కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

15

ఆరాధనా హక్కు కోసం పోరాడడం

ఆరాధనా హక్కు కోసం పోరాడడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

చట్టపరమైన గుర్తింపు పొందడానికి, దేవుని ఆజ్ఞల్ని పాటించే హక్కును కాపాడుకోవడానికి క్రీస్తు అనుచరులు పోరాడడం

1, 2. (ఎ) దేవుని రాజ్య పౌరసత్వానికి గుర్తింపు ఏమిటి? (బి) దేవుని ప్రజలు ఎందుకు చట్టపరమైన పోరాటాలు చేయాల్సి వచ్చింది?

 మీరు దేవుని రాజ్య పౌరులా? మీరు ఒక యెహోవాసాక్షి అయితే, తప్పకుండా మీరు దేవుని రాజ్య పౌరులే! మరైతే మీ పౌరసత్వానికి గుర్తింపు ఏమిటి? దానికి గుర్తింపు పాస్‌పోర్టో, లేదా ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డో కాదు. బదులుగా, మీరు యెహోవాను ఆరాధించే విధానమే ఆ గుర్తింపు. సత్యారాధనలో కేవలం మన నమ్మకాలే కాదు, మన పనులు, అలాగే దేవుని రాజ్య నియమాలకు మనం చూపించే విధేయత ఇమిడివుంటాయి. కుటుంబ జీవితం, చికిత్స వంటి విషయాలతో సహా మన జీవితంలోని ప్రతీ రంగంపై సత్యారాధన ప్రభావం చూపిస్తుంది.

2 అయితే, మనం ఎంతో అమూల్యంగా ఎంచుతున్న మన పౌరసత్వాన్ని, దాని ప్రమాణాల్ని ఈ లోకం అన్నిసార్లూ గౌరవించకపోవచ్చు. కొన్ని ప్రభుత్వాలు మన ఆరాధనకు ఆటంకం కలిగించాలని, లేదా దాన్ని పూర్తిగా ఆపేయాలని ప్రయత్నించాయి. కొన్నిసార్లు, మెస్సీయ రాజు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడానికి, ఆ హక్కును కాపాడుకోవడానికి దేవుని ప్రజలు పోరాడాల్సి వచ్చింది. అది ఆశ్చర్యం కలిగిస్తుందా? లేదు. ఎందుకంటే బైబిలు కాలాల్లో కూడా, దేవుని ప్రజలు యెహోవాను ఆరాధించే తమ హక్కును కాపాడుకోవడానికి ఎన్నోసార్లు పోరాడారు.

3. ఎస్తేరు కాలంలో దేవుని ప్రజలు దేనికోసం పోరాడారు?

3 ఉదాహరణకు, ఎస్తేరు కాలంలో దేవుని ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఎందుకు? చెడ్డ ప్రధాన మంత్రి అయిన హామాను, పర్షియా సామ్రాజ్యంలో ఉన్న యూదులందర్నీ చంపేయమని అహష్వేరోషు రాజుకు సూచించాడు. యూదుల విధులు ‘సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి’ అని అతను చెప్పాడు. (ఎస్తే. 3:8, 9, 13) మరి ఆ సమయంలో యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టాడా? లేదు. దేవుని ప్రజల్ని కాపాడడం కోసం ఎస్తేరు, మొర్దెకై అహష్వేరోషు రాజుకు విన్నవించుకున్నప్పుడు, రాజు వాళ్ల విన్నపాన్ని అంగీకరించేలా యెహోవా సహాయం చేశాడు.—ఎస్తే. 9:20-22.

4. ఈ అధ్యాయంలో మనం ఏమి పరిశీలిస్తాం?

4 మరి మన కాలం విషయమేమిటి? ప్రభుత్వాలు యెహోవాసాక్షుల్ని ఎలా వ్యతిరేకించాయో ముందటి అధ్యాయంలో చూశాం. అవి మన ఆరాధనకు ఎలా ఆటంకం కలిగించాయో ఈ అధ్యాయంలో చూస్తాం. దానికి సంబంధించిన మూడు రంగాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం: (1) ఒక సంస్థగా ఏర్పడి మనకు నచ్చిన విధంగా ఆరాధించుకునే స్వేచ్ఛ, (2) బైబిలు సూత్రాలకు అనుగుణంగా చికిత్సను ఎంచుకునే స్వేచ్ఛ, (3) పిల్లల్ని యెహోవా ప్రమాణాల ప్రకారం పెంచే విషయంలో తల్లిదండ్రులకున్న స్వేచ్ఛ. ఆ మూడు రంగాల్లో, మెస్సీయ రాజ్య పౌరులు తమ విలువైన పౌరసత్వాన్ని కాపాడుకోవడానికి ఎలా పోరాడారో, వాళ్ల ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడో ఇప్పుడు చూద్దాం.

చట్టపరమైన గుర్తింపు కోసం, ప్రాథమిక హక్కుల కోసం పోరాటం

5. దేవుని ప్రజలు చట్టపరమైన గుర్తింపు పొందడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

5 మనం యెహోవాను ఆరాధించాలంటే, మానవ ప్రభుత్వాల నుండి చట్టపరమైన గుర్తింపు పొందాలా? లేదు. కానీ అలా గుర్తింపు పొందడం వల్ల, మన ఆరాధనను స్వేచ్ఛగా కొనసాగించుకోగలుగుతాం. అంటే, మన సొంత రాజ్యమందిరాల్లో లేదా సమావేశ హాళ్లలో సమకూడడం, బైబిలు సాహిత్యాన్ని ముద్రించడం, వేరే దేశాల నుండి ప్రచురణల్ని పొందడం, మంచివార్త ప్రకటించడం వంటివాటిని ఏ ఆటంకం లేకుండా స్వేచ్ఛగా చేయగలుగుతాం. చాలా దేశాల్లో, యెహోవాసాక్షులకు చట్టపరమైన గుర్తింపు లభించింది. దానివల్ల, చట్టపరమైన గుర్తింపు పొందిన మిగతా మతస్థుల్లాగే మనం కూడా స్వేచ్ఛగా ఆరాధించుకోగలుగుతున్నాం. కానీ, ప్రభుత్వాలు మనకు గుర్తింపును ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, లేదా మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు ఏమి చేస్తాం?

6. 1940ల తొలినాళ్లలో, ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షులకు ఏ సమస్య ఎదురైంది?

6 ఆస్ట్రేలియా. 1940ల తొలినాళ్లలో, దేశం చేస్తున్న యుద్ధ సన్నాహాలకు యెహోవాసాక్షుల నమ్మకాలు అడ్డుపడుతున్నాయని భావించి, ఆస్ట్రేలియా గవర్నర్‌ జనరల్‌ వాళ్లపై నిషేధం విధించాడు. దాంతో బహిరంగంగా కూటాలు జరుపుకోవడం, ప్రకటించడం కష్టమయ్యాయి. అంతేకాదు, బెతెల్‌ కార్యాలయాలను మూసేశారు, రాజ్యమందిరాలను జప్తు చేసుకున్నారు, మన ప్రచురణలను నిషేధించారు. అయినప్పటికీ, ఆస్ట్రేలియాలోని సాక్షులు తమ కార్యకలాపాలను రహస్యంగా కొనసాగించారు. చివరికి, 1943 జూన్‌ 14న ఆస్ట్రేలియా హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో, వాళ్లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

7, 8. ఆరాధనా స్వేచ్ఛ కోసం రష్యాలోని మన సహోదరులు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని వివరించండి.

7 రష్యా. ఎన్నో దశాబ్దాలు కమ్యూనిస్టు నిషేధం కింద ఉన్న తర్వాత, చివరికి 1991లో సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం యెహోవాసాక్షులకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. సోవియట్‌ యూనియన్‌ చీలిపోయిన తర్వాత, వాళ్లు 1992లో రష్యన్‌ ప్రభుత్వం కింద చట్టపరమైన గుర్తింపు పొందారు. దాంతో రష్యాలో ఉన్న యెహోవాసాక్షుల సంఖ్య బాగా పెరిగింది. కానీ, రష్యన్‌ ఆర్థోడాక్స్‌ చర్చితో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక, 1995 నుండి 1998 మధ్యకాలంలో మనపై ఐదుసార్లు క్రిమినల్‌ కేసులు పెట్టారు. కానీ ప్రతీసారి, సాక్షులు తప్పు చేశారనడానికి ఆధారాలేవీ ప్రాసిక్యూటర్‌కు కనిపించలేదు. అయినా సరే, వ్యతిరేకులు పట్టువిడవకుండా 1998లో సివిల్‌ కేసు పెట్టారు. మొదట, కోర్టు సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ శత్రువులు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ, 2001 మే నెలలో పై కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. దాంతో, అదే సంవత్సరం అక్టోబరులో కోర్టు ఆ కేసును మళ్లీ పరిశీలించడం మొదలుపెట్టింది. చివరికి 2004లో, మాస్కోలో యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన కార్పొరేషన్‌ను, దాని కార్యకలాపాలను నిషేధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

8 వెంటనే సాక్షులపై హింస చెలరేగింది. (2 తిమోతి 3:12 చదవండి.) సాక్షుల్ని వేధించారు, హింసించారు; వాళ్ల ప్రచురణల్ని స్వాధీనం చేసుకున్నారు; ఆరాధన కోసం వాళ్లు ఉపయోగిస్తున్న ఇళ్ల దగ్గర, అద్దె భవనాల దగ్గర నిఘా పెట్టారు. అప్పుడు మన సహోదరసహోదరీలకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఆలోచించండి! వాళ్లు 2001లో యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు అప్పీలు చేసుకుని, 2004లో అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. చివరికి 2010లో ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. రష్యాలో యెహోవాసాక్షులపై నిషేధం విధించడానికి కారణం, మత వివక్షేనని కోర్టు గుర్తించింది. సాక్షులు తప్పు చేశారనడానికి ఏ ఆధారమూ లేదు కాబట్టి, కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆ కోర్టు కొట్టిపారేసింది. అంతేకాదు, ఆ నిషేధం యెహోవాసాక్షుల హక్కులకు భంగం కలిగిస్తుందని కోర్టు భావించింది. అలా కోర్టు, సాక్షులకున్న మత స్వేచ్ఛను కాపాడింది. కోర్టు ఇచ్చిన తీర్పును రష్యాలోని కొన్ని ప్రభుత్వాలు అమలు చేయకపోయినా, దేవుని ప్రజలు మాత్రం ఆ తీర్పును బట్టి చాలా ఊరటపొందారు.

టీటాస్‌ మానూసాకీస్‌ (9వ పేరా చూడండి)

9-11. గ్రీసులో, యెహోవా ప్రజలు ఆరాధనా స్వేచ్ఛ కోసం ఎలా పోరాడారు? దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

9 గ్రీసు. 1983లో, క్రేతులోని ఇరాక్‌లియన్‌ అనే ప్రాంతంలో టీటాస్‌ మానూసాకీస్‌ అనే సహోదరుడు, కూటాలు జరుపుకోవడం కోసం ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. యెహోవాసాక్షుల చిన్న గుంపు అక్కడ ఆరాధన కోసం సమకూడేది. (హెబ్రీ. 10:24, 25) అయితే, ఒక ఆర్థోడాక్స్‌ చర్చి పాస్టరు ప్రభుత్వ అధికారులకు వాళ్లమీద ఫిర్యాదు చేశాడు. ఎందుకు? సాక్షుల నమ్మకాలు, తన చర్చి నమ్మకాలకు భిన్నంగా ఉన్నాయన్న ఒకేఒక్క కారణంతో అలా చేశాడు! కోర్టు టీటాస్‌ మానూసాకీస్‌ మీద, మరో ముగ్గురు స్థానిక సాక్షుల మీద విచారణ జరిపి, జరిమానాతోపాటు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పు తమ ఆరాధనా హక్కుకు భంగం కలిగిస్తుందని సహోదరులు భావించారు. దాంతో వాళ్లు స్థానిక కోర్టులకు, చివరికి యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు అప్పీలు చేసుకున్నారు.

10 ఎట్టకేలకు, 1996లో యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు, వ్యతిరేకులకు చెంపపెట్టులాంటి తీర్పు వెల్లడి చేసింది. “యెహోవాసాక్షులు గ్రీకు చట్టంలో పొందుపర్చిన ‘గుర్తించబడిన మతం’ కిందకే వస్తారని” ఆ కోర్టు చెప్పింది. అంతేకాదు, కింది కోర్టులు ఇచ్చిన తీర్పులు నిజానికి “వాళ్ల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని” కోర్టు భావించింది. “మత నమ్మకాలు, లేదా ఆ నమ్మకాలను తెలియజేయడానికి ఉపయోగించే పద్ధతులు చట్టపరమైనవా కావా అని నిర్ధారించే హక్కు” గ్రీసు ప్రభుత్వానికి లేదని కూడా కోర్టు చెప్పింది. అలా ఆ కోర్టు, సాక్షుల మీద వేసిన శిక్షల్ని రద్దు చేసి, వాళ్ల ఆరాధనా స్వేచ్ఛను కాపాడింది!

11 ఆ తీర్పుతో, గ్రీసులోని పరిస్థితులు చక్కబడ్డాయా? విచారకరంగా, లేదనే చెప్పాలి. గ్రీసులోని కాసాండ్రీ అనే ప్రాంతంలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో, సాక్షులపై వ్యతిరేకతను రేపింది ఒక ఆర్థోడాక్స్‌ బిషప్‌. ఆ కేసు దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2012లో ఒక కొలిక్కి వచ్చింది. గ్రీసులోని ఉన్నత న్యాయస్థానం (కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌) ఆ కేసును పరిశీలించి, దేవుని ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పు ఇస్తున్నప్పుడు, గ్రీసు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ గురించి కోర్టు ప్రస్తావించింది. అలాగే, యెహోవాసాక్షులు గుర్తించబడిన మతం కిందకి రారని ఇతరులు వేస్తున్న అభియోగాలను కొట్టిపారేసింది. “‘యెహోవాసాక్షుల’ సిద్ధాంతాలన్నీ బహిరంగంగానే ఉన్నాయి. కాబట్టి వాళ్లది, గుర్తించబడిన మతం కిందకే వస్తుంది” అని కోర్టు చెప్పింది. ప్రస్తుతం, కాసాండ్రీలో ఒక చిన్న సంఘం ఉంది. ఆ సంఘంలోని సహోదరసహోదరీలు, తమ సొంత రాజ్యమందిరంలో స్వేచ్ఛగా కూటాలు జరుపుకుంటున్నారు.

12, 13. ఫ్రాన్స్‌లో కొంతమంది వ్యతిరేకులు ‘కట్టడవలన కీడు కల్పించాలని’ ఎలా ప్రయత్నించారు? కానీ చివరికి ఏమి జరిగింది?

12 ఫ్రాన్స్‌. కొంతమంది వ్యతిరేకులు, దేవుని ప్రజలకు ‘కట్టడవలన కీడు కల్పించాలని’ ప్రయత్నించారు. (కీర్తన 94:20 చదవండి.) ఉదాహరణకు, 1990ల మధ్యకాలంలో, పన్ను అధికారులు ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న ఒక చట్టపరమైన కార్పొరేషన్‌ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయడం మొదలుపెట్టారు. ఆ కార్పొరేషన్‌ పేరు అసోసియేషన్‌ లెస్‌ టీమోన్స్‌ డీ జహోవా (ATJ). ఆడిటింగ్‌ వెనకున్న అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఆర్థిక మంత్రి ఇలా చెప్పాడు: “ఇలా ఆడిట్‌ చేయడం వల్ల, చట్టాన్ని అడ్డంపెట్టుకుని ఈ సంస్థను మూసేయవచ్చు, లేదా దానిపై చర్య తీసుకోవచ్చు. . . . సంస్థకు అందే విరాళాల మీద పన్ను విధిస్తే దాని కార్యకలాపాలు కుంటుబడి, చివరికి పూర్తిగా ఆగిపోతాయి.” సంస్థకు సంబంధించిన లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నా, పన్ను అధికారులు దాని మీద అన్యాయంగా పన్ను విధించారు. అంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాలంటే, బ్రాంచి కార్యాలయాన్ని మూసేసి, దాని భవనాలను అమ్ముకోవడం తప్ప సహోదరులకు వేరే దారి లేదు. అది నిజంగా కోలుకోలేని దెబ్బ. కానీ దేవుని ప్రజలు పట్టువదల్లేదు. వాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, చివరికి 2005లో యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టులో కేసు దాఖలు చేశారు.

13 2011, జూన్‌ 30న కోర్టు తీర్పు ఇచ్చింది. అనివార్య పరిస్థితుల్లో తప్ప, మత నమ్మకాలు గానీ, వాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తున్న పద్ధతులు గానీ చట్టపరమైనవా కావా అని నిర్ణయించే హక్కు దేశ ప్రభుత్వాలకు ఉండదని ఆ కోర్టు తెలియజేసింది. “సంస్థకు వచ్చే విరాళాల మీద పన్ను విధించడం వల్ల, . . . దానికి ఏ మూలం నుండీ సహాయం అందకుండా పోయింది. అలాగే, దాని సభ్యుల ఆరాధనా హక్కుకు భంగం కలిగింది” అని ఆ కోర్టు గుర్తించి, యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది! సంతోషకరమైన విషయం ఏమిటంటే, సంస్థ మీద విధించిన పన్నును ఫ్రాన్స్‌ ప్రభుత్వం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు, కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు, బ్రాంచి ఆస్తులపై విధించిన ఆంక్షలన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసింది.

పోరాటాలు చేస్తూ కష్టాలు ఎదుర్కొంటున్న మీ సహోదరసహోదరీల కోసం మీరు క్రమంగా ప్రార్థించవచ్చు

14. ఆరాధనా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సహోదరసహోదరీలకు మీరు ఎలా సహాయం చేయవచ్చు?

14 ఎస్తేరు, మొర్దెకైలాగే నేడున్న దేవుని ప్రజలు కూడా, యెహోవాకు ఇష్టమైన విధంగా ఆయన్ని ఆరాధించడానికి, ఆ హక్కును కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. (ఎస్తే. 4:13-16) వాళ్ల కోసం మీరు ఏమి చేయవచ్చు? అలాంటి పోరాటాలు చేస్తూ కష్టాలు ఎదుర్కొంటున్న మీ సహోదరసహోదరీల కోసం మీరు క్రమంగా ప్రార్థించవచ్చు. హింస, వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లకు మన ప్రార్థనలు ఎంతగానో సహాయం చేస్తాయి. (యాకోబు 5:16 చదవండి.) మరి యెహోవా అలాంటి ప్రార్థనలు వింటాడా? ఆయన తప్పకుండా వింటాడని, మనం సాధించిన విజయాలే చూపిస్తున్నాయి!—హెబ్రీ. 13:18, 19.

మన నమ్మకాలకు అనుగుణంగా వైద్య చికిత్సను ఎంచుకునే స్వేచ్ఛ

15. చికిత్సను ఎంచుకునేటప్పుడు దేవుని ప్రజలు ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారు?

15 ఈ పుస్తకంలోని 11వ అధ్యాయంలో చర్చించినట్లుగా, దేవుని రాజ్య పౌరులకు రక్తం విషయంలో స్పష్టమైన నిర్దేశం ఇవ్వబడింది. కానీ నేడు లోకంలో రక్తాన్ని దుర్వినియోగం చేయడం సాధారణమైపోయింది. (ఆది. 9:5, 6; లేవీ. 17:11; అపొస్తలుల కార్యములు 15:28, 29 చదవండి.) మనం రక్తమార్పిడులను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. అయితే దేవుని నియమాలకు వ్యతిరేకం కానంతవరకు మనకు, మన ప్రియమైన వాళ్లకు శ్రేష్ఠమైన వైద్య చికిత్స అందాలని కోరుకుంటాం. చాలా దేశాల్లో ఉన్నత న్యాయస్థానాలు, మనస్సాక్షిని బట్టి, మత నమ్మకాల్ని బట్టి వైద్య చికిత్సను ఎంచుకొనే లేదా నిరాకరించే హక్కు ప్రజలకు ఉందని గుర్తించాయి. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం దేవుని ప్రజలు ఆ హక్కు కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

16, 17. జపాన్‌లోని ఒక సహోదరికి బలవంతంగా ఎలాంటి చికిత్స చేశారు? ఆమె ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

16 జపాన్‌. జపాన్‌కు చెందిన 63 ఏళ్ల మిసాయి టకేడా అనే గృహిణికి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఆమె యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే, తనకు రక్తం ఎక్కించవద్దని డాక్టర్లకు ఖరాఖండిగా చెప్పింది. కానీ కొన్ని నెలల తర్వాత, ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో తనకు రక్తం ఎక్కించారని తెలుసుకుని ఆమె నిర్ఘాంతపోయింది. డాక్టర్లు తన ఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా తనను మోసం చేసినట్లు సహోదరి టకేడా భావించింది. దాంతో 1993 జూన్‌లో ఆ డాక్టర్ల మీద, ఆసుపత్రి మీద కేసు వేసింది. అణకువ, సౌమ్యత ఉన్న ఈ సహోదరి అచంచలమైన విశ్వాసం చూపించింది. కోర్టుకు వెళ్లినప్పుడు, ఆమె ఓపిక లేకపోయినా సాక్షి బోనులో గంటసేపు నిలబడి, అందరి ముందు ధైర్యంగా సాక్ష్యమిచ్చింది. ఆమె చనిపోయే ఒక నెల ముందు చివరిసారిగా కోర్టు మెట్లెక్కింది. ఆమెకున్న ధైర్యం, విశ్వాసం మనకు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయో కదా! తన పోరాటంలో సహాయం చేయమని ఆమె యెహోవాకు క్రమంగా ప్రార్థించింది. ఆయన తప్పకుండా తన ప్రార్థనలు వింటాడని ఆమె నమ్మింది. మరి యెహోవా ఆమె ప్రార్థనలు విన్నాడా?

17 సహోదరి టకేడా చనిపోయిన మూడు సంవత్సరాలకు, అంటే 2000, ఫిబ్రవరి 29న జపాన్‌ సుప్రీం కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె ఇష్టాలకు వ్యతిరేకంగా రక్తం ఎక్కించడం తప్పని, అలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కును, వ్యక్తిగత హక్కుల్లాగే గౌరవించాలని కోర్టు చెప్పింది. సహోదరి టకేడా, తన మనస్సాక్షిని బట్టి చికిత్సను ఎంచుకునే హక్కును కాపాడుకోవడం కోసం ఎంతో పోరాడింది. ఆ పోరాటం వల్లే, నేడు జపాన్‌లోని సాక్షులు తమకు బలవంతంగా రక్తం ఎక్కిస్తారేమో అనే భయం లేకుండా చికిత్స చేయించుకోగలుగుతున్నారు.

పాబ్లో ఆల్‌బరాసీనీ (18 నుండి 20 పేరాలు చూడండి)

18-20. (ఎ) రక్త మార్పిడులను నిరాకరించే విషయంలో ఒక వ్యక్తికున్న హక్కును అర్జెంటీనాలోని అప్పీళ్ల కోర్టు ఎలా సమర్థించింది? (బి) మనం క్రీస్తు పరిపాలనకు లోబడుతున్నామని ఎలా చూపించవచ్చు?

18 అర్జెంటీనా. స్పృహలో లేనప్పుడు కూడా, చికిత్స విషయంలో సరైన నిర్ణయం తీసుకునేలా దేవుని రాజ్య పౌరులు ఎలా సిద్ధంగా ఉండవచ్చు? మనం స్పృహలో లేనప్పుడు మన బదులు మాట్లాడడానికి, ఒక చట్టపరమైన డాక్యుమెంటును మనతోపాటు ఉంచుకోవచ్చు. పాబ్లో ఆల్‌బరాసీనీ అనే సహోదరుడు అదే చేశాడు. 2012 మే నెలలో, కొంతమంది దుండగులు అతనిమీద దాడి చేసి, తుపాకీతో చాలాసార్లు కాల్చారు. అతను ఆసుపత్రికి చేరుకునే సమయానికి స్పృహ కోల్పోయాడు. కాబట్టి రక్త మార్పిడుల విషయంలో తన అభిప్రాయం ఏమిటో వివరించే స్థితిలో లేడు. కానీ, అతను సంతకం చేసి పెట్టుకున్న మెడికల్‌ డైరెక్టివ్‌ కార్డు అతనితోపాటే ఉంది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో, ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తం ఎక్కించడం తప్పనిసరి అని కొంతమంది డాక్టర్లు భావించారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం, అతని ఇష్టాలను గౌరవించడానికే నిర్ణయించుకుంది. పాబ్లో వాళ్ల నాన్న యెహోవాసాక్షి కాదు, కాబట్టి తన కొడుకు ఇష్టాలను పరిగణలోకి తీసుకోవద్దని కోరుతూ కోర్టు నుండి ఆర్డరు తెచ్చుకున్నాడు.

19 వెంటనే, పాబ్లో భార్య ఒక న్యాయవాది సహాయంతో అప్పీళ్ల కోర్టులో కేసు పెట్టింది. ఆ కోర్టు కొన్ని గంటల్లోనే, కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, మెడికల్‌ డైరెక్టివ్‌లో సూచించినట్లుగా రోగి ఇష్టాలను గౌరవించాలని తీర్పు చెప్పింది. దాంతో పాబ్లో వాళ్ల నాన్న, అర్జెంటీనా సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. పాబ్లో నింపిన మెడికల్‌ డైరెక్టివ్‌ కార్డు “పూర్తి వివేచనతో, సరైన ఉద్దేశంతో, ఇష్టపూర్వకంగా” రాయబడిందని సుప్రీం కోర్టు గుర్తించి, ఇలా తీర్పు ఇచ్చింది: “ఆలోచనా సామర్థ్యం, పరిణతి ఉన్న ప్రతీ వ్యక్తి [తన] చికిత్సకు సంబంధించిన సూచనల్ని ముందుగానే ఇవ్వవచ్చు. ఫలానా వైద్య చికిత్సను ఎంచుకోవాలా లేక తిరస్కరించాలా అన్నది అతనే నిర్ణయించుకోవచ్చు . . . ఆ వ్యక్తికి వైద్యం చేస్తున్న డాక్టరు, అతని అభిప్రాయాలను గౌరవించాల్సిందే.”

మీ మెడికల్‌ డైరెక్టివ్‌ కార్డును నింపారా?

20 సహోదరుడు పాబ్లో క్రమక్రమంగా కోలుకున్నాడు. ముందుగానే మెడికల్‌ డైరెక్టివ్‌ కార్డును నింపి పెట్టుకున్నందుకు పాబ్లో, అతని భార్య సంతోషించారు. దాన్ని నింపడం చిన్న పనే, కానీ చాలా ప్రాముఖ్యమైన పని. దాన్ని నింపడం ద్వారా, తాను క్రీస్తు పరిపాలనకు లోబడుతున్నానని సహోదరుడు చూపించాడు. మరి మీ సంగతేమిటి? మీరు, మీ కుటుంబ సభ్యులు ఆ కార్డును నింపారా?

ఏప్రిల్‌ కడోరా (21 నుండి 24 పేరాలు చూడండి)

21-24.(ఎ) చికిత్సను ఎంచుకునే విషయంలో మైనర్లకు ఉన్న హక్కును కెనడా సుప్రీం కోర్టు ఎలా సమర్థించింది? (బి) యెహోవాను సేవిస్తున్న పిల్లలు ఈ అనుభవం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

21 కెనడా. సాధారణంగా, పిల్లలకు ఏ చికిత్స ఇవ్వాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రులకు ఉందని కోర్టులు గుర్తిస్తాయి. అయితే, చికిత్స విషయంలో పరిణతిగల మైనర్లు తీసుకున్న నిర్ణయాలను కూడా గౌరవించాలని కోర్టులు కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చాయి. ఏప్రిల్‌ కడోరా అనే సహోదరి విషయంలో అదే జరిగింది. 14 ఏళ్లున్నప్పుడు, శరీరం లోపల జరిగిన తీవ్రమైన రక్తస్రావం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరింది. దానికి కొన్ని నెలల క్రితమే ఆమె అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌ కార్డు నింపింది. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తనకు రక్తం ఎక్కించవద్దని ఆ కార్డు మీద రాసింది. ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపినా, డాక్టరు మాత్రం వాటిని పట్టించుకోకుండా, కోర్టు నుండి ఆర్డరు తీసుకువచ్చి బలవంతంగా రక్తం ఎక్కించాడు. అలా ఎక్కించడాన్ని ఆ సహోదరి మానభంగంతో పోల్చింది.

22 ఏప్రిల్‌, ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించారు. రెండు సంవత్సరాల తర్వాత, కెనడా సుప్రీం కోర్టు ఆమె కేసును పరిశీలించింది. తనకు జరిగిన అన్యాయం రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని ఏప్రిల్‌ వాదించింది. కోర్టు ఆ విషయాన్ని ఒప్పుకోకపోయినా ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. పైగా, కేసుకు అయిన ఖర్చులను కూడా ఇచ్చింది. ఆమెకూ, అలాగే చికిత్సను ఎంచుకునే విషయంలో సొంతగా నిర్ణయించుకోవాలని కోరుకునే పరిణతిగల ఇతర మైనర్లకూ స్వేచ్ఛను కల్పిస్తూ, కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది: “16 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా చికిత్సను ఎంచుకునే విషయంలో తమ అభిప్రాయాలను చెప్పుకుని, తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పరిణతిని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి.”

23 ఆ తీర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, అది కేవలం ఏప్రిల్‌కున్న హక్కులనే కాదు, పరిణతి గల మైనర్లందరి హక్కులను కాపాడింది. ఈ తీర్పు రాక ముందు, 16 ఏళ్లలోపు పిల్లలకు ఏ చికిత్స ఇవ్వాలో నిర్ణయించే అధికారం కెనడాలోని కోర్టులకు ఉండేది. అయితే, చికిత్సను ఎంచుకునే విషయంలో తమ పరిణతిని నిరూపించుకునే అవకాశం 16 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాలని, వాళ్ల ఇష్టాలకు వ్యతిరేకంగా చికిత్స చేయించే అధికారం కోర్టులకు ఉండదని ఆ తీర్పు స్పష్టం చేసింది.

“దేవుని పేరును ఘనపర్చడంలో, సాతాను అబద్ధికుడని నిరూపించడంలో నాకూ వంతు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది”

24 మరి ఆ మూడేళ్ల పోరాటానికి ఎలాంటి ఫలితం వచ్చింది? ప్రస్తుతం మంచి ఆరోగ్యంతో ఉండి, క్రమ పయినీరుగా సేవచేస్తున్న ఏప్రిల్‌ ఇలా చెప్తుంది: “దేవుని పేరును ఘనపర్చడంలో, సాతాను అబద్ధికుడని నిరూపించడంలో నాకూ వంతు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.” మన పిల్లలు కూడా ధైర్యంగా నిలబడి, దేవుని రాజ్య పౌరులుగా నిరూపించుకోగలరని ఏప్రిల్‌ అనుభవం చూపిస్తుంది.—మత్త. 21:16.

యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా పిల్లల్ని పెంచే స్వేచ్ఛ

25, 26.తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తవచ్చు?

25 పిల్లల్ని తన ప్రమాణాలకు అనుగుణంగా పెంచమని యెహోవా తల్లిదండ్రులకు చెప్పాడు. (ద్వితీ. 6:6-8; ఎఫె. 6:4) అది కష్టమైన బాధ్యతే. మరిముఖ్యంగా, తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు అది ఇంకా కష్టమౌతుంది. ఎందుకంటే, పిల్లల్ని పెంచే విషయంలో వాళ్లిద్దరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ఉదాహరణకు, పిల్లవాణ్ణి క్రైస్తవ ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని సాక్షియైన తల్లి/తండ్రి బలంగా కోరుకోవచ్చు. కానీ అవతలి వ్యక్తి దానికి ఒప్పుకోకపోవచ్చు. అలాంటప్పుడు, సాక్షియైన తల్లి/తండ్రి ఒక విషయాన్ని వినయంగా గుర్తించాలి. అదేంటంటే, విడాకులు తీసుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్న బంధం తెగిపోతుంది కానీ, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న బంధం తెగిపోదు.

26 కొన్నిసార్లు, సాక్షికాని తల్లి/తండ్రి పిల్లల్ని తమతోనే ఉంచుకుని, తమ మతంలోనే పెంచుతామని కోర్టులో కేసు పెట్టవచ్చు. తమ పిల్లల్ని యెహోవాసాక్షిగా పెంచడం ప్రమాదకరమని కూడా వాళ్లు ఆరోపించవచ్చు. పిల్లల్ని యెహోవాసాక్షిగా పెంచితే, వాళ్లకు పుట్టినరోజులు, పండుగలు లాంటి సరదాలు ఏమీ ఉండవని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకునే అవకాశం కూడా ఉండదని వాళ్లు వాదించవచ్చు. కానీ సంతోషకరంగా, చాలా కోర్టులు తల్లిదండ్రుల మత నమ్మకాల్ని బట్టి కాకుండా, పిల్లల శ్రేయస్సును మనసులో ఉంచుకుని తీర్పు ఇచ్చాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

27, 28.పిల్లల్ని యెహోవాసాక్షులుగా పెంచడం ప్రమాదకరమని ఒక తండ్రి ఆరోపించినప్పుడు, ఒహాయో సుప్రీం కోర్టు ఎలా స్పందించింది?

27 అమెరికా. సహోదరి జెన్నిఫర్‌ పేటర్‌ ఉదాహరణ పరిశీలించండి. సాక్షికాని ఆమె భర్త, తన కొడుకు బాబీని యెహోవాసాక్షిగా పెంచడం ప్రమాదకరమని ఆరోపిస్తూ కోర్టులో కేసు పెట్టాడు. పిల్లవాణ్ణి తండ్రి దగ్గరే ఉంచాలని, తల్లి అప్పుడప్పుడు వెళ్లి పిల్లవాణ్ణి చూడవచ్చని, అయితే ఆమె “యెహోవాసాక్షుల నమ్మకాలను ఏ విధంగానూ పిల్లవాడితో పంచుకోకూడదని” కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే, ఆమె బైబిలు గురించి గానీ, దానిలోని నైతిక ప్రమాణాల గురించి గానీ తన పిల్లవాడితో అస్సలు మాట్లాడకూడదు! ఆ తీర్పు విన్నప్పుడు ఆమె మనసు ఎంత గాయపడివుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె చాలా కృంగిపోయింది. కానీ తాను ఓపిగ్గా యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడం నేర్చుకున్నానని, ప్రతీసారి యెహోవా తనకు సహాయం చేశాడని ఆమె గుర్తు చేసుకుంటుంది. తర్వాత, యెహోవా సంస్థ సహాయంతో, ఆమె తరఫున వాదించిన న్యాయవాది ఒహాయో సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. 1992లో సుప్రీం కోర్టు ఆ కేసును పరిశీలించింది.

28 అప్పుడు సుప్రీం కోర్టు, కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, “పిల్లలకు బోధించడంలో, వాళ్లకు నైతిక విలువల్ని, మత నమ్మకాల్ని నేర్పించడం కూడా భాగమని, అది తల్లిదండ్రులకున్న ప్రాథమిక హక్కు అని” తీర్పు ఇచ్చింది. అంతేకాదు, యెహోవాసాక్షుల నమ్మకాలు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరమైనవని రుజువైతే, ఆ నమ్మకాల్ని ఆధారంగా తీసుకుని, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో కోర్టులు నిర్ణయించవచ్చనీ; అలా రుజువు అవ్వని పక్షంలో, కేవలం మత నమ్మకాల్ని ఆధారం చేసుకుని కోర్టులు తీర్పు ఇవ్వడం తప్పనీ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే యెహోవాసాక్షుల నమ్మకాలు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్నాయనడానికి సుప్రీం కోర్టుకు ఏ ఆధారమూ కనిపించలేదు.

పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచాలనే విషయంలో, చాలా కోర్టులు సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి

29-31. డెన్మార్క్‌లోని ఒక సహోదరి ఏ కారణం వల్ల తన కూతురుకు దూరమైంది? ఆ సహోదరి విషయంలో డెన్మార్క్‌ సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చింది?

29 డెన్మార్క్‌. అనీటా హాన్సెన్‌ అనే సహోదరికి కూడా అలాంటి సమస్యే ఎదురైంది. ఆమె మాజీ భర్త, తన ఏడేళ్ల కూతురు అమాండను తన దగ్గరే ఉంచాలని కోరుతూ జిల్లా కోర్టులో కేసు పెట్టాడు. 2000లో ఆ కోర్టు, అమాండను తల్లి దగ్గరే ఉంచాలని తీర్పు ఇచ్చింది. దాంతో, వాళ్ల నాన్న హైకోర్టుకు అప్పీలు చేశాడు. ఆ కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, ఆ అమ్మాయిని తండ్రి దగ్గరే ఉంచాలని తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులిద్దరికీ వేర్వేరు మత నమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఆ అమ్మాయిని ఏ మతంలో పెంచాలనేది తండ్రే బాగా నిర్ణయించగలడని, ఆ అమ్మాయిని తండ్రి సంరక్షణలోనే పెంచడం మంచిదని కోర్టు భావించింది. అలా సహోదరి హాన్సెన్‌, తాను యెహోవాసాక్షి అనే ఒకేఒక్క కారణం వల్ల తన కూతురుకు దూరమైంది!

30 ఈ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు, సహోదరి ఎంతగా నిరుత్సాహానికి గురైందంటే, ఆమె ఇలా చెప్తుంది: ‘కొన్నిసార్లు నాకు దేని గురించి ప్రార్థించాలో కూడా అర్థమయ్యేది కాదు. కానీ రోమీయులు 8:26, 27 చదివాక, నేను నా భావాలను మాటల్లో వ్యక్తపర్చలేకపోయినా యెహోవా వాటిని అర్థం చేసుకుంటాడని గ్రహించి ఊరట పొందాను. ఆయన నా మీద దృష్టి నిలిపి, అన్ని సమయాల్లో నాకు తోడుగా ఉన్నాడు.’—కీర్తన 32:8; యెషయా 41:10 చదవండి.

31 సహోదరి హాన్సెన్‌, డెన్మార్క్‌లోని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. ఆ కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది: “పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేది నిర్ణయిస్తున్నప్పుడు, వాళ్ల శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం.” అంతేకాదు, తల్లి లేదా తండ్రికి ఏ నమ్మకాలు, సిద్ధాంతాలు ఉన్నాయి అనే దాన్నిబట్టి కాకుండా, వాటి వల్ల వచ్చే బేధాభిప్రాయాల్ని వాళ్లు ఎలా పరిష్కరిస్తున్నారు అనే దాన్నిబట్టే, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో నిర్ణయించాలని కోర్టు చెప్పింది. హాన్సెన్‌ ఒక మంచి తల్లిగా ఉండగలదని కోర్టు భావించి, అమాండను తిరిగి ఆమెకు అప్పగించింది. దాంతో సహోదరి హాయిగా ఊపిరి పీల్చుకుంది.

32. యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు, సాక్షులైన తల్లిదండ్రులకు అన్యాయం జరగకుండా ఎలా కాపాడింది?

32 యూరప్‌లోని వేర్వేరు దేశాలు. పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచాలి అనే విషయంలో, కేసులు చాలా దూరం వెళ్లాయి. అవి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలను దాటి యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు కూడా చేరాయి. యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు అలాంటి రెండు కేసులను పరిశీలిస్తున్నప్పుడు, కింది కోర్టులు సాక్షులకు ఒకలాగా వేరేవాళ్లకు మరోలాగా తీర్పు ఇచ్చాయని గుర్తించింది. అది వివక్ష చూపించడమేనని, “కేవలం మతాన్ని ఆధారంగా తీసుకుని తీర్పు ఇవ్వడం తప్పని” కోర్టు చెప్పింది. ఆ తీర్పు వల్ల ప్రయోజనం పొందిన ఒక సహోదరి ఇలా అంది: “నేను నా పిల్లల్ని క్రైస్తవులుగా పెంచుతూ వాళ్లకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని తాపత్రయపడుతుంటే, వాళ్లకు హాని చేస్తున్నానని నిందించడం నాకు చాలా బాధ కలిగించింది.”

33. సాక్షియైన తల్లి/తండ్రి ఫిలిప్పీయులు 4:5 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?

33 తమ పిల్లల హృదయాల్లో బైబిలు ప్రమాణాలను నాటే హక్కు కోసం పోరాడుతున్న సాక్షులు, ఆ విషయంలో మొండిపట్టు పట్టకుండా జాగ్రత్తపడతారు. (ఫిలిప్పీయులు 4:5 చదవండి.) పిల్లల్ని పెంచే విషయంలో తమకు ఎంత హక్కు ఉందో, సాక్షికాని తల్లి/తండ్రికి కూడా అంతే హక్కు ఉందని సాక్షులు వినయంగా గుర్తిస్తారు. అదే సమయంలో తమ బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతారు. అది ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు పరిశీలిద్దాం.

34. నెహెమ్యా కాలంలోని యూదుల నుండి నేటి క్రైస్తవ తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

34 నెహెమ్యా కాలంలో, యూదులు ఎంతో కష్టపడి యెరూషలేము గోడల్ని మళ్లీ నిర్మించారు. ఎందుకు? తమను, తమ కుటుంబ సభ్యులను, చుట్టూవున్న జనాంగాల నుండి కాపాడుకోవడం కోసం అలా చేశారు. అప్పుడు నెహెమ్యా వాళ్లను ఇలా ప్రోత్సహించాడు: ‘మీ సోదరుల కోసం, మీ కొడుకుల కోసం, మీ కూతుళ్ల కోసం, మీ భార్యల కోసం, మీ ఇళ్ల కోసం పోరాడండి.’ (నెహె. 4:14, NW) అలా పోరాడడం యూదులకు ఎంత ప్రాముఖ్యమో నేటి యెహోవాసాక్షులకు కూడా అంతే ప్రాముఖ్యం. సాక్షులు కూడా తమ పిల్లల్ని సత్యంలో పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే, నేడు పిల్లలపై తోటి విద్యార్థుల, పొరుగువాళ్ల చెడు ప్రభావం ఎక్కువగా పడుతోంది. అంతేకాదు, మీడియా ద్వారా అలాంటి చెడు ప్రభావం నేరుగా ఇంట్లోకే జొరబడుతోంది. కాబట్టి, తల్లిదండ్రులారా మీ కొడుకుల కోసం, మీ కూతుళ్ల కోసం పోరాడుతూ, వాళ్లు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు తోడ్పడే మంచి వాతావరణాన్ని కల్పించండి.

సత్యారాధనకు యెహోవా మద్దతు ఉంటుందనే నమ్మకంతో ఉండండి

35, 36. యెహోవాసాక్షులు చట్టపరమైన పోరాటాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి? మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?

35 ఆధునిక కాలంలో, ఆరాధనా స్వేచ్ఛ కోసం దేవుని ప్రజలు చేసిన పోరాటాలను యెహోవా ఆశీర్వదించాడు. ఆ పోరాటాల వల్ల జడ్జీలకు, మరితరులకు శక్తివంతమైన సాక్ష్యం ఇచ్చే అవకాశం దొరికింది. అంతేకాదు, చాలామంది ప్రజలు యెహోవాసాక్షుల గురించి తెలుసుకోగలిగారు. (రోమా. 1:8) సాక్షులు కోర్టులకు వెళ్లడం వల్ల, వాళ్ల హక్కులే కాకుండా ఇతరుల హక్కులు కూడా కాపాడబడ్డాయి. ఆ విధంగా, సాక్షులుకాని వాళ్లు కూడా ప్రయోజనం పొందారు. అయితే, దేవుని ప్రజలు సమాజాన్ని ఉద్ధరించాలనో, లేక గొప్ప పేరు తెచ్చుకోవాలనో అలా చేయలేదు. బదులుగా, తమ ఆరాధనా హక్కును కాపాడుకుని, పవిత్ర ఆరాధనను స్వేచ్ఛగా కొనసాగించడానికే అలా చేశారు.—ఫిలిప్పీయులు 1:7 చదవండి.

36 ఆరాధనా స్వేచ్ఛ కోసం సహోదరసహోదరీలు చేసిన పోరాటాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఉందాం! అంతేకాదు యెహోవా మనకు తప్పకుండా సహాయం చేస్తాడని, తన ఇష్టం చేయడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడని నమ్మకంతో ఉందాం.—యెష. 54:17.