కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ అధ్యాయం

యేసు శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు

యేసు శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు

యోహాను 1:29-51

  • యేసు మొదటి శిష్యులు

యేసు 40 రోజులు ఎడారిలో ఉన్న తర్వాత గలిలయకు వెళ్లాలనుకున్నాడు. అయితే దానికిముందు, తనకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను దగ్గరికి వెళ్లాడు. యేసు తన దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను ఆయన వైపు చూపిస్తూ, అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల! ‘నా వెనక ఒకాయన వస్తున్నాడు. ఆయన ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే.” (యోహాను 1:29, 30) తనకన్నా యేసు కొంచెం చిన్నవాడైనప్పటికీ, ఆయన తనకన్నా ముందే ఉనికిలో ఉన్నాడని, పరలోకంలో జీవించాడని యోహాను గుర్తించాడు.

కొన్ని వారాల క్రితం యేసు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ఆయనే మెస్సీయ అని యోహానుకు అంత ఖచ్చితంగా తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే యోహాను ఇలా అన్నాడు: “ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే ఈయన్ని ఇశ్రాయేలీయులు స్పష్టంగా చూడాలని నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ వచ్చాను.”—యోహాను 1:31.

యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తూ, యోహాను అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “పవిత్రశక్తి పావురం రూపంలో ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను, అది ఈయన మీద ఉండిపోయింది. ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు: ‘పవిత్రశక్తి ఎవరిమీదికి దిగివచ్చి ఉండిపోవడం నువ్వు చూస్తావో ఆయనే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇస్తాడు.’ నేను దాన్ని చూశాను, ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాను.”—యోహాను 1:32-34.

తర్వాతి రోజు యేసు మళ్లీ యోహాను దగ్గరికి వచ్చినప్పుడు అతను తన ఇద్దరు శిష్యులతో ఉన్నాడు. యోహాను యేసును చూసి, “ఇదిగో, దేవుని గొర్రెపిల్ల!” అన్నాడు. (యోహాను 1:36) దాంతో, ఆ ఇద్దరు శిష్యులు యేసును అనుసరించారు. వాళ్లలో ఒకరు అంద్రెయ. ఇంకొకరు, ఈ సంఘటన గురించి రాసిన వ్యక్తి అయ్యుంటాడు. అతని పేరు కూడా యోహానే. ఈ యోహాను సలోమే కుమారుడు, కాబట్టి వరసకు యేసుకు సహోదరుడు. సలోమే మరియకు చెల్లెలు అయ్యుంటుంది, ఆమె భర్త పేరు జెబెదయి.

అంద్రెయ యోహానులు తన వెనక రావడం గమనించి, యేసు “మీకేం కావాలి?” అన్నాడు.

వాళ్లు ఆయన్ని, “రబ్బీ, నువ్వు ఎక్కడ ఉంటున్నావు?” అని అడిగారు.

ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు.—యోహాను 1:37-39.

అప్పుడు దాదాపు సాయంత్రం 4 గంటలు అయింది. అంద్రెయ యోహానులు ఆ రోజు యేసుతోనే ఉన్నారు. తర్వాత అంద్రెయ చాలా సంతోషంగా తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్లి, “మేము మెస్సీయను చూశాం” అన్నాడు; ఈ సీమోనుకు పేతురు అనే పేరు కూడా ఉంది. (యోహాను 1:41) అంద్రెయ పేతురును యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. తర్వాత జరిగిన సంఘటనల్ని చూస్తే, యోహాను కూడా తన సహోదరుడైన యాకోబు దగ్గరికి వెళ్లి, అతన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చాడని తెలుస్తోంది; అయితే, యోహాను తాను రాసిన పుస్తకంలో తన గురించిన ఈ విషయాన్ని చేర్చలేదు.

తర్వాతి రోజు యేసు బేత్సయిదాకు చెందిన ఫిలిప్పును చూశాడు. బేత్సయిదా నగరం గలిలయ సముద్రానికి ఉత్తర తీరాన ఉంది. అంద్రెయ, పేతురు కూడా ఆ నగరానికి చెందినవాళ్లే. యేసు ఫిలిప్పుతో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు.—యోహాను 1:43.

తర్వాత ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయనే నజరేతువాడూ యోసేపు కుమారుడూ అయిన యేసు” అన్నాడు. నతనయేలుకు బర్తొలొమయి అనే పేరు కూడా ఉంది. అతను ఫిలిప్పును, “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” అని అనుమానంగా అడిగాడు.

“వచ్చి చూడు” అని ఫిలిప్పు అన్నాడు. యేసు నతనయేలు రావడం చూసి, “ఇదిగో, ఇతను ఏ కపటమూ లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నాడు.

అప్పుడు నతనయేలు యేసుతో, “నేను నీకు ఎలా తెలుసు?” అన్నాడు.

“ఫిలిప్పు నిన్ను పిలవకముందే, నువ్వు ఆ అంజూర చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అని యేసు చెప్పాడు.

నతనయేలు ఆశ్చర్యపోయి, “రబ్బీ, నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి” అన్నాడు.

అప్పుడు యేసు, “నేను నిన్ను అంజూర చెట్టు కింద చూశానని చెప్పాను కాబట్టి నమ్ముతున్నావా? నువ్వు వీటికన్నా గొప్పవాటిని చూస్తావు” అన్నాడు. తర్వాత ఆయన ఇలా మాటిచ్చాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఆకాశం తెరవబడడం, దేవదూతలు మానవ కుమారుని దగ్గరికి దిగిరావడం, పైకి ఎక్కివెళ్లడం మీరు చూస్తారు.”—యోహాను 1:45-51.

తర్వాత యేసు తన కొత్త శిష్యులతో కలిసి యొర్దాను లోయ నుండి గలిలయకు బయల్దేరాడు.