కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

24వ అధ్యాయం

గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం

గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం

మత్తయి 4:23-25 మార్కు 1:35-39 లూకా 4:42, 43

  • యేసు నలుగురు శిష్యులతో కలిసి గలిలయలో ప్రయాణించాడు

  • ఆయన పరిచర్య, అద్భుతాల గురించి అంతటా తెలిసింది

కపెర్నహూములో యేసు తన నలుగురు శిష్యులతో కలిసి రోజంతా తీరిక లేకుండా గడిపాడు. సాయంత్రం, ఆ నగరంలోని ప్రజలు ఆయన దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చి వాళ్లను బాగు చేయమన్నారు. కాబట్టి ఏకాంతంగా తన తండ్రికి ప్రార్థన చేసుకునే సమయం యేసుకు దొరకలేదు.

తర్వాతి రోజు ఉదయం యేసు చీకటితోనే లేచి, తన తండ్రికి ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. అయితే ఏకాంతంగా గడిపే అవకాశం ఆయనకు ఎక్కువసేపు దొరకలేదు. ఎందుకంటే, యేసు కనిపించకపోవడంతో “సీమోను, అతనితో ఉన్నవాళ్లు” ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లారు. యేసు తన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పేతురే మిగతావాళ్లను తీసుకుని ఆయన్ని వెతకడానికి బయల్దేరి ఉంటాడు.—మార్కు 1:36; లూకా 4:38.

యేసు కనిపించగానే పేతురు ఇలా అన్నాడు: “అందరూ నీకోసం వెతుకుతున్నారు.” (మార్కు 1:37) యేసు తమ ఊరిలోనే ఉండాలని కపెర్నహూము ప్రజలు కోరుకున్నారు. వాళ్లు ఆయన చేసినవాటిని చూసి ఎంతో ముగ్ధులయ్యారు, అందుకే “ఆయన్ని తమ దగ్గర నుండి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించారు.” (లూకా 4:42) రోగుల్ని బాగుచేయడానికే యేసు భూమ్మీదికి వచ్చాడా? ఆయన ఆ అద్భుతాల్ని ఈ ఊరిలో మాత్రమే చేస్తాడా? యేసు ఏమన్నాడు?

యేసు తన శిష్యులతో, “రండి, మనం దగ్గర్లోని పట్టణాలకు ఎక్కడికైనా వెళ్దాం. అక్కడ కూడా నేను ప్రకటించాలి, అందుకే కదా నేను వచ్చాను” అన్నాడు. నిజానికి, తనను అక్కడే ఉండిపోమంటున్న ప్రజలతో ఆయన ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.”—మార్కు 1:38; లూకా 4:43.

అవును, యేసు భూమ్మీదికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, దేవుని రాజ్యం గురించి ప్రకటించడం. ఆ రాజ్యం తండ్రి పేరును పవిత్రపరుస్తుంది, మనుషుల రోగాలన్నిటినీ శాశ్వతంగా తీసేస్తుంది. అయితే, దేవుడే తనను పంపించాడని రుజువు చేయడానికి యేసు అద్భుతరీతిలో రోగుల్ని బాగుచేశాడు. వందల సంవత్సరాల క్రితం, మోషే కూడా దేవుడు తనను పంపించాడని చూపించడానికి అద్భుతాలు చేశాడు.—నిర్గమకాండం 4:1-9, 30, 31.

యేసు తన నలుగురు శిష్యులతో కలిసి మిగతా నగరాల్లో ప్రకటించడానికి కపెర్నహూము నుండి వెళ్లిపోయాడు. వాళ్లెవరంటే: పేతురు, అతని సహోదరుడు అంద్రెయ, యోహాను, అతని సహోదరుడు యాకోబు. ఒక వారం క్రితం, వాళ్లు యేసుతో కలిసి ప్రయాణిస్తూ పరిచర్య చేసే ఆహ్వానాన్ని పొందారు. ఆ అవకాశం మొదట దక్కింది వాళ్లకే.

యేసు, ఆయన నలుగురు శిష్యులు గలిలయలో చేసిన ప్రకటనా యాత్రకు మంచి ఫలితాలు వచ్చాయి. నిజానికి, యేసు గురించిన వార్త సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. అది “సిరియా అంతటా,” దెకపొలి అని పిలవబడే పది నగరాల్లో, యొర్దాను అవతలి ప్రాంతంలో వ్యాపించింది. (మత్తయి 4:24, 25) ఆ ప్రాంతాలకు, యూదయకు చెందిన చాలామంది ప్రజలు యేసును, ఆయన శిష్యుల్ని అనుసరించారు. వాళ్లు ఆయన దగ్గరికి రోగుల్ని, చెడ్డదూతలు పట్టినవాళ్లను తీసుకొచ్చారు. యేసు వాళ్లను నిరాశపర్చకుండా రోగుల్ని బాగుచేశాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు.