కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19వ అధ్యాయం

యేసు సమరయ స్త్రీకి బోధించాడు

యేసు సమరయ స్త్రీకి బోధించాడు

యోహాను 4:3-43

  • యేసు సమరయ స్త్రీకి, ఇతరులకు బోధించాడు

  • దేవుడు ఇష్టపడే ఆరాధన

యేసు, ఆయన శిష్యులు యూదయ నుండి గలిలయకు బయల్దేరారు. వాళ్లు సమరయ జిల్లా గుండా ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం కావస్తోంది. వాళ్లు ప్రయాణం వల్ల అలసిపోయి, కాస్త విశ్రాంతి తీసుకుందామని సుఖారు అనే నగరం సమీపంలో ఒక బావి దగ్గర ఆగారు. కొన్ని శతాబ్దాల క్రితం, యాకోబు స్వయంగా ఆ బావిని తవ్వి ఉండవచ్చు లేదా డబ్బులిచ్చి వేరేవాళ్లతో తవ్వించి ఉండవచ్చు. ఆ బావి ఇప్పటికీ ఉంది, దాన్ని పాలస్తీనాలోని నబ్లుస్‌ అనే నగరంలో చూడవచ్చు.

యేసు ఆ బావి దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా, శిష్యులు ఆహారం కొనడం కోసం నగరంలోకి వెళ్లారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. యేసు ఆమెను, “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని అడిగాడు.—యోహాను 4:7.

సాధారణంగా యూదులు, సమరయులు మాట్లాడుకోరు; ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కాబట్టి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి, “నువ్వు యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, మరి నువ్వెలా నన్ను నీళ్లు అడుగుతున్నావు?” అంది. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతి ఏమిటో, ‘నాకు నీళ్లివ్వు’ అని నిన్ను అడుగుతున్నది ఎవరో నీకు తెలిసివుంటే, నువ్వు ఆయన్ని నీళ్లు అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చేవాడు.” అందుకు ఆ స్త్రీ, “అయ్యా, నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు. పైగా ఈ బావి లోతుగా ఉంది. మరి ఈ జీవజలాన్ని నువ్వు ఎక్కడి నుండి తెచ్చిస్తావు? మన పూర్వీకుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. అతను, అతని కుమారులు, అతని పశువులు తాగింది ఈ బావి నీళ్లే. నువ్వు అతని కన్నా గొప్పవాడివా?” అంది.—యోహాను 4:9-12.

అప్పుడు యేసు, “ఈ బావి నీళ్లు తాగే ప్రతీ ఒక్కరికి మళ్లీ దాహం వేస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగే ఏ వ్యక్తికీ ఎప్పుడూ దాహం వేయదు. నేనిచ్చే నీళ్లు అతనిలో నీటి ఊటలా మారతాయి. ఆ ఊట అతనికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి అతనిలో ఉబుకుతూ ఉంటుంది” అన్నాడు. (యోహాను 4:13, 14) యేసు అలసిపోయినప్పటికీ, జీవాన్నిచ్చే సత్యాల గురించి ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు.

అందుకు ఆ స్త్రీ, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నేను నీళ్లు చేదుకోవడానికి పదేపదే ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు” అని అడిగింది. అయితే యేసు ఇప్పుడు మరో విషయం గురించి మాట్లాడుతూ, “నువ్వు వెళ్లి నీ భర్తను పిలుచుకొని రా” అన్నాడు. అందుకు ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అని చెప్పింది. అప్పుడు యేసు, “‘నాకు భర్త లేడు’ అని నువ్వు సరిగ్గానే చెప్పావు. నీకు ఐదుగురు భర్తలు ఉండేవాళ్లు, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో అతను నీ భర్త కాదు” అన్నాడు. తన గురించి యేసు అన్ని విషయాలు చెప్పేసరికి ఆమె అవాక్కయింది.—యోహాను 4:15-18.

యేసు మామూలు వ్యక్తి కాదని ఆమెకు అర్థమైంది. ఆమె ఆశ్చర్యంతో, “అయ్యా, నువ్వు ప్రవక్తవని నాకనిపిస్తుంది” అంది. తర్వాత ఆమె అన్న ఈ మాటల్ని బట్టి ఆమెకు ఆధ్యాత్మిక విషయాలంటే ఆసక్తి ఉందని తెలుస్తుంది: “మా పూర్వీకులు [సమరయులు] ఈ పర్వతం [దగ్గర్లోని గెరిజీము పర్వతం] మీద ఆరాధించారు, కానీ మీరు [యూదులు] యెరూషలేములోనే ఆరాధించాలని చెప్తారు.”—యోహాను 4:19, 20.

అయితే, ఎక్కడ ఆరాధిస్తాం అనేది ముఖ్యం కాదని వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఒక సమయం రాబోతుంది, అప్పుడు మీరు ఈ పర్వతం మీద గానీ, యెరూషలేములో గానీ తండ్రిని ఆరాధించరు.” తర్వాత ఆయన ఇలా అన్నాడు: “దేవుణ్ణి సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించే సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది. నిజానికి తనను అలా ఆరాధించే వాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు.”—యోహాను 4:21, 23, 24.

నిజమైన ఆరాధకులు తనను ఎక్కడ ఆరాధిస్తున్నారు అనేది కాదుగానీ, ఎలా ఆరాధిస్తున్నారు అనేదే తండ్రి చూస్తాడు. ఆ మాటలు ఆమెకు ఎంతో నచ్చాయి. ఆమె ఇలా అంది: “క్రీస్తు అని పిలవబడే మెస్సీయ రాబోతున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు వివరంగా చెప్తాడు.”—యోహాను 4:25.

అప్పుడు యేసు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని వెల్లడిచేశాడు: “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని.” (యోహాను 4:26) ఒక్కసారి ఆలోచించండి! మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చిన స్త్రీతో, తానే మెస్సీయనని యేసు సూటిగా చెప్పాడు! అది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎవరికీ ఆ విషయం చెప్పలేదు.

చాలామంది సమరయులు విశ్వాసం ఉంచారు

యేసు శిష్యులు ఆహారం తీసుకుని సుఖారు నుండి తిరిగొచ్చారు. వాళ్లు వచ్చేసరికి, యేసు యాకోబు బావి దగ్గర ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ కనిపించాడు. వాళ్లు వచ్చాక, ఆ స్త్రీ తన నీళ్ల కుండను అక్కడే విడిచిపెట్టి నగరంలోకి వెళ్లింది.

ఆమె సుఖారులోకి వెళ్లి, యేసు తనతో చెప్పిన విషయాల్ని ప్రజలకు చెప్పింది. ఆమె గట్టి నమ్మకంతో, “ఒకాయన నేను చేసినవన్నీ చెప్పాడు, మీరు కూడా వచ్చి చూడండి” అంది. బహుశా వాళ్లలో ఆసక్తి కలిగించాలని, “ఆయనే క్రీస్తు అయ్యుంటాడా?” అని అడిగింది. (యోహాను 4:29) అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే, మోషే కాలం నుండి ప్రజలు దానిగురించి మాట్లాడుకుంటున్నారు. (ద్వితీయోపదేశకాండం 18:18) ఆ మాట విన్న ప్రజలు వెంటనే యేసును చూడాలని నగరం నుండి బయల్దేరారు.

ఈలోగా, తాము తెచ్చిన ఆహారాన్ని తినమని శిష్యులు యేసును అడిగారు. కానీ యేసు, “మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అని వాళ్లతో అన్నాడు. దానికి శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆయన కోసం ఎవరు ఆహారం తెచ్చివుంటారు?” అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకున్నారు. అప్పుడు యేసు దయగా ఇలా వివరించాడు: “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.” యేసు అనుచరులందరికీ అవి చాలా విలువైన మాటలు.—యోహాను 4:32-34.

యేసు “పని” అన్నప్పుడు, ఇంకో నాలుగు నెలల్లో మొదలయ్యే కోత పని గురించి కాదు గానీ, ఆధ్యాత్మిక కోత పని గురించి మాట్లాడుతున్నాడు. ఆ విషయం, ఆయన తర్వాత చెప్పిన ఈ మాటల్లో స్పష్టమౌతుంది: “మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి. కోత కోసేవాడు ఇప్పటికే తన జీతం తీసుకుంటూ శాశ్వత జీవితం కోసం పంటను సమకూరుస్తున్నాడు. దానివల్ల విత్తేవాడు, కోసేవాడు కలిసి సంతోషిస్తారు.”—యోహాను 4:35, 36.

సమరయ స్త్రీతో మాట్లాడడంవల్ల వచ్చిన ఫలితాల్ని బహుశా యేసు గమనించి ఉంటాడు. ఆమె ఇచ్చిన సాక్ష్యం వల్ల సుఖారు నగరంలోని చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఎందుకంటే, “నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు” అని ఆమె ప్రజలతో చెప్తూ ఉంది. (యోహాను 4:39) కాబట్టి వాళ్లు యేసును కలవడానికి బావి దగ్గరికి వచ్చి, తమతోపాటు ఉండి మరిన్ని విషయాలు బోధించమని యేసును వేడుకున్నారు. ఆయన దానికి ఒప్పుకుని, రెండు రోజులు సమరయలోనే ఉన్నాడు.

యేసు మాటలు విని ఇంకా చాలామంది సమరయులు ఆయన మీద విశ్వాసం ఉంచారు. వాళ్లు ఆ స్త్రీతో, “మేము ఇప్పటినుండి కేవలం నీ మాటల్ని బట్టే నమ్మట్లేదు; మేమే స్వయంగా ఆయన మాటలు విన్నాం, ఆయన నిజంగా లోక రక్షకుడని మాకు అర్థమైంది” అన్నారు. (యోహాను 4:42) క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే విషయంలో ఆ సమరయ స్త్రీ మనకు చక్కని ఆదర్శం ఉంచింది. మనం కూడా ఆమెలాగే ప్రజల్లో ఆసక్తి రేకెత్తించి, వాళ్లు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకునేలా మాట్లాడాలి.

కోత కోయడానికి ఇంకా నాలుగు నెలలు ఉందన్న విషయం గుర్తు తెచ్చుకోండి. అది బార్లీ పంట. ఆ ప్రాంతంలో బార్లీ పంటను వసంత కాలంలో కోస్తారు. కాబట్టి ఈ సంఘటన నవంబరు లేదా డిసెంబరు నెలలో జరిగివుంటుంది. దీన్నిబట్టి, సా.శ. 30 పస్కా తర్వాత యేసు, ఆయన శిష్యులు బోధిస్తూ, బాప్తిస్మం ఇస్తూ దాదాపు ఎనిమిది నెలలు యూదయలోనే గడిపారని అర్థమౌతుంది. వాళ్లు ఇప్పుడు ఉత్తర దిశగా తమ సొంత ప్రాంతమైన గలిలయకు ప్రయాణం కొనసాగించారు. మరి వాళ్లు గలిలయకు వెళ్లాక ఏం జరిగింది?