కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

58వ అధ్యాయం

అద్భుతరీతిలో ఆహారం, పరిసయ్యుల పులిసిన పిండి

అద్భుతరీతిలో ఆహారం, పరిసయ్యుల పులిసిన పిండి

మత్తయి 15:32–16:12 మార్కు 8:1-21

  • యేసు 4,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు

  • పరిసయ్యుల పులిసిన పిండి గురించి హెచ్చరించాడు

గలిలయ సముద్రానికి తూర్పున ఉన్న దెకపొలి ప్రాంతంలో ప్రజలు పెద్దయెత్తున యేసు దగ్గరికి వచ్చారు. వాళ్లు ఆయన చెప్పేది వినడానికి, తమ రోగాలు నయం చేసుకోవడానికి వచ్చారు. వాళ్లు తమ వెంట పెద్దపెద్ద సరుకుల గంపలు లేదా బుట్టలు తెచ్చుకున్నారు.

తర్వాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని చూస్తే నాకు జాలేస్తోంది. మూడు రోజులుగా వాళ్లు నాతోనే ఉన్నారు, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు. వాళ్లను ఇలాగే ఆకలితో ఇళ్లకు పంపించేస్తే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతారు; కొందరైతే మరీ దూరం నుండి వచ్చారు.” కానీ శిష్యులు, “ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది ఆకలి తీర్చడానికి కావాల్సినంత ఆహారం ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.—మార్కు 8:2-4.

అప్పుడు యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని అడిగాడు. శిష్యులు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అన్నారు. (మత్తయి 15:34) తర్వాత యేసు ప్రజల్ని నేల మీద కూర్చోమన్నాడు. ఆయన రొట్టెలు, చేపలు తీసుకుని దేవునికి ప్రార్థన చేసి, ప్రజలకు పంచిపెట్టమని తన శిష్యులకు ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా, ప్రజలందరూ తృప్తిగా తిన్నారు. దాదాపు 4,000 మంది పురుషులు, చాలామంది స్త్రీలు, పిల్లలు తృప్తిగా తిన్నాక కూడా మిగిలిన ముక్కలు ఏడు పెద్ద గంపల్లో నిండాయి!

ప్రజల్ని పంపించేసిన తర్వాత యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కి గలిలయ సముద్రానికి పశ్చిమ తీరాన ఉన్న మగదానుకు వెళ్లారు. అక్కడ పరిసయ్యులు, కొంతమంది సద్దూకయ్యులు కలిసి యేసును పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకం నుండి ఒక సూచన చూపించమని అడిగారు.

వాళ్ల ఉద్దేశాన్ని పసిగట్టి యేసు ఇలా అన్నాడు: “సాయంకాలం అయినప్పుడు, ‘ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం పడదు’ అని మీరంటారు. అలాగే ఉదయం పూట, ‘ఆకాశం ఎర్రగా ఉన్నా, మబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు చల్లగా ఉంటుంది, వర్షం పడుతుంది’ అని అంటారు. మీరు ఆకాశాన్ని చూసి వాతావరణం ఎలా ఉంటుందో అర్థంచేసుకోగలరు కానీ కాలాల సూచనల్ని అర్థంచేసుకోలేరు.” (మత్తయి 16:2, 3) యోనాకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదని యేసు ఆ పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు.

యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కి గలిలయ సముద్రానికి ఈశాన్య తీరాన ఉన్న బేత్సయిదాకు బయల్దేరారు. తినడానికి సరిపడా రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయామని ప్రయాణం మధ్యలో శిష్యులకు అర్థమైంది. వాళ్ల దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. ఇంతకుముందే పరిసయ్యులతో, హేరోదు మద్దతుదారులైన సద్దూకయ్యులతో జరిగిన చర్చను మనసులో ఉంచుకొని యేసు తన శిష్యుల్ని ఇలా హెచ్చరించాడు: “అప్రమత్తంగా ఉండండి, పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, హేరోదు పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి.” తాము రొట్టెలు మర్చిపోయి వచ్చినందుకే యేసు అలా అన్నాడని శిష్యులు పొరబడ్డారు. యేసు అది గమనించి, “రొట్టెలు లేవని మీరెందుకు గొడవపడుతున్నారు?” అన్నాడు.—మార్కు 8:15-17.

యేసు ఇంతకుముందే వేలమందికి ఆహారం పెట్టాడు. కాబట్టి తినడానికి కావాల్సిన రొట్టెల గురించి ఆయన మాట్లాడట్లేదని శిష్యులు అర్థం చేసుకోవాలి. యేసు ఇలా అన్నాడు: “ఒకసారి గుర్తుచేసుకోండి, నేను ఐదు రొట్టెలు విరిచి 5,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టెముక్కల్ని మీరు ఎన్ని గంపల నిండా పోగుచేశారు?” వాళ్లు, “పన్నెండు గంపలు” అన్నారు. తర్వాత యేసు, “నేను ఏడు రొట్టెలు విరిచి 4,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టెముక్కల్ని ఎన్ని పెద్ద గంపల నిండా పోగుచేశారు?” అని అడిగాడు. వాళ్లు, “ఏడు పెద్ద గంపలు” అని జవాబిచ్చారు.—మార్కు 8:18-20.

యేసు ఇలా అన్నాడు: “నేను మీతో మాట్లాడింది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కావట్లేదు? . . . పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి.”—మత్తయి 16:11.

యేసు ఏం చెప్తున్నాడో శిష్యులకు ఇప్పుడు అర్థమైంది. పులిసిన పిండి కలిపినప్పుడు పిండిముద్ద పులుస్తుంది, పొంగుతుంది. యేసు ఇక్కడ పులిసిన పిండిని, కలుషితం చేసేదానికి సూచనగా ఉపయోగించాడు. కాబట్టి కలుషితం చేసే “పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధ” విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు హెచ్చరిస్తున్నాడు.—మత్తయి 16:12.