కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19

యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని

యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణ పని రాజ్య పనులకు మద్దతిస్తుంది

1, 2. (ఎ) యెహోవా సేవకులు ఏ పనిలో సంతోషంగా పాల్గొంటున్నారు? (బి) యెహోవా వేటిని అమూల్యంగా ఎంచుతాడు?

 యెహోవా నమ్మకమైన సేవకులు, ఎప్పటినుండో నిర్మాణ పనిలో సంతోషంగా పాల్గొంటూ ఆయన పేరుకు ఘనత తెస్తున్నారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు గుడారాన్ని నిర్మించడంలో ఉత్సాహంగా భాగం వహించారు. అంతేకాదు ఆ నిర్మాణానికి కావాల్సిన వస్తువులను ఉదారంగా ఇచ్చారు.—నిర్గ. 35:30-35; 36:1, 4-7.

2 అయితే యెహోవాకు ఘనత తీసుకొచ్చేవి, ఆయన విలువైనవిగా ఎంచేవి, నిర్మాణ పనిలో ఉపయోగించే వస్తువులు కావు. (మత్త. 23:16, 17) బదులుగా, తన సేవకులు చేసే ఆరాధనను, ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా చేసే పనిని ఆయన అమూల్యంగా ఎంచుతాడు. (నిర్గ. 35:21; మార్కు 12:41-44; 1 తిమో. 6:17-19) అది నిజం. ఎందుకంటే భవనాలు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు కట్టిన గుడారం గానీ, ఆలయం గానీ ఇప్పుడు లేవు. అయినప్పటికీ, వాటిని నిర్మించడంలో తన నమ్మకమైన సేవకులు చూపించిన ఉదారతను, వాళ్లు పడిన కష్టాన్ని యెహోవా మర్చిపోలేదు.—1 కొరింథీయులు 15:58; హెబ్రీయులు 6:10 చదవండి.

3. ఈ అధ్యాయంలో మనం ఏమి పరిశీలిస్తాం?

3 ఆధునిక కాల యెహోవా సేవకులు కూడా ఆరాధనా స్థలాల్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశారు. రాజైన యేసుక్రీస్తు నిర్దేశం కింద, మనం నిర్మాణ పనిలో ఎంతో అభివృద్ధి సాధించాం. ఆ పనిని యెహోవా ఆశీర్వదించాడని స్పష్టమౌతోంది. (కీర్త. 127:1) ఈ అధ్యాయంలో, యెహోవాకు ఘనత తెచ్చిన కొన్ని నిర్మాణ పనుల గురించి చూస్తాం. అలాగే నిర్మాణ పనిలో పాల్గొన్న కొందరి అనుభవాలను కూడా పరిశీలిస్తాం.

రాజ్యమందిరాలను నిర్మించడం

4. (ఎ) నేడు ఆరాధనా స్థలాలు ఎందుకు ఎక్కువగా అవసరమౌతున్నాయి? (బి) వేర్వేరు బ్రాంచి కార్యాలయాలను ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది? ( “మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిర్మించిన బ్రాంచి కార్యాలయాలు” అనే బాక్సు చూడండి.)

4 16వ అధ్యాయంలో చూసినట్లుగా, మనం ఆరాధన కోసం సమకూడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 10:25) కూటాలు మన విశ్వాసాన్ని బలపర్చడమే కాక, ఇంకా ఎక్కువగా ప్రకటనా పని చేయాలనే ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ చివరి రోజుల్లో యెహోవా ప్రకటనా పనిని వేగవంతం చేయడం వల్ల, ప్రతీ సంవత్సరం లక్షలమంది ప్రజలు ఆయన సంస్థలోకి ప్రవాహంలా వస్తున్నారు. (యెష. 60:22) వాళ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, బైబిలు ప్రచురణలను తయారు చేయడానికి కావాల్సిన ముద్రణా సదుపాయాలు, అలాగే ఆరాధనా స్థలాలు ఎక్కువగా అవసరం అవుతున్నాయి.

5. రాజ్యమందిరం అనే పేరు ఎందుకు సరైనది? ( “న్యూ లైట్‌ చర్చి” అనే బాక్సు కూడా చూడండి.)

5 సొంత ఆరాధనా స్థలాలు ఉండడం ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థులు తొలినాళ్లలోనే గుర్తించారు. అలాంటి ఒక ఆరాధనా స్థలాన్ని 1890లో అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో నిర్మించారు. 1930ల కల్లా, యెహోవా ప్రజలు చాలా భవనాలను నిర్మించారు లేదా బాగుచేశారు. అయితే, వాటికి ప్రత్యేకమైన పేరేమీ పెట్టలేదు. 1935లో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, హవాయ్‌లో కొత్త బ్రాంచి కార్యాలయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఒక హాలును సందర్శించాడు. దానికి ఏ పేరు పెట్టాలని అడిగినప్పుడు, “మనం రాజ్యం గురించి ప్రకటిస్తున్నాం కాబట్టి దీన్ని ‘రాజ్యమందిరం’ అని పిలిస్తే బాగుంటుందేమో!” అని సహోదరుడు జవాబిచ్చాడు. (మత్త. 24:14) అది నిజంగా సరైన పేరు. కొంతకాలానికే, ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు ఉపయోగిస్తున్న ఆరాధనా స్థలాలన్నీ అదే పేరుతో పిలువబడ్డాయి.

6, 7. అతి తక్కువ సమయంలోనే రాజ్యమందిరాలను నిర్మించడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

6 1970ల కల్లా ఎక్కువ రాజ్యమందిరాలు అవసరమయ్యాయి. దాంతో అమెరికాలోని సహోదరులు, తక్కువ రోజుల్లోనే అందమైన భవనాలను నిర్మించే ఒక చక్కని పద్ధతిని కనుగొన్నారు. 1983కల్లా అమెరికా, కెనడా ప్రాంతాల్లో దాదాపు 200 రాజ్యమందిరాలను నిర్మించారు. ఆ పని చేసేందుకు వాళ్లు రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. దానికి మంచి ఫలితాలు రావడంతో, 1986లో పరిపాలక సభ ఆ ఏర్పాటును అధికారికం చేసింది. అలా 1987కల్లా అమెరికాలో 60 రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. a 1992కల్లా అవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, మెక్సికో, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్‌ దేశాల్లో కూడా ఏర్పడ్డాయి. రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను నిర్మిస్తూ పవిత్రసేవలో ఎంతో కష్టపడి పని చేస్తున్న మన సహోదరులకు మనం తప్పకుండా మద్దతివ్వాలి.

7 అలా నిర్మించబడిన రాజ్యమందిరాలు స్థానికులకు మంచి సాక్ష్యమిచ్చాయి. ఉదాహరణకు, స్పెయిన్‌లోని మార్టోస్‌ అనే నగరంలో ఒక రాజ్యమందిరం చాలా తక్కువ సమయంలో నిర్మించబడింది. దాని గురించి, స్పెయిన్‌లోని ఒక వార్తాపత్రిక “విశ్వాసం కొండల్ని సైతం కదిలిస్తుంది” అనే శీర్షిక కింద ఇలా తెలియజేసింది: “[స్పెయిన్‌లోని] వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకులు తమ సొంత ఖర్చులతో మార్టోస్‌కు వెళ్లి, ఒక భవనాన్ని నిర్మించారు. వాళ్లు అతి తక్కువ సమయంలోనే ఒక పటిష్ఠమైన భవనాన్ని నిర్మించి చరిత్ర సృష్టించారు. స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో వాళ్లు అంత నిస్వార్థంగా ఎలా పని చేయగలిగారు?” ఆ ప్రశ్నకు జవాబుగా, ఆ నిర్మాణ పనిలో సేవ చేసిన ఒక యెహోవాసాక్షి అన్న ఈ మాటల్ని వార్తాపత్రిక ప్రచురించింది: “మేమంతా యెహోవా చేత బోధించబడుతున్నాం కాబట్టే ఇది సాధ్యమైంది.”

తక్కువ వనరులు ఉన్న దేశాల్లో రాజ్యమందిరాలను నిర్మించడం

8. 1999లో, పరిపాలక సభ ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది? ఎందుకు?

8 20వ శతాబ్దం చివరికల్లా, తక్కువ వనరులు ఉన్న దేశాల్లో సైతం ప్రజలు యెహోవా సంస్థలోకి ప్రవాహంలా వచ్చారు. దాంతో, స్థానిక సంఘాలు తమ స్తోమతకు తగ్గట్లు ఆరాధనా స్థలాలను నిర్మించుకున్నాయి. కానీ అవి ఇతర ఆరాధనా స్థలాలంత అందంగా, ఆడంబరంగా లేకపోవడంతో అక్కడి సహోదరులు ఎగతాళిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి దేశాల్లో రాజ్యమందిర నిర్మాణ పనిని వేగవంతం చేయడానికి, పరిపాలక సభ 1999లో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సంపన్న దేశాల్లో వచ్చిన విరాళాలను, తక్కువ వనరులు ఉన్న దేశాల్లో ఉపయోగించి ‘సమానత్వాన్ని’ తీసుకురావాలని పరిపాలక సభ నిర్ణయించింది. (2 కొరింథీయులు 8:13-15 చదవండి.) ఆ పనిలో సహాయం చేయడానికి, ఇతర దేశాలకు చెందిన సహోదరసహోదరీలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

9. మొదట్లో ఏది అసాధ్యం అనిపించింది? కానీ తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

9 2001లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 88 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 18,300 కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు నిర్మించాల్సి ఉంది. మొదట్లో వాటన్నిటిని నిర్మించడం అసాధ్యం అనిపించింది. కానీ దేవుని శక్తి, రాజైన యేసుక్రీస్తు అండగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. (మత్త. 19:26) పరిపాలక సభ మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా, 1999 నుండి 2013 మధ్యకాలంలో అంటే 15 ఏళ్లలోనే 26,849 రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి. b యెహోవా ప్రకటనా పనిని ఎంతగా ఆశీర్వదించాడంటే, 2013 నాటికి ఆ దేశాల్లో మరో 6,500 రాజ్యమందిరాలు అవసరమయ్యాయి. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం వందల రాజ్యమందిరాలు అవసరం అవుతున్నాయి.

తక్కువ వనరులు ఉన్న దేశాల్లో రాజ్యమందిరాలను నిర్మించడం నిజంగా ఒక సవాలే

10-12. రాజ్యమందిరాలను నిర్మించడం వల్ల యెహోవా పేరుకు ఎలా ఘనత వస్తుంది?

10 రాజ్యమందిరాలను నిర్మించడం వల్ల యెహోవా పేరుకు ఎలా ఘనత వస్తుంది? “సాధారణంగా కొత్త రాజ్యమందిరాన్ని నిర్మించిన ఒక్క నెలలోనే, కూటాలకు హాజరయ్యేవాళ్ల సంఖ్య రెండింతలు పెరుగుతుంది” అని జింబాబ్వేలోని బ్రాంచి కార్యాలయం తెలియజేసింది. చాలా దేశాల్లో, సరైన ఆరాధనా స్థలం లేకపోవడం వల్ల ప్రజలు మన కూటాలకు హాజరవ్వడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. కానీ రాజ్యమందిరాన్ని నిర్మించాక, అది నిండిపోయి ఇంకొక రాజ్యమందిరం అవసరమౌతుంది. అయితే, ప్రజలు కేవలం రాజ్యమందిరాల రూపాన్ని చూసి యెహోవావైపు ఆకర్షితులవ్వరు గానీ, వాటిని నిర్మించే సహోదరసహోదరీల నిజమైన క్రైస్తవ ప్రేమను చూసి ఆకర్షితులౌతారు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

11 ఇండోనేషియా. రాజ్యమందిర నిర్మాణాన్ని చాలా రోజులుగా గమనిస్తున్న ఒక వ్యక్తి, అక్కడ పని చేస్తున్నవాళ్లంతా స్వచ్ఛంద సేవకులని తెలిసి ఇలా అన్నాడు: “మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది! ఈ పని చేస్తున్నందుకు మీకు జీతం రాకపోయినా మీరు భలే సంతోషంగా, మనస్ఫూర్తిగా పని చేస్తున్నారు. మీలాంటి మతాన్ని నేను ఎక్కడా చూడలేదు!”

12 యుక్రెయిన్‌. ఒకామె, తాను రోజూ వెళ్లే దారిలో ఒక రాజ్యమందిర నిర్మాణాన్ని గమనిస్తూ ఉంది. అక్కడ పనిచేసేవాళ్లు యెహోవాసాక్షులని, వాళ్లు నిర్మిస్తున్నది రాజ్యమందిరమని ఆమెకు అర్థమైంది. ఆమె ఇలా చెప్తుంది: “మా చెల్లి కూడా ఒక యెహోవాసాక్షే. ఆమె యెహోవాసాక్షుల గురించి తరచూ నాకు చెప్తుంటుంది. వాళ్లు చేస్తున్న ఈ నిర్మాణ పనిని, వాళ్ల మధ్య ఉన్న ప్రేమను చూశాక ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో నేనూ భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను.” ఆమె బైబిలు అధ్యయనాన్ని అంగీకరించి 2010లో బాప్తిస్మం తీసుకుంది.

13, 14. (ఎ) రాజ్యమందిర నిర్మాణ పనిని చూసిన ఒక జంట ఎలా స్పందించింది? (బి) మీ ఆరాధనా స్థలాలు యెహోవా పేరుకు ఘనత తెచ్చేలా మీరేమి చేయవచ్చు?

13 అర్జెంటీనా. ఒక జంట, రాజ్యమందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సహోదరుని దగ్గరికి వచ్చి, ఇలా అన్నారు: “ఈ నిర్మాణ పనిని మేము రోజూ గమనిస్తున్నాం. . . . ఇలాంటి స్థలంలోనే మేము దేవుని గురించి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ కూటాలకు హాజరవ్వాలంటే ఏమి చేయాలి?” తర్వాత వాళ్లు బైబిలు అధ్యయనం తీసుకోవడానికి అంగీకరించి, తమ కుటుంబం మొత్తానికి బైబిలు అధ్యయనం చేయమని అడిగారు. సహోదరులు దానికి సంతోషంగా ఒప్పుకున్నారు.

14 మీ రాజ్యమందిరాన్ని నిర్మించేటప్పుడు, దానిలో భాగం వహించే అవకాశం మీకు దొరికి ఉండకపోవచ్చు. అయితే, మీ రాజ్యమందిరం యెహోవా పేరుకు ఘనత తెచ్చేలా సహాయం చేసే అవకాశం మీకు ఇప్పటికీ ఉంది. ఎలా? మీరు మీ బైబిలు విద్యార్థుల్ని, పునర్దర్శనాల్లో కలిసినవాళ్లను, ఇతరుల్ని రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఆహ్వానించవచ్చు. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి, దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయం చేయవచ్చు. స్థానిక రాజ్యమందిర ఖర్చుల కోసం, అలాగే ప్రపంచవ్యాప్త రాజ్యమందిర నిర్మాణ పని కోసం మీరు ముందుగానే కొంత డబ్బును పక్కకు తీసిపెట్టుకోవచ్చు. (1 కొరింథీయులు 16:2 చదవండి.) అలా చేయడం ద్వారా యెహోవా పేరును ఘనపర్చవచ్చు.

‘ఇష్టపూర్వకంగా’ సేవ చేసే సహోదరసహోదరీలు

15-17. (ఎ) చాలావరకు నిర్మాణ పనుల్లో ఎవరు భాగం వహిస్తారు? (బి) అంతర్జాతీయ నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసిన కొంతమంది దంపతులు ఏమి చెప్తున్నారు?

15 రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను, బ్రాంచి భవనాలను చాలావరకు స్థానిక సహోదరసహోదరీలే నిర్మిస్తారు. సాధారణంగా, నిర్మాణ పనిలో అనుభవం ఉన్న ఇతర దేశాల సహోదరసహోదరీలు వచ్చి వాళ్లకు సహాయం చేస్తారు. ఆ స్వచ్ఛంద సేవకులు, కొన్ని వారాలపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులో పని చేసేందుకు వీలుగా తమ జీవితంలో సర్దుబాట్లు చేసుకుంటారు. ఇంకొంతమంది, నిర్మాణ పనిలో ఒకచోటు నుండి మరోచోటుకు వెళ్తూ చాలా సంవత్సరాలు సేవ చేస్తారు.

టిమో, లీనా లాపలేన్‌ (16వ పేరా చూడండి)

16 అంతర్జాతీయ నిర్మాణ పనిలో సవాళ్లూ ఉన్నాయి, ఆశీర్వాదాలూ ఉన్నాయి. ఉదాహరణకు టిమో, లీనా అనే జంట ఆసియా, యూరప్‌, దక్షిణ అమెరికాలోని దేశాలకు వెళ్లి రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను, బ్రాంచి భవనాలను నిర్మించడంలో సహాయం చేశారు. టిమో ఇలా అంటున్నాడు: “గత 30 ఏళ్లలో, దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి నా నియామకం మారుతూ వచ్చింది.” టిమో లీనాలకు పెళ్లై 25 ఏళ్లు అయింది. లీనా ఇలా అంటుంది: “నేను టిమోతో కలిసి పది దేశాల్లో సేవ చేశాను. ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లినప్పుడల్లా, అక్కడి వాతావరణానికి, ఆహారానికి, భాషకు, ప్రకటనా క్షేత్రానికి అలవాటు పడడానికి, కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడానికి ఎంతో సమయం, ఓర్పు అవసరమయ్యేవి.” c మరి వాళ్లు చేసిన కృషికి ఏమైనా ఫలితాలు వచ్చాయా? లీనా ఇలా చెప్తుంది: “మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందాం. సహోదరసహోదరీలు చూపించిన ప్రేమ, వాళ్లిచ్చిన ఆతిథ్యం ద్వారా యెహోవాకు మామీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకున్నాం. మార్కు 10:29, 30 లో యేసు తన శిష్యులకు చేసిన వాగ్దాన నెరవేర్పును కళ్లారా చూశాం. 100 రెట్లు ఎక్కువగా ఆధ్యాత్మిక సహోదరులను, సహోదరీలను, తల్లులను సంపాదించుకున్నాం.” టిమో ఇలా చెప్తున్నాడు: “మా నైపుణ్యాలను ఉన్నతమైన వాటికోసం, అంటే రాజ్య పనుల కోసం ఉపయోగించడం ఎంతో సంతృప్తినిస్తుంది.”

17 డారెన్‌, శారాలు ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌, దక్షిణ అమెరికా, దక్షిణ పసిఫిక్‌లో ఎన్నో నిర్మాణ ప్రాజెక్టుల్లో పని చేశారు. ఆ పనిలో సవాళ్లు ఎదురైనప్పటికీ, ఎన్నో ఆశీర్వాదాలు పొందామని వాళ్లు చెప్తున్నారు. డారెన్‌ ఇలా అంటున్నాడు: “ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన సహోదరులతో కలిసి పని చేయడం ఒక గొప్ప అవకాశం. యెహోవా మీదున్న ప్రేమే మా అందర్నీ ఐక్యం చేసింది.” శారా ఇలా అంటుంది: “వేర్వేరు సంస్కృతులకు చెందిన సహోదరసహోదరీల నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. యెహోవా సేవ కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలు చూసినప్పుడు, నేను కూడా చేయగలిగినదంతా చేయాలనే ప్రోత్సాహం పొందాను.”

18. కీర్తన 110:1-3 లో ఉన్న ప్రవచనం ఎలా నెరవేరుతోంది?

18 సవాళ్లు ఎదురైనప్పటికీ, దేవుని ప్రజలు రాజ్య పనులకు ‘ఇష్టపూర్వకంగా’ మద్దతిస్తారని దావీదు ప్రవచించాడు. (కీర్తన 110:1-3 చదవండి.) రాజ్యానికి సంబంధించిన పనుల్లో భాగం వహిస్తున్న ప్రతీఒక్కరూ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్లే. (1 కొరిం. 3:9) ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో నిర్మించబడుతున్న బ్రాంచి భవనాలు, వందల సంఖ్యలో నిర్మించబడుతున్న సమావేశ హాళ్లు, వేల సంఖ్యలో నిర్మించబడుతున్న రాజ్యమందిరాలు దేవుని రాజ్యం వాస్తవమైనదని, అది ఇప్పుడు పరిపాలిస్తోందని రుజువు చేస్తున్నాయి! యెహోవాకు ఘనత తెచ్చే పనిలో రాజైన యేసుక్రీస్తుకు మద్దతివ్వడం ఎంత గొప్ప అవకాశమో కదా! యెహోవా ఆ ఘనత పొందడానికి నిజంగా అర్హుడు.

a 2013లో, అమెరికాలో 132 రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీల కింద 2,30,000 కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు పని చేశారు. వాళ్లు ప్రతీ సంవత్సరం దాదాపు 75 కొత్త రాజ్యమందిరాలను నిర్మిస్తున్నారు, అలాగే 900 హాళ్లకు మరమ్మతులు చేస్తున్నారు.

b పరిపాలక సభ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రాజ్యమందిరాలను మాత్రమే ఈ సంఖ్య సూచిస్తుంది. మిగతావాటిని ఇందులో చేర్చలేదు.

c అంతర్జాతీయ సేవకులు, స్వచ్ఛంద సేవకులు చాలావరకు తమ సమయాన్ని నిర్మాణ పనికే వెచ్చిస్తారు. అయితే, వారాంతంలో లేదా సాయంత్రంపూట ప్రకటనా పనిలో పాల్గొంటూ స్థానిక సంఘాలకు మద్దతిస్తారు.