కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

49వ అధ్యాయం

గలిలయలో ప్రకటించాడు, అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు

గలిలయలో ప్రకటించాడు, అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు

మత్తయి 9:35–10:15 మార్కు 6:6-11 లూకా 9:1-5

  • యేసు గలిలయలో చేసిన మరో ప్రకటనా యాత్ర

  • ప్రకటించడం కోసం అపొస్తలుల్ని పంపించాడు

దాదాపు రెండు సంవత్సరాలు యేసు విస్తృతంగా ప్రకటించాడు. కాబట్టి, ఆయన కొంతకాలం ఆ పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకున్నాడా? లేదు, ఆయన ఇంకా ఎక్కువగా ప్రకటించాడు. యేసు “[గలిలయలోని] అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.” (మత్తయి 9:35) తాను చూసినదాన్ని బట్టి ప్రకటనా పనిని ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయనకు అర్థమైంది. మరి, ఆయన దాన్ని ఎలా చేస్తాడు?

తాను వెళ్లిన ప్రతీచోట ఆధ్యాత్మిక స్వస్థత, ఓదార్పు అవసరమైన ప్రజలు ఉండడం యేసు గమనించాడు. వాళ్లు కాపరిలేని గొర్రెల్లా చర్మం ఒలిచేయబడి, విసిరేయబడి ఉన్నారు. యేసు వాళ్లను చూసి జాలిపడి, తన శిష్యులతో ఇలా అన్నాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి.”—మత్తయి 9:37, 38.

అందుకోసం ఏం చేయాలో యేసుకు తెలుసు. ఆయన 12 మంది అపొస్తలుల్ని పిలిచి, వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు. ఆయన వాళ్లకు ఈ స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు: “అన్యజనుల దగ్గరికి వెళ్లకండి, సమరయులకు చెందిన ఏ నగరంలోకీ ప్రవేశించకండి. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికే వెళ్తూ ఉండండి. మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం దగ్గరపడింది’ అని ప్రకటించండి.”—మత్తయి 10:5-7.

యేసు మాదిరి ప్రార్థనలో ప్రస్తావించిన రాజ్యం గురించే వాళ్లు ప్రకటించాల్సివుంది. దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు వాళ్ల మధ్య ఉన్నాడు కాబట్టి, ఆ భావంలో “పరలోక రాజ్యం దగ్గరపడింది.” అయితే, ఆ రాజ్యానికి తాము నిజమైన ప్రతినిధులమని శిష్యులు ఎలా రుజువు చేసుకుంటారు? యేసు వాళ్లకు రోగుల్ని బాగుచేసే, చివరికి చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తి ఇచ్చాడు. ఇదంతా వాళ్లు ఉచితంగా చేయాలి. మరి అపొస్తలులకు ఆహారం, ఇతర అవసరాలు ఎలా తీరతాయి?

ప్రకటనా పనికి వెళ్తున్నప్పుడు ఆ అవసరాల కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు. వాళ్లు ఖర్చుల కోసం బంగారం, వెండి, లేదా రాగి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రయాణం కోసం వాళ్లు కనీసం ఆహారం మూటను గానీ, అదనపు వస్త్రాల్ని గానీ, చెప్పుల్ని గానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు? “పనివాడు భోజనానికి అర్హుడు” అని యేసు హామీ ఇచ్చాడు. (మత్తయి 10:10) శిష్యులు చెప్పే సందేశాన్ని ఇష్టపడే ప్రజలు వాళ్ల కనీస అవసరాలు చూసుకుంటారు. యేసు ఇలా అన్నాడు: “ఎక్కడైనా మీరొక ఇంట్లో అడుగుపెడితే, ఆ ఊరు నుండి వెళ్లిపోయేవరకు ఆ ఇంట్లోనే ఉండండి.”—మార్కు 6:10.

ఇంటివాళ్లకు రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించాలో కూడా యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటివాళ్లను పలకరించి, వాళ్లకు శాంతి కలగాలని చెప్పండి. వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తే, వాళ్లకు శాంతి కలుగుతుంది; కానీ వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించకపోతే, మీ శాంతి మీ దగ్గరే ఉంటుంది. ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీరు చెప్పేది వినకపోతే, మీరు ఆ ఇంటిని గానీ ఆ నగరాన్ని గానీ విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేయండి.”—మత్తయి 10:12-14.

కొన్నిసార్లు ఒక నగరమంతా లేదా ఊరంతా వాళ్ల సందేశాన్ని వినకపోవచ్చు. మరి అలాంటి ఊరికి ఏమౌతుంది? చాలా కఠినమైన తీర్పు వస్తుందని యేసు చెప్పాడు. ఆయన ఇలా వివరించాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, తీర్పు రోజున ఆ నగరం పరిస్థితి, సొదొమ గొమొర్రాల పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది.”—మత్తయి 10:15.