కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

47వ అధ్యాయం

పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!

పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!

మత్తయి 9:18, 23-26 మార్కు 5:22-24, 35-43 లూకా 8:40-42, 49-56

  • యాయీరు కూతుర్ని యేసు బ్రతికించాడు

రక్తస్రావం ఉన్న స్త్రీని యేసు బాగుచేయడం యాయీరు గమనించాడు. కాబట్టి, తన కూతుర్ని కూడా ఆయన బాగుచేయగలడనే నమ్మకం యాయీరుకు ఉంది. అయితే ఈపాటికి ఆమె చనిపోయి ఉంటుందని అతను అనుకుంటున్నాడు. (మత్తయి 9:18) ఒకవేళ అదే నిజమైతే, యేసు ఏమైనా చేయగలడా?

యేసు తాను బాగుచేసిన స్త్రీతో మాట్లాడుతుండగానే, యాయీరు ఇంటి నుండి కొంతమంది వచ్చి, “మీ అమ్మాయి చనిపోయింది! ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టడం ఎందుకు?” అని యాయీరుతో అన్నారు.—మార్కు 5:35.

అది నిజంగా గుండె పగిలే వార్త! సమాజంలో ఎంతో పేరు, పలుకుబడి ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతని ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. అయితే యేసు వాళ్ల మాటలు విని యాయీరు వైపు తిరిగి, “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు” అని ధైర్యం చెప్పాడు.—మార్కు 5:36.

తర్వాత యేసు యాయీరుతో వెళ్లాడు. అతని ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడంతా గోలగోలగా ఉంది. అక్కడ ఉన్నవాళ్లు దుఃఖిస్తూ, ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. యేసు లోపలికి వెళ్లి, ఆశ్చర్యం కలిగించే ఈ మాట అన్నాడు: “పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే.” (మార్కు 5:39) ఆ మాట వినగానే, ప్రజలు యేసును చూసి నవ్వారు. పాప నిజంగా చనిపోయిందని వాళ్లకు తెలుసు. అయితే దేవుడు ఇచ్చిన శక్తితో, గాఢనిద్రలో ఉన్నవాళ్లను లేపినంత సులువుగా చనిపోయినవాళ్లను లేపగలనని యేసు చూపించబోతున్నాడు.

యేసు పేతురును, యాకోబును, యోహానును, చనిపోయిన పాప తల్లిదండ్రుల్ని తప్ప అందర్నీ బయటికి పంపించేశాడు. ఆయన ఆ ఐదుగురిని వెంటబెట్టుకొని పాప ఉన్న చోటికి వెళ్లాడు. తర్వాత ఆమె చేయి పట్టుకొని, “‘తలీతా కుమీ’ అన్నాడు. ఆ మాటను అనువదిస్తే, ‘పాపా, నీతో చెప్తున్నాను, లే!’ అని అర్థం.” (మార్కు 5:41) వెంటనే ఆమె లేచి నడవడం మొదలుపెట్టింది. అది చూసి యాయీరు, అతని భార్య ఎంత ఆనందించివుంటారో ఊహించండి! ఆమె నిజంగానే బ్రతికిందనడానికి ఇంకో రుజువు ఇస్తూ, ఆమెకు తినడానికి ఏమైనా పెట్టమని యేసు చెప్పాడు.

అంతకుముందు, యేసు ఎవరినైనా బాగుచేసినప్పుడు దానిగురించి ఇతరులకు చెప్పొద్దని ఆజ్ఞాపించేవాడు. ఈ తల్లిదండ్రులకు కూడా అదే చెప్పాడు. అయినా ఆ తల్లిదండ్రులు, ఇంకొందరు ఆనందం పట్టలేక యేసు చేసిన అద్భుతం గురించి “ఆ ప్రాంతమంతా” చెప్పారు. (మత్తయి 9:26) చనిపోయిన మీ ప్రియమైనవాళ్లు ఎవరైనా తిరిగి బ్రతికితే, మీరు కూడా ఉత్సాహంగా దాని గురించి చెప్పరా? బైబిలు చెప్తున్నట్లు, యేసు చేసిన పునరుత్థానాల్లో ఇది రెండోది.