కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ అధ్యాయం

యేసు బాప్తిస్మం తీసుకున్నాడు

యేసు బాప్తిస్మం తీసుకున్నాడు

మత్తయి 3:13-17 మార్కు 1:9-11 లూకా 3:21, 22 యోహాను 1:32-34

  • యేసు బాప్తిస్మం తీసుకున్నాడు, అభిషేకించబడ్డాడు

  • యేసు తన కుమారుడని యెహోవా తెలియజేశాడు

బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం మొదలుపెట్టి సుమారు ఆరు నెలలైంది. యేసుకు ఇప్పుడు దాదాపు 30 ఏళ్లు. ఆయన యోహానును కలవడానికి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. ఎందుకు? యోహాను తన బంధువు కాబట్టి అతన్ని పలకరిద్దామని, లేదా అతని పని ఎలా జరుగుతుందో తెలుసుకుందామని ఆయన రాలేదు. బదులుగా, తనకు బాప్తిస్మం ఇవ్వమని అడగడానికి వచ్చాడు.

అయితే యోహాను, “నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాల్సిన వాణ్ణి, అలాంటిది నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా?” అంటూ అడ్డు చెప్పాడు. (మత్తయి 3:14) యేసు దేవుని కుమారుడని యోహానుకు తెలుసు. గర్భవతి అయిన మరియ ఎలీసబెతు దగ్గరికి వెళ్లినప్పుడు, ఎలీసబెతు కడుపులో ఉన్న యోహాను సంతోషంతో గంతులు వేశాడని గుర్తుచేసుకోండి. తర్వాత ఎలీసబెతు ఆ విషయాన్ని యోహానుకు చెప్పే ఉంటుంది. అంతేకాదు, యేసు పుడతాడని దేవదూత చెప్పడం, ఆయన పుట్టిన రాత్రి కొంతమంది దేవదూతలు కాపరులకు కనిపించడం గురించి కూడా యోహానుకు తెలిసివుంటుంది.

తాను ఇస్తున్న బాప్తిస్మం, తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతున్నవాళ్ల కోసమే అని యోహానుకు తెలుసు. అయితే, యేసు ఏ పాపమూ చేయలేదు. తనకు బాప్తిస్మం ఇవ్వమని యేసు అడిగినప్పుడు యోహాను అడ్డు చెప్పాడు. కానీ యేసు ఇలా అన్నాడు: “ఇప్పటికి ఇలా కానివ్వు, మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నిటినీ చేయడం సరైనది.”—మత్తయి 3:15.

యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతున్నానని చూపించడానికి యేసు బాప్తిస్మం తీసుకోలేదు. బదులుగా, తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనను తాను అర్పించుకుంటున్నానని చూపించడానికే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. (హెబ్రీయులు 10:5-7) యేసు అప్పటివరకు వడ్రంగి పని చేశాడు. అయితే ఇప్పుడు, పరలోక తండ్రి దేని కోసమైతే తనను భూమ్మీదికి పంపించాడో, ఆ పరిచర్యను మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. యేసుకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఏదైనా అసాధారణ సంఘటన జరుగుతుందని యోహాను ఎదురు చూసివుంటాడా?

యోహాను ఆ తర్వాత ఇలా అన్నాడు: “నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు: ‘పవిత్రశక్తి ఎవరిమీదికి దిగివచ్చి ఉండిపోవడం నువ్వు చూస్తావో ఆయనే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇస్తాడు.’” (యోహాను 1:33) తాను బాప్తిస్మం ఇస్తున్నవాళ్లలో ఎవరి మీదికి పవిత్రశక్తి వస్తుందా అని యోహాను ఎదురు చూస్తున్నాడు. అందుకే, యేసు నీళ్లలో నుండి పైకి వస్తున్నప్పుడు, “దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదికి దిగిరావడం” చూసి యోహాను ఆశ్చర్యపోయి ఉండడు.—మత్తయి 3:16.

అయితే యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరో సంఘటన కూడా జరిగింది. ఆయన కోసం “ఆకాశం తెరుచుకుంది.” దాని అర్థం ఏంటి? తన పరలోక జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు యేసుకు గుర్తొచ్చాయని అది సూచిస్తుండవచ్చు. కాబట్టి, తాను యెహోవాకు ఆత్మకుమారునిగా జీవించినప్పటి సంగతులు, అప్పుడు దేవుడు తనకు నేర్పించిన సత్యాలు యేసుకు గుర్తొచ్చాయి.

అంతేకాదు, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” (మత్తయి 3:17) ఆ స్వరం ఎవరిది? ఖచ్చితంగా అది దేవుని స్వరమే. ఆ సమయంలో యేసు యోహాను పక్కనే ఉన్నాడు కాబట్టి, అది యేసు స్వరం అయ్యే అవకాశం లేదు. యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు.

యేసు భూమ్మీద మనిషిగా జీవించినప్పుడు ఆయన ఆదాములాగే దేవుని పరిపూర్ణ కుమారుడు. యేసు బాప్తిస్మం గురించి వివరించిన తర్వాత, శిష్యుడైన లూకా ఇలా రాశాడు: “యేసు తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు దాదాపు 30 ఏళ్లు. ప్రజలు అనుకున్నదాని ప్రకారం ఆయన యోసేపు కుమారుడు, యోసేపు హేలీ కుమారుడు . . . దావీదు కుమారుడు . . . అబ్రాహాము కుమారుడు . . . నోవహు కుమారుడు . . . ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.”—లూకా 3:23-38.

అయితే యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా తన పవిత్రశక్తిని ఆయన మీద కుమ్మరించాడు. దాంతో యేసు ఒక కొత్త రీతిలో, ఒక ప్రత్యేకమైన విధంగా దేవుని కుమారుడు అయ్యాడు. యేసు అప్పటినుండి దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తూ, శాశ్వత జీవితానికి దారి చూపించే వ్యక్తి అయ్యాడు. అంతేకాదు ఆ క్షణం నుండి యేసు తన తండ్రి అప్పగించిన పనిని మొదలుపెట్టాడు. పాపులైన మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినప్పుడు ఆయన దాన్ని పూర్తిచేస్తాడు.