కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ అధ్యాయం

యేసు నజరేతులో పెరిగాడు

యేసు నజరేతులో పెరిగాడు

మత్తయి 13:55, 56 మార్కు 6:3

  • యోసేపు మరియల కుటుంబం పెద్దదైంది

  • యేసు వడ్రంగి పని నేర్చుకున్నాడు

యేసు నజరేతులో పెరుగుతున్నాడు. అది గలిలయలోని కొండ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న మామూలు నగరం. అది గలిలయ సముద్రం అనే పెద్ద సరస్సుకు పశ్చిమాన ఉంది.

యోసేపు మరియలు ఐగుప్తు నుండి నజరేతుకు వచ్చినప్పుడు, యేసుకు రెండేళ్లు ఉండివుంటాయి. బహుశా ఆ సమయంలో వాళ్లకు ఆయనొక్కడే సంతానం. ఆ తర్వాత వాళ్లకు యాకోబు, యోసేపు, సీమోను, యూదాలతోపాటు కూతుళ్లు కూడా పుట్టారు. అవును, యేసుకు కనీసం ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు.

యేసుకు బంధువులు కూడా ఉన్నారు. మనకు ఇప్పటికే ఎలీసబెతు, ఆమె కుమారుడైన యోహాను తెలుసు. వాళ్లు దక్షిణాన ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న యూదయలో ఉంటున్నారు. అయితే, గలిలయలో యోసేపు కుటుంబానికి దగ్గర్లోనే సలోమే ఉంటోంది. ఆమె మరియకు చెల్లెలు అయ్యుంటుంది, కాబట్టి ఆమె కూడా యేసుకు బంధువే. సలోమే భర్త జెబెదయి. వాళ్లకు ఇద్దరు కుమారులు యాకోబు, యోహాను. వాళ్లు వరసకు యేసుకు సహోదరులు అవుతారు. యాకోబు యోహానులు యేసుతో కలిసి పెరిగారో లేదో తెలీదు గానీ, పెద్దయ్యాక మాత్రం ఆయనకు దగ్గరి స్నేహితులు, అపొస్తలులు అయ్యారు.

పెరుగుతున్న తన కుటుంబాన్ని చూసుకోవడానికి యోసేపు ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అతను ఒక వడ్రంగి. అతను యేసును తన సొంత కుమారునిలా పెంచాడు. అందుకే యేసుకు “వడ్రంగి కుమారుడు” అనే పేరు వచ్చింది. (మత్తయి 13:55) యోసేపు యేసుకు కూడా వడ్రంగి పని నేర్పించాడు, యేసు దాన్ని బాగా నేర్చుకున్నాడు. ఎంతగా అంటే, ఆ తర్వాత ప్రజలు ఆయన గురించి మాట్లాడుతూ “ఇతను వడ్రంగి” అన్నారు.—మార్కు 6:3.

యోసేపు కుటుంబం యెహోవా ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చేది. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా, “ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు” యోసేపు మరియలు తమ పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు నేర్పించేవాళ్లు. (ద్వితీయోపదేశకాండం 6:6-9) నజరేతులో ఒక సమాజమందిరం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి యోసేపు క్రమం తప్పకుండా తన కుటుంబాన్ని తీసుకుని అక్కడికి వెళ్లివుంటాడు. యేసు “అలవాటు ప్రకారం విశ్రాంతి రోజున” సమాజమందిరానికి వెళ్లేవాడని లేఖనాలు చెప్తున్నాయి. (లూకా 4:16) అంతేకాదు, యోసేపు కుటుంబం యెరూషలేములోని యెహోవా ఆలయానికి క్రమంగా వెళ్తూ ఎంతో ఆనందంగా గడిపేది.