కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

67వ అధ్యాయం

“ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”

“ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”

యోహాను 7:32-52

  • యేసును బంధించడానికి భటుల్ని పంపించారు

  • నీకొదేము యేసు తరఫున మాట్లాడాడు

యేసు గుడారాల (లేదా, పర్ణశాలల) పండుగ కోసం ఇంకా యెరూషలేములోనే ఉన్నాడు. ‘ప్రజల్లో చాలామంది తనమీద విశ్వాసం ఉంచినందుకు’ యేసు సంతోషించాడు. కానీ మతనాయకులకు అది నచ్చలేదు. వాళ్లు ఆయన్ని బంధించడానికి భటుల్ని పంపించారు. (యోహాను 7:31, 32) యేసు మాత్రం దాక్కోవడానికి ప్రయత్నించలేదు.

బదులుగా యేసు అందరిముందు ఆలయంలో బోధిస్తూ ఇలా అన్నాడు: “నేను ఇంకా కొంతకాలమే మీతో ఉంటాను, తర్వాత నన్ను పంపిన తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను. మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.” (యోహాను 7:33, 34) యేసు చెప్తున్నది అర్థంకాక యూదులు ఇలా అనుకున్నారు: “మనం కనుక్కోకుండా ఉండేలా ఈయన ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదిరిపోయిన యూదుల దగ్గరికి వెళ్లి గ్రీసువాళ్లకు ప్రకటించాలని అనుకుంటున్నాడా? ‘మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అనడంలో ఈయన ఉద్దేశం ఏంటి?” (యోహాను 7:35, 36) అయితే యేసు తాను చనిపోయి, పరలోకానికి పునరుత్థానం అవడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శత్రువులు అక్కడికి వెళ్లలేరు.

అది పండుగ ఏడవ రోజు. పండుగలో ప్రతీ ఉదయం ఒక యాజకుడు సిలోయము కోనేరు నుండి నీళ్లు తెచ్చి, బలిపీఠం అడుగున ప్రవహించేలా పోసేవాడు. బహుశా దాన్ని గుర్తుచేస్తూ యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “ఎవరికైనా దాహంగా ఉంటే, నా దగ్గరికి రావాలి. నేను అతనికి నీళ్లు ఇస్తాను. ఎవరైనా నామీద విశ్వాసం ఉంచితే, లేఖనం చెప్తున్నట్టుగా ‘అతని హృదయంలో నుండి జీవజలాల ధారలు ప్రవహిస్తాయి.’”—యోహాను 7:37, 38.

తన శిష్యులు పవిత్రశక్తితో అభిషేకించబడి, పరలోక నిరీక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుందో యేసు ఆ మాటల ద్వారా తెలియజేశాడు. యేసు చనిపోయిన తర్వాత వాళ్లు అభిషేకించబడతారు. తర్వాతి సంవత్సరం పెంతెకొస్తు రోజున శిష్యులు పవిత్రశక్తితో అభిషేకించబడి, సత్యం గురించి ప్రజలకు చెప్పినప్పుడు జీవజలాల ధారలు ప్రవహించడం మొదలైంది.

యేసు చెప్పింది విన్న కొంతమంది, “రావాల్సిన ఆ ప్రవక్త నిజంగా ఈయనే” అన్నారు. అంటే లేఖనాలు ప్రవచించిన మోషే కన్నా గొప్ప ప్రవక్త ఆయనే అని వాళ్ల ఉద్దేశం. కొంతమంది, “ఈయనే క్రీస్తు” అన్నారు. అయితే కొంతమంది, “క్రీస్తు గలిలయ నుండి రాడు కదా? క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరైన బేత్లెహేము నుండే వస్తాడనీ లేఖనం చెప్పట్లేదా?” అని వాదించారు.—యోహాను 7:40-42.

అలా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది యేసును బంధించాలనుకున్నారు కానీ ఎవరూ ఆయన మీద చెయ్యి వేయలేకపోయారు. భటులు యేసును బంధించకుండా తిరిగొచ్చినప్పుడు, “మీరు ఆయన్ని ఎందుకు తీసుకురాలేదు?” అని ముఖ్య యాజకులు, పరిసయ్యులు అడిగారు. అప్పుడు ఆ భటులు, “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు” అని జవాబిచ్చారు. దానికి ఆ మతనాయకులు కోపంతో రగిలిపోతూ, వాళ్లను ఎగతాళి చేస్తూ, దూషిస్తూ, “మీరు కూడా మోసపోయారా ఏంటి? నాయకుల్లో, పరిసయ్యుల్లో ఒక్కరైనా ఆయనమీద విశ్వాసం ఉంచారా, లేదు కదా? అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజలు శపించబడిన వాళ్లు” అన్నారు.—యోహాను 7:45-49.

అప్పుడు మహాసభ సభ్యుడూ పరిసయ్యుడూ అయిన నీకొదేము యేసు తరఫున మాట్లాడే ధైర్యం చేశాడు. అతను దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం రాత్రిపూట యేసు దగ్గరికి వెళ్లాడు, ఆయన మీద విశ్వాసం ఉందని చెప్పాడు. నీకొదేము ఇప్పుడు ఇలా అన్నాడు: “మన ధర్మశాస్త్రం ప్రకారం, ముందు ఒక వ్యక్తి చెప్పేది విని, అతను ఏంచేస్తున్నాడో తెలుసుకోకుండా అతనికి తీర్పు తీర్చలేం కదా?” అందుకు వాళ్లు, “నువ్వు కూడా గలిలయ నుండే వచ్చావా ఏంటి? లేఖనాల్ని పరిశీలించి చూడు, గలిలయలో నుండి ఏ ప్రవక్తా రాడు” అన్నారు.—యోహాను 7:51, 52.

గలిలయలో నుండి ప్రవక్త వస్తాడని లేఖనాలు సూటిగా చెప్పలేదు. కానీ ‘అన్యజనుల గలిలయ ప్రాంతం గొప్ప వెలుగును’ చూస్తుందని చెప్పడం ద్వారా, క్రీస్తు అక్కడి నుండి వస్తాడని దేవుని వాక్యం ముందే సూచించింది. (యెషయా 9:1, 2; మత్తయి 4:13-17) అంతేకాదు, లేఖనాలు ముందే చెప్పినట్లు యేసు బేత్లెహేములో, దావీదు వంశంలో పుట్టాడు. బహుశా పరిసయ్యులకు ఈ విషయాలు తెలిసేవుంటాయి. అయినా, ప్రజల్లో యేసు గురించి తప్పుడు వార్తలు వాళ్లే వ్యాప్తి చేసివుంటారు.