కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

21వ అధ్యాయం

యేసు నజరేతులోని సమాజమందిరానికి వెళ్లాడు

యేసు నజరేతులోని సమాజమందిరానికి వెళ్లాడు

లూకా 4:16-31

  • యేసు యెషయా గ్రంథపు చుట్ట నుండి చదివాడు

  • నజరేతు ప్రజలు యేసును చంపాలని చూశారు

నజరేతులో అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం, యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోకముందు యేసు అక్కడ ఒక వడ్రంగి మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన అద్భుతాలు చేసే వ్యక్తిగా పేరుగాంచాడు. ఆయన నజరేతులో కూడా అద్భుతాలు చేస్తాడని వాళ్లు కుతూహలంతో ఎదురుచూస్తున్నారు.

యేసు అలవాటు ప్రకారం అక్కడి సమాజమందిరానికి వెళ్లాడు. అప్పుడు వాళ్ల కుతూహలం ఇంకా ఎక్కువైంది. ‘ప్రతీ విశ్రాంతి రోజున సమాజమందిరాల్లో’ ప్రార్థన చేస్తారు, మోషే పుస్తకాల్లో ఉన్నవాటిని చదువుతారు. (అపొస్తలుల కార్యాలు 15:21) ప్రవక్తల పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని కూడా చదువుతారు. యేసు ఎన్నో సంవత్సరాలుగా ఆ సమాజమందిరానికి వెళ్తున్నాడు కాబట్టి, అక్కడున్న చాలామంది ఆయనకు తెలిసినవాళ్లే అయ్యుంటారు. ఆయన లేఖనాలు చదవడానికి నిలబడ్డాడు. అప్పుడు యెషయా గ్రంథపు చుట్టను ఆయనకు ఇచ్చారు. ఆయన ఆ గ్రంథపు చుట్ట తెరిచి, పవిత్రశక్తితో అభిషేకించబడే వ్యక్తి గురించి రాసివున్న చోటును కనుగొన్నాడు. నేడు ఆ మాటల్ని యెషయా 61:1, 2 వచనాల్లో చూడవచ్చు.

బందీలకు విడుదల కలుగుతుందని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని, యెహోవా అనుగ్రహ సంవత్సరం రాబోతుందని ఆ వ్యక్తి ఎలా ప్రకటిస్తాడో యేసు ఆ గ్రంథపు చుట్ట నుండి చదివాడు. తర్వాత, ఆ చుట్టను అక్కడున్న సేవకునికి ఇచ్చి కూర్చున్నాడు. అందరూ రెప్పవాల్చకుండా ఆయన్నే చూస్తున్నారు. బహుశా కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన ఈ ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు: “ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈ రోజు నెరవేరింది.”—లూకా 4:21.

“ఆయన నోటి నుండి వస్తున్న దయగల మాటలకు” ప్రజలు ఆశ్చర్యపోతూ, “ఈయన యోసేపు కుమారుడే కదా?” అని చెప్పుకున్నారు. తాము విన్న అద్భుతాల్ని యేసు ఇక్కడ కూడా చేస్తే చూడాలని వాళ్లు కోరుకుంటున్నారు. యేసు అది గమనించి ఇలా అన్నాడు: “మీరు, ‘వైద్యుడా, నిన్ను నువ్వు బాగుచేసుకో’ అనే సామెత చెప్పి, దాన్ని తప్పకుండా నాకు అన్వయిస్తారు. ‘కపెర్నహూములో ఏమేం జరిగాయని మేము విన్నామో వాటిని ఇక్కడ నీ సొంత ఊరిలో కూడా చేయి’ అని నాతో అంటారు.” (లూకా 4:22, 23) ఆయన రోగుల్ని బాగుచేయడం తన సొంతూరిలోనే మొదలుపెట్టి, ముందు తన సొంత ప్రజలకు మేలు చేయాలని యేసు పొరుగువాళ్లు ఆశించి ఉంటారు. కానీ యేసు అలా చేయకపోవడంతో, ఆయన తమను చిన్నచూపు చూస్తున్నాడని వాళ్లు అనుకుని ఉంటారు.

యేసు వాళ్ల ఆలోచనల్ని గ్రహించి ఇశ్రాయేలు చరిత్రలోని కొన్ని సంఘటనల గురించి చెప్పాడు. ఏలీయా రోజుల్లో ఇశ్రాయేలులో చాలామంది విధవరాళ్లు ఉన్నారు. అయినా దేవుడు ఏలీయాను వాళ్లలో ఏ ఒక్కరి దగ్గరికీ పంపించలేదు కానీ, సీదోను దగ్గర సారెపతు అనే ఊరిలో ఉంటున్న అన్యురాలైన ఒక విధవరాలి దగ్గరికే పంపించాడు. ఏలీయా అక్కడ ఒక అద్భుతం చేసి ప్రాణం కాపాడాడు. (1 రాజులు 17:8-16) అలాగే, ఎలీషా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశస్థుడైన నయమానును మాత్రమే ఎలీషా బాగుచేశాడు.—2 రాజులు 5:1, 8-14.

చరిత్రలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ యేసు తన ఊరి ప్రజల స్వార్థాన్ని, అవిశ్వాసాన్ని బయటపెట్టాడు. అప్పుడు వాళ్లు ఎలా స్పందించారు? ఆ సమాజమందిరంలో ఉన్నవాళ్లు కోపంతో లేచి, యేసును నగరం బయటికి తరిమారు. నజరేతు నగరం ఏ కొండ మీదైతే కట్టబడిందో ఆ కొండ శిఖరానికి తీసుకెళ్లి, ఆయన్ని అక్కడి నుండి తోసేయాలనుకున్నారు. కానీ యేసు వాళ్ల చేతుల్లో నుండి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డాడు. తర్వాత ఆయన గలిలయ సముద్రానికి వాయవ్య తీరాన ఉన్న కపెర్నహూముకు బయల్దేరాడు.