కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20

సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం

సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

విపత్తుల సమయంలో క్రైస్తవ ప్రేమను చేతల్లో చూపించడం

1, 2. (ఎ) యూదయలోని క్రైస్తవులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? (బి) వాళ్లు క్రైస్తవ ప్రేమను ఎలా రుచి చూశారు?

 అది దాదాపు సా.శ. 46. యూదయ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. ధాన్యం సమృద్ధిగా లేకపోవడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడున్న యూదా క్రైస్తవులు (క్రైస్తవులుగా మారిన యూదులు), తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నారు. కానీ వాళ్లు ముందెన్నడూ చూడనంతగా యెహోవా కాపుదలను రుచి చూడబోతున్నారు. ఏ విధంగా?

2 కష్టాల్ని అనుభవిస్తున్న ఆ యూదా క్రైస్తవుల కోసం సిరియాలోని అంతియొకయలో ఉన్న యూదా క్రైస్తవులు, అన్య క్రైస్తవులు (క్రైస్తవులుగా మారిన అన్యులు) విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. అలా సేకరించిన విరాళాలను, బాధ్యతగల ఇద్దరు సహోదరుల ద్వారా అంటే బర్నబా, సౌలు ద్వారా యెరూషలేములోని సంఘ పెద్దలకు పంపించారు. (అపొస్తలుల కార్యములు 11:27-30; 12:25 చదవండి.) వాళ్లు చూపించిన ప్రేమకు యూదయలోని సహోదరులు ఎంత ముగ్ధులైవుంటారో కదా!

3. (ఎ) నేడున్న దేవుని ప్రజలు అంతియొకయలోని క్రైస్తవులను ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఒక ఉదాహరణ చెప్పండి. (“ ఆధునిక కాలంలో, మొదటిసారిగా భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం” అనే బాక్సు కూడా చూడండి.) (బి) ఈ అధ్యాయంలో మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 దేవుని ప్రజలు తోటి సహోదరసహోదరీల కోసం సహాయక చర్యలు చేపట్టినట్లుగా నమోదైన సంఘటనల్లో అదే మొదటిది. అంతియొకయలోని క్రైస్తవుల్లాగే, నేడు కూడా మనం కష్టాల్ని లేదా విపత్తులను ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు వెంటనే సహాయం చేస్తాం. a అలాంటి సహాయక చర్యలు చేపట్టడం కూడా ఒక రకమైన పరిచర్యేనని ఎందుకు చెప్పవచ్చు? మనం అలా చేయడానికి కారణాలు ఏమిటి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? ఇప్పుడు మనం ఆ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ‘పవిత్రసేవలో’ భాగం

4. పౌలు కొరింథీయులకు రాసిన ఉత్తరంలో పరిచర్య గురించి ఏమి చెప్పాడు?

4 పౌలు కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరంలో, రెండు రకాల పరిచర్యల గురించి ప్రస్తావించాడు. ఆయన అభిషిక్తులను ఉద్దేశించి ఆ మాటలు రాసినప్పటికీ, అవి నేడున్న ‘వేరే గొర్రెలకు’ కూడా వర్తిస్తాయి. (యోహా. 10:16) ఒకటి, “శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్య.” దానిలో ప్రకటనా పని, బోధనా పని ఇమిడివున్నాయి. (2 కొరిం. 5:18-20; 1 తిమో. 2:3-6) మరొకటి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసుల కోసం చేసేది. దాన్నే పౌలు ‘పరిచారం చేయడం’ అని అన్నాడు. (2 కొరిం. 8:4, అధస్సూచి) ఆ రెండిటికీ, “పరిచర్య” అని అర్థమిచ్చే డీయాకోనీయ అనే గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు.

5. విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం కూడా ఒక రకమైన పరిచర్యేనని ఎందుకు చెప్పవచ్చు?

5 ఆ రెండు పనులకు పౌలు ఒకే గ్రీకు పదాన్ని ఉపయోగించడాన్ని బట్టి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు సహాయం చేయడం కూడా ఒక రకమైన పరిచర్యేనని, సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యల్లో అది కూడా ఒకటని అర్థమౌతుంది. పౌలు అంతకుముందు ఇలా రాశాడు: “పరిచర్యలు వివిధ రకాలు, కానీ ప్రభువు ఒక్కడే; కార్యకలాపాలు వివిధ రకాలు, . . . పవిత్రశక్తే అవన్నీ చేస్తోంది.” (1 కొరిం. 12:4-6, 11) సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యలను పౌలు “పవిత్రసేవ” అని పిలిచాడు. b (రోమా. 12:1, 6-8) అందుకే, ఆయన “పవిత్రులకు సహాయం [పరిచారం, అధస్సూచి] చేయడానికి” సమయం వెచ్చించాడు.—రోమా. 15:25, 26.

6. (ఎ) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం, మన ఆరాధనలో భాగమని పౌలు ఎలా తర్కించాడు? (బి) మనం ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయక చర్యలు ఎలా చేపడతామో వివరించండి. (214వ పేజీలో ఉన్న “ విపత్తులు వచ్చినప్పుడు . . . ” అనే బాక్సు చూడండి.)

6 విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ఒక రకమైన పరిచర్య అని, యెహోవాకు చేసే ఆరాధనలో అదొక భాగమని పౌలు కొరింథీయులకు చెప్పాలనుకున్నాడు. ఆయన ఎలా తర్కించాడో గమనించండి: క్రైస్తవులు ‘క్రీస్తు గురించిన మంచివార్తకు లోబడి ఉంటున్నారు’ కాబట్టే విపత్తు సహాయక చర్యల్లో భాగం వహిస్తున్నారని పౌలు అన్నాడు. (2 కొరిం. 9:13) అంటే, వాళ్లు క్రీస్తు బోధల్ని పాటిస్తూ తోటి విశ్వాసులకు సహాయం చేస్తున్నారు. అంతేకాదు వాళ్లు దయతో చేసే అలాంటి పనులు, “దేవుడు చూపించే అపారదయకు” నిదర్శనాలని పౌలు చెప్పాడు. (2 కొరిం. 9:14; 1 పేతు. 4:10) కావలికోట డిసెంబరు 1, 1975 సంచిక, అవసరంలో ఉన్న సహోదరులకు సహాయం చేయడం గురించి సరిగ్గానే ఇలా చెప్పింది: “యెహోవా దేవుడు, ఆయన కొడుకైన యేసుక్రీస్తు ఇలాంటి సేవలకు ప్రాముఖ్యత ఇస్తారా ఇవ్వరా అనే సందేహం మనకు ఎప్పుడూ రాకూడదు.” అవును, విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం పవిత్రసేవలో ఒక భాగం.—రోమా. 12:1, 7; 2 కొరిం. 8:7; హెబ్రీ. 13:16.

సహాయక చర్యలు చేపట్టడానికి గల కారణాలు

7, 8. విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి గల మొదటి కారణం ఏమిటి? వివరించండి.

7 మనం విపత్తు సహాయక చర్యలు ఎందుకు చేపడతాం? దానికి సమాధానం, పౌలు కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరంలో ఉంది. (2 కొరింథీయులు 9:11-15 చదవండి.) సహాయక చర్యలు చేపట్టడానికి గల మూడు ముఖ్యమైన కారణాల గురించి ఆయన తెలియజేశాడు. వాటిలో ఒక్కో కారణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

8 మొదటిగా, విపత్తు సహాయక చర్యలు యెహోవాను మహిమపరుస్తాయి. ఆ ఐదు వచనాల్లో పౌలు ఎన్నిసార్లు యెహోవా దేవుని గురించి ప్రస్తావించాడో గమనించండి. ‘దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం,’ ‘చాలామంది ప్రజలు దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలపడం’ వంటి మాటల్ని పౌలు ఉపయోగించాడు. (11, 12 వచనాలు) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల, క్రైస్తవులు “దేవుణ్ణి మహిమపరుస్తారు” అనీ, “దేవుని సాటిలేని అపారదయను” స్తుతిస్తారనీ ఆయన చెప్పాడు. (13, 14 వచనాలు) అంతేకాదు, ఆయన ఇలా ముగించాడు: ‘దేవునికి కృతజ్ఞతలు.’—15వ వచనం; 1 పేతు. 4:11.

9. మనం చేపట్టే విపత్తు సహాయక చర్యలు, ఇతరుల అపోహలను ఎలా తుడిచేస్తాయి? ఒక ఉదాహరణ చెప్పండి.

9 నేటి దేవుని సేవకులు కూడా పౌలులాగే భావిస్తారు. అంటే, విపత్తులు వచ్చినప్పుడు సహోదరసహోదరీలకు సహాయం చేయడం ద్వారా యెహోవాను మహిమపర్చవచ్చని, ఆయన బోధలకు వన్నె తీసుకురావచ్చని భావిస్తారు. (1 కొరిం. 10:31; తీతు 2:10) నిజానికి, అలా చేయడం ద్వారా యెహోవా మీద, ఆయన సాక్షుల మీద ఇతరులకు ఉన్న అపోహలను తుడిచేయవచ్చు. ఒక ఉదాహరణ గమనించండి. తుఫాను వల్ల అతలాకుతలమైన ఒక ప్రాంతంలో, ఒకామె తన ఇంటి తలుపు మీద “యెహోవాసాక్షులు మా తలుపు తట్టకూడదు” అని బోర్డు తగిలించుకుంది. అదే వీధిలో ఒక పాడైన ఇంటిని బాగుచేయడానికి కొంతమంది స్వచ్ఛంద సేవకులు వచ్చారు. ఆమె కొన్ని రోజులుగా వాళ్లను గమనిస్తూ ఉంది. అసలు వాళ్లెవరో కనుక్కోవడానికి వాళ్ల దగ్గరికి వెళ్లింది. వాళ్లు యెహోవాసాక్షులని తెలియగానే ఆమె ఆశ్చర్యపోయి, “నేను యెహోవాసాక్షుల్ని అపార్థం చేసుకున్నాను” అంది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఆమె తన తలుపుకు తగిలించిన బోర్డును తీసిపారేసింది.

10, 11. (ఎ) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల తోటి విశ్వాసుల అవసరాలు తీరతాయని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) విపత్తు సహాయక పనుల్లో పాల్గొనే స్వచ్ఛంద సేవకులకు ఉపయోగ పడే ఏ ప్రచురణ అందుబాటులో ఉంది? (“ విపత్తు సహాయక పనుల్లో పాల్గొనేవాళ్లకు సహాయం చేసే ఒక కొత్త పరికరం” అనే బాక్సు చూడండి.)

10 రెండవదిగా, విపత్తు సహాయక చర్యల వల్ల తోటి విశ్వాసుల “అవసరాలు చక్కగా” తీరతాయి. (2 కొరిం. 9:12ఎ) మన సహోదరసహోదరీలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడానికి, వాళ్లకు సహాయం చేయడానికి మనం ముందుంటాం. ఎందుకు? ఎందుకంటే, క్రైస్తవ సంఘ సభ్యులుగా మనందరం ‘ఒకే శరీరం.’ శరీరంలో “ఒక అవయవం బాధపడితే, ఇతర అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి.” (1 కొరిం. 12:20, 26) మన సహోదరసహోదరీలెవరైనా విపత్తులు ఎదుర్కొంటున్నారని తెలిస్తే, ఆ క్షణంలోనే మన పనులన్నిటిని వదిలేసి, ప్రేమతో కనికరంతో వాళ్లకు సహాయం చేయడానికి వెళ్తాం. (యాకో. 2:15, 16) ఈ ఉదాహరణ గమనించండి. 2011లో, సునామీ జపాన్‌ను అతలాకుతలం చేసింది. అప్పుడు అమెరికా బ్రాంచి కార్యాలయం, అమెరికాలోని రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలకు ఉత్తరం పంపి, జపాన్‌లో రాజ్యమందిరాలను తిరిగి నిర్మించడానికి “కొంతమంది అర్హులైన సహోదరులు” కావాలని కోరింది. దానికి ఎలాంటి స్పందన వచ్చింది? కొన్ని వారాల్లోనే, దాదాపు 600 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి, తమ సొంత ఖర్చుతో జపాన్‌ వెళ్లడానికి సిద్ధమయ్యారు! దాని గురించి అమెరికా బ్రాంచి కార్యాలయం ఇలా చెప్పింది: “ఆ ప్రతిస్పందన చూసి మేము ఆశ్చర్యపోయాం.” జపాన్‌లోని ఒక సహోదరుడు, వేరే దేశం నుండి సహాయం చేయడానికి వచ్చిన ఒక సహోదరునితో మాట్లాడుతూ, ఎందుకంత శ్రమ తీసుకుని వచ్చారని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “మేమూ, జపాన్‌లో ఉన్న సహోదరులూ ‘ఒకే శరీరం’. కాబట్టి వాళ్లకు బాధ కలిగినా, నొప్పి కలిగినా మాకూ బాధేస్తుంది.” కొన్నిసార్లైతే, స్వచ్ఛంద సేవకులు తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి, తోటి విశ్వాసులకు సహాయం చేశారు. ఆ విధంగా, వాళ్లు త్యాగపూరిత ప్రేమ చూపించారు. c1 యోహా. 3:16.

11 మనం అందించే సహాయాన్ని చూసి సాక్షులుకాని వాళ్లు కూడా ముగ్ధులౌతారు. ఉదాహరణకు, 2013లో అమెరికాలోని అర్కాన్సాస్‌ రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు, సాక్షులు వెంటనే చర్య తీసుకున్నారు. దాని గురించి ఒక వార్తాపత్రిక ఇలా రాసింది: “విపత్తు రాగానే యెహోవాసాక్షులు ఒక క్రమపద్ధతిలో సహాయక చర్యలు చేపట్టారు.” అవును, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, సహోదరుల “అవసరాలు చక్కగా” తీరేలా మనం సహాయం చేస్తాం.

12-14. (ఎ) కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఆధ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండడం ప్రాముఖ్యమని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?

12 మూడవదిగా, విపత్తు సహాయక చర్యలు చేపట్టడం వల్ల, కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టడం ఎందుకు ప్రాముఖ్యం? సహాయం అందుకున్న వాళ్లు “దేవునికి ఎన్నో కృతజ్ఞతలు” తెలుపుతారు అని పౌలు అన్నాడు. (2 కొరిం. 9:12బి) అంటే, దానర్థం వాళ్లు సాధ్యమైనంత త్వరగా తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెడతారు. (ఫిలి. 1:10) 1945 కావలికోట ఇలా చెప్పింది: “పౌలు . . . విరాళాలను సేకరించడానికి ఎందుకు ఒప్పుకున్నాడంటే, అది కష్టాల్లో ఉన్న సహోదరుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాదు, వాళ్లు యెహోవాకు సాక్ష్యమిచ్చే పనిలో ఇంకా ఉత్సాహంగా పాల్గొనేలా . . . తోడ్పడుతుంది.” నేడు, మనం విపత్తు సహాయక చర్యలు చేపట్టడానికి కారణం కూడా అదే. సహోదరులు సాధ్యమైనంత త్వరగా ప్రకటనా పనిని తిరిగి మొదలుపెడితే, వాళ్లూ ఓదార్పు పొందుతారు, అలాగే నిరాశలో కూరుకుపోయిన ఇతరుల్ని కూడా ఓదార్చగలుగుతారు.—2 కొరింథీయులు 1:3, 4 చదవండి.

13 అలాంటి సహాయం వల్ల, కొంతమంది సహోదరసహోదరీలు ప్రకటనా పనిని తిరిగి ప్రారంభించి, ఓదార్పు పొందగలిగారు. వాళ్లు ఏమంటున్నారో గమనించండి. ఒక సహోదరుడు ఇలా చెప్పాడు: “క్షేత్ర పరిచర్యకు వెళ్లడం వల్ల మా కుటుంబం సంతోషంగా ఉంది. ఇతరుల్ని ఓదార్చడానికి ప్రయత్నించడం వల్ల, మా కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలిగాం.” ఒక సహోదరి ఇలా చెప్పింది: “ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడం వల్ల, నా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనసు పెట్టకుండా ఉండగలిగాను. అప్పుడు నాకు చాలా ధైర్యంగా అనిపించింది.” మరో సహోదరి ఇలా అంది: “పరిస్థితులు పూర్తిగా మా చేయి దాటిపోయినప్పుడు, పరిచర్య మా కుటుంబానికి చాలా సహాయం చేసింది. కొత్తలోకం గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల, అన్నీ కొత్తవిగా అవుతాయనే మా నమ్మకం బలపడింది.”

14 కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాల్సిన మరో పని, కూటాలకు హాజరవడం. 50వ పడిలో ఉన్న కీయోకో అనే సహోదరి ఉదాహరణ గమనించండి. ఆమె సునామీలో సమస్తం కోల్పోయింది. కట్టుకున్న బట్టలు, వేసుకున్న చెప్పులు తప్ప ఆమెకు ఏమీ మిగల్లేదు. ఇక మిగతా జీవితాన్ని ఎలా గడపాలా అని ఆమె ఆలోచించింది. అప్పుడు ఒక సంఘ పెద్ద, తన కారులో జరుగుతున్న కూటానికి రమ్మని ఆమెను ఆహ్వానించాడు. దాని గురించి కీయోకో ఇలా చెప్తుంది: “ఆ కారులో సంఘ పెద్ద, ఆయన భార్య, నేనూ, ఇంకో సహోదరి ఉన్నాం. ఆ కూటం చాలా సరళంగా జరిగినప్పటికీ, అది నా మనసులో ఉన్న సునామీ జ్ఞాపకాలను అద్భుతరీతిలో తుడిచేసింది. అప్పుడు నా మనసు ప్రశాంతంగా అనిపించింది. క్రైస్తవ సహవాసం ఎంత శక్తివంతమైనదో ఆ కూటం నాకు నేర్పింది.” విపత్తులు వచ్చినప్పుడు కూటాలకు హాజరైన మరో సహోదరి ఇలా చెప్పింది: “అవి నా ప్రాణాన్ని నిలబెట్టాయి!”—రోమా. 1:11, 12; 12:12.

విపత్తు సహాయక చర్యల వల్ల వచ్చే ప్రయోజనాలు

15, 16. (ఎ) కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలకు సహాయం చేయడం వల్ల కొరింథులోని క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందారు? (బి) వాళ్లలాగే మనం కూడా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

15 సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పౌలు కొరింథీయులకు తెలియజేశాడు. ఆయన ఇలా అన్నాడు: “మీమీద ఉన్న దేవుని సాటిలేని అపారదయను చూసి వాళ్లు [సహాయం అందుకున్న యెరూషలేములోని యూదా క్రైస్తవులు] మీ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు, మీమీద తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.” (2 కొరిం. 9:14) అవును, సహాయం అందుకున్న యూదా క్రైస్తవులు, కొరింథులోని యూదా క్రైస్తవుల కోసమే కాక అన్య క్రైస్తవుల కోసం కూడా ప్రార్థించారు. అలా వాళ్ల మధ్య ప్రేమ బలపడింది.

16 పౌలు చెప్పిన మాటల్ని మన కాలానికి అన్వయిస్తూ 1945, డిసెంబరు 1 కావలికోట ఇలా చెప్పింది: “ఒక ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలు వేరే ప్రాంతంలోని వాళ్లకు సహాయం చేసినప్పుడు, వాళ్ల మధ్య ఐక్యత బలపడుతుంది!” విపత్తు సహాయక పనుల్లో భాగం వహిస్తున్న స్వచ్ఛంద సేవకుల విషయంలో అది నిజం. వరదలు వచ్చినప్పుడు సహాయం అందించడానికి వెళ్లిన ఒక సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “ఈ పని వల్ల, నా సహోదరులకు చాలా దగ్గరైనట్లు అనిపిస్తుంది.” అలాంటి సహాయాన్ని అందుకున్న ఒక సహోదరి కృతజ్ఞతతో ఇలా అంటుంది: “భూపరదైసులో మనకు అత్యంత సన్నిహితంగా ఉండేది కూడా మన సహోదరులే.”—సామెతలు 17:17 చదవండి.

17. (ఎ) విపత్తులు ఎదుర్కొంటున్న సహోదరసహోదరీలు, యెషయా 41:13 లో ఉన్న మాటల్ని ఎలా చవిచూస్తారు? (బి) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల యెహోవా ఎలా మహిమపర్చబడతాడో, సహోదరుల ఐక్యత ఎలా బలపడుతుందో కొన్ని ఉదాహరణలు చెప్పండి. (“ ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయక పనుల్లో పాల్గొన్న సహోదరసహోదరీలు” అనే బాక్సు కూడా చూడండి.)

17 మన సహోదరులు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు, అక్కడున్న సహోదరసహోదరీలు, దేవుడు చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును ఒక ప్రత్యేకమైన రీతిలో చవిచూస్తారు: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” (యెష. 41:13) విపత్తు నుండి బయటపడిన ఒక సహోదరి ఇలా చెప్పింది: “విపత్తు సృష్టించిన అల్లకల్లోలం చూసి నేను ఆశ వదులుకున్నాను, కానీ యెహోవా తన చేయి అందించాడు. సహోదరులు నాకు చేసిన సహాయాన్ని మాటల్లో వర్ణించలేను.” ఇద్దరు సంఘ పెద్దలు వాళ్లవాళ్ల సంఘాల తరఫున ఇలా ఉత్తరం రాశారు: “భూకంపం భారీ నష్టాన్ని కలిగించింది. కానీ సహోదరుల ద్వారా యెహోవా మాకు సహాయం చేశాడు. విపత్తు సహాయక చర్యల గురించి మేము ప్రచురణల్లో చదివాం, కానీ ఇప్పుడు కళ్లారా చూశాం.”

మీరూ భాగం వహించాలనుకుంటున్నారా?

18. విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించాలనుకుంటే, మీరు ఏమి చేయవచ్చు? (“ అది ఆయన జీవితాన్నే మార్చేసింది” అనే బాక్సు కూడా చూడండి.)

18 విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ఎలా ఉంటుందో రుచి చూడాలనుకుంటున్నారా? అయితే, ఒక్క విషయం. సాధారణంగా, రాజ్యమందిర నిర్మాణ పనుల్లో భాగం వహించేవాళ్లనే, విపత్తు సహాయక చర్యల్లో ఉపయోగించుకుంటారని గుర్తుంచుకోండి. కాబట్టి మీ సంఘ పెద్దలతో మాట్లాడి, దరఖాస్తు చేసుకోండి. విపత్తు సహాయక పనుల్లో ఎంతోకాలంగా సేవ చేస్తున్న ఒక సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “విపత్తు సహాయక కమిటీ నుండి మీకు అధికారికంగా ఆహ్వానం వస్తే తప్ప సంఘటనా స్థలానికి వెళ్లకండి.” అలా వెళ్లకుండా ఉండడం ద్వారా, ఆ సహాయక చర్యలు ఒక క్రమపద్ధతిలో జరిగేందుకు మనం తోడ్పడతాం.

19. విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ద్వారా మనం నిజంగా క్రీస్తు శిష్యులమని ఎలా రుజువు చేయవచ్చు?

19 విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ద్వారా, “ఒకరినొకరు ప్రేమించుకోవాలి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడతాం. అలాంటి ప్రేమ చూపించినప్పుడు, మనం నిజంగా క్రీస్తు శిష్యులమని ఇతరులు గుర్తిస్తారు. (యోహా. 13:34, 35) ఎంతోమంది సహోదరసహోదరీలు తోటి విశ్వాసులకు సహాయం చేస్తూ, యెహోవాకు మహిమ తెస్తున్నారు. అలాంటివాళ్లు మన మధ్య ఉండడం ఎంత ఆశీర్వాదమో కదా!

a విపత్తులు వచ్చినప్పుడు తోటి విశ్వాసులకు సహాయం చేయడం గురించి ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. అయితే, చాలా సందర్భాల్లో సాక్షులుకాని వాళ్లు కూడా మనం చేపట్టే విపత్తు సహాయక చర్యల నుండి ప్రయోజనం పొందుతారు.—గల. 6:10.

b పౌలు ‘సంఘ పరిచారకుల’ గురించి మాట్లాడుతున్నప్పుడు డీయాకోనోస్‌ (పరిచారకులు) అనే పదాన్ని ఉపయోగించాడు.—1 తిమో. 3:12.

c కావలికోట 1994, నవంబరు 1 సంచికలోని 23-27 పేజీల్లో ఉన్న “బోస్నియాలోని మన విశ్వాసగృహమునకు చేరినవారికి సహాయాన్ని అందించడం” అనే ఆర్టికల్‌ చూడండి.