కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ అధ్యాయం

మరియ పెళ్లికాకుండానే గర్భవతి అయింది

మరియ పెళ్లికాకుండానే గర్భవతి అయింది

మత్తయి 1:18-25 లూకా 1:56

  • మరియ గర్భవతి అయిందని యోసేపుకు తెలిసింది

  • మరియ యోసేపుకు భార్య అయింది

మరియకు ఇప్పుడు నాలుగో నెల. ఆమె గర్భవతి అయ్యాక దాదాపు మూడు నెలలపాటు, దక్షిణాన యూదయ పర్వత ప్రాంతంలో నివసిస్తున్న తన బంధువు ఎలీసబెతు దగ్గర ఉంది. ఇప్పుడు ఆమె నజరేతులో ఉన్న తన ఇంటికి తిరిగొచ్చింది. ఆమె గర్భవతి అనే విషయం త్వరలోనే చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోతుంది. ఆమె పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఊహించండి!

పైగా, ఆ ప్రాంతంలోనే వడ్రంగిగా పనిచేస్తున్న యోసేపుతో అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, పెళ్లి నిశ్చయమైన స్త్రీ వేరే పురుషునితో ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే, ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారని మరియకు తెలుసు. (ద్వితీయోపదేశకాండం 22:23, 24) మరియ ఏ తప్పూ చేయలేదు. అయినప్పటికీ తాను గర్భవతిననే విషయం యోసేపుకు ఎలా చెప్పాలి, చెప్తే ఏమౌతుంది అని ఆమె ఆందోళన పడివుంటుంది.

మరియ మూడు నెలలు ఊర్లో లేదు కాబట్టి, ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని యోసేపు ఎదురు చూసివుంటాడు. వాళ్లు కలుసుకున్నప్పుడు మరియ తన పరిస్థితి గురించి యోసేపుకు చెప్పివుంటుంది. దేవుని పవిత్రశక్తి వల్లే తాను గర్భవతిని అయ్యానని వివరించడానికి ఆమె ఎంతో ప్రయత్నించివుంటుంది. అయినప్పటికీ ఆమె మాటల్ని అర్థం చేసుకోవడం, నమ్మడం యోసేపుకు చాలా కష్టమైవుంటుంది.

మరియ మంచి అమ్మాయని, ఆమెకు నలుగురిలో మంచి పేరు ఉందని యోసేపుకు తెలుసు. పైగా ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. అయినప్పటికీ, మరియ ఎంత చెప్పినా, ఆమె వేరే పురుషుని వల్లే గర్భవతి అయ్యుంటుందని యోసేపు అనుకున్నాడు. అయితే, అందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపడం లేదా అవమానించడం యోసేపుకు ఇష్టంలేదు. అందుకే రహస్యంగా ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు. ఆ రోజుల్లో పెళ్లి నిశ్చయమైతే దాదాపు పెళ్లయినట్టే, దాన్ని రద్దు చేయాలంటే విడాకులు తీసుకోవాలి.

ఆ విషయాల గురించే ఆలోచిస్తూ యోసేపు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కలలో కనిపించి ఇలా చెప్పాడు: “నీ భార్య మరియను ఇంటికి తెచ్చుకోవడానికి భయపడకు; ఎందుకంటే ఆమె పవిత్రశక్తి వల్లే గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. నువ్వు ఆయనకు యేసు అని పేరుపెట్టాలి, ఎందుకంటే ఆయన తన ప్రజల్ని వాళ్ల పాపాల నుండి రక్షిస్తాడు.”—మత్తయి 1:20, 21.

యోసేపు నిద్ర లేచాడు. అతనికి ఇప్పుడు విషయం బాగా అర్థమైంది. అందుకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూత చెప్పినట్టే చేశాడు. అతను మరియను తన ఇంటికి తెచ్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నామని చూపించడానికి ఆ రోజుల్లో అలా చేసేవాళ్లు. ఇప్పటినుండి యోసేపు, మరియలు భార్యాభర్తలు. అయితే, మరియ యేసును కనేవరకు యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు.

కొన్ని నెలలు గడిచాక, యోసేపు మరియలు నజరేతులో ఉన్న తమ ఇంటి నుండి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికి మరియ నిండు గర్భిణి. ప్రసవం దగ్గరపడుతున్న ఈ సమయంలో వాళ్లు ఎక్కడికి బయల్దేరారు?