కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

25వ అధ్యాయం

యేసు కనికరంతో ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు

యేసు కనికరంతో ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు

మత్తయి 8:1-4 మార్కు 1:40-45 లూకా 5:12-16

  • యేసు ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు

యేసు, ఆయన నలుగురు శిష్యులు “గలిలయ అంతటా ప్రయాణిస్తూ సమాజమందిరాల్లో” ప్రకటిస్తున్నారు. యేసు అద్భుతాల గురించిన వార్త సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. (మార్కు 1:39) అలా ఆ వార్త ఒకానొక నగరానికి చేరుకుంది. అక్కడ ఒక కుష్ఠురోగి ఉన్నాడు. అతనికి “ఒంటి నిండా కుష్ఠు” ఉందని వైద్యుడైన లూకా వర్ణించాడు. (లూకా 5:12) ఈ వ్యాధి ముదిరినప్పుడు, అది రోగి శరీరంలోని అవయవాల్ని మెల్లమెల్లగా తినేస్తుంది.

కాబట్టి ఈ కుష్ఠురోగి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అతను వేరేవాళ్లకు దూరంగా బ్రతకాలి. అంతేకాదు ప్రజలు ఎవరైనా తనకు దగ్గర్లో ఉంటే, వాళ్లకు కూడా ఆ వ్యాధి సోకకుండా ఉండేలా అతను “అపవిత్రుణ్ణి! అపవిత్రుణ్ణి!” అని అరవాలి. (లేవీయకాండం 13:45, 46) మరి ఇప్పుడు ఆ కుష్ఠురోగి ఏం చేస్తాడు? అతను యేసు దగ్గరికి వచ్చి సాగిలపడి, “ప్రభువా, నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని వేడుకున్నాడు.—మత్తయి 8:2.

అతనికి యేసు మీద ఎంత విశ్వాసం ఉందో కదా! చాలా దయనీయమైన స్థితిలో ఉన్న అతన్ని చూసి, యేసు ఏం చేశాడు? అక్కడ మీరు ఉంటే ఏం చేసేవాళ్లు? యేసు కనికరంతో చలించిపోయి, తన చెయ్యి చాపి అతన్ని ముట్టుకున్నాడు. అతనితో “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అన్నాడు. (మత్తయి 8:3) వెంటనే అతని రోగం మాయమైపోయింది. నమ్మడానికి కష్టంగా ఉన్నా, అది నిజం!

యేసు లాంటి సమర్థుడు, కనికరంగల వ్యక్తి పరిపాలిస్తే బావుంటుందని మీకు అనిపిస్తుందా? యేసు కుష్ఠురోగిని బాగుచేసిన విధానం చూస్తే, భవిష్యత్తులో ఆయన రాజుగా భూమంతటినీ పరిపాలించేటప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుందనే నమ్మకం కలుగుతుంది: “దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు.” (కీర్తన 72:13) అవును, బాధల్లో ఉన్న వాళ్లందరికీ సహాయం చేయాలనే తన కోరికను యేసు భవిష్యత్తులో నెరవేర్చుకుంటాడు.

యేసు ఈ కుష్ఠురోగిని బాగు చేయకముందే, ఆయన పరిచర్య ప్రజల్లో ఎంతో కుతూహలం కలిగిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలు ఈ అద్భుతం గురించి కూడా వింటారు. అయితే కేవలం వేరేవాళ్ల మాటలు విని ప్రజలు తనపై విశ్వాసం ఉంచాలని యేసు కోరుకోలేదు. “వీధుల్లో తన స్వరం వినబడనివ్వడు” అని తన గురించి చెప్పబడిన ప్రవచనం ఆయనకు తెలుసు. అంటే, ఏదో సంచలనం సృష్టించి తన గురించి అందరికీ తెలిసేలా చేయడు. (యెషయా 42:1, 2) అందుకే, ఆ కుష్ఠురోగిని బాగుచేశాక యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “జాగ్రత్త, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్లి యాజకునికి కనిపించి, మోషే ధర్మశాస్త్రం నియమించిన కానుకను అర్పించు.”—మత్తయి 8:4.

తాను బాగైనందుకు ఆ కుష్ఠురోగి ఎంత సంతోషించాడంటే, అతను జరిగినదాన్ని వేరేవాళ్లకు చెప్పకుండా ఉండలేకపోయాడు. వెంటనే వెళ్లి అన్నిచోట్లా దాని గురించి చెప్పాడు. దానివల్ల ప్రజల్లో ఆసక్తి, కుతూహలం ఇంకా పెరిగాయి. ఎంతగా అంటే, యేసు ఇక బహిరంగంగా నగరంలో తిరగలేకపోయాడు. కాబట్టి కొంతకాలం ఆయన ఎవరూలేని ప్రాంతాల్లో ఉన్నాడు. అయినా ఆయన బోధలు వినడానికి, రోగాల్ని నయం చేయించుకోవడానికి ప్రజలు అన్నిచోట్ల నుండి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.