కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

42వ అధ్యాయం

యేసు పరిసయ్యుల్ని గద్దించడం

యేసు పరిసయ్యుల్ని గద్దించడం

మత్తయి 12:33-50 మార్కు 3:31-35 లూకా 8:19-21

  • యేసు “యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన” చెప్పాడు

  • కుటుంబ సభ్యుల కన్నా శిష్యులే సన్నిహితులు

యేసు పవిత్రశక్తి సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడని శాస్త్రులు, పరిసయ్యులు ఒప్పుకోవట్లేదు. ఆ విధంగా వాళ్లు పవిత్రశక్తిని దూషించే ప్రమాదంలో పడుతున్నారు. మరి వాళ్లు ఎవరి వైపు ఉంటారు? దేవుని వైపా, సాతాను వైపా? యేసు ఇలా అన్నాడు: “మీరు మంచి చెట్టయితే మీ పండ్లు కూడా మంచిగానే ఉంటాయి, మీరు చెడ్డ చెట్టయితే మీ పండ్లు కూడా చెడ్డగానే ఉంటాయి. చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టే తెలుస్తుంది.”—మత్తయి 12:33.

యేసు చెడ్డదూతల్ని వెళ్లగొట్టడమనే మంచి పండ్లు ఫలిస్తున్నాడు. అయితే ఆయన సాతాను సహాయంతోనే అలా చేస్తున్నాడని నిందించడం మూర్ఖత్వం. యేసు కొండమీది ప్రసంగంలో స్పష్టం చేసినట్లు, ఒక చెట్టు మంచి పండ్లను ఇస్తుంటే అది మంచి చెట్టే అవుతుంది కానీ చెడ్డ చెట్టు అవ్వదు. మరి, పరిసయ్యులు ఫలిస్తున్న పండ్లు, అంటే యేసు మీద వాళ్లు చేసిన అర్థంలేని ఆరోపణలు ఏం రుజువు చేస్తున్నాయి? వాళ్లు చెడ్డ చెట్లు అని రుజువు చేస్తున్నాయి. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “సర్పసంతానమా, చెడ్డవాళ్లయిన మీరు మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.”—మత్తయి 7:16, 17; 12:34.

అవును, మన హృదయం ఎలా ఉందో మన మాటల్ని బట్టి తెలుస్తుంది, వాటి ఆధారంగానే తీర్పు పొందుతాం. అందుకే యేసు ఇలా అన్నాడు: “నేను మీతో చెప్తున్నాను, మనుషులు తాము మాట్లాడే ప్రతీ పనికిరాని మాట విషయంలో తీర్పు రోజున లెక్క చెప్పాల్సి ఉంటుంది; నీ మాటల్ని బట్టే నువ్వు నీతిమంతుడివని తీర్పు పొందుతావు, నీ మాటల్ని బట్టే నువ్వు చెడ్డవాడివని తీర్పు పొందుతావు.”—మత్తయి 12:36, 37.

యేసు ఎన్నో అద్భుతాలు చేస్తున్నా శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా ఎక్కువ కోరుతూ ఇలా అన్నారు: “బోధకుడా, నువ్వు ఒక సూచన చేస్తే చూడాలనుంది.” గతంలో యేసు చేసిన అద్భుతాల్ని వాళ్లు ప్రత్యక్షంగా చూసి ఉండకపోయినా, వాటిని కళ్లారా చూసిన చాలామంది సాక్ష్యం ఇచ్చారు. అందుకే, ఆ యూదా నాయకులతో యేసు ఇలా అన్నాడు: “దుష్టులు, వ్యభిచారులు అయిన ఈ తరంవాళ్లు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు. కానీ యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదు.”—మత్తయి 12:38, 39.

తాను ఎందుకు అలా అన్నాడో వివరిస్తూ యేసు ఇలా చెప్పాడు: “యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నట్టే, మానవ కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉంటాడు.” ఒక రకమైన పెద్ద చేప యోనాను మింగేసింది, కానీ ఆ తర్వాత అతను బయటికి వచ్చాడు. ఒక రకంగా అతను మళ్లీ బ్రతికాడు. అదేవిధంగా తాను చనిపోయి మూడో రోజున లేపబడతానని యేసు ప్రవచించాడు. యేసు పునరుత్థానం అయినప్పుడు యూదా నాయకులు “యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన” తిరస్కరిస్తారు. అంటే వాళ్లు పశ్చాత్తాపపడరు, మారరు. (మత్తయి 27:63-66; 28:12-15) కానీ యోనా ప్రకటించినప్పుడు “నీనెవె ప్రజలు” పశ్చాత్తాపపడ్డారు, అందుకే వాళ్లు ఈ తరంవాళ్ల మీద నేరం మోపుతారు. షేబ దేశపు రాణి కూడా తన ఆదర్శం ద్వారా వాళ్లమీద నేరం మోపుతుందని యేసు చెప్పాడు. ఆమె సొలొమోను తెలివిగల మాటల్ని వినాలనుకుంది, వాటిని విని ఎంతో ఆశ్చర్యపోయింది. తర్వాత యేసు ఇలా అన్నాడు: “సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్తయి 12:40-42.

యేసు ఈ చెడ్డ తరంవాళ్ల పరిస్థితిని అపవిత్ర దూత విడిచివెళ్లిన ఒకతనితో పోల్చాడు. (మత్తయి 12:45) అతను ఆ ఖాళీని మంచివాటితో నింపుకోకపోవడంతో, ఆ చెడ్డదూత తనకన్నా చెడ్డవాళ్లయిన ఇంకో ఏడుగురు దూతలతో తిరిగొచ్చి అతనిలో ప్రవేశిస్తాడు. అతనిలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా శుద్ధీకరించబడి, బాగుచేయబడ్డారు. కానీ వాళ్లు దేవుని ప్రవక్తల్ని తిరస్కరించి, దేవుని పవిత్రశక్తి ఉన్న యేసును కూడా వ్యతిరేకించారు. కాబట్టి, వాళ్ల చివరి పరిస్థితి మొదటి పరిస్థితికన్నా ఘోరంగా ఉంటుంది.

యేసు ఇంకా మాట్లాడుతుండగా వాళ్ల అమ్మ, తమ్ముళ్లు వచ్చి గుంపు చివరన నిలబడ్డారు. యేసు దగ్గర కూర్చున్నవాళ్లలో కొందరు, “మీ అమ్మ, తమ్ముళ్లు నిన్ను చూడాలని వచ్చి బయట నిలబడ్డారు” అని ఆయనకు చెప్పారు. అప్పుడు యేసు, తన శిష్యులే తనకు సన్నిహితులని, వాళ్లే తనకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తల్లుల లాంటివాళ్లని వివరిస్తాడు. తన శిష్యుల వైపు చెయ్యి చూపిస్తూ ఆయన ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, దాన్ని పాటించే వీళ్లే మా అమ్మ, నా తమ్ముళ్లు.” (లూకా 8:20, 21) కుటుంబ సభ్యులతో తనకున్న బంధం విలువైనదైనా, శిష్యులతో తనకున్న బంధం ఇంకా విలువైనదని ఆయన చూపించాడు. మన ఆధ్యాత్మిక సహోదరులతో దగ్గరి సంబంధం ఉండడం వల్ల ఎంత సేదదీర్పు పొందుతున్నామో కదా! ముఖ్యంగా ఇతరులు మనల్ని, మన మంచి పనుల్ని అనుమానించినప్పుడు లేదా అవమానించినప్పుడు అది ఎంతో సేదదీర్పునిస్తుంది.