కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

30వ అధ్యాయం

యేసుకు తండ్రితో ఉన్న సంబంధం

యేసుకు తండ్రితో ఉన్న సంబంధం

యోహాను 5:17-47

  • దేవుడే యేసుకు తండ్రి

  • పునరుత్థానాన్ని వాగ్దానం చేశాడు

విశ్రాంతి రోజున యేసు ఒక వ్యక్తిని బాగుచేయడం ద్వారా దేవుని నియమాన్ని మీరాడని కొందరు యూదులు నిందించారు. అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు, కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను.”—యోహాను 5:17.

విశ్రాంతి రోజు గురించిన దేవుని నియమాన్ని యేసు మీరలేదు. ప్రకటించడం ద్వారా, రోగుల్ని బాగుచేయడం ద్వారా నిజానికి ఆయన మంచి పనులు చేసే దేవుణ్ణి అనుకరిస్తున్నాడు. కాబట్టి యేసు విశ్రాంతి రోజునే కాదు ప్రతీరోజు మంచి పనులు చేస్తున్నాడు. అయితే ఆయనిచ్చిన జవాబు యూదుల కోపాన్ని మరింత పెంచింది, దాంతో వాళ్లు ఆయన్ని చంపాలనుకున్నారు. ఎందుకు?

యేసు విశ్రాంతి రోజున ప్రజల్ని బాగుచేసి దేవుని నియమాన్ని మీరుతున్నాడని యూదులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికితోడు, ఆయన దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది. అలా చెప్పుకోవడం ద్వారా యేసు తనను దేవునితో సమానం చేసుకుంటున్నాడని వాళ్లు అనుకున్నారు. అది వాళ్ల దృష్టిలో దైవదూషణతో సమానం. కానీ యేసు భయపడకుండా, దేవునితో తనకున్న ప్రత్యేకమైన సంబంధం గురించి ఇలా చెప్పాడు: “తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, అలాగే తాను చేసే వాటన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు.”—యోహాను 5:20.

యేసు ఇంకా ఇలా అన్నాడు: “తండ్రి ఎలాగైతే చనిపోయినవాళ్లను లేపి వాళ్లకు జీవాన్నిస్తాడో, అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైనవాళ్లకు జీవాన్నిస్తాడు.” (యోహాను 5:21) ఆ మాటల్లో ఎంత అర్థం ఉందో కదా! అవి నిజంగా భవిష్యత్తు మీద ఆశను పెంచే మాటలు. అందరికీ జీవాన్ని ఇచ్చేది తండ్రే. చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తిని గతంలో కొంతమందికి ఇవ్వడం ద్వారా తండ్రి ఆ విషయాన్ని నిరూపించాడు. ఇప్పుడు కూడా దేవుని కుమారుడైన యేసు ఆధ్యాత్మిక భావంలో చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తున్నాడు. అందుకే యేసు ఇలా అన్నాడు: “నా మాటలు విని నన్ను పంపించిన తండ్రిమీద నమ్మకముంచే ప్రతీ వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు; అతనికి తీర్పు తీర్చబడదు, అతను మరణాన్ని దాటి జీవంలోకి వచ్చాడు.”—యోహాను 5:24.

యేసు చనిపోయినవాళ్లను బ్రతికించినట్టు అప్పటికింకా ఎలాంటి నివేదికలూ లేవు. కానీ పునరుత్థానాలు నిజంగా జరుగుతాయని ఆయన తనను నిందిస్తున్నవాళ్లకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు.”—యోహాను 5:28, 29.

యేసుకు ప్రత్యేకమైన పాత్ర ఉన్నప్పటికీ, తాను దేవుని కన్నా గొప్పవాణ్ణి కాదని చూపిస్తూ ఇలా అన్నాడు: “నా అంతట నేను ఏ పనీ చేయలేను. . . . నేను నా ఇష్టాన్ని కాదుగానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటున్నాను.” (యోహాను 5:30) దేవుని సంకల్పంలో తనకున్న పాత్ర గురించి ఇప్పటివరకు యేసు ఇలా బహిరంగంగా చెప్పుకోలేదు. అయితే యేసును నిందిస్తున్నవాళ్లకు, ఆయన ఇచ్చిన సాక్ష్యమే కాకుండా మరొకరు ఇచ్చిన సాక్ష్యం కూడా ఉంది. అదేంటో గుర్తుచేస్తూ యేసు ఇలా అన్నాడు: “మీరు [బాప్తిస్మమిచ్చే] యోహాను దగ్గరికి మనుషుల్ని పంపించారు, అతను సత్యం గురించి సాక్ష్యమిచ్చాడు.”—యోహాను 5:33.

బహుశా, యేసును నిందిస్తున్నవాళ్లు దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఆ సాక్ష్యాన్ని విన్నారు. యోహాను తన తర్వాత రాబోయే వ్యక్తి గురించి యూదా మతనాయకులకు చెప్పాడు. వాళ్లు ఆ వ్యక్తినే “ప్రవక్త” అని, “క్రీస్తు” అని పిలిచారు. (యోహాను 1:20-25) ఇప్పుడు చెరసాలలో ఉన్న యోహానును ఒకప్పుడు వాళ్లు ఎంతో గౌరవించారని గుర్తుచేస్తూ, యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “కొంతకాలం మీరు అతని వెలుగులో సంతోషించడానికి ఇష్టపడ్డారు.” (యోహాను 5:35) అయితే, బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం కన్నా మరింత గొప్ప సాక్ష్యం ఉందని యేసు చెప్పాడు.

యేసు ఇలా అన్నాడు: “నేను చేస్తున్న ఈ పనులే [ఇంతకుముందు తాను చేసిన అద్భుతంతో సహా] తండ్రి నన్ను పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి. నన్ను పంపించిన తండ్రే స్వయంగా నా గురించి సాక్ష్యమిచ్చాడు.” (యోహాను 5:36, 37) ఉదాహరణకు, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు స్వయంగా దేవుడే ఆయన గురించి సాక్ష్యమిచ్చాడు.—మత్తయి 3:17.

నిజానికి, యేసును నిందిస్తున్నవాళ్లు ఆయన్ని తిరస్కరించడానికి ఏ కారణమూ లేదు. తాము పరిశోధిస్తున్నామని చెప్పుకుంటున్న లేఖనాలే ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి. యేసు చివర్లో ఇలా అన్నాడు: “మీరు మోషేని నమ్మి ఉంటే, నన్నూ నమ్మేవాళ్లు; ఎందుకంటే అతను నా గురించి రాశాడు. అతను రాసినవాటినే మీరు నమ్మనప్పుడు, నేను చెప్పేవి ఎలా నమ్ముతారు?”—యోహాను 5:46, 47.