కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

22వ అధ్యాయం

నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

మత్తయి 4:13-22 మార్కు 1:16-20 లూకా 5:1-11

  • ఎప్పుడూ తన వెంటే ఉండమని యేసు తన శిష్యుల్ని ఆహ్వానించాడు

  • చేపలు పట్టే జాలర్లు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

నజరేతు ప్రజలు యేసును చంపాలని ప్రయత్నించిన తర్వాత, ఆయన గలిలయ సముద్రం దగ్గర్లో ఉన్న కపెర్నహూము నగరానికి వెళ్లాడు. గలిలయ సముద్రానికి “గెన్నేసరెతు సరస్సు” అనే పేరు కూడా ఉంది. (లూకా 5:1) యేసు అక్కడికి వెళ్లడం వల్ల, సముద్ర తీరంలో ఉన్న గలిలయ ప్రజలు గొప్ప వెలుగును చూస్తారనే యెషయా ప్రవచనం నెరవేరింది.—యెషయా 9:1, 2.

యేసు గలిలయలోని ఈ ప్రాంతంలో కూడా, “పరలోక రాజ్యం దగ్గరపడింది” అని ప్రకటిస్తూ ఉన్నాడు. (మత్తయి 4:17) యేసు తన శిష్యుల్లో నలుగురిని అక్కడ చూశాడు. వాళ్లు ఇంతకుముందు యేసుతోపాటు ప్రయాణించారు. కానీ యూదయ నుండి తిరిగొచ్చిన తర్వాత, మళ్లీ తమ చేపల వ్యాపారాన్ని కొనసాగించారు. (యోహాను 1:35-42) అయితే వాళ్లు ఇప్పుడు యేసు వెంటే ఉండాల్సిన సమయం వచ్చింది. అలా ఉంటేనే, యేసు వెళ్లిపోయిన తర్వాత కూడా పరిచర్యను కొనసాగించేలా ఆయన వాళ్లకు శిక్షణ ఇవ్వగలడు.

యేసు సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు సీమోను పేతురును, అతని సహోదరుడైన అంద్రెయను, వాళ్లతోపాటు ఇంకొంతమంది జాలర్లను చూశాడు. వాళ్లు తమ వలల్ని శుభ్రం చేసుకుంటున్నారు. యేసు వాళ్ల దగ్గరికి వెళ్లి, పేతురు పడవ ఎక్కి, పడవను ఒడ్డుకు కాస్త దూరంగా లాగమని చెప్పాడు. తర్వాత ఆ పడవలో కూర్చుని, తీరం దగ్గరికి వచ్చిన ప్రజలకు రాజ్యం గురించిన సత్యాల్ని బోధించాడు.

తర్వాత యేసు పేతురుతో, “పడవను లోతుగా ఉన్న చోటికి తీసుకెళ్లి అక్కడ మీ వలలు వేయండి” అన్నాడు. దానికి పేతురు, “బోధకుడా, మేము రాత్రంతా కష్టపడినా మాకు ఏమీ దొరకలేదు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి వలలు వేస్తాను” అన్నాడు.—లూకా 5:4, 5.

వాళ్లు వలలు వేసినప్పుడు చేపలు ఎంత ఎక్కువగా పడ్డాయంటే వలలు పిగిలిపోసాగాయి! వెంటనే వాళ్లు, సహాయం చేయడానికి రమ్మని దగ్గర్లోని పడవలో ఉన్న తోటి జాలర్లకు సైగచేశారు. కాసేపటికే రెండు పడవలు చేపలతో నిండిపోయి, ఆ బరువుకి మునిగిపోసాగాయి. అది చూసిన పేతురు యేసు ముందు సాగిలపడి, “ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచివెళ్లు” అన్నాడు. అప్పుడు యేసు, “భయపడకు. ఇప్పటినుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు” అన్నాడు.—లూకా 5:8, 10.

తర్వాత యేసు పేతురు అంద్రెయలతో ఇలా అన్నాడు: “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను.” (మత్తయి 4:19) యేసు ఇంకో ఇద్దరు జాలర్లను కూడా అలాగే పిలిచాడు. వాళ్లు ఎవరంటే, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను. వాళ్లు కూడా ఇంకేం ఆలోచించకుండా ఆయన వెంట వెళ్లారు. అలా, ఆ నలుగురు శిష్యులు చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఆయన వెంటే ఉన్నారు.