కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

37వ అధ్యాయం

యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు

యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు

లూకా 7:11-17

  • నాయీనులో పునరుత్థానం

సైనికాధికారి సేవకుణ్ణి బాగుచేసిన తర్వాత, యేసు కపెర్నహూము నుండి నాయీను అనే నగరానికి బయల్దేరాడు. అది కపెర్నహూముకు నైరుతి దిశలో దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన ఒంటరిగా వెళ్లడం లేదు, ఆయనతోపాటు శిష్యులు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. బహుశా సాయంత్రం కావస్తుండగా వాళ్లు నాయీను పొలిమేర్లకు చేరుకొనివుంటారు. అప్పుడు, అంత్యక్రియల కోసం ఊరేగింపుగా వెళ్తున్న చాలామంది యూదులు ఎదురయ్యారు. వాళ్లు ఒక యువకుడి శవాన్ని ఊరి బయట పాతిపెట్టడానికి మోసుకెళ్తున్నారు.

ఆ యువకుడి తల్లి వాళ్లందరి కన్నా చాలా దుఃఖంలో ఉంది. ఆమె విధవరాలు, ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు. భర్త చనిపోయినా ఇంతకాలం కనీసం కుమారుడైనా ఆమెకు తోడున్నాడు. వాళ్లిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉండేదో ఊహించుకోండి. ఆమె అతనిమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఆమె భవిష్యత్తు అతని మీదే ఆధారపడివుంది. ఇప్పుడు అతను కూడా లేడు. ఇక ఆమెకు తోడుగా ఉంటూ ఆమెను ఎవరు చూసుకుంటారు?

ఆమె దుఃఖాన్ని, దీనస్థితిని చూసి యేసు ఎంతో చలించిపోయాడు. ఆయన మృదువుగా, భరోసాను ఇస్తూ “ఏడ్వకు” అని ధైర్యం చెప్పాడు. అంతటితో ఆగకుండా, పాడె దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకున్నాడు. (లూకా 7:13, 14) ఏడుస్తున్న ఆ ఊరి ప్రజలు ఆయన స్పందించిన తీరును, పాడె ముట్టుకోవడాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. ‘ఆయన ఆమెను ఎందుకు ఏడ్వద్దు అన్నాడు? ఆయన ఏం చేయబోతున్నాడు?’ అని చాలామంది అనుకొనివుంటారు.

మరి ఆయనతో ప్రయాణిస్తున్నవాళ్ల సంగతేంటి? ఆయన అద్భుతాలు చేయడం, ఎన్నో రోగాల్ని నయం చేయడం వాళ్లు చూశారు, కానీ చనిపోయినవాళ్లను బ్రతికించడం ఇంకా చూడలేదు. చాలాకాలం క్రితం పునరుత్థానాలు జరిగాయి, కానీ యేసు అలాంటిది చేయగలడా? (1 రాజులు 17:17-23; 2 రాజులు 4:32-37) అప్పుడు యేసు, “బాబూ, నేను నీతో చెప్తున్నాను, లే!” అని ఆజ్ఞాపించాడు. (లూకా 7:14) దాంతో ఆ యువకుడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు! యేసు అతన్ని వాళ్లమ్మకు అప్పగించాడు. ఆమె ఆశ్చర్యంలో, ఆనందంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు.

ఆ యువకుడు నిజంగానే బ్రతికాడని చూసిన ప్రజలు జీవదాత అయిన యెహోవాను స్తుతిస్తూ ఇలా అన్నారు: “ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు వచ్చాడు.” ఇంకొంతమంది యేసు చేసిన అద్భుతానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, “దేవుడు తన ప్రజల్ని గుర్తుచేసుకున్నాడు” అన్నారు. (లూకా 7:16) ఈ అద్భుతం గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. అది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసు సొంతూరు నజరేతుకు కూడా చేరి ఉంటుంది. చివరికి దక్షిణాన ఉన్న యూదయకు కూడా ఆ వార్త చేరుకుంది.

బాప్తిస్మమిచ్చే యోహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. యేసు చేస్తున్న అద్భుతాల గురించి అతను ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నాడు. వాటి గురించి అతని శిష్యులు అతనికి చెప్పేవాళ్లు. వాటిని విన్నప్పుడు అతను ఎలా స్పందించాడు?