కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

63వ అధ్యాయం

అపొస్తలులకు మరింత ముఖ్యమైన సలహా ఇచ్చాడు

అపొస్తలులకు మరింత ముఖ్యమైన సలహా ఇచ్చాడు

మత్తయి 18:6-20 మార్కు 9:38-50 లూకా 9:49, 50

  • విశ్వాసం కోల్పోయేలా చేయడం గురించి హెచ్చరిక

  • ఒక సహోదరుడు పాపం చేస్తే ఏం చేయాలి?

యేసు ఇంతకుముందే, తన అనుచరుల ఆలోచనా తీరు ఎలా ఉండాలో వివరించాడు. వాళ్లు హోదాను ఏమాత్రం పట్టించుకోని చిన్నపిల్లల్లా వినయంగా ఉండాలి. అంతేకాదు, వాళ్లు అలాంటి చిన్నపిల్లల్ని యేసు పేరు మీద చేర్చుకోవాలి. అలా చేస్తే వాళ్లు ఆయన్ని కూడా చేర్చుకున్నవాళ్లు అవుతారు.—మత్తయి 18:5.

అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు, యేసు వాళ్లకు వినయం గురించి చాలా ముఖ్యమైన పాఠం నేర్పించాడు. ఇప్పుడు అపొస్తలుడైన యోహాను కాసేపటి క్రితం జరిగిన ఒక సంఘటన గురించి యేసుకు ఇలా చెప్పాడు: “ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొడుతుండడం మేము చూశాం. అతను మాతో కలిసి నిన్ను అనుసరించట్లేదు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాం.”—లూకా 9:49.

అద్భుతరీతిలో బాగుచేసే, చెడ్డదూతల్ని వెళ్లగొట్టే అధికారం కేవలం అపొస్తలులకు మాత్రమే ఉందని యోహాను అనుకున్నాడా? మరైతే ఆ యూదుడు చెడ్డదూతల్ని ఎలా వెళ్లగొట్టగలుగుతున్నాడు? అతను అపొస్తలులతో కలిసి యేసును అనుసరించట్లేదు కాబట్టి అలాంటి అద్భుతాలు చేయకూడదని యోహాను అనుకొని ఉంటాడు.

అప్పుడు యేసు అన్న ఈ మాటలు యోహానుకు ఆశ్చర్యం కలిగించివుంటాయి: “అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాళ్లెవ్వరూ అంత త్వరగా నా గురించి చెడ్డగా మాట్లాడలేరు. మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మన వైపే ఉన్నాడు. నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీరు క్రీస్తు శిష్యులని మీకు గిన్నెడు నీళ్లు ఇచ్చేవాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ప్రతిఫలం పొందుతారు.”—మార్కు 9:39-41.

అవును, అతను యేసు వైపు ఉండాలంటే ఆ సమయంలో తప్పనిసరిగా ఆయనతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అప్పటికింకా క్రైస్తవ సంఘం ఏర్పడలేదు కాబట్టి, అతను యేసుతో ప్రయాణించనంత మాత్రాన ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్లు, లేదా అబద్ధమతాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అవ్వదు. అతనికి యేసు పేరుమీద ఖచ్చితంగా విశ్వాసం ఉండివుంటుంది. అతను తప్పకుండా తన ప్రతిఫలం పొందుతాడని యేసు మాటలు తెలియజేస్తున్నాయి.

అంతేకాదు అపొస్తలులు తమ మాటల వల్ల, పనుల వల్ల అతన్ని విశ్వాసం కోల్పోయేలా చేస్తే, అది చాలా పెద్ద తప్పు అవుతుందని యేసు చెప్పాడు. “విశ్వాసంగల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి ఎవరైతే కారణమౌతారో, అతను మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రంలో పడేయబడడమే అతనికి మంచిది” అని ఆయన అన్నాడు. (మార్కు 9:42) ఆ తర్వాత చెయ్యి, కాలు, కన్ను లాంటి ఎంతో ముఖ్యమైన అవయవాలు తమ విశ్వాసం కోల్పోవడానికి కారణమౌతుంటే, వాటిని సైతం తీసేసుకోవాలని యేసు తన అనుచరులకు చెప్పాడు. ముఖ్యమైన ఆ అవయవాలు ఉండి గెహెన్నాలో (హిన్నోము లోయలో) పడడం కన్నా, అవి లేకుండా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం మంచిది. యెరూషలేముకు దగ్గర్లో చెత్తను కాల్చేసే ఈ లోయను అపొస్తలులు చూసేవుంటారు. కాబట్టి అది శాశ్వత నాశనాన్ని సూచిస్తుందని వాళ్లకు అర్థమైవుంటుంది.

యేసు ఇంకా ఇలా హెచ్చరించాడు: “ఈ చిన్నవాళ్లలో ఏ ఒక్కర్నీ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, పరలోకంలోవున్న వీళ్ల దూతలు నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తుంటారు.” తండ్రి ఆ ‘చిన్నవాళ్లను’ ఎంత విలువైనవాళ్లుగా చూస్తాడు? యేసు దాన్ని వివరించడానికి, 100 గొర్రెలు ఉండి ఒక్క గొర్రెను పోగొట్టుకున్న వ్యక్తి ఉదాహరణను చెప్పాడు. అతను 99 గొర్రెల్ని విడిచిపెట్టి, ఆ ఒక్కదాని కోసం వెతుకుతాడు. అది దొరికినప్పుడు 99 గొర్రెల కన్నా దాని విషయంలో ఎక్కువ సంతోషిస్తాడు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టంలేదు.”—మత్తయి 18:10, 14.

బహుశా, శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకోవడాన్ని మనసులో ఉంచుకుని యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఉప్పులా ఉండండి, ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.” (మార్కు 9:50) ఆహారంలో ఉప్పు వేస్తే మంచి రుచి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి మాటలు ఉప్పు వేసినట్టు ఉంటే, వినేవాళ్లు వాటిని సులభంగా అంగీకరిస్తారు, శాంతిగా ఉంటారు. కానీ వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.—కొలొస్సయులు 4:6.

కొన్నిసార్లు పెద్దపెద్ద సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో యేసు చెప్పాడు. “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి. అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే.” మరి అతను వినకపోతే ఏం చేయాలో యేసు ఇలా చెప్పాడు: “నీతోపాటు ఒకరిద్దర్ని తీసుకెళ్లు. అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా ప్రతీ విషయం నిర్ధారించబడుతుంది.” అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే, ఆ విషయాన్ని “సంఘానికి” అంటే బాధ్యతగల పెద్దలకు తెలియజేయాలి, వాళ్లు తగిన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ పాపం చేసిన వ్యక్తి, వాళ్ల మాట కూడా వినకపోతే అప్పుడేంటి? యేసు ఇలా చెప్పాడు: “అతన్ని నీకు అన్యజనుల్లో ఒకడిగా, పన్ను వసూలుచేసేవాడిగా ఉండనీ.” యూదులు అలాంటివాళ్లతో సహవాసం చేయరు.—మత్తయి 18:15-17.

సంఘ పర్యవేక్షకులు దేవుని వాక్యానికి అంటిపెట్టుకుని ఉండాలి. ఒక వ్యక్తి పాపం చేశాడని, అతనికి క్రమశిక్షణ అవసరమని వాళ్లు నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ‘అప్పటికే పరలోకంలో బంధించబడి ఉంటుంది.’ వాళ్లు అతన్ని నిర్దోషి అని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ‘పరలోకంలో విప్పబడి ఉంటుంది.’ క్రైస్తవ సంఘం ఏర్పడిన తర్వాత ఆ నిర్దేశాలు ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం “ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరున కలుసుకుంటారో అక్కడ నేను వాళ్ల మధ్య ఉంటాను” అని యేసు అన్నాడు.—మత్తయి 18:18-20.