కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

26వ అధ్యాయం

“నీ పాపాలు క్షమించబడ్డాయి”

“నీ పాపాలు క్షమించబడ్డాయి”

మత్తయి 9:1-8 మార్కు 2:1-12 లూకా 5:17-26

  • యేసు పక్షవాతం ఉన్న వ్యక్తి పాపాల్ని క్షమించాడు, అతన్ని బాగుచేశాడు

ఇప్పుడు యేసు గురించిన వార్త సుదూరాన ఉన్న ప్రజలకు తెలిసింది. దాంతో చాలామంది యేసు బోధలు వినడానికి, ఆయన చేసే అద్భుతాలు చూడడానికి మారుమూల ప్రాంతాలకు కూడా వచ్చారు. అయితే కొన్నిరోజుల తర్వాత, యేసు తన పరిచర్య కేంద్రమైన కపెర్నహూముకు తిరిగొచ్చాడు. ఆయన తిరిగొచ్చాడన్న వార్త గలిలయ తీరంలోని ఈ నగరంలో వేగంగా వ్యాపించింది. దాంతో ఆయన ఉంటున్న ఇంటికి చాలామంది వచ్చారు. గలిలయ-యూదయ ప్రాంతాలన్నిటి నుండి, అలాగే యెరూషలేము నుండి కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా వచ్చారు.

దాంతో “ఆ ఇల్లంతా జనంతో నిండిపోయింది, కనీసం వాకిట్లో కూడా చోటు లేదు. యేసు వాళ్లకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు.” (మార్కు 2:2) అప్పుడు ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. యేసు మనుషుల బాధలకు కారణమైనదాన్ని తీసేసి తాను కోరుకున్నవాళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని, అలా చేసే శక్తి ఆయనకు ఉందని ఆ సంఘటన చూపించింది.

జనంతో కిటకిటలాడుతున్న ఆ ఇంటి లోపల యేసు బోధిస్తుండగా, నలుగురు మనుషులు పక్షవాతం ఉన్న తమ స్నేహితుణ్ణి మంచం మీద మోసుకొచ్చారు. యేసు అతన్ని బాగుచేయాలన్నది వాళ్ల కోరిక. అయితే, జనం కిక్కిరిసి ఉండడం వల్ల వాళ్లు “అతన్ని యేసు ముందుకు తీసుకురాలేకపోయారు.” (మార్కు 2:4) వాళ్లకు ఎంత నిరుత్సాహంగా అనిపించివుంటుందో ఊహించండి. వాళ్లు ఆ ఇంటి మీదికి ఎక్కి, యేసు ఉన్న చోట పైకప్పు తీసి, పక్షవాతం ఉన్న వ్యక్తిని మంచంతో సహా కిందికి దించారు.

మధ్యలో ఆటంకం కలిగించినందుకు యేసుకు కోపం వచ్చిందా? లేదు. నిజానికి, ఆయన వాళ్ల విశ్వాసం చూసి చాలా ముగ్ధుడై, పక్షవాతం ఉన్న వ్యక్తితో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నాడు. (మత్తయి 9:2) మరి, యేసు నిజంగా పాపాల్ని క్షమించగలడా? శాస్త్రులు, పరిసయ్యులు “ఈ మనిషి ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు. పాపాల్ని క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి ఉంది?” అంటూ రాద్ధాంతం చేశారు.—మార్కు 2:7.

వాళ్ల ఆలోచనల్ని పసిగట్టి యేసు వాళ్లతో, “మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు? పక్షవాతం ఉన్న వ్యక్తితో ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడం తేలికా? ‘లేచి నీ మంచం తీసుకొని నడువు’ అని చెప్పడం తేలికా?” అన్నాడు. (మార్కు 2:8, 9) అవును, యేసు త్వరలో తాను అర్పించబోయే బలి ఆధారంగా మనుషుల పాపాల్ని క్షమించగలడు.

తనకు పాపాల్ని క్షమించే అధికారం ఉందని తనను విమర్శిస్తున్నవాళ్లకు, అక్కడున్న వాళ్లందరికీ చూపించడానికి, యేసు పక్షవాతం ఉన్న వ్యక్తి వైపు తిరిగి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు.” అతను వెంటనే లేచి, తన మంచం తీసుకొని అందరూ చూస్తుండగా బయటికి వెళ్లిపోయాడు. దాంతో వాళ్లంతా ఆశ్చర్యపోయి, “ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదే” అంటూ దేవుణ్ణి మహిమపర్చారు.—మార్కు 2:11, 12.

యేసు ఇక్కడ అనారోగ్యాన్ని పాపాలతో ముడిపెట్టాడని గమనించండి. కాబట్టి పాప క్షమాపణకు, ఆరోగ్యానికి సంబంధం ఉంది. మన మొదటి తండ్రి ఆదాము పాపం చేశాడని, ఆ పాపం వల్లే మనందరికీ అనారోగ్యం, మరణం వారసత్వంగా వచ్చాయని బైబిలు చెప్తుంది. అయితే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన్ని సేవించే వాళ్లందరి పాపాల్ని దేవుని రాజ్య పరిపాలనలో యేసు క్షమిస్తాడు. అప్పుడు అనారోగ్యం శాశ్వతంగా తీసేయబడుతుంది.—రోమీయులు 5:12, 18, 19.