందానికి తోడ్పడతారు. అందులో రెండు విధానాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని మందను కాయడం

19. పరిచర్యలో తమతో కలిసి పనిచేస్తున్న పెద్దల గురించి కొంతమంది సహోదరసహోదరీలు ఎలా భావిస్తున్నారు?

19 మొదటిగా, పెద్దలు సంఘ సభ్యులతో కలిసి పని చేస్తారు. సువార్త రచయిత అయిన లూకా, యేసు గురించి ఇలా రాశాడు: “ఆయన దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణించాడు. ఆ 12 మంది ఆయనతోపాటే ఉన్నారు.” (లూకా 8:1) యేసు తన అపొస్తలులతో కలిసి పరిచర్య చేశాడు. అదే విధంగా, పెద్దలు తోటి విశ్వాసులతో కలిసి ప్రకటనా పనిలో పాల్గొంటారు. అది సంఘంపై మంచి ప్రభావం చూపిస్తుందని వాళ్లకు తెలుసు. అలాంటి సంఘ పెద్దల గురించి కొంతమంది సహోదరసహోదరీలు ఏమంటున్నారో గమనించండి. 80వ పడిలో ఉన్న జేనీన్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది: “సంఘ పెద్దలతో కలిసి పరిచర్య చేయడం వల్ల వాళ్లతో మాట్లాడడానికి, వాళ్ల గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.” 30వ పడిలో ఉన్న స్టీవెన్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “ఇంటింటి పరిచర్యలో పెద్దలతో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, పరిచర్యలో వాళ్లు నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది.”

తప్పిపోయిన గొర్రె కోసం వెతికే కాపరిలాగే, పెద్దలు సంఘానికి దూరమైనవాళ్ల కోసం వెతుకుతారు

20, 21. యేసు చెప్పిన ఉదాహరణలోని కాపరి నుండి సంఘ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు? ఒక అనుభవం చెప్పండి. (“ ప్రతీవారం కలిసి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి” అనే బాక్సు కూడా చూడండి.)

20 రెండవదిగా, సంఘానికి దూరమైన వాళ్లపట్ల పెద్దలు శ్రద్ధ చూపిస్తారు. (హెబ్రీ. 12:12) వాళ్లు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాళ్లకు ఎందుకు సహాయం చేస్తారు? ఎలా చేస్తారు? యేసు చెప్పిన కాపరి, తప్పిపోయిన గొర్రె ఉదాహరణలో ఆ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. (లూకా 15:4-7 చదవండి.) మందలోనుండి ఒక గొర్రె తప్పిపోయిందని తెలియగానే, కాపరి ఆ గొర్రే తన సర్వస్వం అన్నట్లు దానికోసం వెతుకుతాడు. నేడు క్రైస్తవ పెద్దలు ఆ కాపరి నుండి ఏమి నేర్చుకోవచ్చు? తప్పిపోయిన గొర్రె కాపరి దృష్టిలో ఇంకా అమూల్యమైనదే. అదే విధంగా, సంఘానికి దూరమైనవాళ్లు కూడా పెద్దల దృష్టిలో అమూల్యమైనవాళ్లే. అలాంటివాళ్లు సంఘానికి తిరిగి రారని, వాళ్ల కోసం ప్రయత్నించడం వ్యర్థమని పెద్దలు ఎన్నడూ భావించరు. బదులుగా, “తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దాన్ని వెతకడానికి” వెళ్లే కాపరిలాగే, పెద్దలు కూడా బలహీనంగా ఉన్నవాళ్లను వెతకడానికి, వాళ్లకు సహాయం చేయడానికి ముందుంటారు.

21 తప్పిపోయిన గొర్రె దొరకగానే ఆ కాపరి ఏమి చేశాడు? ఆయన దాన్ని లేవనెత్తి, ప్రేమగా తన “భుజాల మీద వేసుకొని,” మంద దగ్గరికి తీసుకొచ్చాడు. అదే విధంగా, సంఘ పెద్దలు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి పట్ల శ్రద్ధ చూపించినప్పుడు, ఆ వ్యక్తి తిరిగి కోలుకుని, సంఘానికి దగ్గరవ్వగలుగుతాడు. ఆఫ్రికాకు చెందిన విక్టర్‌ అనే సహోదరుని విషయంలో అదే జరిగింది. ఆయన ఇలా చెప్తున్నాడు: “నేను నిష్క్రియునిగా ఉన్న ఎనిమిది సంవత్సరాల్లో, పెద్దలు నాకు సహాయం చేస్తూనే ఉన్నారు.” మరి, ఆయన చర్య తీసుకునేలా ఏది కదిలించింది? ఆయన ఇలా అంటున్నాడు: “ఒక రోజు, జాన్‌ అనే ఒక సంఘ పెద్ద నన్ను కలవడానికి వచ్చాడు. మేమిద్దరం కలిసి అంతకుముందు పయినీరు సేవా పాఠశాలకు హాజరయ్యాం. ఆ పాఠశాలలో మేము దిగిన ఫోటోలను చూపించి, ఆ మధుర జ్ఞాపకాలను నాకు గుర్తుచేశాడు. దాంతో, యెహోవా సేవలో నేను అనుభవించిన ఆనందాన్ని తిరిగి పొందాలనే కోరిక నాలో కలిగింది.” జాన్‌ కలిసిన కొంతకాలానికే విక్టర్‌ సంఘానికి తిరిగి రావడం మొదలుపెట్టాడు. ఆయన మళ్లీ తన పయినీరు సేవను కొనసాగించాడు. మనపట్ల శ్రద్ధ చూపించే సంఘ పెద్దలు ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం.—2 కొరిం. 1:24. b

పర్యవేక్షణలో వచ్చిన మార్పుల వల్ల దేవుని ప్రజల ఐక్యత బలపడింది

22. నీతి, శాంతి సంఘ ఐక్యతకు ఎలా తోడ్పడతాయి? (“ మేము చాలా సంతోషించాం” అనే బాక్సు కూడా చూడండి.)

22 ముందటి పేరాల్లో గమనించినట్లుగా, దేవుని ప్రజల మధ్య నీతి, శాంతి నెలకొంటాయని యెహోవా ముందే చెప్పాడు. (యెష. 60:17) ఆ రెండు లక్షణాలు సంఘ ఐక్యతకు ఎంతగానో తోడ్పడతాయి. ఏ విధంగా? ముందు, నీతి గురించి పరిశీలిద్దాం. “మన దేవుడైన యెహోవా ఒకేఒక్క యెహోవా.” (ద్వితీ. 6:4, NW) అంటే ఆయన నీతి ప్రమాణాలు ఒక దేశంలో ఒకలా, మరో దేశంలో ఇంకోలా ఉండవు. మంచి చెడుల విషయంలో ఆయన ప్రమాణాలు “పవిత్రుల సంఘాలన్నిట్లో” ఒకేలా ఉంటాయి. (1 కొరిం. 14:33) అలాగే, ఆ ప్రమాణాలు పాటించే సంఘాలన్నీ ఒకేలా ఉంటాయి. ఇక శాంతి విషయానికొస్తే, మనం సంఘంలో ఉన్న శాంతిని ఆనందించడమే కాకుండా, ‘శాంతిని నెలకొల్పేవాళ్లుగా’ ఉండాలని మన రాజైన యేసు కోరుకుంటున్నాడు. (మత్త. 5:9) అప్పుడప్పుడు మన మధ్య విభేదాలు తలెత్తవచ్చు. కానీ “ఇతరులతో శాంతిగా ఉండడానికి . . . చేయగలిగినదంతా చేద్దాం.” (రోమా. 14:19) అలా చేస్తే సంఘంలో ఐక్యతను, శాంతిని పెంపొందించిన వాళ్లమౌతాం.—యెష. 60:18.

23. నేడు యెహోవా సేవకులు ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారు?

23 1895, నవంబరు వాచ్‌ టవర్‌ పత్రికలో, సంస్థలోని బాధ్యతగల సహోదరులు సంఘ పెద్దల ఏర్పాటు గురించి ప్రకటించడంతోపాటు తమ కోరికను కూడా తెలియజేశారు. దేవుని ప్రజలందరి విశ్వాసం ఒక్కటయ్యేలా ఈ కొత్త ఏర్పాటు సహాయం చేయాలని కోరుకుంటున్నామని, దానికోసం ప్రార్థిస్తున్నామని వాళ్లు చెప్పారు. యెహోవా మన రాజైన యేసు ద్వారా, సంస్థలో ఎలా క్రమక్రమంగా మార్పులు తీసుకొచ్చాడో ఇప్పటివరకు పరిశీలించాం. ఆ మార్పులు మన ఐక్యతకు ఎంతగానో దోహదపడ్డాయి. (కీర్త. 99:4) ఆ మార్పుల వల్లే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలందరూ ‘ఒకే స్ఫూర్తిని చూపిస్తూ ఒకేవిధంగా ప్రవర్తిస్తూ,’ ‘శాంతికి మూలమైన దేవుణ్ణి’ “ఐక్యంగా” ఆరాధించగలుగుతున్నారు.—2 కొరిం. 12:18; జెఫన్యా 3:9 చదవండి.

a వాళ్లు లోతుగా పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలను, బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయకం (ఇంగ్లీషు) అనే రెఫరెన్స్‌ పుస్తకంలో ప్రచురించారు.