కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ అధ్యాయం

మార్గం సిద్ధం చేసే వ్యక్తి పుట్టాడు

మార్గం సిద్ధం చేసే వ్యక్తి పుట్టాడు

లూకా 1:57-79

  • బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టాడు, అతనికి పేరు పెట్టారు

  • యోహాను పెద్దయ్యాక ఏం చేస్తాడో జెకర్యా ప్రవచించాడు

ఎలీసబెతుకు ప్రసవ సమయం దగ్గరపడింది. మూడు నెలలుగా, ఆమె బంధువైన మరియ ఆమెతోనే ఉంటోంది. ఇప్పుడు మరియ ఆమెకు వీడ్కోలు చెప్పి, ఉత్తరాన నజరేతులో ఉన్న తన ఇంటికి బయల్దేరింది. అది చాలా దూర ప్రయాణం. ఇంకో ఆరు నెలల్లో ఆమె కూడా ఒక మగబిడ్డను కంటుంది.

మరియ వెళ్లిపోయిన కొన్ని రోజులకు ఎలీసబెతు ప్రసవించింది. ప్రసవ సమయంలో ఏ ఇబ్బందీ రాలేదు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. జెకర్యా, ఎలీసబెతులు చాలా సంతోషించారు. ఎలీసబెతు తన పిల్లవాణ్ణి ఇరుగుపొరుగువాళ్లకు, బంధువులకు చూపించినప్పుడు వాళ్లు కూడా సంతోషించారు.

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, మగబిడ్డ పుడితే ఎనిమిదో రోజున సున్నతి చేయించి, పేరు కూడా పెట్టేవాళ్లు. (లేవీయకాండం 12:2, 3) జెకర్యా, ఎలీసబెతుల బిడ్డకు తండ్రి పేరు పెట్టాలని కొంతమంది అనుకున్నారు. కానీ ఎలీసబెతు “వద్దు, అతనికి యోహాను అని పేరు పెట్టాలి” అంది. (లూకా 1:60) ఆ బిడ్డకు యోహాను అని పేరు పెట్టాలని గబ్రియేలు దూత చెప్పడం మీకు గుర్తుందా?

అయితే వాళ్ల బంధువులు, ఇరుగుపొరుగువాళ్లు అడ్డుచెప్తూ “మీ బంధువుల్లో ఎవరికీ ఆ పేరు లేదే” అన్నారు. (లూకా 1:61) వాళ్లు జెకర్యాకు సైగలు చేసి, బాబుకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడో చెప్పమన్నారు. అప్పుడు జెకర్యా ఒక పలక తెమ్మని, దానిమీద “అతని పేరు యోహాను” అని రాశాడు.—లూకా 1:63.

వెంటనే, అద్భుతరీతిలో జెకర్యాకు మళ్లీ మాటలు వచ్చాయి. మీకు గుర్తుందా? ఎలీసబెతు మగబిడ్డను కంటుందని దేవదూత చెప్పినప్పుడు, దాన్ని నమ్మకపోవడం వల్ల అతని మాట పడిపోయింది. కానీ ఇప్పుడు అతను మాట్లాడగలుగుతున్నాడు. అది చూసి ఇరుగుపొరుగువాళ్లు ఆశ్చర్యపోయి, “ఈ బాబు పెద్దయ్యాక ఏమౌతాడో?” అనుకున్నారు. (లూకా 1:66) దేవుని నిర్దేశం ప్రకారమే ఆ పిల్లవాడికి యోహాను అని పేరు పెట్టారని వాళ్లకు అర్థమైంది.

అప్పుడు జెకర్యా పవిత్రశక్తితో నిండిపోయి ఇలా ప్రకటించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఎందుకంటే, ఆయన తన ప్రజల మీద దృష్టిపెట్టాడు, వాళ్లకు విడుదల తీసుకొచ్చాడు. ఆయన తన సేవకుడైన దావీదు ఇంట్లో మన కోసం ఒక బలమైన రక్షకుణ్ణి పుట్టించాడు.” (లూకా 1:68, 69) జెకర్యా, ‘బలమైన రక్షకుడు’ అనే మాటను పుట్టబోయే యేసు ప్రభువును ఉద్దేశించే అన్నాడు. ఆ రక్షకుని ద్వారా దేవుడు ఏం చేస్తాడో చెప్తూ జెకర్యా ఇలా అన్నాడు: “మనం శత్రువుల చేతుల్లో నుండి తప్పించబడిన తర్వాత, భయపడకుండా తనకు పవిత్రసేవ చేసే గొప్ప అవకాశాన్ని ఆయన మనకు ఇస్తాడు. దానివల్ల మనం జీవితాంతం విశ్వసనీయంగా ఉంటూ సరైనది చేయగలుగుతాం.”—లూకా 1:74, 75.

జెకర్యా తన కుమారుని గురించి ఇలా ప్రవచించాడు: “బాబూ, నువ్వు మాత్రం సర్వోన్నతుని ప్రవక్తవని పిలవబడతావు. ఎందుకంటే, తన మార్గాల్ని సిద్ధం చేయడానికి యెహోవా తనకు ముందు నిన్ను పంపిస్తాడు. తమ పాపాలకు క్షమాపణ పొందడం ద్వారా రక్షణ పొందవచ్చనే సందేశాన్ని తన ప్రజలకు ప్రకటించడానికి అలా పంపిస్తాడు. మన దేవుడు తన గొప్ప కనికరం వల్ల అలా చేస్తాడు. ఆ కనికరంతో ఆయన మనల్ని సూర్యోదయంలా ప్రకాశింపజేస్తాడు. చీకట్లో, మరణ నీడలో కూర్చున్న వాళ్లకు వెలుగును ఇవ్వడానికి, మన పాదాల్ని శాంతి మార్గంలో నడిపించడానికి ఆయన అలా చేస్తాడు.” (లూకా 1:76-79) ఆ ప్రవచనం, ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చివుంటుంది!

ఈలోగా మరియ నజరేతులో ఉన్న తన ఇంటికి చేరుకుంది. ఆమెకు ఇంకా పెళ్లికాలేదు. మరి ఆమె గర్భవతి అయిందని నలుగురికీ తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి?