కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18వ అధ్యాయం

యేసు ఎక్కువవడం, యోహాను తగ్గిపోవడం

యేసు ఎక్కువవడం, యోహాను తగ్గిపోవడం

మత్తయి 4:12 మార్కు 6:17-20 లూకా 3:19, 20 యోహాను 3:22–4:3

  • యేసు శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు

  • బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో వేయబడ్డాడు

సా.శ. 30 వసంత కాలంలో పస్కాను ఆచరించిన తర్వాత యేసు, ఆయన శిష్యులు యెరూషలేము నుండి బయల్దేరారు. అయితే వాళ్లు గలిలయలోని తమ ఇళ్లకు కాకుండా యూదయ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వాళ్లు చాలామందికి బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మమిచ్చే యోహాను కూడా దాదాపు ఒక సంవత్సరం నుండి, బహుశా యొర్దాను నదిలో ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. యోహాను శిష్యుల్లో కొంతమంది ఇంకా అతనితోపాటే ఉన్నారు.

యేసు ఎవరికీ బాప్తిస్మం ఇవ్వలేదు. బదులుగా ఆయన నిర్దేశం కింద ఆయన శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు. యేసు పరిచర్యలోని ఈ సమయంలో, యేసు యోహానులు ఇద్దరూ, ధర్మశాస్త్ర ఒప్పందానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడిన యూదులకు బోధిస్తూ ఉన్నారు.—అపొస్తలుల కార్యాలు 19:4.

అయితే యోహాను శిష్యులు యేసుమీద అసూయతో యోహానుకు ఇలా ఫిర్యాదు చేశారు: “నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి [యేసు] . . . బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు.” (యోహాను 3:26) కానీ యోహాను అసూయపడలేదు. నిజానికి యేసు సాధిస్తున్న విజయాన్ని చూసి యోహాను సంతోషించాడు, తన శిష్యులు కూడా సంతోషించాలని కోరుకున్నాడు. అతను వాళ్లకిలా గుర్తుచేశాడు: “‘నేను క్రీస్తును కాదుగానీ ఆయనకు ముందుగా పంపబడ్డాను’ అని నేను చెప్పిన మాట మీరే స్వయంగా విన్నారు.” ఆ విషయం అందరికీ అర్థమవ్వడానికి ఈ ఉదాహరణ చెప్పాడు: “పెళ్లికూతురు పెళ్లికుమారుడికి సొంతం. అయితే పెళ్లికుమారుడి స్నేహితుడు పక్కనే నిలబడి, పెళ్లికుమారుడి స్వరం విని, అతని స్వరాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. అలా, ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమైంది.”—యోహాను 3:28, 29.

ఆ పెళ్లికుమారుడి స్నేహితునిలా, యోహాను కొన్ని నెలల క్రితం తన శిష్యుల్ని యేసుకు సంతోషంగా పరిచయం చేశాడు. వాళ్లలో కొంతమంది యేసు అనుచరులయ్యారు. కొంతకాలానికి వాళ్లు పవిత్రశక్తితో అభిషేకించబడతారు. ప్రస్తుతం తనతోపాటు ఉన్న శిష్యులు కూడా యేసు అనుచరులు అవ్వాలని యోహాను కోరుకున్నాడు. నిజానికి క్రీస్తు పరిచర్యకు మార్గం సిద్ధం చేయడమే యోహాను ఉద్దేశం. అందుకే యోహాను ఇలా అన్నాడు: “ఆయన ఎక్కువౌతూ ఉండాలి, నేను తగ్గిపోతూ ఉండాలి.”—యోహాను 3:30.

యేసు తొలి శిష్యుల్లో ఒకడైన మరో యోహాను ఆ తర్వాత దీని గురించి వివరించాడు. యేసు ఎక్కడి నుండి వచ్చాడో, మనుషుల రక్షణ విషయంలో ఆయన పాత్ర ఏంటో వివరిస్తూ అతను ఇలా రాశాడు: “పైనుండి వచ్చే వ్యక్తి అందరికన్నా పైన ఉన్నాడు. . . . తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, అన్నిటినీ ఆయన చేతికి అప్పగించాడు. కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు; కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు, కానీ దేవుని ఆగ్రహం అతని మీద నిలిచివుంటుంది.” (యోహాను 3:31, 35, 36) అది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యం!

తన పాత్ర, తన పని తగ్గిపోతూ ఉండాలని యోహాను వివరించిన కొంతకాలానికే, హేరోదు రాజు అతన్ని బంధించాడు. హేరోదు తన అన్న ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెళ్లిచేసుకున్నాడు. ఆ అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. అది విని, యేసు తన శిష్యులతోపాటు యూదయ నుండి “గలిలయకు వెళ్లిపోయాడు.”—మత్తయి 4:12; మార్కు 1:14.