కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

66వ అధ్యాయం

గుడారాల పండుగ కోసం యెరూషలేముకు వచ్చారు

గుడారాల పండుగ కోసం యెరూషలేముకు వచ్చారు

యోహాను 7:11-32

  • యేసు ఆలయంలో బోధించాడు

యేసు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఆయన గురించి చాలామందికి తెలిసింది. వేలమంది యూదులు ఆయన చేసిన అద్భుతాల్ని చూశారు. వాటి గురించిన వార్తలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు గుడారాల (లేదా, పర్ణశాలల) పండుగ సమయంలో యెరూషలేములో చాలామంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. కొంతమంది “ఆయన మంచివాడు” అని అంటే, ఇంకొంతమంది “ఆయన మంచివాడు కాదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు” అంటున్నారు. (యోహాను 7:12) ఇలా ఆయన గురించి పండుగ ప్రారంభంలో చాలామంది మాట్లాడుకున్నారు. కానీ యూదా నాయకులు ఏం చేస్తారో అనే భయంతో, ఎవరూ యేసు తరఫున నలుగురిలో మాట్లాడే ధైర్యం చేయలేదు.

పండుగ మధ్యలో ఒక రోజు యేసు ఆలయానికి వచ్చాడు. ఆయన అద్భుతమైన బోధనా సామర్థ్యాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. యేసు ఎప్పుడూ రబ్బీల పాఠశాలలకు వెళ్లలేదు. అందుకే యూదులు, “పాఠశాలల్లో చదువుకోని ఈయనకు లేఖనాలు ఇంత బాగా ఎలా తెలుసు?” అని ఆశ్చర్యపోయారు.—యోహాను 7:15.

యేసు ఇలా వివరించాడు: “నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వ్యక్తిదే. ఎవరైనా దేవుని ఇష్టాన్ని చేయాలని కోరుకుంటే, నేను చేసే బోధ దేవుని నుండి వచ్చిందో, నా అంతట నేనే బోధిస్తున్నానో అతనికి తెలుస్తుంది.” (యోహాను 7:16, 17) యేసు ధర్మశాస్త్రం ప్రకారమే బోధిస్తున్నాడు కాబట్టి ఆయన తన మహిమ కోసం కాకుండా, దేవుని మహిమ కోసం ప్రయత్నిస్తున్నాడని వాళ్లకు అర్థమైవుండాలి.

తర్వాత యేసు ఇలా అన్నాడు: “మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా? కానీ మీలో ఒక్కరు కూడా దాన్ని పాటించట్లేదు. మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు?” అయితే ప్రజల్లో కొంతమందికి బహుశా వేరే ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లకు, యేసును చంపడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలిసుండకపోవచ్చు. ఆయన లాంటి బోధకుణ్ణి ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు అని వాళ్లు అనుకుని ఉండవచ్చు. కాబట్టి, యేసు ఆ మాట అంటున్నాడంటే ఆయనకు ఏదో అయ్యిందనుకొని వాళ్లు ఇలా అన్నారు: “నీకు చెడ్డదూత పట్టాడు. నిన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు?”—యోహాను 7:19, 20.

నిజానికి, ఒకటిన్నర సంవత్సరాల క్రితం, యేసు విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని బాగుచేసినప్పుడు యూదా నాయకులు ఆయన్ని చంపాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు యేసు వాళ్లను ఆలోచింపజేసేలా మాట్లాడి వాళ్ల మూర్ఖత్వాన్ని బయటపెట్టాడు. ఆయన సున్నతి గురించి మాట్లాడాడు. ధర్మశాస్త్రం ప్రకారం మగపిల్లవాడికి ఎనిమిదో రోజున సున్నతి చేస్తారు, అది విశ్రాంతి రోజు అయినా సరే అలా చేస్తారు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: “మోషే ధర్మశాస్త్రాన్ని మీరకూడదని ఒక వ్యక్తి విశ్రాంతి రోజున సున్నతి పొందుతాడు కదా, అలాంటిది నేను విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని పూర్తిగా బాగు చేశానని నామీద ఎందుకు కోపంతో మండిపడుతున్నారు? పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి.”—యోహాను 7:23, 24.

అయితే యేసును చంపడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలిసిన యెరూషలేము నివాసులు ఇలా అన్నారు: “వాళ్లు [నాయకులు] చంపాలని చూస్తున్నది ఈయన్నే కదా? అయినా చూడండి! ఈయన అందరిముందు మాట్లాడుతున్నా వాళ్లు ఈయన్ని ఏమీ అనట్లేదు. ఈయనే క్రీస్తు అని మన నాయకులకు నిజంగా తెలిసిపోయిందా ఏంటి?” ఇంతకీ ప్రజలు యేసే క్రీస్తని ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే, “ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు; అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలీదు” అని వాళ్లు అనుకున్నారు.—యోహాను 7:25-27.

అప్పుడు యేసు ఆలయంలో వాళ్లకు ఇలా జవాబిచ్చాడు: “నేను ఎవర్నో, ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు. నన్ను పంపిన వ్యక్తి నిజమైనవాడు, ఆయన మీకు తెలీదు. కానీ నాకు ఆయన తెలుసు, ఎందుకంటే నేను ఆయన దగ్గర నుండి వచ్చాను; ఆయనే నన్ను పంపించాడు.” (యోహాను 7:28, 29) అలా అన్నందుకు, వాళ్లు యేసును పట్టుకొని చెరసాలలో వేయాలని లేదా చంపాలని చూశారు. యేసు చనిపోయే సమయం ఇంకా రాలేదు కాబట్టి వాళ్లలా చేయలేకపోయారు.

అయితే చాలామంది యేసు మీద విశ్వాసం ఉంచారు. అలా విశ్వాసం ఉంచడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆయన నీళ్లమీద నడిచాడు, గాలుల్ని నిమ్మళింపజేశాడు, కొన్ని రొట్టెలు-చేపలతో వేలమందికి అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు, రోగుల్ని బాగుచేశాడు, కుంటివాళ్లు నడిచేలా చేశాడు, గుడ్డివాళ్లకు చూపు తెప్పించాడు, కుష్ఠురోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను సైతం బ్రతికించాడు. అందుకే ప్రజలు, “క్రీస్తు వచ్చినప్పుడు, ఈయన చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాడా?” అనుకున్నారు.—యోహాను 7:31.

ప్రజలు ఇలా అనుకోవడం పరిసయ్యులు విన్నారు. దాంతో ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసును బంధించడానికి భటుల్ని పంపించారు.