కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

45వ అధ్యాయం

యేసుకు చెడ్డదూతల మీద అధికారం ఉంది

యేసుకు చెడ్డదూతల మీద అధికారం ఉంది

మత్తయి 8:28-34 మార్కు 5:1-20 లూకా 8:26-39

  • చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించాడు

సముద్రంలో భయంకరమైన సంఘటన చూసి ఒడ్డుకు చేరుకున్న శిష్యులకు మరో ఊహించని సంఘటన ఎదురైంది. చెడ్డదూతలు పట్టిన ఇద్దరు వ్యక్తులు దగ్గర్లో ఉన్న సమాధుల నుండి యేసు వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు! వాళ్లు చాలా క్రూరంగా ఉన్నారు. అయితే ఇద్దరిలో ఒకతని గురించే మార్కు, లూకా సువార్తలు ఎక్కువగా చెప్తున్నాయి. బహుశా అతను రెండోవాడి కన్నా చాలా క్రూరంగా ఉండివుంటాడు, అంతేకాదు ఎక్కువకాలం నుండి చెడ్డదూతల అదుపులో ఉండివుంటాడు.

దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగేవాడు. అతను “రాత్రింబగళ్లు సమాధుల్లో, కొండల్లో అరుస్తూ తిరిగేవాడు, రాళ్లతో గాయపర్చుకునేవాడు.” (మార్కు 5:5) అతను ఎంత భయంకరంగా ఉండేవాడంటే, ప్రజలు అటువైపు వెళ్లడానికే భయపడేవాళ్లు. కొంతమంది అతన్ని బంధించడానికి ప్రయత్నించారు కానీ అతను గొలుసుల్ని తెంచుకొని, కాళ్లకు ఉన్న సంకెళ్లను ముక్కలుముక్కలు చేసేవాడు. అతన్ని అదుపుచేయడం ఎవరివల్లా కాలేదు.

అతను యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు, అతన్ని పట్టిన చెడ్డదూతలు అతను ఇలా అరిచేలా చేశారు: “సర్వోన్నత దేవుని కుమారుడివైన యేసూ, నాతో నీకేం పని? నన్ను హింసించనని దేవుని మీద ఒట్టేయి.” చెడ్డదూతల మీద తనకు అధికారం ఉందని చూపిస్తూ యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “అపవిత్ర దూతా, అతనిలో నుండి బయటికి రా.”—మార్కు 5:7, 8.

నిజానికి, ఆ వ్యక్తిలో చాలామంది చెడ్డదూతలు ఉన్నారు. యేసు అతన్ని, “నీ పేరేంటి?” అని అడిగినప్పుడు అతను, “నా పేరు సేన, ఎందుకంటే మేము చాలామందిమి” అని జవాబిచ్చాడు. (మార్కు 5:9) రోమా సైన్యంలోని ఒక సేనలో వేలమంది సైనికులు ఉండేవాళ్లు; అంటే, ఈ వ్యక్తిలో చాలామంది చెడ్డదూతలు నివసిస్తున్నారు, వాళ్లు అతన్ని బాధపెడుతూ ఆనందం పొందుతున్నారు. “తమను అగాధంలోకి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించవద్దని” వాళ్లు యేసును వేడుకున్నారు. తమకు, తమ నాయకుడైన సాతానుకు చివరికి ఏమౌతుందో వాళ్లకు తెలుసని దీన్నిబట్టి అర్థమౌతుంది.—లూకా 8:31.

అక్కడికి దగ్గర్లో దాదాపు 2,000 పందులు మేత మేస్తున్నాయి. ధర్మశాస్త్రం ప్రకారం అవి అపవిత్రమైనవి, యూదులు వాటిని పెంచుకోకూడదు కూడా. ఆ అపవిత్ర దూతలు యేసును ఇలా వేడుకున్నారు: “దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్లనివ్వు.” (మార్కు 5:12) యేసు చెప్పగానే వాళ్లు ఆ పందుల్లోకి వెళ్లిపోయారు. దాంతో ఆ 2,000 పందులు కొండ అంచు వరకు పరుగెత్తుకుంటూ వెళ్లి, కింద ఉన్న సముద్రంలో పడి మునిగిపోయాయి.

పందుల్ని మేపుతున్నవాళ్లు దీన్ని చూసినప్పుడు నగరంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఆ విషయం చెప్పడానికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. జరిగినదాన్ని చూడడానికి ప్రజలు వచ్చారు. వాళ్లు వచ్చినప్పుడు, చెడ్డదూతలు విడిచివెళ్లిన వ్యక్తి బాగై, స్థిమితంగా ఉండడం గమనించారు. అతను బట్టలు వేసుకొని, యేసు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు!

దీని గురించి విన్నవాళ్లలో, ఆ వ్యక్తిని చూసినవాళ్లలో భయం మొదలైంది; యేసు ఇంకా ఏమేం చేస్తాడో అని వాళ్లు భయపడ్డారు. తమ ప్రాంతాన్ని విడిచివెళ్లమని వాళ్లు యేసును బ్రతిమాలారు. యేసు పడవలో వెళ్లిపోతుండగా, బాగైన ఆ వ్యక్తి తాను కూడా వస్తానని ఆయన్ని వేడుకున్నాడు. కానీ యేసు అతనికి ఇలా చెప్పాడు: “మీ ఇంటికి వెళ్లి, యెహోవా నీ కోసం చేసినవాటన్నిటి గురించి, ఆయన నీ మీద చూపించిన కరుణ గురించి నీ బంధువులకు చెప్పు.”—మార్కు 5:19.

యేసు సాధారణంగా ఎవరినైనా బాగుచేసినప్పుడు ఇతరులకు చెప్పొద్దని ఆజ్ఞాపించేవాడు. సంచలనం కలిగించే వార్తల్ని బట్టి ప్రజలు తనమీద విశ్వాసం ఉంచడం ఆయనకు ఇష్టంలేదు. కానీ ఈ సందర్భంలో చెడ్డదూతలు విడిచివెళ్లిన వ్యక్తి, యేసు శక్తికి సజీవసాక్ష్యంగా ఉన్నాడు; యేసు స్వయంగా వెళ్లి కలుసుకోలేని ప్రజలకు అతను సాక్ష్యం ఇవ్వగలడు. అంతేకాదు, పందుల్ని నష్టపోవడం గురించి ఎవరైనా చెడు ప్రచారం చేస్తే అతను దాన్ని తిప్పికొట్టవచ్చు. అందుకే అతను వెళ్లి, యేసు తనకు చేసిన మేలు గురించి దెకపొలి అంతటా ప్రకటించడం మొదలుపెట్టాడు.