కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

59వ అధ్యాయం

మానవ కుమారుడు ఎవరు?

మానవ కుమారుడు ఎవరు?

మత్తయి 16:13-27 మార్కు 8:22-38 లూకా 9:18-26

  • యేసు ఒక గుడ్డివాడిని బాగుచేశాడు

  • పేతురుకు రాజ్యపు తాళంచెవులు ఇస్తానన్నాడు

  • తాను చనిపోయి తిరిగి బ్రతుకుతానని యేసు చెప్పాడు

యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు చేరుకున్నారు. ప్రజలు ఆయన దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి, అతన్ని ముట్టుకొని బాగుచేయమని బ్రతిమాలారు.

యేసు అతని చేయి పట్టుకొని ఊరి బయటికి తీసుకెళ్లాడు. అతని కళ్ల మీద ఉమ్మివేసి, “నీకు ఏమైనా కనిపిస్తోందా?” అని అడిగాడు. అతను, “నాకు మనుషులు కనిపిస్తున్నారు, కానీ వాళ్లు నడుస్తున్న చెట్లలా ఉన్నారు” అన్నాడు. (మార్కు 8:23, 24) యేసు అతని కళ్ల మీద చేతులుంచి, అతనికి చూపు తెప్పించాడు. ఇప్పుడు అతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. యేసు అతనితో, ఊళ్లోకి వెళ్లకు అని చెప్పి ఇంటికి పంపించేశాడు.

తర్వాత యేసు, ఆయన శిష్యులు ఉత్తరాన ఉన్న ఫిలిప్పీ కైసరయకు బయల్దేరారు. సముద్ర మట్టానికి 1,150 అడుగుల (350 మీటర్ల) ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది సుమారు రెండు రోజుల ప్రయాణం. ఆ ఊరికి ఈశాన్యంలో మంచుతో కప్పబడిన హెర్మోను పర్వతం ఉంది.

ప్రయాణం మధ్యలో యేసు ఒకచోట ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్లాడు. యేసు చనిపోవడానికి ఇంకా తొమ్మిది-పది నెలల సమయం మాత్రమే ఉంది. ఆయన తన శిష్యుల గురించే ఆలోచిస్తున్నాడు. ఈ మధ్యే చాలామంది ఆయన్ని అనుసరించడం మానేశారు, కొంతమంది అయోమయంలో పడ్డారు లేదా నిరుత్సాహపడ్డారు. వాళ్లు ఇలా అనుకొని ఉండవచ్చు: ‘ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన ఎందుకు ఒప్పుకోలేదు? తాను ఎవరన్నది తిరుగులేని విధంగా నిరూపించుకునేలా ఆయన ఒక సూచన ఎందుకు ఇవ్వలేదు?’

యేసు ప్రార్థన చేసుకుంటున్న చోటుకు శిష్యులు వచ్చారు. అప్పుడు ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “మానవ కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అందుకు వాళ్లు, “కొంతమంది బాప్తిస్మమిచ్చే యోహాను అని, ఇంకొంతమంది ఏలీయా అని, మరికొంతమంది యిర్మీయా అని లేదా ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు” అని అన్నారు. అంటే ఆ వ్యక్తుల్లో ఒకరు యేసులా బ్రతికి వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ తన శిష్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి, “మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని యేసు అడిగాడు. పేతురు వెంటనే, “నువ్వు క్రీస్తువి, జీవంగల దేవుని కుమారుడివి” అన్నాడు.—మత్తయి 16:13-16.

దేవుడే పేతురుకు ఆ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి అతను సంతోషంగా ఉంటాడని చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “నేను నీతో చెప్తున్నాను, నువ్వు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని కడతాను; సమాధి ద్వారాలు దాన్ని జయించలేవు.” తానే ఒక సంఘాన్ని కడతానని, ఆ సంఘంలోని వాళ్లు భూమ్మీద జీవించినంత కాలం నమ్మకంగా ఉంటే సమాధి కూడా వాళ్లను బంధించివుంచలేదని యేసు చెప్తున్నాడు. ఆయన పేతురుకు ఇలా మాటిచ్చాడు: “పరలోక రాజ్యం తాళంచెవుల్ని నేను నీకు ఇస్తాను.”—మత్తయి 16:18, 19.

యేసు తన అపొస్తలులందరిలో పేతురే గొప్పవాడని చెప్పలేదు, అతన్ని సంఘానికి పునాదిగా కూడా చేయలేదు. స్వయంగా యేసే పునాది రాయి, ఆ రాయి మీదే ఆయన తన సంఘాన్ని కడతాడు. (1 కొరింథీయులు 3:11; ఎఫెసీయులు 2:20) అయితే ఆయన పేతురుకు మూడు తాళంచెవులు ఇస్తానన్నాడు. అంటే, వేర్వేరు గుంపులకు చెందిన ప్రజలు పరలోక రాజ్యంలోకి ప్రవేశించేలా మార్గాన్ని తెరిచే అవకాశం పేతురుకు దొరుకుతుంది.

పశ్చాత్తాపం చూపించిన యూదులు, యూదులుగా మారిన అన్యులు రక్షణ పొందాలంటే ఏం చేయాలో చెప్పడం ద్వారా సా.శ. 33 పెంతెకొస్తు రోజున పేతురు మొదటి తాళంచెవి ఉపయోగిస్తాడు. విశ్వసించిన సమరయులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించేలా మార్గం తెరవడం ద్వారా రెండో తాళంచెవి ఉపయోగిస్తాడు. తర్వాత, సా.శ. 36 లో సున్నతి పొందని అన్యులకు ఆ మార్గం తెరవడం ద్వారా పేతురు మూడో తాళంచెవి ఉపయోగిస్తాడు. ఆ అన్యుల్లో మొదటివాళ్లు కొర్నేలి, అతని స్నేహితులు, బంధువులు.—అపొస్తలుల కార్యాలు 2:37, 38; 8:14-17; 10:44-48.

త్వరలో తాను యెరూషలేములో హింసించబడతానని, చనిపోతానని యేసు చెప్పాడు. అప్పుడు అపొస్తలులు చాలా ఆందోళనపడ్డారు. యేసు పునరుత్థానమై పరలోకానికి వెళ్తాడని గ్రహించని పేతురు, ఆయన్ని పక్కకు తీసుకెళ్లి ఇలా మందలించాడు: “ప్రభువా, అలా మాట్లాడొద్దు. నీకు అలా జరగనే జరగదు.” కానీ యేసు వెనక్కి తిరిగి, “సాతానా! నా వెనక్కి వెళ్లు. నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు” అన్నాడు.—మత్తయి 16:22, 23.

తర్వాత యేసు తన అపొస్తలులతో పాటు ప్రజల్ని కూడా పిలిచి, తనను అనుసరించడం అంత తేలిక కాదని చెప్తూ ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, తన హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం, మంచివార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.”—మార్కు 8:34, 35.

అవును, యేసు ఆమోదం పొందాలంటే ఆయన అనుచరులు ధైర్యంగా ఉండాలి, త్యాగాలు చేయాలి. యేసు ఇలా అన్నాడు: “వ్యభిచారులు, పాపులు అయిన ఈ తరంవాళ్ల మధ్య ఎవరైనా నా శిష్యుణ్ణని, నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, మానవ కుమారుడు కూడా పవిత్ర దూతలతో కలిసి తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు.” (మార్కు 8:38) అవును, యేసు వచ్చినప్పుడు “ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇస్తాడు.”—మత్తయి 16:27.