కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

36వ అధ్యాయం

ఒక సైనికాధికారి గొప్ప విశ్వాసం చూపించాడు

ఒక సైనికాధికారి గొప్ప విశ్వాసం చూపించాడు

మత్తయి 8:5-13 లూకా 7:1-10

  • యేసు ఒక సైనికాధికారి సేవకుణ్ణి బాగుచేశాడు

  • విశ్వాసం చూపించేవాళ్లు ఆశీర్వాదాలు పొందుతారు

కొండమీది ప్రసంగం ఇచ్చిన తర్వాత యేసు కపెర్నహూము నగరానికి వెళ్లాడు. అప్పుడు యూదుల పెద్దల్లో కొంతమంది యేసు దగ్గరికి వచ్చారు. అయితే వాళ్లను పంపించింది యూదుడు కాదు, ఒక రోమా సైనికాధికారి. అతని కింద వందమంది సైనికులు ఉండేవాళ్లు.

ఆ సైనికాధికారి అన్యుడే అయినా యేసును సహాయం అడిగాడు. అతని ప్రియమైన సేవకుడు తీవ్రంగా జబ్బు చేసి చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ సైనికాధికారి సేవకుడు “పక్షవాతంతో ఇంట్లో పడివున్నాడు, అతను [బహుశా నొప్పితో] ఎంతో బాధపడుతున్నాడు” అని యూదులు యేసుకు చెప్పారు. (మత్తయి 8:6) యేసు సహాయం పొందడానికి ఆ సైనికాధికారి అర్హుడని చెప్తూ యూదుల పెద్దలు ఇలా అన్నారు: “మన ప్రజలంటే అతనికి ప్రేమ. మన సమాజమందిరాన్ని కట్టించింది కూడా అతనే.”—లూకా 7:4, 5.

వెంటనే, యేసు ఆ పెద్దలతో కలిసి సైనికాధికారి ఇంటికి బయల్దేరాడు. వాళ్లు ఇంటి దగ్గరికి వస్తుండగా, ఆ సైనికాధికారి తన స్నేహితుల్ని పంపించి ఇలా చెప్పించాడు: “అయ్యా, నా ఇంటికి రావడానికి కష్టపడొద్దు. ఎందుకంటే, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను. అందుకే, నీ దగ్గరికి వచ్చే అర్హత నాకుందని కూడా నేను అనుకోలేదు.” (లూకా 7:6, 7) ఎప్పుడూ ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి ఎంత వినయంగా మాట్లాడాడో కదా! సాధారణంగా రోమన్లు దాసులతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ ఈ సైనికాధికారి మాత్రం అలాంటివాడు కాదని తెలుస్తోంది.—మత్తయి 8:9.

యూదులు అన్యులతో సహవాసం చేయరని ఆ సైనికాధికారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. (అపొస్తలుల కార్యాలు 10:28) బహుశా అది మనసులో ఉంచుకొని, అతను తన స్నేహితుల ద్వారా యేసును ఇలా వేడుకున్నాడు: “నువ్వు ఒక్కమాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు.”—లూకా 7:7.

ఆ మాటకు యేసు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లను నేను చూడలేదు.” (లూకా 7:9) ఆ స్నేహితులు సైనికాధికారి ఇంటికి తిరిగొచ్చినప్పుడు, అప్పటిదాకా తీవ్ర అనారోగ్యంతో ఉన్న సేవకుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు.

యేసు అతన్ని బాగుచేశాక ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని, విశ్వాసం చూపించే అన్యులు ఆశీర్వాదాలు పొందుతారని స్పష్టం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “తూర్పు నుండి, పడమర నుండి చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు బల్ల దగ్గర కూర్చుంటారు.” మరి విశ్వాసంలేని యూదుల సంగతేంటి? వాళ్లు “బయట చీకట్లోకి తోసేయబడతారు. అక్కడ వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు” అని యేసు అన్నాడు.—మత్తయి 8:11, 12.

కాబట్టి, క్రీస్తుతో కలిసి పరిపాలించే అవకాశం మొట్టమొదట తమకు వచ్చినా దాన్ని అంగీకరించని సహజ యూదులు తిరస్కరించబడతారు. అయితే, అన్యులు “పరలోక రాజ్యంలో” క్రీస్తు బల్ల దగ్గర కూర్చునే అవకాశం పొందుతారు.