కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

50వ అధ్యాయం

హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు

హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు

మత్తయి 10:16–11:1 మార్కు 6:12, 13 లూకా 9:6

  • యేసు అపొస్తలులకు శిక్షణ ఇచ్చి పంపించాడు

యేసు తన అపొస్తలుల్ని ఇద్దరిద్దరిగా పంపిస్తూ, ప్రకటనా పని చేసే విషయంలో చక్కని నిర్దేశాలు ఇచ్చాడు. అయితే, యేసు కేవలం నిర్దేశాలు ఇచ్చి ఊరుకోలేదు. వ్యతిరేకుల గురించి ఆయన దయతో ఇలా హెచ్చరించాడు: “ఇదిగో! తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్నట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను . . . జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు, తమ సమాజమందిరాల్లో కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తారు. నా కారణంగా మిమ్మల్ని అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకెళ్తారు.”—మత్తయి 10:16-18.

అవును, యేసు అనుచరులకు తీవ్రమైన హింస ఎదురవ్వవచ్చు. కానీ ఆయన వాళ్లకు ఇలా ధైర్యం చెప్పాడు: “వాళ్లు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ఆందోళన పడకండి; మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ అంతట మీరే మాట్లాడరు కానీ, మీ తండ్రి ఇచ్చే పవిత్రశక్తి సహాయంతో మాట్లాడతారు. అంతేకాదు, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వాళ్లను చంపిస్తారు. మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.”—మత్తయి 10:19-22.

ప్రకటనా పని ఎంతో ముఖ్యమైంది. కాబట్టి, తన అనుచరులు సమస్యల్లో చిక్కుకోకుండా ఆ పనిని కొనసాగించాలంటే వివేచన చూపించాలని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “వాళ్లు మిమ్మల్ని ఒక నగరంలో హింసించినప్పుడు, ఇంకో నగరానికి పారిపోండి; మీరు ఇశ్రాయేలు నగరాల్లో, గ్రామాల్లో మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడని మీతో నిజంగా చెప్తున్నాను.”—మత్తయి 10:23.

యేసు తన 12 మంది అపొస్తలులకు ఎంత చక్కని నిర్దేశాలు, హెచ్చరికలు, ప్రోత్సాహం ఇచ్చాడో కదా! అయితే యేసు చనిపోయి, పునరుత్థానమైన తర్వాత ప్రకటనా పనిలో పాల్గొనేవాళ్లకు కూడా అవి వర్తిస్తాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? తన శిష్యుల్ని ‘ప్రజలందరూ ద్వేషిస్తారు’ అని యేసు అన్నాడు. కాబట్టి అపొస్తలులు ఎవరికైతే ప్రకటిస్తారో వాళ్లు మాత్రమే కాదుగానీ, ప్రపంచంలోని ప్రజలందరూ ద్వేషిస్తారని అర్థమౌతుంది. అంతేకాదు, అపొస్తలులు గలిలయలో ప్రకటించిన ఆ కొద్ది సమయంలో, వాళ్లు అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురాబడడం గానీ, వాళ్ల కుటుంబ సభ్యులు వాళ్లను మరణానికి అప్పగించడం గానీ జరగలేదు.

కాబట్టి యేసు, భవిష్యత్తును మనసులో ఉంచుకునే అపొస్తలులకు ఆ విషయాలు చెప్పాడని అర్థమౌతుంది. “మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడు” అని యేసు తన శిష్యులతో అన్న మాటల గురించి ఆలోచించండి. మహిమాన్విత రాజైన యేసుక్రీస్తు దేవుని న్యాయాధిపతిగా వచ్చేలోపు, రాజ్యం గురించి ప్రకటించడం పూర్తవ్వదని ఆయన సూచిస్తున్నాడు.

ప్రకటనా పనిలో వ్యతిరేకత ఎదురైతే అపొస్తలులు ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే యేసు ఇలా అన్నాడు: “విద్యార్థి తన బోధకుడి కన్నా గొప్పవాడు కాదు, అలాగే దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు.” దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నందుకు తనలాగే శిష్యులు కూడా అవమానాన్ని, హింసను ఎదుర్కొంటారని యేసు స్పష్టం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఇలా ప్రోత్సహించాడు: “శరీరాన్ని చంపినా ప్రాణాన్ని చంపలేనివాళ్లకు భయపడకండి. కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి.”—మత్తయి 10:24, 28.

ఈ విషయంలో యేసు మంచి ఆదర్శం ఉంచాడు. యేసు సర్వశక్తిమంతుడైన యెహోవా పట్ల తనకున్న విశ్వసనీయత విషయంలో రాజీపడే బదులు, ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నాడు. సర్వశక్తిగల దేవుడు మాత్రమే ఒక వ్యక్తి “ప్రాణాన్ని” (భవిష్యత్తులో మళ్లీ జీవించే అవకాశాన్ని) తీసేయగలడు, లేదా శాశ్వతంగా జీవించేలా అతన్ని పునరుత్థానం చేయగలడు. ఆ మాటలు అపొస్తలులకు ఎంత ధైర్యాన్ని ఇచ్చివుంటాయో కదా!

తన అనుచరుల మీద దేవునికి ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని చూపించడానికి యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయినా మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు. . . . కాబట్టి భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.”—మత్తయి 10:29, 31.

యేసు శిష్యులు ప్రకటించే సందేశం కుటుంబ సభ్యుల మధ్య విభజనలు సృష్టిస్తుంది. అంటే కుటుంబంలో కొంతమంది ఆ సందేశాన్ని స్వీకరిస్తారు, కొంతమంది స్వీకరించరు. “నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి” అని యేసు చెప్పాడు. అవును, కుటుంబంలో ఒక సభ్యుడు బైబిలు సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలంటే అతనికి ధైర్యం అవసరం. యేసు ఇలా అన్నాడు: “తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. కుమారుణ్ణి గానీ, కూతుర్ని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.”—మత్తయి 10:34, 37.

అయితే, కొంతమంది ఆయన శిష్యుల్ని దయతో చేర్చుకుంటారు. యేసు ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా శిష్యుడనే కారణంతో వీళ్లలో ఒకరికి తాగడానికి కేవలం కొన్ని చన్నీళ్లు ఇచ్చే వ్యక్తి కూడా ఖచ్చితంగా తన ప్రతిఫలం పొందుతాడు.”—మత్తయి 10:42.

యేసు ఇచ్చిన నిర్దేశాలతో, హెచ్చరికలతో, ప్రోత్సాహంతో బాగా సిద్ధపడిన అపొస్తలులు “ఆ ప్రాంతంలోని గ్రామాలన్నిట్లో తిరుగుతూ ప్రతీచోట మంచివార్త ప్రకటిస్తూ, రోగుల్ని బాగుచేస్తూ వెళ్లారు.”—లూకా 9:6.