కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18

రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?

రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యెహోవా ప్రజలు రాజ్య పనులకు ఆర్థిక మద్దతు ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు?

1, 2. (ఎ) బైబిలు విద్యార్థుల కార్యకలాపాలు ఎలా జరుగుతాయని ఒక చర్చి నాయకుడు అడిగినప్పుడు, సహోదరుడు రస్సెల్‌ ఏమి చెప్పాడు? (బి) ఈ అధ్యాయంలో ఏమి పరిశీలిస్తాం?

 ఒకసారి, రిఫార్మ్‌డ్‌ చర్చికి చెందిన ఒక నాయకుడు, సహోదరుడు రస్సెల్‌ దగ్గరికి వచ్చి ‘మీ కార్యకలాపాలన్నీ ఎలా జరుగుతాయి?’ అని అడిగాడు.

 “మేము ఎవ్వరి దగ్గరా చందాలు వసూలు చేయం” అని సహోదరుడు చెప్పాడు.

 “మరి మీకు డబ్బులు ఎక్కడినుండి వస్తాయి?” అని అతను అడిగాడు.

 రస్సెల్‌ ఇలా అన్నాడు: “నేను నిజం చెప్పినా మీరు నమ్మరు. మా కూటాలకు వచ్చేవాళ్ల దగ్గర మేము చందాలు వసూలు చేయం. వాళ్లే ఈ ఏర్పాట్లన్నిటిని చూసి, ‘వీటికి ఎంతోకొంత ఖర్చైవుంటుంది కదా. . . . దీనికి నా వంతుగా నేనేమైనా ఇవ్వగలనా?’ అని ఆలోచిస్తారు.”

 ఆ నాయకుడు, ఇదంతా నిజమేనా అన్నట్లు చూశాడు.

 అప్పుడు రస్సెల్‌ ఇలా అన్నాడు: “నేను చెప్తుంది నిజమే. మా కూటాలకు వచ్చినవాళ్లు, ‘నా దగ్గరున్న ఈ కొంచెం డబ్బు మీకు ఏమైనా ఉపయోగపడగలదా?’ అని తరచూ అడుగుతుంటారు. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదంతో ఎంతోకొంత సంపాదించుకొనివుంటే, దాన్ని ప్రభువు కోసం ఉపయోగించాలని అతనే కోరుకుంటాడు. కానీ అతని దగ్గర ఏమీ లేనప్పుడు, డబ్బులు ఇవ్వమని మనమెందుకు బలవంతపెట్టాలి?” a

2 సహోదరుడు రస్సెల్‌ చెప్పింది “నిజమే.” సత్యారాధనకు మద్దతుగా స్వచ్ఛంద విరాళాలివ్వడం ఈనాటిది కాదు. ప్రాచీన కాలంలో, అలాగే మనకాలంలో సత్యారాధనకు మద్దతిచ్చినవాళ్ల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. రాజ్య పనులకు ఆర్థిక మద్దతు ఎలా వస్తుందో పరిశీలిస్తుండగా, మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకుందాం: ‘రాజ్య పనులకు నేనెలా మద్దతివ్వవచ్చు?’

‘కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకునే ప్రతీ ఒక్కరు యెహోవా కోసం తేవాలి’

3, 4. (ఎ) యెహోవాకు తన ఆరాధకుల మీద ఏ నమ్మకం ఉంది? (బి) గుడార నిర్మాణ పనికి ఇశ్రాయేలీయులు ఎలా మద్దతిచ్చారు?

3 యెహోవాకు తన సత్యారాధకుల మీద నమ్మకం ఉంది. తన ప్రజలకు అవకాశం ఇవ్వాలే గానీ వాళ్లు స్వచ్ఛందంగా, సంతోషంగా విరాళాలిస్తారని ఆయనకు తెలుసు. ఈ విషయంలో ఇశ్రాయేలీయులకు సంబంధించిన రెండు ఉదాహరణలు గమనించండి.

4 ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత, ఆరాధన కోసం ఒక గుడారాన్ని కట్టమని యెహోవా వాళ్లకు చెప్పాడు. అది ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడానికి వీలుగా ఉండే గుడారం. దాన్ని నిర్మించడం, అలంకరించడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఈ నిర్మాణ పనికి మద్దతిచ్చే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తూ, యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకునే ప్రతీ ఒక్కరు యెహోవా కోసం తేవాలి.’ (నిర్గ. 35:5, NW) మరి అప్పటివరకు ‘బానిసలు చేసే అన్నిరకాల కష్టమైన పనుల్ని’ చేసిన ఇశ్రాయేలీయులు దానికి ఎలా స్పందించారు? (నిర్గ. 1:14, NW) వాళ్లు వెండిని, బంగారాన్ని, ఇతర విలువైన వస్తువుల్ని స్వచ్ఛందంగా ఇచ్చి, ఆ నిర్మాణ పనికి అసాధారణ మద్దతు తెలిపారు. వాళ్లు బహుశా ఐగుప్తీయుల దగ్గర తీసుకున్నవాటిలో నుండే విరాళం ఇచ్చివుంటారు. (నిర్గ. 12:35, 36) వాళ్లు ఎంత ఎక్కువగా విరాళాలు ఇచ్చారంటే, “మీరు ఇక ఏ వస్తువుల్నీ తీసుకురావద్దు” అని వాళ్లకు చెప్పాల్సివచ్చింది.—నిర్గ. 36:4-7, NW.

5. ఇశ్రాయేలీయులు ఆలయ నిర్మాణ పనికి ఎలా మద్దతిచ్చారు?

5 దాదాపు 475 సంవత్సరాల తర్వాత, సత్యారాధన కోసం ఒక శాశ్వతమైన ఆలయాన్ని కట్టడానికి, దావీదు తన సొంత ధనాగారం నుండి స్వచ్ఛందంగా విరాళాలిచ్చాడు. ఆ అవకాశాన్ని మిగతా ఇశ్రాయేలీయులకు కూడా కల్పిస్తూ, “ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?” అని దావీదు అడిగాడు. అప్పుడు వాళ్లు “పూర్ణమనస్సుతో యెహోవాకు” స్వచ్ఛంద విరాళాలిచ్చారు. (1 దిన. 29:3-9) ఆ విరాళాలన్నిటికి అసలైన మూలం యెహోవాయేనని తెలియజేస్తూ, దావీదు ఇలా ప్రార్థించాడు: “సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.”—1 దిన. 29:14.

6. నేడు రాజ్య పనులకు డబ్బు ఎందుకు అవసరం? మనకు ఏ ప్రశ్నలు రావచ్చు?

6 మోషే గానీ, దావీదు గానీ దేవుని ప్రజల్ని విరాళాలు ఇవ్వమని బలవంతపెట్టలేదు. బదులుగా, ప్రజలే వాటిని హృదయపూర్వకంగా ఇచ్చారు. మరి నేటి సంగతేంటి? రాజ్య పనులకు చాలా డబ్బు ఖర్చు అవుతుందని మనకు తెలుసు. బైబిళ్లను, బైబిలు ప్రచురణలను ముద్రించి పంచిపెట్టడానికి; ఆరాధనా స్థలాలను, బ్రాంచి భవనాలను నిర్మించి వాటిని సరైన స్థితిలో ఉంచడానికి; విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి, మనకు ఈ ప్రశ్నలు రావచ్చు: వీటన్నిటికి డబ్బు ఎక్కడినుండి వస్తుంది? విరాళాలు ఇవ్వమని దేవుని ప్రజల్ని ఎవరైనా బలవంతపెట్టాలా?

“ఈ పత్రిక ఎన్నడూ మద్దతు కోసం మనుషులను యాచించదు, అర్థించదు”

7, 8. యెహోవా ప్రజలు డబ్బు కోసం మనుషులను ఎందుకు యాచించరు లేదా అర్థించరు?

7 సాధారణంగా, క్రైస్తవ మత సామ్రాజ్యపు చర్చీలు డబ్బుల కోసం రకరకాల పద్ధతుల్ని ఉపయోగించేవి. కానీ సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు అలాంటి పద్ధతుల్ని ఎన్నడూ ఉపయోగించలేదు. వాచ్‌ టవర్‌ పత్రిక రెండో సంచిక ఏమి చెప్పిందో గమనించండి. ఆ సంచికలో “‘మీకు జాయన్స్‌ వాచ్‌ టవర్‌’ కావాలా?” అనే శీర్షిక కింద, రస్సెల్‌ ఇలా తెలియజేశాడు: “జాయన్స్‌ వాచ్‌ టవర్‌కు యెహోవా మద్దతు ఉందని మేము నమ్ముతున్నాం. అదే నిజమైతే ఈ పత్రిక ఎన్నడూ మద్దతు కోసం మనుషులను యాచించదు, అర్థించదు. ‘పర్వతాల వెండి, బంగారాలన్నీ నావే’ అని చెప్పినవాడు అవసరమైన నిధులను అందించకపోతే, పత్రికను నిలిపేయాల్సిన సమయం వచ్చిందని మేము అనుకుంటాం.” (హగ్గ. 2:7-9) ఆ మాట చెప్పి 130 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. అయినా, కావలికోట పత్రికను గానీ, ఆ పత్రికను ప్రచురిస్తున్న సంస్థను గానీ నిలిపేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు!

8 యెహోవా ప్రజలు డబ్బు కోసం చేయి చాచరు, చందాలు వసూలు చేయరు లేదా విరాళాలు ఇవ్వమని ఉత్తరాలు పంపరు. అలాగే, డబ్బు కోసం కొన్ని చర్చీలు ఉపయోగించే బింగో, లాటరీ వంటి పద్ధతుల్ని కూడా ఉపయోగించరు. బదులుగా, వాళ్లు ఎంతోకాలం క్రితం వాచ్‌ టవర్‌ చెప్పిన ఈ మాట మీదే నిలబడతారు: “ఇతర చర్చీల్లాగా ప్రభువు పేరు చెప్పుకుని డబ్బులు అడగడం సరైనది కాదని మా అభిప్రాయం. . . . అలా ఇతరుల్ని అడిగి సేకరించిన డబ్బు ప్రభువుకు అసహ్యం. ఆయన దాన్ని అస్సలు అంగీకరించడు. అంతేకాదు, ఆ డబ్బును ఇచ్చినవాళ్ల మీద గానీ, వాళ్లు ఏ పని కోసమైతే డబ్బు ఇచ్చారో ఆ పని మీద గానీ దేవుని ఆశీర్వాదం ఉండదు.” b

‘ప్రతీ ఒక్కరు తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి’

9, 10. మనం స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి ఒక కారణం ఏమిటి?

9 రాజ్య పౌరులమైన మనం, మన డబ్బును, ఇతర వనరులను బలవంతంగా కాదు గానీ ఇష్టపూర్వకంగా రాజ్య పనుల కోసం ఉపయోగిస్తాం. ఎందుకు? మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

10 మొదటిగా, మనం యెహోవాను ప్రేమిస్తూ “ఆయనకు నచ్చే పనులు” చేయాలనుకుంటాం కాబట్టే స్వచ్ఛందంగా విరాళమిస్తాం. (1 యోహా. 3:22) తన ఆరాధకులు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఏమన్నాడో గమనించండి. (2 కొరింథీయులు 9:7 చదవండి.) నిజ క్రైస్తవుడు బలవంతంగానో, అయిష్టంగానో కాకుండా తన ‘మనసులో తీర్మానించుకుని’ ఇస్తాడు. c అంటే సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో, వాటికోసం తాను ఎంత ఇవ్వగలడో ఆలోచించి, తర్వాత విరాళం ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఎందుకంటే “సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని బైబిలు చెప్తుంది.

మొజాంబిక్‌లో సంతోషంగా విరాళం ఇస్తున్న చిన్నారులు

11. యెహోవాకు శ్రేష్ఠమైన కానుక ఇవ్వాలనే కోరిక ఎలా కలుగుతుంది?

11 రెండవదిగా, యెహోవా మనమీద ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరించాడు కాబట్టి, దానికి కృతజ్ఞతగా మనం విరాళమిస్తాం. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆలోచింపజేసే సూత్రాన్ని పరిశీలించండి. (ద్వితీయోపదేశకాండము 16:16, 17 చదవండి.) మూడు వార్షిక పండుగలకు హాజరయ్యేటప్పుడు, ప్రతీ ఇశ్రాయేలీయుడు ‘యెహోవా తనకు అనుగ్రహించిన దీవెన చొప్పున’ కానుక తీసుకురావాలి. అంటే ఆ పండుగకు హాజరయ్యే ముందే, ప్రతీ వ్యక్తి యెహోవా తనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను లెక్కపెట్టుకుని, తన హృదయంలో నిశ్చయించుకొని, తన స్తోమతకు తగ్గట్లు తాను ఏమి ఇవ్వగలడో ఆలోచించుకోవాలి. అదేవిధంగా మనం కూడా, యెహోవా మనల్ని ఏయే విధాలుగా ఆశీర్వదించాడో ధ్యానించినప్పుడు, ఆయనకు శ్రేష్ఠమైన కానుక ఇవ్వాలనే కోరిక కలుగుతుంది. స్వచ్ఛంద విరాళాలే కాదు మనం హృదయపూర్వకంగా ఇచ్చే ఏ కానుకైనా, యెహోవా మనపై కుమ్మరించిన దీవెనలపట్ల మనకు ఎంత కృతజ్ఞత ఉందో చూపిస్తుంది.—2 కొరిం. 8:12-15.

12, 13. విరాళం ఇవ్వడం ద్వారా మన రాజైన యేసుక్రీస్తు పట్ల ఎలా ప్రేమ చూపిస్తాం? ప్రతీఒక్కరు ఎంత విరాళం ఇవ్వాలి?

12 మూడవదిగా, మనం విరాళం ఇవ్వడం ద్వారా మన రాజైన యేసుక్రీస్తు పట్ల ప్రేమ చూపిస్తాం. అదెలా? యేసు తన భూజీవితపు చివరి రాత్రి తన శిష్యులతో ఏమి అన్నాడో గమనించండి. (యోహాను 14:23 చదవండి.) “ఎవరైనా నన్ను ప్రేమిస్తే, అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు” అని యేసు అన్నాడు. ఆయన “మాట”లో రాజ్యం గురించిన మంచివార్తను భూవ్యాప్తంగా ప్రకటించమనే ఆజ్ఞ కూడా ఇమిడివుంది. (మత్త. 24:14; 28:19, 20) కాబట్టి రాజ్య ప్రకటనా పనికి మద్దతుగా మన సమయాన్ని, శక్తిని, ఆర్థిక వనరుల్ని ఇవ్వడం ద్వారా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాం. ఆ విధంగా ఆయనపై ప్రేమ చూపిస్తాం.

13 అవును, స్వచ్ఛంద విరాళాల ద్వారా రాజ్యానికి మద్దతివ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి దాన్ని ఎలా చేయవచ్చు? ప్రతీఒక్కరు వ్యక్తిగతంగా నిర్ణయించుకుని, తమ శక్తిమేరకు శ్రేష్ఠమైనది ఇవ్వవచ్చు. అయితే మన సహోదరసహోదరీల్లో చాలామంది ధనవంతులు కాదు. (మత్త. 19:23, 24; యాకో. 2:5) అయినప్పటికీ, వాళ్లు హృదయపూర్వకంగా ఇచ్చే ఏ చిన్న విరాళమైనా యెహోవా దృష్టిలో, యేసు దృష్టిలో విలువైనదే అని తెలుసుకుని వాళ్లు సంతోషించవచ్చు.—మార్కు 12:41-44.

రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?

14. చాలా సంవత్సరాలపాటు యెహోవాసాక్షులు బైబిలు సాహిత్యాన్ని ఎలా అందించారు?

14 చాలా సంవత్సరాలపాటు, యెహోవాసాక్షులు బైబిలు ప్రచురణల్ని డబ్బులకు అందించేవాళ్లు. ఆ ధర ఎంత తక్కువగా ఉండేదంటే, అంతంతమాత్రపు ఆదాయం ఉన్నవాళ్లు సైతం వాటిని తీసుకోగలిగేవాళ్లు. కొన్నిసార్లు గృహస్థులకు ఆసక్తి ఉండేది కానీ, మన ప్రచురణల్ని తీసుకోవడానికి వాళ్ల దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అలాంటప్పుడు, ప్రచారకులు వాళ్లకు ఉచితంగానే ప్రచురణల్ని అందించడానికి ఇష్టపడేవాళ్లు. మంచి మనసున్న ప్రజలు వాటిని చదివి ప్రయోజనం పొందాలన్నదే వాళ్ల ముఖ్య ఉద్దేశం.

15, 16. (ఎ) సాహిత్యాన్ని అందించే విధానంలో పరిపాలక సభ 1990లో ఏ మార్పు తీసుకొచ్చింది? (బి) మనం స్వచ్ఛంద విరాళాలు ఎలా ఇవ్వవచ్చు? (“ స్వచ్ఛంద విరాళాలను ఎలా ఉపయోగిస్తారు?” అనే బాక్సు కూడా చూడండి.)

15 1990లో, ప్రచురణలు అందించే విధానంలో పరిపాలక సభ మార్పు తీసుకొచ్చింది. సాహిత్యాన్ని ఇకపై విరాళాల పద్ధతిలోనే అందించాలని చెప్పింది. దాని గురించి వివరిస్తూ, అమెరికాలో ఉన్న సంఘాలన్నిటికి పరిపాలక సభ ఈ ఉత్తరం పంపింది: “సహోదరసహోదరీలకు గానీ ఇతరులకు గానీ సాహిత్యాన్ని, పత్రికలను ఇస్తున్నప్పుడు, వాటిని తీసుకోవాలంటే ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పకూడదు లేదా అడగకూడదు. . . . ఎవరైనా మన విద్యా పని కోసం విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. అయితే, వాళ్లు విరాళం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్లకు సాహిత్యాన్ని అందిస్తాం.” ఆ కొత్త ఏర్పాటు, మనం చేసే పని స్వచ్ఛందమైనదని, మతపరమైనదని, మనం “దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ” తిరిగేవాళ్లం కాదని స్పష్టం చేసింది. (2 కొరిం. 2:17) ఆ సంవత్సరం నుండి, అమెరికాలో ఉన్న మన సహోదరసహోదరీలు పూర్తిగా విరాళాల ఆధారంగానే సాహిత్యాన్ని అందించడం మొదలుపెట్టారు. తర్వాత్తర్వాత, ఇతర దేశాల్లో కూడా ఆ విరాళాల పద్ధతి అమల్లోకి వచ్చింది.

16 మరి స్వచ్ఛంద విరాళాలు ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలి? విరాళాలు వేయడానికి వీలుగా ప్రతీ రాజ్యమందిరంలో విరాళాల పెట్టెలు ఉంటాయి. విరాళం ఇవ్వాలనుకునే వాళ్లు దాంట్లో వేయవచ్చు లేదా యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టపరమైన సంస్థలకు నేరుగా పంపించవచ్చు. ప్రతీ సంవత్సరం కావలికోటలో వచ్చే ఒక ఆర్టికల్‌ ఆ వివరాల గురించి చర్చిస్తుంది.

స్వచ్ఛంద విరాళాలను ఎలా ఉపయోగిస్తారు?

17-19. స్వచ్ఛంద విరాళాలను (ఎ) ప్రపంచవ్యాప్త పని కోసం, (బి) ప్రపంచవ్యాప్త రాజ్యమందిర నిర్మాణ పని కోసం, (సి) స్థానిక సంఘ ఖర్చుల కోసం ఎలా ఉపయోగిస్తారో వివరించండి.

17 ప్రపంచవ్యాప్త పని. మనం ఇచ్చే విరాళాలను ప్రపంచవ్యాప్త పని కోసం ఉపయోగిస్తారు. అంటే, సాహిత్యాన్ని ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టడానికి; బ్రాంచి కార్యాలయాలను బెతెల్‌ గృహాలను నిర్మించి, వాటిని సరైన స్థితిలో ఉంచడానికి; దైవపరిపాలనా పాఠశాలలను నిర్వహించడానికి ఆ విరాళాలను ఉపయోగిస్తారు. అంతేకాదు, మిషనరీల, ప్రయాణ పర్యవేక్షకుల, ప్రత్యేక పయినీర్ల అవసరాల కోసం కూడా వాటిని ఉపయోగిస్తారు. విపత్తులు వచ్చినప్పుడు, సహోదరసహోదరీల కోసం సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఆ విరాళాలు ఉపయోగపడతాయి. d

18 ప్రపంచవ్యాప్త రాజ్యమందిర నిర్మాణ పని. కొత్త రాజ్యమందిరాలను నిర్మించడానికి లేదా పాతవాటికి మరమ్మతులు చేయడానికి స్వచ్ఛంద విరాళాలను ఉపయోగిస్తారు. ఎక్కువ విరాళాలు వచ్చినప్పుడు, రాజ్యమందిరాల అవసరం ఉన్న మరిన్ని సంఘాలకు సహాయం చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. e

19 స్థానిక సంఘ ఖర్చులు. స్థానిక రాజ్యమందిర ఖర్చుల కోసం, అలాగే దాన్ని సరైన స్థితిలో ఉంచడం కోసం విరాళాలను ఉపయోగిస్తారు. కావాలనుకుంటే, ఆ విరాళాల్లో కొంత మొత్తాన్ని ప్రపంచవ్యాప్త పని కోసం, స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపించాలని పెద్దలు నిర్ణయించవచ్చు. అలాంటప్పుడు, వాళ్లు సంఘంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సంఘం దాన్ని ఆమోదించాక, నిర్ణయించబడిన విరాళాల్ని బ్రాంచికి పంపిస్తారు. ప్రతీ నెల, సంఘ అకౌంట్స్‌ చూసుకునే సహోదరుడు అకౌంట్స్‌ రిపోర్టు తయారుచేస్తాడు. తర్వాత దాన్ని సంఘంలో చదువుతారు.

20. మీకున్న విలువైన వాటితో యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు?

20 ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో ఎంత శ్రమ, ఖర్చు ఇమిడివున్నాయో ఆలోచించినప్పుడు మనకున్న విలువైన వాటితో ‘యెహోవాను ఘనపర్చాలనుకుంటాం.’ (సామె. 3:9, 10) అంటే మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సామర్థ్యాలను రాజ్య పనిలో ఉపయోగించాలని కోరుకుంటాం. అయితే, మన దగ్గరున్న విలువైన వాటిలో, మన ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి. కాబట్టి, మన శక్తికొలది ఆ వనరులను ఉపయోగించాలని నిశ్చయించుకుందాం. అలా చేయడం ద్వారా, యెహోవాను ఘనపరుస్తాం, మెస్సీయ రాజ్యానికి మద్దతిస్తాం.

a ద వాచ్‌ టవర్‌ జూలై 15, 1915 సంచికలో 218-219 పేజీలు.

b ద వాచ్‌ టవర్‌ ఆగస్టు 1, 1899 సంచికలో 201వ పేజీ.

c “తీర్మానించుకోవడం” అనే గ్రీకు పదానికి, “ముందే నిర్ణయించుకోవడం” అని అర్థం ఉందని ఒక విద్వాంసుడు చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “అప్పటికప్పుడు ఇవ్వడంలో ఆనందం ఉన్నా, ముందే ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం మంచిది.”—1 కొరిం. 16:2.

d విపత్తు సహాయక చర్యల గురించి మరింత సమాచారం కోసం ఈ పుస్తకంలోని 20వ అధ్యాయం చూడండి.

e రాజ్యమందిర నిర్మాణ పని గురించి మరింత సమాచారం కోసం ఈ పుస్తకంలోని 19వ అధ్యాయం చూడండి.