కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

27వ అధ్యాయం

యేసు మత్తయిని ఆహ్వానించాడు

యేసు మత్తయిని ఆహ్వానించాడు

మత్తయి 9:9-13 మార్కు 2:13-17 లూకా 5:27-32

  • పన్ను వసూలుచేసే మత్తయిని యేసు ఆహ్వానించాడు

  • పాపులకు సహాయం చేయడానికి క్రీస్తు వాళ్లతో సమయం గడిపాడు

పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగుచేసిన తర్వాత, యేసు కొంతకాలం గలిలయ సముద్ర తీరంలోని కపెర్నహూము ప్రాంతంలోనే ఉన్నాడు. మళ్లీ ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన పన్ను వసూలుచేసే కార్యాలయం వైపు నుండి వెళ్తున్నప్పుడు, అక్కడ కూర్చొనివున్న మత్తయిని చూశాడు. అతనికి లేవి అనే పేరు కూడా ఉంది. యేసు అతనికి ఈ గొప్ప ఆహ్వానం ఇచ్చాడు: “వచ్చి, నన్ను అనుసరించు.”—మత్తయి 9:9.

పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానుల్లాగే మత్తయికి కూడా యేసు బోధల గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాల గురించి ఎంతోకొంత తెలిసివుంటుంది. వాళ్లలాగే మత్తయి కూడా వెంటనే స్పందించాడు. దానిగురించి, మత్తయి తన సువార్తలో స్వయంగా ఇలా వివరించాడు: “అప్పుడు అతను [మత్తయి] లేచి ఆయన్ని [యేసును] అనుసరించాడు.” (మత్తయి 9:9) అలా, మత్తయి పన్ను వసూలుచేసే పనిని విడిచిపెట్టి యేసు శిష్యుడయ్యాడు.

కొంతకాలం తర్వాత, బహుశా యేసు తనకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆహ్వానానికి కృతజ్ఞతగా మత్తయి తన ఇంట్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు యేసు, ఆయన శిష్యులే కాక, మత్తయి పాత స్నేహితులైన ఇతర పన్ను వసూలుదారులు కూడా చాలామంది వచ్చారు. వాళ్లు ప్రజలు ద్వేషించే రోమా అధికారుల కోసం పని చేస్తూ ఓడరేవులకు వచ్చే ఓడల మీద, రహదారుల్లో చేసే ప్రయాణాల మీద, దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్ను వసూలు చేసేవాళ్లు. వాళ్లు తరచూ ఎక్కువ మొత్తాన్ని అన్యాయంగా వసూలు చేసేవాళ్లు కాబట్టి యూదులు వాళ్లను అసహ్యించుకునేవాళ్లు. తప్పుడు పనులు చేసేవాళ్లు అనే పేరున్న కొంతమంది పాపులు కూడా ఆ విందుకు వచ్చారు.—లూకా 7:37-39.

యేసు అలాంటివాళ్లతో కలిసి భోజనం చేయడం చూసి అక్కడున్న స్వనీతిపరులైన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు?” అని శిష్యుల్ని అడిగారు. (మత్తయి 9:11) అది విని యేసు ఇలా జవాబిచ్చాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. మీరు వెళ్లి, ‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏంటో తెలుసుకోండి. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (మత్తయి 9:12, 13; హోషేయ 6:6) పరిసయ్యులు యేసును “బోధకుడు” అన్నప్పటికీ, ఆయన బోధకుడనే నమ్మకం గానీ, ఆయన నుండి మంచి విషయాలు నేర్చుకోవాలనే కోరిక గానీ వాళ్లకు లేవు.

పన్ను వసూలుచేసే వాళ్లు, పాపులు యేసు చెప్పేది విని ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో మత్తయి వాళ్లను విందుకు ఆహ్వానించి ఉంటాడు. “ఎందుకంటే వాళ్లు కూడా ఆయన అనుచరులయ్యారు.” (మార్కు 2:15) దేవునితో మంచి సంబంధం కలిగివుండేలా వాళ్లకు సహాయం చేయాలని యేసు కోరుకున్నాడు. స్వనీతిపరులైన పరిసయ్యుల్లా ఆయన వాళ్లను అసహ్యించుకోలేదు. బదులుగా వాళ్లను చూసి కనికరంతో, కరుణతో చలించిపోయాడు. ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్న వాళ్లందరికీ యేసు ఆధ్యాత్మిక వైద్యుడు కాగలడు.

పన్ను వసూలుచేసే వాళ్ల పట్ల, పాపుల పట్ల యేసు కరుణ చూపించాడు. ఆయన వాళ్ల పాపాల్ని చూసీచూడనట్లు ఉండలేదు కానీ, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లమీద చూపించినట్లే వీళ్లమీద కూడా ఎంతో జాలి చూపించాడు. ఉదాహరణకు, యేసు ఒక కుష్ఠురోగిని కనికరంతో ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అని చెప్పడం గుర్తుచేసుకోండి. (మత్తయి 8:3) మనం కూడా యేసులాగే కరుణ చూపిస్తూ అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సహాయం చేయాలి.