కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

22

రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది

రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

మనుషుల విషయంలో, భూమి విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ రాజ్యం నెరవేర్చడం

1, 2. (ఎ) మనం కొన్నిసార్లు పరదైసును వాస్తవమైనదిగా ఎందుకు చూడలేకపోవచ్చు? (బి) దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయనే విశ్వాసాన్ని మనం ఎలా బలపర్చుకోవచ్చు?

 రోజంతా పని చేసి అలసిపోయిన ఒక సహోదరుడు రాజ్యమందిరానికి వచ్చి కూర్చున్నాడు. ఒకవైపు ఆఫీసులో బాస్‌ తిట్టే తిట్లు, మరోవైపు కుటుంబ అవసరాల్ని ఎలా తీర్చాలి అనే ఆందోళన, ఇంకోవైపు భార్యను పట్టిపీడిస్తున్న అనారోగ్యం. వీటన్నిటి గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రారంభ పాట సంగీతం మొదలవ్వగానే లేచి నిలబడ్డాడు. తన చుట్టూ ఉన్న సహోదరసహోదరీలను చూసి, ఆయనకు కాస్త సంతోషంగా అనిపించింది. ఆయన పాడడం మొదలుపెట్టాడు. ఆ పాట, పరదైసులో ఉండబోయే పరిస్థితుల గురించి చక్కగా వర్ణిస్తోంది. దాన్ని పాడుతున్నంతసేపూ ఆయన పరదైసులో ఉన్నట్లు ఊహించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి తనకిష్టమైన ఆ పాట పాడుతూ, మనసులో ఉన్న బాధనంతా మర్చిపోయాడు.

2 ఆ సహోదరునిలాగే మనలో చాలామందిమి, పరదైసు గురించి ఊహించుకుని ఊరట పొందివుంటాం. కానీ, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వల్ల, రాబోయే పరదైసును మనం వాస్తవమైనదిగా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ‘ప్రమాదకరంగా, కష్టంగా’ ఉన్నాయి. పైగా, పరదైసులాంటి పరిస్థితులు మచ్చుకు ఒక్కటి కూడా కనిపించడం లేదు. (2 తిమో. 3:1) మరి మన నిరీక్షణను వాస్తవమైనదిగా చూడడానికి ఏది సహాయం చేస్తుంది? దేవుని రాజ్యం త్వరలోనే మనుషులందర్నీ పరిపాలిస్తుందని మనం ఎందుకు నమ్మవచ్చు? ప్రాచీన కాలంలో యెహోవా నెరవేర్చిన కొన్ని ప్రవచనాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ ప్రవచనాలు, అలాంటి ఇతర ప్రవచనాలు మన కాలంలో ఎలా నెరవేరుతున్నాయో, భవిష్యత్తులో ఎలా నెరవేరతాయో పరిశీలించి మన విశ్వాసాన్ని బలపర్చుకుందాం.

ప్రాచీన కాలంలో యెహోవా తన వాగ్దానాలను ఎలా నెరవేర్చాడు?

3. బబులోను చెరలో ఉన్న యూదులకు ఏ వాగ్దానం ఓదార్పునిచ్చింది?

3 సా.శ.పూ. 6వ శతాబ్దంలో, బబులోను చెరలో ఉన్న యూదుల జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. వాళ్లలో చాలామంది ఆ బానిసత్వంలోనే పుట్టి పెరిగారు. వాళ్లు కూడా తమ తల్లిదండ్రుల్లాగే కష్టాలతో బ్రతుకు ఈడుస్తున్నారు. యెహోవా మీద విశ్వాసం ఉంచుతున్నందుకు బబులోనీయులు వాళ్లను ఎగతాళి చేస్తున్నారు. (కీర్త. 137:1-3) దశాబ్దాలు గడుస్తున్నాయి. నమ్మకమైన యూదులు, ఎప్పటికైనా యెహోవా తమను స్వదేశానికి తీసుకెళ్తాడనే ఆశతో బ్రతుకుతున్నారు. వాళ్లను స్వదేశానికి తీసుకువెళ్తానని, అక్కడి పరిస్థితులు ఏదెను తోటలో ఉన్న పరిస్థితుల్లా ఉంటాయని యెహోవా వాళ్లకు మాటిచ్చాడు. (యెషయా 51:3 చదవండి.) ఆ వాగ్దానాలు, వాళ్ల భయాలను పోగొట్టడమే కాక వాళ్లకు భరోసా ఇచ్చాయి. ఏ విధంగా? కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

4. స్వదేశానికి తిరిగొచ్చిన యూదులు సురక్షితంగా ఉంటారని యెహోవా ఎలా అభయం ఇచ్చాడు?

4 భద్రత. బబులోను చెర నుండి తిరిగొస్తున్న యూదులు, పరదైసులా ఉన్న ప్రాంతానికి కాదు గానీ, 70 ఏళ్లుగా పాడుబడిపోయిన ప్రాంతానికి వస్తున్నారు. వాళ్లలో కొంతమందైతే, ఆ దేశాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంతేకాదు ఆ దేశంలో, అలాగే వాళ్లు వచ్చే దారిలో సింహాలు, తోడేళ్లు, చిరుతపులులు, ఇతర క్రూర జంతువులు తిరుగుతూ ఉండేవి. కాబట్టి ఒక కుటుంబ శిరస్సు ఇలా ఆలోచించే అవకాశం ఉంది: ‘నేను నా భార్యాపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? నా గొర్రెలు, పశువుల మందల సంగతేంటి? వాటినెలా రక్షించుకోగలను?’ అలాంటి భయాలు ఉండడం సహజమే. ఆ సమయంలో యెహోవా వాళ్లకు ఓదార్పునిచ్చే ఒక వాగ్దానం చేశాడు. దాన్ని మనం యెషయా 11:6-9 లో చూడవచ్చు. (చదవండి.) రమ్యమైన కావ్య రూపంలో ఉన్న ఆ మాటలు, వాళ్లకు, వాళ్ల పశువులకు ఏ హానీ జరగదనే భరోసా ఇచ్చాయి. సింహం గడ్డి తింటుందంటే, దానర్థం అది యూదుల పశువుల జోలికి రాదు. కాబట్టి అలాంటి క్రూర జంతువులకు వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. తన ప్రజలు యూదా దేశంలో సురక్షితంగా ఉంటారని, ఎడారిలోనైనా, అరణ్యంలోనైనా వాళ్లు నిర్భయంగా నివసిస్తారని యెహోవా వాగ్దానం చేశాడు.—యెహె. 34:25.

5. తమకు కావాల్సిన వాటిని యెహోవా సమృద్ధిగా ఇస్తాడని నమ్మడానికి యూదులకు ఏ వాగ్దానాలు సహాయం చేశాయి?

5 సమృద్ధి. కుటుంబ శిరస్సులకు మరికొన్ని సందేహాలు రావచ్చు: ‘స్వదేశానికి వెళ్లాక నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? మేము ఎక్కడ నివసించాలి? ఏదైనా పని దొరుకుతుందా? ఒకవేళ దొరికితే, అది బానిసలుగా ఉన్నప్పుడు చేసిన చాకిరీలాగే ఉంటుందా, లేక మెరుగ్గా ఉంటుందా?’ యెహోవా వాళ్ల భయాల్ని అర్థం చేసుకుని వాళ్లకు ఇంకొన్ని వాగ్దానాలు చేశాడు. వాళ్లు విధేయులుగా ఉన్నంతకాలం, సరైన సమయంలో వర్షం కురుస్తుందని, “నేల నుండి శ్రేష్ఠమైన ఆహారం సమృద్ధిగా” పండుతుందని యెహోవా మాటిచ్చాడు. (యెష. 30:23, NW) ఇక నివాసం, పని విషయానికొస్తే, యెహోవా తన ప్రజలకు ఇలా వాగ్దానం చేశాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.” (యెష. 65:21, 22) అవును, వాళ్ల జీవితం బబులోను చెరలో జీవించిన దానికన్నా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇంతకీ, వాళ్లు బబులోను చెరలోకి వెళ్లడానికి కారణమైన ఆధ్యాత్మిక అనారోగ్యం మాటేమిటి?

6. దేవుని ప్రజలు ఎలాంటి అనారోగ్యంతో బాధపడ్డారు? కానీ యెహోవా వాళ్లకు ఏ అభయం ఇచ్చాడు?

6 ఆధ్యాత్మిక ఆరోగ్యం. దేవుని ప్రజలు చెరలోకి వెళ్లడానికి చాలాకాలం ముందే ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురయ్యారు. “ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను” అని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. (యెష. 1:5) వాళ్లు యెహోవా ఉపదేశాన్ని వినకుండా చెవులు మూసుకున్నారు, ఆయన నడిపింపును చూడకుండా కళ్లు మూసుకున్నారు. అందుకే ఆధ్యాత్మిక భావంలో వాళ్లు గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు అయ్యారు. (యెష. 6:10; యిర్మీ. 5:21; యెహె. 12:2) మరి, చెర నుండి తిరిగి వస్తున్నప్పుడు కూడా అలాంటి అనారోగ్యమే ఉంటే, వాళ్లు సురక్షితంగా జీవించగలరా? యెహోవా అనుగ్రహాన్ని పొందగలరా? ఎంతమాత్రం పొందలేరు. అందుకే యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.” (యెష. 29:18) అవును, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్న తన ప్రజల్ని యెహోవా ఆధ్యాత్మికంగా స్వస్థపరుస్తాడు. వాళ్లు తన మాటకు లోబడినంత కాలం, ఆయన వాళ్లకు జీవాన్నిచ్చే నిర్దేశాన్ని, నడిపింపును ఇస్తూనే ఉంటాడు.

7. బబులోను చెర నుండి తిరిగొస్తున్న యూదుల విషయంలో యెహోవా చేసిన వాగ్దానాలు ఎలా నెరవేరాయి? వాటి నెరవేర్పు గురించి పరిశీలించడం వల్ల మన విశ్వాసం ఎలా బలపడుతుంది?

7 మరి యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చాడా? నెరవేర్చాడని చరిత్రే రుజువు చేస్తోంది. స్వదేశానికి తిరిగొచ్చిన యూదులు భద్రతను, సమృద్ధిని, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అనుభవించారు. ఉదాహరణకు, వాళ్లకంటే బలవంతులైన, అధిక సంఖ్యలో ఉన్న ఇతర జనాంగాల నుండి యెహోవా వాళ్లను కాపాడాడు. వాళ్ల పశువుల మందలకు సైతం ఏ హానీ జరగలేదు. నిజమే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు రాసిన ప్రవచనాల నెరవేర్పును యూదులు కొంతవరకు మాత్రమే చూశారు. కానీ, అవి ఆ సమయంలో వాళ్లకు అవసరమైన ఓదార్పును, అభయాన్ని ఇచ్చాయి. గతంలో యెహోవా తన ప్రజలకు ఏమేమి చేశాడో ధ్యానించడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది. ఆ ప్రవచనాల తొలి నెరవేర్పే అంత అద్భుతంగా ఉంటే, భవిష్యత్తులో జరిగే గొప్ప నెరవేర్పు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో! ఆ ప్రవచనాలు నేడు ఎలా నెరవేరుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా మన కాలంలో తన వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు

8. నేడు దేవుని ప్రజలు ఏ దేశంలో ఆయన్ని ఆరాధిస్తున్నారు?

8 నేడు, యెహోవా ప్రజలు ఒక అక్షరార్థమైన జనాంగంగా లేరు, వాళ్లకంటూ ఒక సొంత దేశమూ లేదు. బదులుగా, అభిషిక్త క్రైస్తవులు “దేవుని ఇశ్రాయేలు” అనే ఒక ఆధ్యాత్మిక జనాంగంగా ఏర్పడ్డారు. (గల. 6:16) వాళ్ల సహచరులైన “వేరే గొర్రెలు” వాళ్లతో కలిసి, ఆధ్యాత్మిక దేశంలో ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తున్నారు. (యోహా. 10:16; యెష. 66:8) యెహోవా ఇచ్చిన ఆ దేశం ఏమిటి? ఆధ్యాత్మిక పరదైసు. దానిలో, యెహోవా చేసిన వాగ్దానాలు ఆధ్యాత్మిక భావంలో నెరవేరుతున్నాయి. కొన్ని ఉదాహరణలు గమనించండి.

9, 10. (ఎ) యెషయా 11:6-9 లో ఉన్న మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి? (బి) దేవుని ప్రజలు శాంతిని అనుభవిస్తున్నారని చెప్పడానికి ఏ రుజువు ఉంది?

9 భద్రత. జంతువులకు జంతువులకు మధ్య, అలాగే మనుషులకు జంతువులకు మధ్య శాంతి, సఖ్యత ఉంటాయని యెషయా 11:6-9 తెలియజేస్తుంది. ఆ ప్రవచనం ఇప్పుడు ఆధ్యాత్మిక భావంలో నెరవేరుతోంది. ఏ విధంగా? ఆ ప్రాణులు ఎందుకు హాని చేయవో చెప్తూ, 9వ వచనం ఇలా వివరిస్తుంది: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” “యెహోవానుగూర్చిన జ్ఞానము” జంతువుల ప్రవృత్తిని మారుస్తుందా? లేదు. అది మనుషుల స్వభావాన్ని మారుస్తుంది. నిజానికి సర్వోన్నతుడైన దేవుని గురించి తెలుసుకుని, ఆయనలా సమాధానంగా ఉండడం నేర్చుకుంటున్నది మనుషులే కానీ జంతువులు కాదు. నేడు, క్రీస్తు అనుచరులు క్రూరమైన లక్షణాలను విడిచిపెట్టి తోటి సహోదరసహోదరీలతో శాంతిగా, సఖ్యతగా జీవిస్తున్నారు. అలా, ఆ ప్రవచనం ఆధ్యాత్మిక భావంలో నెరవేరుతోంది.

10 ఉదాహరణకు, క్రైస్తవులు ఎందుకు యుద్ధాల్లో పాల్గొనరో, దానివల్ల వాళ్లు ఎలాంటి హింసలు ఎదుర్కొన్నారో ఈ ప్రచురణలో గమనించాం. హింసతో నిండివున్న ఈ లోకంలో, ఒక జనాంగం హింసలో పాల్గొనడాన్ని నిరాకరించి, దానికోసం చనిపోవడానికి కూడా సిద్ధపడుతుందంటే, అది గొప్ప విషయం కాదంటారా? మెస్సీయ రాజ్య పౌరులు యెషయా ప్రవచనంలో వర్ణించబడిన శాంతిని అనుభవిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఏ రుజువు కావాలి? తన అనుచరులు ప్రేమను బట్టే గుర్తించబడతారని యేసు చెప్పాడు. (యోహా. 13:34, 35) సంఘంలో, నిజ క్రైస్తవులందరూ ఒకరితో ఒకరు శాంతిగా, ప్రేమగా, మృదువుగా ఎలా మెలగాలో క్రీస్తు తన ‘నమ్మకమైన బుద్ధిగల దాసుని’ ద్వారా ఓపిగ్గా నేర్పిస్తున్నాడు.—మత్త. 24:45-47.

11, 12. నేడు లోకం ఎలాంటి క్షామంతో అలమటిస్తోంది? దీనికి భిన్నంగా దేవుని ప్రజల పరిస్థితి ఎలా ఉంది?

11 సమృద్ధి. ప్రస్తుతం ఈ లోకం ఆధ్యాత్మిక క్షామంతో అలమటిస్తోంది. దాని గురించి బైబిలు ఇలా హెచ్చరించింది: “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.” (ఆమో. 8:11) దేవుని రాజ్య పౌరులు కూడా ఆ క్షామంతో అలమటిస్తారా? లేదు. లోకంలోని ప్రజలకు భిన్నంగా తన సేవకులకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో యెహోవా ముందే చెప్పాడు: “నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు.” (యెష. 65:13) ఆ మాటలు నెరవేరడాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారా?

12 నేడు, ఆధ్యాత్మిక ఏర్పాట్లు అంతకంతకూ లోతు, వెడల్పు పెరుగుతున్న నదిలా పెల్లుబికి ప్రవహిస్తున్నాయి. మన బైబిలు ప్రచురణలు, ఆడియో రికార్డింగ్‌లు, వీడియోలు, కూటాలు, సమావేశాలు, వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం వెల్లువలా మనల్ని ముంచెత్తుతున్నాయి. అందుకే, ఆధ్యాత్మిక క్షామంతో అలమటిస్తున్న ఈ లోకంలో, మనం ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవిస్తున్నాం. (యెహె. 47:1-12; యోవే. 3:18) సమృద్ధి గురించి యెహోవా చేసిన వాగ్దానాలు నెరవేరడాన్ని మీరు కళ్లారా చూస్తున్నారా? యెహోవా బల్ల దగ్గర క్రమంగా ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాలని మీరు నిశ్చయించుకున్నారా?

సంఘాల్లో మనం ఆధ్యాత్మిక సమృద్ధిని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం

13. గుడ్డివాళ్ల కళ్లు తెరవబడడం, చెవిటివాళ్ల చెవులు విప్పబడడం మీరు చూస్తున్నారా?

13 ఆధ్యాత్మిక ఆరోగ్యం. నేడు చాలామంది ప్రజలు ఆధ్యాత్మిక గుడ్డితనంతో, చెవిటితనంతో ఉన్నారు. (2 కొరిం. 4:4) అయితే, క్రీస్తు ప్రపంచవ్యాప్తంగా అలాంటి వైకల్యాలను, వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు. గుడ్డివాళ్ల కళ్లు తెరవబడడాన్ని, చెవిటివాళ్ల చెవులు విప్పబడడాన్ని మీరు గమనిస్తున్నారా? అబద్ధ సిద్ధాంతాల వల్ల గుడ్డివాళ్లుగా, చెవిటివాళ్లుగా మారిన ప్రజలు ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఖచ్చితమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. అలా, “ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు” అనే ప్రవచనం నెరవేరుతోంది. (యెష. 29:18) ప్రపంచవ్యాప్తంగా, ప్రతీ సంవత్సరం లక్షలమంది ప్రజలు అలాంటి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందుతున్నారు. వాళ్లు మహాబబులోనును విడిచిపెట్టి, మనతో కలిసి ఆధ్యాత్మిక పరదైసులో యెహోవాను ఆరాధిస్తున్నారు. యెహోవా వాగ్దానాలు నెరవేరుతున్నాయనడానికి వాళ్లే సజీవ సాక్ష్యం!

14. ఏ విషయాల్ని ధ్యానించడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది?

14 ఈ పుస్తకంలోని ప్రతీ అధ్యాయంలో, క్రీస్తు తన అనుచరులను ఆధ్యాత్మిక పరదైసులోకి తీసుకొచ్చాడనడానికి చాలా రుజువుల్ని పరిశీలించాం. ఆ ఆధ్యాత్మిక పరదైసులో మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాల గురించి ధ్యానించడం వల్ల, భవిష్యత్తులో యెహోవా తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడనే మన విశ్వాసం బలపడుతుంది.

“నీ రాజ్యం రావాలి”

15. భూమి పరదైసులా మారుతుందని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

15 ఈ భూమిని పరదైసుగా మార్చాలన్నదే యెహోవా మొదటి సంకల్పం. ఆయన ఆదాముహవ్వలను పరదైసులాంటి ఏదెను తోటలో ఉంచి, తమ సంతానంతో భూమిని నింపమని, భూమ్మీదున్న సమస్త ప్రాణుల్ని సంరక్షించమని చెప్పాడు. (ఆది. 1:28) కానీ ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపి, యెహోవాపై తిరుగుబాటు చేశారు. అలాగే, తమ సంతానాన్ని అపరిపూర్ణత, పాపం, మరణం అనే ఊబిలోకి నెట్టేశారు. అయినప్పటికీ, యెహోవా తన సంకల్పాన్ని మార్చుకోలేదు. ఆయన ఏదైనా చెప్పాడంటే, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. (యెషయా 55:10, 11 చదవండి.) కాబట్టి, భవిష్యత్తులో ఆదాముహవ్వల సంతానం ఈ భూమిని నింపుతారని, దాన్ని పరదైసుగా మార్చి అందులోని ప్రాణుల్ని ప్రేమతో సంరక్షిస్తారని మనం నమ్మవచ్చు. అప్పుడు, బబులోను చెర నుండి తిరిగొస్తున్న యూదులకు యెహోవా ఏ వాగ్దానాలైతే చేశాడో, అవి పూర్తి స్థాయిలో నెరవేరతాయి! ఈ ఉదాహరణల్ని పరిశీలించండి.

16. పరదైసులో ఉండబోయే భద్రతను బైబిలు ఎలా వర్ణిస్తుంది?

16 భద్రత. ఎట్టకేలకు, యెషయా 11:6-9 లో ఉన్న ప్రవచనం ఆధ్యాత్మిక భావంలోనే కాక అక్షరార్థంగా కూడా పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఈ భూమ్మీద ఎక్కడికి వెళ్లినా సురక్షితంగా ఉంటారు. మనుషుల వల్ల గానీ, జంతువుల వల్ల గానీ ఇతరులకు ఎలాంటి హాని జరగదు. ఒక్కసారి ఊహించండి. ఈ భూగ్రహంలో ఎక్కడున్నా, అంటే నదుల్లో, సరస్సుల్లో, సముద్రాల్లో ఈత కొడుతున్నా; కొండల్ని అధిరోహిస్తున్నా; పచ్చిక బయళ్ల మీద సంచరిస్తున్నా మీరు పూర్తి భద్రతతో ఉంటారు. చీకటి పడినా మీరు భయపడరు. యెహెజ్కేలు 34:25 చెప్తున్నట్లుగా, మీరు ఎడారిలోనైనా అరణ్యంలోనైనా ‘నిర్భయంగా నివసిస్తారు.’

17. దేవుని రాజ్యం భూమంతటినీ పరిపాలించినప్పుడు, యెహోవా మనకు కావాల్సిన వాటిని సమృద్ధిగా ఇస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

17 సమృద్ధి. పేదరికం, కుపోషణ, కరువు, సంక్షేమ పథకాల ఊసే ఇక వినబడదు. మెస్సీయ రాజు తన పౌరుల్ని అన్నివిధాలా పోషిస్తాడని చెప్పడానికి, ప్రస్తుతం దేవుని ప్రజలు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక సమృద్ధే ఒక రుజువు. యేసు భూమ్మీదున్నప్పుడు, తన ప్రజల్ని పోషించగల సామర్థ్యం తనకుందని చూపించాడు. ఆయన కేవలం కొన్ని రొట్టెలతో, చేపలతో వేలమంది ప్రజల ఆకలిని తీర్చాడు. (మత్త. 14:17, 18; 15:34-36; మార్కు 8:19, 20) దేవుని రాజ్యం ఈ భూమంతటినీ పరిపాలించినప్పుడు, ఇలాంటి ఎన్నో ప్రవచనాలు అక్షరార్థంగా నెరవేరతాయి: “నువ్వు నేలలో విత్తే విత్తనాల కోసం ఆయన వర్షం కురిపిస్తాడు, అప్పుడు నేల నుండి శ్రేష్ఠమైన ఆహారం సమృద్ధిగా పండుతుంది. ఆ రోజు నీ పశువులు, మందలు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేత మేస్తాయి.”—యెష. 30:23, NW.

18, 19. (ఎ) యెషయా 65:20-22 లో ఉన్న మాటల్ని బట్టి మీరు ఎలా ఓదార్పు పొందారు? (బి) మన ఆయుష్షు చెట్ల ఆయుష్షులా ఉంటుందంటే, దానర్థమేమిటి?

18 నేడు చాలామందికి మంచి ఇల్లు, సంతృప్తికరమైన పని కలలాగే మిగిలిపోతున్నాయి. ఈ అవినీతి లోకంలో ఎంత చెమటోడ్చి పని చేసినా, కుటుంబ అవసరాలు తీరడం అంతంతమాత్రంగానే ఉంది. ధనికులు, దురాశపరులు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నారు. కానీ ఈ ప్రవచనం ప్రపంచవ్యాప్తంగా నెరవేరినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెష. 65:20-22.

19 మన ఆయుష్షు చెట్ల ఆయుష్షులా ఉంటుందంటే అర్థం ఏమిటి? మీరు ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. అది మీ తాతముత్తాతల కాలం నాటిది అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతారు. బహుశా అపరిపూర్ణత, పాపం కారణంగా మనమైనా చనిపోతామేమో కానీ, ఆ చెట్టు మాత్రం ఇంకా బ్రతికే ఉండి తన ఉనికిని చాటుతూ ఉంటుంది. అయితే, రానున్న పరదైసులో మనం నిరంతరం జీవిస్తామని యెహోవా మాటిస్తున్నాడు. అది ఎంత ఓదార్పునిస్తుందో కదా! (కీర్త. 37:11, 29) అప్పుడు, ఎంతోకాలంగా ఉన్న చెట్టు కూడా, ఇవాళ ఉండి రేపు వాడిపోయే గడ్డిలా మనకు కనిపిస్తుంది.

20. దేవుని రాజ్య పౌరులు ఎలాంటి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు?

20 పరిపూర్ణ ఆరోగ్యం. నేడు అనారోగ్యం, మరణం ప్రజలందర్నీ పట్టిపీడిస్తున్నాయి. అయితే, మరో భావంలో కూడా మనందరం అనారోగ్యంతో ఉన్నాం. అంటే, పాపం అనే ప్రాణాంతకమైన వ్యాధి సోకి బాధపడుతున్నాం. దానికి ఒకేఒక విరుగుడు, క్రీస్తు విమోచన క్రయధన బలి. (రోమా. 3:23; 6:23) వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో యేసు, ఆయన సహపరిపాలకులు ఆ బలి విలువను నమ్మకస్థులైన మనుషులకు పూర్తిగా అన్వయించి, పాపపు జాడలన్నిటిని క్రమక్రమంగా తొలగిస్తారు. అప్పుడు యెషయా చెప్పిన ఈ ప్రవచనం పూర్తి స్థాయిలో నెరవేరుతుంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” (యెష. 33:24) గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, కుంటివాళ్లు ఉండని కాలాన్ని ఒకసారి ఊహించుకోండి. (యెషయా 35:5, 6 చదవండి.) శారీరక, మానసిక, భావోద్వేగ వ్యాధులన్నిటిని యేసు నయంచేస్తాడు. అప్పుడు, దేవుని రాజ్య పౌరులు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు!

21. మరణానికి ఏమౌతుంది? ఆ వాగ్దానం మీకు ఎందుకు ఓదార్పునిస్తుంది?

21 మరి పాపం వల్ల, అనారోగ్యం వల్ల వచ్చే మరణం మాటేమిటి? మనందరం ఏదోక సమయంలో ఆ ‘చివరి శత్రువుతో’ పోరాడి ఓడిపోవాల్సిందే. (1 కొరిం. 15:26) మరి యెహోవా కూడా దాన్ని ఏమీ చేయలేడా? యెషయా ఇలా ప్రవచించాడు: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెష. 25:8) ఆ పరిస్థితిని ఊహించుకోండి. సమాధులు గానీ, అంత్యక్రియలు గానీ, దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకోవడం గానీ ఇక ఉండవు! బదులుగా, ఆనందంతో వచ్చే కన్నీళ్లే ఉంటాయి. ఎందుకంటే, అప్పుడు యెహోవా చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. (యెషయా 26:19 చదవండి.) అలా చివరికి, మరణం మిగిల్చిన గాయాలు మానిపోతాయి.

22. మెస్సీయ రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన తర్వాత ఏమి జరుగుతుంది?

22 వెయ్యేళ్ల పరిపాలన ముగింపు కల్లా, రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది. అప్పుడు క్రీస్తు తన రాజ్యాధికారాన్ని తిరిగి తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరిం. 15:25-28) వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో, సాతాను అగాధం అనే నిష్క్రియా స్థితి నుండి విడుదల చేయబడతాడు. ఆ సమయానికల్లా మనుషులు పరిపూర్ణతకు చేరుకొనివుంటారు, కాబట్టి వాళ్లు చివరి పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత యేసు ఆ ఘటసర్పాన్ని, దానికి మద్దతిచ్చే వాళ్లందర్నీ నాశనం చేస్తాడు. (ఆది. 3:15; ప్రక. 20:3, 7-10) అయితే, యెహోవాను విశ్వసనీయంగా ప్రేమించే వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్లు అనుభవించే పరిస్థితి గురించి బైబిలు చాలా చక్కగా వర్ణిస్తుంది. నమ్మకమైన సేవకులు “దేవుని పిల్లలు ఆస్వాదించే మహిమగల స్వాతంత్ర్యాన్ని” అనుభవిస్తారని బైబిలు చెప్తుంది.—రోమా. 8:21.

మనుషుల విషయంలో, భూమి విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ రాజ్యం నెరవేరుస్తుంది

23, 24. (ఎ) దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయని ఎందుకు చెప్పవచ్చు? (బి) మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?

23 ఆ వాగ్దానాలు ఊహలో, పగటి కలలో కాదు. అవి తప్పక నెరవేరతాయి! ఎందుకు? ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో చూసినట్లుగా, యేసు తన అనుచరులకు ఇలా ప్రార్థించమని చెప్పాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్త. 6:9, 10) దేవుని రాజ్యం అనేది ఒక ఊహ కాదు. అది ప్రస్తుతం పరలోకంలో పరిపాలిస్తున్న ఒక నిజమైన ప్రభుత్వం! వంద సంవత్సరాలుగా, అది యెహోవా వాగ్దానాలను నెరవేర్చే పనిలో ఉంది. ఆ విషయాన్ని మన సంఘాల్లో స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యం ఈ భూమ్మీద పూర్తి అధికారాన్ని తీసుకున్నప్పుడు, యెహోవా వాగ్దానాలన్నీ తప్పక నెరవేరతాయనే నమ్మకంతో మనం ఉండవచ్చు!

24 దేవుని రాజ్యం తప్పకుండా వస్తుందని, యెహోవా చేసిన ప్రతీ వాగ్దానం నెరవేరుతుందని మనం నమ్మవచ్చు. ఎందుకు? ఎందుకంటే, ఇప్పటికే దేవుని రాజ్యం పరిపాలిస్తోంది! అయితే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘దేవుని రాజ్యం పరిపాలిస్తోందని నా జీవన విధానం చూపిస్తుందా?’ మనందరం దేవుని రాజ్య పౌరులుగా జీవించడానికి చేయగలిగినదంతా చేద్దాం. అలా చేస్తే, ఆ నీతియుక్త పరిపాలన కింద జీవిస్తూ నిరంతరం ప్రయోజనం పొందుతాం!