కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ అధ్యాయం

పుట్టకముందే యేసు ఘనత పొందాడు

పుట్టకముందే యేసు ఘనత పొందాడు

లూకా 1:34-56

  • మరియ తన బంధువు ఎలీసబెతును చూడడానికి వెళ్లింది

మరియ ఒక మగబిడ్డను కంటుందని, ఆయనకు యేసు అని పేరు పెడతారని, ఆయన శాశ్వతకాలం రాజుగా పరిపాలిస్తాడని గబ్రియేలు దూత చెప్పాడు. అప్పుడు ఆమె, “ఇదెలా సాధ్యం? నేనింకా కన్యనే కదా?” అంది.—లూకా 1:34.

అప్పుడు గబ్రియేలు ఇలా చెప్పాడు: “పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే, పుట్టబోయే బిడ్డ పవిత్రుడని, దేవుని కుమారుడని పిలవబడతాడు.”—లూకా 1:35.

బహుశా మరియకు నమ్మకం కలిగించడానికి గబ్రియేలు ఇలా చెప్పాడు: “ఇదిగో! మీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతి అయింది. గొడ్రాలని పిలవబడిన ఆమెకు ఇప్పుడు ఆరో నెల. దేవునికి ఏదీ అసాధ్యం కాదు.”—లూకా 1:36, 37.

గబ్రియేలు చెప్పిన విషయాన్ని ఒప్పుకుంటూ మరియ ఇలా అంది: “ఇదిగో! యెహోవా దాసురాలిని! నువ్వు చెప్పినట్టే నాకు జరగాలి.”—లూకా 1:38.

గబ్రియేలు వెళ్లిపోయిన తర్వాత మరియ ఎలీసబెతు దగ్గరికి బయల్దేరింది. జెకర్యా, ఎలీసబెతులు యెరూషలేముకు దగ్గర్లో యూదయ పర్వత ప్రాంతంలో ఉంటున్నారు. మరియ ఉంటున్న నజరేతు నుండి అక్కడికి వెళ్లాలంటే మూడునాలుగు రోజులు పడుతుంది.

మరియ చివరికి జెకర్యా ఇంటికి చేరుకుంది. ఆమె లోపలికి అడుగుపెడుతూ ఎలీసబెతును పలకరించింది. అప్పుడు ఎలీసబెతు పవిత్రశక్తితో నిండిపోయి మరియతో ఇలా అంది: “స్త్రీలలో నువ్వు దీవించబడిన దానివి. నీ గర్భఫలం దీవెన పొందింది! నా ప్రభువు తల్లి వచ్చి నన్ను చూడడానికి నేను ఎంతటిదాన్ని? ఇదిగో! నీ శుభాకాంక్షలు నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న శిశువు సంతోషంతో గంతులు వేశాడు.”—లూకా 1:42-44.

అప్పుడు మరియ కృతజ్ఞతతో నిండిపోయి ఇలా అంది: “నా ప్రాణం యెహోవాను ఘనపరుస్తోంది. నా రక్షకుడైన దేవుణ్ణి బట్టి నా హృదయం సంతోషించకుండా ఉండలేకపోతోంది. ఎందుకంటే, తన దాసురాలి దీనస్థితిని ఆయన గుర్తుచేసుకున్నాడు. ఇదిగో! ఇప్పటినుండి అన్ని తరాలవాళ్లు నన్ను ధన్యురాలు అంటారు. ఎందుకంటే, శక్తిమంతుడైన దేవుడు నా విషయంలో గొప్ప పనులు చేశాడు.” మరియ ఎంతో దయ పొందినా ఘనతంతా దేవునికే ఇచ్చింది. ఆమె ఇలా అంది: “ఆయన పేరు పవిత్రమైనది. ఆయనకు భయపడేవాళ్ల మీద ఆయన కరుణ తరతరాలు ఉంటుంది.”—లూకా 1:46-50.

దేవుణ్ణి స్తుతిస్తూ మరియ ఇలా అంది: “ఆయన తన బాహువుతో శక్తివంతమైన పనులు చేశాడు; గర్విష్ఠుల్ని చెదరగొట్టాడు. గొప్ప అధికారం ఉన్నవాళ్లను సింహాసనాల నుండి కిందికి దింపేసి, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లను ఘనపర్చాడు. ఆకలిగా ఉన్నవాళ్లను మంచివాటితో పూర్తిగా తృప్తిపర్చాడు, ధనవంతుల్ని వట్టి చేతులతో పంపేశాడు. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి వచ్చాడు; మన పూర్వీకులతో చెప్పినట్టే అబ్రాహాము మీద, అతని సంతానం మీద ఎప్పటికీ కరుణ చూపించాడు.”—లూకా 1:51-55.

బహుశా నెలలు నిండుతున్న ఎలీసబెతుకు సహాయం చేయడానికి, మరియ దాదాపు మూడు నెలలు ఆమెతోనే ఉంది. విశ్వాసంగల ఆ ఇద్దరు స్త్రీలు తమ జీవితాల్లోని ఈ ప్రత్యేక సమయంలో కలిసి ఉండడం ఎంత మంచి విషయమో కదా!

పుట్టకముందే యేసు ఘనత పొందాడని మీరు గమనించారా? ఎలీసబెతు ఆయన్ని “నా ప్రభువు” అని పిలిచింది. అంతేకాదు, మరియ పలకరించగానే ఎలీసబెతు గర్భంలోని శిశువు “సంతోషంతో గంతులు వేశాడు.” కానీ ఆ తర్వాత కొంతమంది మరియను, ఆమె బిడ్డను ఘనపర్చలేదు. దాని గురించి తర్వాత తెలుసుకుంటాం.