కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16

ఆరాధన కోసం సమకూడడం

ఆరాధన కోసం సమకూడడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

మన కూటాలు ఎంత ప్రాముఖ్యమైనవో, వాటిలో క్రమక్రమంగా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుంటాం

1. శిష్యులందరూ ఒకచోట సమకూడినప్పుడు ఏమి జరిగింది? అలా సమకూడడం వల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందారు?

 యేసు పునరుత్థానమై కొన్ని రోజులు గడిచాయి. శిష్యులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక ఇంట్లో కలుసుకున్నారు. అయితే, వాళ్లు శత్రువులకు భయపడి తలుపులు గట్టిగా వేసుకున్నారు. యేసు వాళ్ల మధ్య ప్రత్యక్షమై “పవిత్రశక్తిని పొందండి” అని చెప్పడంతో, వాళ్ల భయం ఒక్కసారిగా మాయమైంది! (యోహాను 20:19-22 చదవండి.) కొన్ని రోజులకు శిష్యులు మళ్లీ సమకూడినప్పుడు యెహోవా వాళ్లపై పవిత్రశక్తి కుమ్మరించాడు. ఆ విధంగా, వాళ్లు ముందుముందు చేయబోయే ప్రకటనా పనికి కావాల్సిన శక్తిని పొందారు.—అపొ. 2:1-7.

2. (ఎ) యెహోవా ఇచ్చే శక్తి మనకు ఎందుకు అవసరం? ఆయన దాన్ని ఏయే విధాలుగా ఇస్తున్నాడు? (బి) కుటుంబ ఆరాధన ఎందుకు ప్రాముఖ్యం? (అధస్సూచి, అలాగే 175వ పేజీలో ఉన్న “ కుటుంబ ఆరాధన” అనే బాక్సు చూడండి.)

2 మొదటి శతాబ్దంలోని సహోదరులకు ఎదురైన సవాళ్లే మనకూ ఎదురౌతాయి. (1 పేతు. 5:9) వాళ్లలాగే మనం కూడా కొన్నిసార్లు మనుషులకు భయపడతాం. అంతేకాదు, ప్రకటనా పనిని ఓపిగ్గా కొనసాగించాలంటే మనకు కూడా యెహోవా ఇచ్చే శక్తి అవసరమౌతుంది. (ఎఫె. 6:10) యెహోవా ఆ శక్తిని ముఖ్యంగా సంఘ కూటాల ద్వారా ఇస్తున్నాడు. వారాంతంలో జరిగే బహిరంగ కూటం, కావలికోట అధ్యయనం ద్వారా, అలాగే వారం మధ్యలో జరిగే మన క్రైస్తవ జీవితం, పరిచర్య అనే కూటం ద్వారా అంటే రెండు సంఘ కూటాల ద్వారా చక్కని ఉపదేశం పొందుతున్నాం. a ఇవే కాక, ప్రాదేశిక సమావేశం ద్వారా, ప్రాంతీయ సమావేశాల ద్వారా, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ద్వారా మనం ప్రయోజనం పొందుతున్నాం. వాటన్నిటికి హాజరవ్వడం ఎందుకు ప్రాముఖ్యం? నేడు మనం జరుపుకుంటున్న కూటాలు అసలు ఎలా రూపుదిద్దుకున్నాయి? కూటాల పట్ల మన వైఖరి మన గురించి ఏమి తెలియజేస్తుంది?

కూటాలకు ఎందుకు హాజరవ్వాలి?

3, 4. తన ప్రజలు ఏమి చేయాలని యెహోవా కోరుకున్నాడు? ఈ విషయంలో ఇశ్రాయేలీయులు, యేసు, ఆయన శిష్యులు ఏమి చేశారు?

3 తన ప్రజలు ఆరాధన కోసం సమకూడాలని యెహోవా కోరుకున్నాడు. ఉదాహరణకు, సా.శ.పూ 1513లో యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చి, ప్రతీవారం విశ్రాంతి రోజును ఆచరించాలని, ఆ రోజున ప్రతీ కుటుంబం తనను ఆరాధించడానికి, తానిచ్చే ఉపదేశం పొందడానికి సమకూడాలని ఆజ్ఞాపించాడు. (ద్వితీ. 5:12; 6:4-9) ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞను పాటించినంతకాలం, వాళ్ల కుటుంబాలు బలంగా ఉన్నాయి, అలాగే ఒక జనాంగంగా వాళ్లు యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారో, అప్పుడు యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయారు.—లేవీ. 10:11; 26:31-35; 2 దిన. 36:20, 21.

4 అయితే, ఈ విషయంలో యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడో గమనించండి. ప్రతీవారం విశ్రాంతి రోజున సభామందిరానికి వెళ్లడం ఆయనకు అలవాటు. (లూకా 4:16) ఆయన శిష్యులు కూడా ఆయనలాగే క్రమంగా సమకూడేవాళ్లు. యేసు చనిపోయి పునరుత్థానమైన తర్వాత, విశ్రాంతి రోజును ఆచరించాల్సిన అవసరం లేనప్పటికీ వాళ్లు క్రమంగా సమకూడారు. (అపొ. 1:6, 12-14; 2:1-4; రోమా. 14:5; కొలొ. 2:13, 14) కూటాల్లో వాళ్లు ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందేవాళ్లు. అలాగే ప్రార్థనల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా, పాటల ద్వారా యెహోవాకు స్తుతి బలి అర్పించేవాళ్లు.—కొలొ. 3:16; హెబ్రీ. 13:15.

యేసు శిష్యులు ఒకరినొకరు బలపర్చుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి సమకూడేవాళ్లు

5. మనం కూటాలకు, సమావేశాలకు ఎందుకు హాజరౌతాం? (176వ పేజీలోని “ దేవుని ప్రజల్ని ఐక్యం చేసిన సమావేశాలు” అనే బాక్సు కూడా చూడండి.)

5 మనం కూటాలకు, సమావేశాలకు హాజరవ్వడం ద్వారా, దేవుని రాజ్యానికి మద్దతిస్తాం, పవిత్రశక్తి ద్వారా బలం పొందుతాం, ఇతరులను ప్రోత్సహిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రార్థనల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా, పాటల ద్వారా యెహోవాను స్తుతిస్తాం. మనం కూటాలు జరుపుకునే పద్ధతి ఇశ్రాయేలీయులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు జరుపుకున్న పద్ధతికి కాస్త వేరుగా ఉండవచ్చు. అయితే, కూటాలు అప్పుడెంత ప్రాముఖ్యమో ఇప్పుడూ అంతే ప్రాముఖ్యం. ఇంతకీ మనం జరుపుకునే కూటాలు ఎలా రూపుదిద్దుకున్నాయి?

కూటాలు “ప్రేమ చూపించడానికి, మంచిపనులు చేయడానికి” పురికొల్పుతాయి

6, 7. (ఎ) మన కూటాల ఉద్దేశం ఏమిటి? (బి) మొదట్లో బైబిలు విద్యార్థులు కూటాలు ఎలా జరుపుకునేవాళ్లు?

6 సహోదరుడు ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని పరిశోధించడం మొదలుపెట్టినప్పుడు, అలాంటి లక్ష్యమే ఉన్న ఇతరులతో సమకూడడం అవసరమని గుర్తించాడు. 1879లో రస్సెల్‌ ఇలా రాశాడు: “నేనూ, పిట్స్‌బర్గ్‌లోని ఇతరులూ కలిసి లేఖనాలను పరిశోధించడానికి ఒక బైబిలు తరగతిని ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం మేము ప్రతీ ఆదివారం సమకూడుతున్నాం.” జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పాఠకులు కూడా అలా సమకూడాలని సహోదరుడు ప్రోత్సహించాడు. దాంతో, 1881కల్లా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో వాళ్లు ప్రతీ ఆదివారం, బుధవారం కూటాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ కూటాల ఉద్దేశం ఏమిటి? క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ప్రేమ చూపించడానికి ఆ కూటాలు సహాయం చేస్తాయని, అందుకోసమే అవి ఏర్పాటు చేయబడ్డాయని 1895 నవంబరు వాచ్‌ టవర్‌ పత్రిక తెలియజేసింది.—హెబ్రీయులు 10:24, 25 చదవండి.

7 మొదట్లో, బైబిలు విద్యార్థులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కూటాలు జరుపుకునేవాళ్లు. ఉదాహరణకు, అమెరికాలోని ఒక గుంపు రాసిన ఉత్తరం 1911లో ప్రచురించబడింది. అందులో ఇలా ఉంది: “మేము ప్రతీవారం కనీసం ఐదు కూటాలు జరుపుకుంటున్నాం.” వాళ్లు ఆ కూటాలను సోమవారం, బుధవారం, శుక్రవారం, అలాగే ఆదివారం రోజున రెండుసార్లు జరుపుకునేవాళ్లు. ఆఫ్రికాలోని మరో గుంపు రాసిన ఉత్తరం 1914లో ప్రచురించబడింది. ఆ ఉత్తరంలో వాళ్లు ఇలా తెలియజేశారు: “మేము నెలకు రెండుసార్లు కూటాలు జరుపుకుంటున్నాం. అవి శుక్రవారం మొదలై ఆదివారం పూర్తి అవుతాయి.” కాలం గడుస్తుండగా, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న పద్ధతి వచ్చింది. ప్రతీ కూటం వెనకున్న చరిత్రను ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం.

8. అప్పట్లో ఏయే అంశాల మీద బహిరంగ ప్రసంగాలు ఇచ్చేవాళ్లు?

8 బహిరంగ కూటం. జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పత్రికను ప్రచురించడం మొదలుపెట్టిన తర్వాతి సంవత్సరంలో, అంటే 1880లో సహోదరుడు రస్సెల్‌ యేసును అనుకరిస్తూ, వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించాడు. (లూకా 4:43) ఆ పర్యటనలో, ‘దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు’ అనే అంశం మీద సహోదరుడు బహిరంగ కూటాలు నిర్వహించాడు. ఆ క్రమంలోనే, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న బహిరంగ కూటం రూపుదిద్దుకుంది. 1911లో, ప్రతీ సంఘంలో లేదా తరగతిలో ఉన్న సమర్థులైన ప్రసంగీకులు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి ప్రసంగాలు ఇవ్వాలని ప్రోత్సహించబడ్డారు. వాళ్లు తీర్పు, విమోచన వంటి ఆరు అంశాలపై ప్రసంగాలు ఇచ్చేవాళ్లు. ప్రతీ ప్రసంగం చివర్లో తర్వాతి వారం జరగబోయే ప్రసంగాంశాన్ని, ప్రసంగీకుని పేరును తెలియజేసేవాళ్లు.

9. సంవత్సరాలు గడుస్తుండగా బహిరంగ కూటంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కూటానికి మీరెలా మద్దతివ్వవచ్చు?

9 1945లో, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగ కూటాలు నిర్వహించబడ్డాయి. దానిలో భాగంగా, సహోదరులు ఒక్కో ప్రాంతానికి వెళ్లి, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఎనిమిది ప్రసంగాలు ఇచ్చేవాళ్లు. చాలా దశాబ్దాలపాటు, నియమిత ప్రసంగీకులు సంస్థ రూపొందించిన ప్రసంగాలే కాకుండా, సొంతగా తయారుచేసుకున్న ప్రసంగాలు కూడా ఇచ్చేవాళ్లు. అయితే 1981లో, సహోదరులు సంఘాలకు ఇవ్వబడిన సంక్షిప్త ప్రతుల ఆధారంగానే ప్రసంగించాలని నిర్దేశం వచ్చింది. b 1990 ముందువరకు, సంస్థ నిర్దేశం ప్రకారం కొన్ని బహిరంగ ప్రసంగాల్లో ప్రేక్షకులు భాగం వహించేవాళ్లు లేదా ప్రదర్శనలు ఇచ్చేవాళ్లు. అయితే, 1990లో సంస్థ ఆ నిర్దేశాన్ని సవరిస్తూ, బహిరంగ ప్రసంగాలను ప్రసంగ రూపంలోనే ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు, 2008 జనవరిలో బహిరంగ ప్రసంగం ఇచ్చే సమయం 45 నిమిషాల నుండి 30 నిమిషాలకు కుదించబడింది. బహిరంగ ప్రసంగాల్లో అలాంటి మార్పులూ చేర్పులూ జరిగినప్పటికీ, అవి నేటికీ దేవుని వాక్యంపై మన విశ్వాసాన్ని పెంచుతూ, రాజ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాయి. (1 తిమో. 4:13, 16) మరి ప్రాముఖ్యమైన ఆ బైబిలు ప్రసంగాల్ని వినడానికి రమ్మని మీ విద్యార్థుల్ని, పునర్దర్శనాల్లో కలిసిన వాళ్లను ఆహ్వానిస్తున్నారా?

10-12. (ఎ) కావలికోట అధ్యయనం నిర్వహించే పద్ధతిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

10 కావలికోట అధ్యయనం. వాచ్‌ టవర్‌ సొసైటీ పంపించిన కొంతమంది సహోదరులు వేర్వేరు సంఘాలను సందర్శించి, ప్రసంగాలు ఇచ్చేవాళ్లు అలాగే ప్రకటనా పనిని ముందుండి నడిపించేవాళ్లు. ఆ ప్రయాణ ప్రతినిధులను పిల్‌గ్రిమ్స్‌ అని పిలిచేవాళ్లు. సంఘాలు కావలికోట అధ్యయనాన్ని క్రమంగా ఒక కూటంలా జరుపుకుంటే బాగుంటుందని వాళ్లు 1922లో సంస్థకు సూచించారు. సంస్థ ఆ సలహాను అమల్లో పెట్టడంతో, సంఘాలు కావలికోట అధ్యయనాన్ని వారం మధ్యలో గానీ, ఆదివారం గానీ జరుపుకోవడం మొదలుపెట్టాయి.

కావలికోట అధ్యయనం, ఘానా, 1931

11 కావలికోట అధ్యయనాన్ని ఎలా జరుపుకోవాలనే విషయంలో 1932, జూన్‌ 15 కావలికోట సూచనలు ఇచ్చింది. బెతెల్‌ గృహంలో ఎలా జరుగుతుందో అదే పద్ధతిలో నిర్వహించుకోమని ఆ ఆర్టికల్‌ సూచించింది. బెతెల్‌ గృహంలో, కావలికోట అధ్యయనాన్ని ఒక సహోదరుడు నిర్వహించేవాడు. ముగ్గురు సహోదరులు ముందు వరుసలో కూర్చొని వంతులవారీగా పేరాలు చదివేవాళ్లు. అప్పట్లో, కావలికోట ఆర్టికల్స్‌లో ముద్రిత ప్రశ్నలు ఉండేవి కావు. కాబట్టి, చదివిన సమాచారంలో ప్రశ్నలు అడగమని అధ్యయనం నిర్వహిస్తున్న సహోదరుడు ప్రేక్షకుల్ని కోరేవాడు. తర్వాత, ప్రేక్షకుల్లో ఎవరైనా ఆ ప్రశ్నలకు జవాబిచ్చేవాళ్లు. ఒకవేళ ఇంకా వివరణ అవసరమైతే, అధ్యయనం నిర్వహిస్తున్న సహోదరుడే దాని గురించి “క్లుప్తంగా” చెప్పేవాడు.

12 మొదట్లో, ప్రతీ సంఘంలో ఎక్కువమంది సభ్యులు ఏ కావలికోట సంచికను కోరుకుంటే, దాన్నే అధ్యయనం చేసేవాళ్లు. అయితే, సంఘాలన్నీ తాజా సంచికనే అధ్యయనం చేయాలని 1933, ఏప్రిల్‌ 15 కావలికోట సూచించింది. కావలికోట అధ్యయనాన్ని ఆదివారం జరుపుకోవాలని 1937లో నిర్దేశం వచ్చింది. అధ్యయన ఆర్టికల్‌లో ప్రతీ పేజీ కింద ప్రశ్నలు ఉంటాయని, వాటినే ఉపయోగించాలని 1942, అక్టోబరు 1 కావలికోట తెలియజేసింది. అంతేకాదు, కావలికోట అధ్యయనం గంటసేపు జరగాలనీ, జవాబులు చెప్పాలనుకునేవాళ్లు పేరాలోని సమాచారాన్ని చదివే బదులు, “సొంత మాటల్లో” వ్యాఖ్యానించాలనీ ఆ పత్రిక చెప్పింది. అలా ఎన్నో మార్పులు జరిగి, ప్రస్తుతం మనం అనుసరిస్తున్న పద్ధతి వచ్చింది. నమ్మకమైన దాసుడు ఇప్పటికీ కావలికోట అధ్యయనం ద్వారానే ఆధ్యాత్మిక ఆహారాన్ని తగిన సమయంలో అందిస్తున్నాడు. (మత్త. 24:45) కాబట్టి మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను ప్రతీవారం కావలికోట అధ్యయనానికి చక్కగా సిద్ధపడుతున్నానా? దానిలో వ్యాఖ్యానించడానికి కృషి చేస్తున్నానా?’

13, 14. సంఘ బైబిలు అధ్యయనం ఎలా మొదలైంది? ఈ కూటానికి సంబంధించి ఏ విషయం మీకు బాగా నచ్చింది?

13 సంఘ బైబిలు అధ్యయనం. 1890ల మధ్యకాలంలో, అమెరికాలోని మేరీల్యాండ్‌లో బాల్టమోర్‌లో ఉంటున్న సహోదరుడు హెచ్‌. ఎన్‌. రాన్‌, మిలీనియల్‌ డాన్‌ సంపుటుల్ని అధ్యయనం చేయడానికి అందరూ సమకూడితే బాగుంటుందని సూచించాడు. ఆ కూటాల్నే “డాన్‌ సర్కిల్స్‌” అని పిలిచేవాళ్లు. మొదట్లో వాటిని సహోదరుల ఇళ్లల్లో నిర్వహించి చూశారు. అమోరికాలోని చాలా నగరాల్లో అవి విజయవంతం అవ్వడంతో, బైబిలు విద్యార్థులందరూ వాటిని జరుపుకోవాలని 1895 సెప్టెంబరు కావలికోట ప్రోత్సహించింది. దాన్ని నిర్వహించే సహోదరునికి చక్కగా చదివే సామర్థ్యం ఉండాలని కూడా అది సూచించింది. ఆ సహోదరుడు, అధ్యయనం చేస్తున్న ప్రచురణలో ఒక వాక్యం చదివి, దానిమీద వ్యాఖ్యానించమని ప్రేక్షకుల్ని అడిగేవాడు. అలా, పేరాలోని ప్రతీ వాక్యాన్ని చదివి చర్చించాక, పేరాలో ఉన్న లేఖనాలను కూడా చదివేవాడు. అధ్యాయం చివర్లో, హాజరైన ప్రతీఒక్కరు ఆ సమాచారాన్ని క్లుప్తంగా సమీక్షించేవాళ్లు.

14 తర్వాత, ఆ కూటం “బెరయన్‌ సర్కిల్స్‌ ఫర్‌ బైబిల్‌ స్టడీ” అని పిలువబడింది. లేఖనాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసిన మొదటి శతాబ్దపు బెరయ ప్రజలకు గుర్తుగా ఆ పేరు పెట్టారు. (అపొ. 17:11) తర్వాత, దాన్ని సంఘ పుస్తక అధ్యయనం అని పిలిచారు. ప్రస్తుతం దాన్ని సంఘ బైబిలు అధ్యయనం అని పిలుస్తున్నాం. ఆ కూటాన్ని చిన్నచిన్న గుంపులుగా ఇళ్లల్లో నిర్వహించుకునే బదులు, సంఘమంతా కలిసి రాజ్యమందిరంలో జరుపుకుంటున్నాం. ఎన్నో దశాబ్దాలుగా, ఈ కూటంలో వేర్వేరు పుస్తకాలను, బ్రోషుర్లను, కావలికోట ఆర్టికల్స్‌ను అధ్యయనం చేస్తూ, బైబిల్లోని లోతైన విషయాలను అర్థం చేసుకుంటున్నాం. హాజరైన వాళ్లందరూ దానిలో భాగం వహించాలని సంస్థ ఎప్పటినుండో ప్రోత్సహిస్తుంది. మీరు కూడా ఈ కూటానికి సిద్ధపడుతూ, వీలైనంత ఎక్కువగా దానిలో భాగం వహిస్తున్నారా?

15. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఉద్దేశం ఏమిటి?

15 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేసిన క్యారీ బార్బర్‌ అనే సహోదరుడు ఇలా గుర్తుచేసుకున్నాడు: “1942, ఫిబ్రవరి 16 సోమవారం రాత్రి, బ్రూక్లిన్‌ బెతెల్‌లో ఉన్న సహోదరులందరూ ఒక కొత్త పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడానికి ఆహ్వానించబడ్డారు. ఆ పాఠశాలనే తర్వాత దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అని పిలిచారు.” కొంతకాలం తర్వాత ఆ సహోదరుడు పరిపాలక సభ సభ్యునిగా సేవ చేశాడు. ఆయన ఆ పాఠశాల గురించి ఇలా చెప్పాడు: “ఆధునిక కాలంలో, యెహోవా తన ప్రజల విషయంలో తీసుకొచ్చిన గొప్ప మార్పుల్లో ఇదొకటి.” సహోదరుల ప్రకటనా, బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చడంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల చాలా సహాయం చేసింది. దాంతో, సంస్థ 1943లో, దైవపరిపాలనా పరిచర్య కోర్సు (ఇంగ్లీషు) అనే చిన్నపుస్తకాన్ని ప్రచురించి, దాన్ని సంఘాలన్నిటికీ అందుబాటులోకి తెచ్చింది. “చక్కగా ప్రకటించే విషయంలో తమకు తాము శిక్షణ ఇచ్చుకునేలా” దేవుని ప్రజలకు సహాయం చేయడమే ఆ పాఠశాల ఉద్దేశమని 1943, జూన్‌ 1 కావలికోట తెలియజేసింది.—2 తిమో. 2:15.

16, 17. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల బోధనా నైపుణ్యాలను మాత్రమే నేర్పిస్తుందా? వివరించండి.

16 మొదట్లో, కొంతమంది సహోదరులు ప్రేక్షకుల ముందు నిలబడి ప్రసంగాలు ఇవ్వడానికి భయపడేవాళ్లు. జూ. క్లేటన్‌ ఉడ్‌వర్త్‌ అనే సహోదరుని ఉదాహరణే తీసుకోండి. 1918లో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌తోపాటు అరెస్టు అయిన ఏడుగురిలో క్లేటన్‌ వాళ్ల నాన్న కూడా ఉన్నాడు. క్లేటన్‌ 1943లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ పాఠశాలలో భాగం వహించిన మొదటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఇలా అన్నాడు: “నాకు ప్రసంగాలు ఇవ్వడం చాలా కష్టంగా అనిపించేది. ప్రసంగాలు ఇస్తున్నప్పుడు నా నోరు ఎండిపోయేది, మాటలు తడబడేవి, గొంతు బొంగురుపోయేది.” కానీ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సహాయంతో ఆయన తన సామర్థ్యాలను మెరుగుపర్చుకున్నాడు. దానివల్ల, ఆయనకు చాలాచోట్ల బహిరంగ ప్రసంగాలిచ్చే అవకాశాలు వచ్చాయి. ఆ పాఠశాల ఆయనకు బోధనా నైపుణ్యాలు నేర్పించడమే కాకుండా వినయాన్ని, యెహోవాపై ఆధారపడడాన్ని కూడా నేర్పింది. ఆయన ఇలా అన్నాడు: “ఎవరు ప్రసంగిస్తున్నారన్నది ప్రాముఖ్యం కాదు. ప్రసంగీకుడు చక్కగా సిద్ధపడి యెహోవా మీద ఆధారపడితే, ప్రేక్షకులు శ్రద్ధగా విని ప్రయోజనం పొందుతారని నేను గ్రహించాను.”

17 1959లో, సహోదరీలు కూడా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరవచ్చని ఒక సమావేశంలో ప్రకటన చేశారు. ఆ సమావేశానికి హాజరైన ఎడ్నా బౌర్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది: “ఆ ప్రకటన విని సహోదరీలందరూ ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ల ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.” సంవత్సరాలు గడుస్తుండగా, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా చాలామంది సహోదరులు అలాగే సహోదరీలు యెహోవా ఉపదేశాన్ని పొందారు. నేడు, వారం మధ్యలో జరిగే కూటంలో మనం అలాంటి శిక్షణే పొందుతున్నాం.—యెషయా 54:13 చదవండి.

18, 19. (ఎ) పరిచర్యకు సంబంధించిన చక్కని సలహాలను మనం ఎక్కడ పొందుతున్నాం? (బి) మనం కూటాల్లో ఎందుకు పాటలు పాడతాం? (“ స్తుతిగీతాలు పాడడం” అనే బాక్సు చూడండి.)

18 సేవా కూటం. 1919కల్లా, బైబిలు విద్యార్థులు క్షేత్ర పరిచర్యకు సంబంధించి ఒక కూటం జరుపుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో, ఎవరైతే పరిచర్యలో ప్రచురణలు అందిస్తున్నారో వాళ్లు మాత్రమే దానికి హాజరయ్యేవాళ్లు. అయితే, 1923లో ఆ సేవా కూటాన్ని నెలకు ఒకసారి చేసుకోవాలని, దానికి సంఘంలోని వాళ్లందరూ హాజరవ్వవచ్చని నిర్దేశం వచ్చింది. తర్వాత 1928లో, ఆ కూటాన్ని వారానికి ఒకసారి జరుపుకోవాలని నిర్దేశం వచ్చింది. ఆ కూటాన్ని డైరెక్టర్‌లో (తర్వాత దాన్ని ఇన్‌ఫార్మెంట్‌ అని, ఆ తర్వాత మన రాజ్య పరిచర్య అని పిలిచారు) ఉన్న సమాచారం ఆధారంగానే జరుపుకోవాలని 1935 కావలికోట తెలియజేసింది. తర్వాత్తర్వాత, ఆ కూటం ప్రతీవారం జరిగే సంఘ కూటాల్లో భాగమైంది.

19 నేడు వారం మధ్యలో జరిగే కూటంలో పరిచర్యకు సంబంధించి ఎన్నో సలహాలు, సూచనలు పొందుతున్నాం. (మత్త. 10:5-13) మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఉన్న సలహాలను చదివి, వాటిని పరిచర్యలో పాటించడానికి కృషి చేస్తున్నారా?

సంవత్సరానికి ఒకసారి జరిగే అత్యంత ప్రాముఖ్యమైన కూటం

సా.శ. మొదటి శతాబ్దం నుండి, క్రైస్తవులు ప్రతీ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటున్నారు (20వ పేరా చూడండి)

20-22. (ఎ) క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను మనం ఎందుకు జరుపుకుంటాం? (బి) ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం వల్ల మీరెలాంటి ప్రయోజనం పొందుతున్నారు?

20 తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన అనుచరులకు చెప్పాడు. పస్కా పండుగలాగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. (1 కొరిం. 11:23-26) ప్రతీ సంవత్సరం, ఆ ఆచరణకు లక్షలమంది హాజరౌతారు. ఆ ఆచరణకు హాజరవ్వడం వల్ల, అభిషిక్తులు తమకున్న నిరీక్షణ గురించి, అంటే దేవుని రాజ్యంలో క్రీస్తు తోటి వారసులుగా ఉండే గొప్ప అవకాశం గురించి ధ్యానిస్తారు. (రోమా. 8:17) అలాగే, వేరేగొర్రెలు ఆ ఆచరణకు హాజరవ్వడం వల్ల, దేవుని రాజ్యానికి రాజైన క్రీస్తుపట్ల ప్రగాఢ గౌరవం, విశ్వసనీయత చూపించాలనే ప్రోత్సాహం పొందుతారు.—యోహా. 10:16.

21 ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించడం ప్రాముఖ్యమని, దాన్ని సంవత్సరానికి ఒక్కసారే ఆచరించాలని సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు గుర్తించారు. 1880 ఏప్రిల్‌ వాచ్‌ టవర్‌ సంచిక ఇలా చెప్పింది: “మనం ఎన్నో సంవత్సరాలుగా . . . పిట్స్‌బర్గ్‌లో పస్కాను [జ్ఞాపకార్థ ఆచరణ] ఆచరిస్తూ, మన ప్రభువు శరీరానికి, రక్తానికి గుర్తుగా ఉన్న చిహ్నాల్లో పాలుపంచుకుంటున్నాం.” అప్పట్లో, జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చేవాళ్ల కోసం సమావేశాలను కూడా ఏర్పాటు చేసేవాళ్లు. 1889లో జరిగిన అలాంటి ఒక సమావేశానికి 225 మంది హాజరయ్యారు, 22 మంది బాప్తిస్మం తీసుకున్నారు. హాజరైనవాళ్ల సంఖ్యను, బాప్తిస్మం తీసుకున్నవాళ్ల సంఖ్యను నమోదు చేసిన మొట్టమొదటి సమావేశం అదే.

22 నేడు జ్ఞాపకార్థ ఆచరణను సమావేశంలో భాగంగా కాదు గానీ, స్థానిక రాజ్యమందిరంలో లేదా అద్దె భవనంలో ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. అంతేకాదు, ఈ ఆచరణకు రమ్మని మన ప్రాంతంలో ఉన్న ప్రజలందర్నీ ఆహ్వానిస్తున్నాం. 2013లో, ఈ ఆచరణకు 1 కోటి 90 లక్షల కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. ఈ ప్రాముఖ్యమైన ఆచరణకు మనం హాజరవ్వడం, అలాగే ఇతరుల్ని ఆహ్వానించడం ఎంత గొప్ప అవకాశమో కదా! ప్రతీ సంవత్సరం, జ్ఞాపకార్థ ఆచరణకు వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించడానికి మీరు కృషిచేస్తున్నారా?

కూటాలకు హాజరవ్వడం గురించి మీరెలా భావిస్తున్నారు?

23. మనకు జరిగే వేర్వేరు కూటాల గురించి మీరెలా భావిస్తున్నారు?

23 యెహోవా నమ్మకమైన సేవకులు, ఆరాధన కోసం సమకూడమనే ఆజ్ఞను ఏమాత్రం భారంగా ఎంచరు. (హెబ్రీ. 10:24, 25; 1 యోహా. 5:3) ఉదాహరణకు, రాజైన దావీదు యెహోవా మందిరానికి ఎంతో ఇష్టంగా వెళ్లేవాడు. (కీర్త. 27:4) మరిముఖ్యంగా, దేవుణ్ణి ప్రేమించే ఇతరులతో కలిసి యెహోవాను ఆరాధించడం ఆయనకు ఇష్టం. (కీర్త. 35:18) ఈ విషయంలో యేసు కూడా చక్కని ఆదర్శం ఉంచాడు. చిన్నవయసులోనే, ఆయన తన తండ్రి ఆలయంలో గడపాలని కోరుకున్నాడు.—లూకా 2:41-49.

కూటాలకు వెళ్లాలని మనం ఎంత బలంగా కోరుకుంటే, రాజ్యం మనకు అంత వాస్తవికంగా ఉందని అర్థం

24. కూటాలకు హాజరవ్వడం ద్వారా మనం ఏమి చూపిస్తాం?

24 కూటాలకు హాజరవ్వడం ద్వారా, మనకు యెహోవా పట్ల ప్రేమ, తోటి విశ్వాసుల్ని బలపర్చాలనే కోరిక ఉన్నాయని చూపిస్తాం. రాజ్య పౌరులుగా ఎలా జీవించాలో కూటాలు, సమావేశాలు మనకు నేర్పిస్తాయి. కాబట్టి వాటికి హాజరవ్వడం ద్వారా ఆ శిక్షణ పొందాలనే కోరిక మనకుందని చూపిస్తాం. అంతేకాదు, దేవుని రాజ్యం నేడు చేస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన పనికి, అంటే శిష్యుల్ని చేసే పనికి కావాల్సిన నైపుణ్యాన్ని, ప్రోత్సాహాన్ని కూటాలు ఇస్తాయి. (మత్తయి 28:19, 20 చదవండి.) కూటాలకు వెళ్లాలని మనం ఎంత బలంగా కోరుకుంటే, రాజ్యం మనకు అంత వాస్తవికంగా ఉందని అర్థం. కాబట్టి, కూటాలను ఎప్పుడూ విలువైనవిగా ఎంచుదాం!

a సంఘ కూటాలతోపాటు, మనం ప్రతీవారం కుటుంబ ఆరాధన కోసం లేదా వ్యక్తిగత అధ్యయనం కోసం సమయం కేటాయిస్తాం.

b 2013కల్లా, 180 కన్నా ఎక్కువ బహిరంగ ప్రసంగాల సంక్షిప్త ప్రతుల్ని సంస్థ రూపొందించింది.