కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

72వ అధ్యాయం

70 మంది శిష్యుల్ని ప్రకటించడానికి పంపించాడు

70 మంది శిష్యుల్ని ప్రకటించడానికి పంపించాడు

లూకా 10:1-24

  • 70 మంది శిష్యుల్ని ఎంచుకుని, ప్రకటించడానికి పంపించాడు

సా.శ. 32 ముగింపుకు వస్తోంది, యేసు బాప్తిస్మం తీసుకుని దాదాపు మూడు సంవత్సరాలైంది. యేసు, ఆయన శిష్యులు ఈమధ్యే గుడారాల పండుగ కోసం యెరూషలేముకు వెళ్లారు. వాళ్లు ఇంకా ఆ చుట్టుపక్కలే ఉండివుంటారు. (లూకా 10:38; యోహాను 11:1) యేసు తన పరిచర్యలోని చివరి ఆరు నెలలు, యూదయలో లేదా యొర్దాను నదికి అవతల ఉన్న పెరయ జిల్లాలో ఎక్కువగా ప్రకటించాడు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది.

అంతకుముందు, సా.శ. 30 పస్కా పండుగ తర్వాత యేసు కొన్ని నెలలు యూదయలో ప్రకటిస్తూ, సమరయ గుండా ప్రయాణిస్తూ గడిపాడు. సా.శ. 31 పస్కా సమయంలో యెరూషలేములోని యూదులు ఆయన్ని చంపాలని ప్రయత్నించారు. తర్వాతి ఒకటిన్నర సంవత్సరాలు, యేసు ఎక్కువగా ఉత్తరాన ఉన్న గలిలయలోనే బోధించాడు. ఆ సమయంలో చాలామంది ఆయన అనుచరులయ్యారు. గలిలయలో ఆయన తన అపొస్తలులకు శిక్షణ ఇచ్చి ప్రకటించడానికి పంపించినప్పుడు, వాళ్లకు ఈ నిర్దేశం ఇచ్చాడు: “‘పరలోక రాజ్యం దగ్గరపడింది’ అని ప్రకటించండి.” (మత్తయి 10:5-7) ఇప్పుడు ఆయన యూదయలో ఒక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.

ఆ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి యేసు 70 మంది శిష్యుల్ని ఎంచుకుని, వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు. ‘కోయాల్సిన పంట చాలా ఉండి, పనివాళ్లు కొంతమందే ఉన్న’ ప్రాంతంలో ప్రకటించడానికి ఆ రాజ్య ప్రచారకుల్ని పంపించాడు. (లూకా 10:2) ముందు వాళ్లను పంపించి, బహుశా తర్వాత ఆయన వెళ్లివుంటాడు. ఆ 70 మంది ప్రచారకులు రోగుల్ని బాగుచేస్తూ, యేసు ప్రకటిస్తున్న సందేశాన్నే ప్రకటించాలి.

సమాజమందిరాలకు వెళ్లి బోధించే బదులు, ప్రజల ఇళ్లకు వెళ్లమని యేసు వాళ్లకు చెప్పాడు. ఆయన ఇలా నిర్దేశించాడు: “ఎక్కడైనా ఒక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ముందు ఇలా అనండి: ‘ఈ ఇంట్లో శాంతి ఉండాలి.’ శాంతిని ప్రేమించేవాళ్లు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే, మీ శాంతి అతని మీద నిలిచివుంటుంది.” ఇంతకీ శిష్యులు ప్రకటించాల్సిన సందేశం ఏంటి? యేసు ఇలా చెప్పాడు: “‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చేసింది’ అని వాళ్లతో చెప్పండి.”—లూకా 10:5-9.

దాదాపు సంవత్సరం క్రితం యేసు 12 మంది అపొస్తలుల్ని పంపించినప్పుడు ఏ నిర్దేశాలు ఇచ్చాడో, ఈ 70 మందికి కూడా అలాంటి నిర్దేశాలే ఇచ్చాడు. అందరూ వాళ్లను ప్రేమగా ఆహ్వానించకపోవచ్చని యేసు హెచ్చరించాడు. అయినా, వాళ్లు చేసే పని వల్ల మంచి మనసున్న చాలామంది ప్రజలు, యేసు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటారు.

కాసేపటి తర్వాత ఆ 70 మంది రాజ్య ప్రచారకులు యేసు దగ్గరికి తిరిగొచ్చి, “ప్రభువా, నీ పేరున ఆజ్ఞాపిస్తే చెడ్డదూతలు కూడా మాకు లోబడుతున్నారు” అని సంతోషంగా చెప్పారు. యేసు అది విని తప్పకుండా సంతోషించివుంటాడు. ఆయన ఇలా అన్నాడు: “సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను. ఇదిగో! పాముల్ని, తేళ్లను కాళ్ల కింద తొక్కే అధికారాన్ని . . . నేను మీకు ఇచ్చాను.”—లూకా 10:17-19.

తన అనుచరులు సూచనార్థకంగా పాముల్ని, తేళ్లను తొక్కుతారని అంటే ప్రమాదకరమైన వాటిని అధిగమిస్తారని యేసు హామీ ఇచ్చాడు. అంతేకాదు, భవిష్యత్తులో సాతాను పరలోకం నుండి పడవేయబడతాడనే పూర్తి నమ్మకంతో వాళ్లు ఉండవచ్చు. నిజానికి, వాళ్లు దేన్నిబట్టి ఎక్కువగా సంతోషించాలో చెప్తూ యేసు ఆ 70 మందితో ఇలా అన్నాడు: “చెడ్డదూతలు మీకు లోబడుతున్నారని సంతోషించకండి. బదులుగా, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి.”—లూకా 10:20.

వినయస్థులైన వీళ్లను తండ్రి అంత శక్తివంతంగా ఉపయోగిస్తున్నందుకు యేసు ఎంతో సంతోషించి, అందరిముందూ ఆయన్ని స్తుతించాడు. తర్వాత తన శిష్యుల వైపు తిరిగి ఇలా అన్నాడు: “మీరు చూస్తున్న వాటిని చూసేవాళ్లు ధన్యులు. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, చాలామంది ప్రవక్తలు, రాజులు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు; మీరు వింటున్నవాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు.”—లూకా 10:23, 24.