కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

74వ అధ్యాయం

ఆతిథ్యం, ప్రార్థన గురించి పాఠాలు

ఆతిథ్యం, ప్రార్థన గురించి పాఠాలు

లూకా 10:38–11:13

  • మార్త, మరియల ఇంటికి యేసు వెళ్లాడు

  • పట్టుదలగా ప్రార్థించడం చాలా అవసరం

యెరూషలేముకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బేతనియ అనే పల్లెటూరు ఉంది. అది ఒలీవల కొండ మీద తూర్పున ఉంది. (యోహాను 11:18) యేసు ఆ ఊర్లో ఉన్న మార్త, మరియ అనే అక్కచెల్లెళ్ల ఇంటికి వెళ్లాడు. వాళ్లు, వాళ్ల సహోదరుడైన లాజరు యేసుకు స్నేహితులు. వాళ్లు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు.

మెస్సీయ తమ ఇంటికి రావడం వాళ్లకు ఒక గొప్ప గౌరవం. కాబట్టి మార్త చాలా హడావిడిగా యేసు కోసం ఎన్నో వంటకాలు సిద్ధం చేస్తోంది. అయితే ఆమె సహోదరి మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని, ఆయన చెప్పేవి వింటూ ఉంది. కాసేపటి తర్వాత మార్త యేసుతో, “ప్రభువా, నా సహోదరి పనంతా నా మీదే వదిలేసింది, దీని గురించి నువ్వు పట్టించుకోవా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అని అంది.—లూకా 10:40.

యేసు మరియను తప్పుపట్టే బదులు, భౌతిక విషయాల గురించి అతిగా ఆందోళనపడుతున్న మార్తను సరిదిద్దాడు: “మార్తా, మార్తా, నువ్వు చాలా విషయాల గురించి ఆందోళనపడుతూ కంగారుపడుతున్నావు. అయితే అవసరమైనవి కొన్నే, బహుశా ఒక్కటైనా సరిపోవచ్చు. మరియ సరైనదాన్ని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసేయబడదు.” (లూకా 10:41, 42) ఎక్కువ సమయం తీసుకుని చాలా వంటలు చేయడం అవసరం లేదని యేసు చెప్తున్నాడు. మామూలు భోజనం చాలు.

మార్త ఉద్దేశాలు సరైనవే, ఆమె చక్కగా ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. అయితే వంటల గురించి అతిగా ఆందోళనపడడం వల్ల ఆమె దేవుని కుమారుడు చెప్పే విలువైన ఉపదేశాన్ని కోల్పోతుంది! మరియ సరైనదాన్ని ఎంచుకుందని యేసు చెప్పాడు. దానివల్ల ఆమె శాశ్వత ప్రయోజనం పొందుతుంది, మనం కూడా దాన్నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు.

యేసు మరో సందర్భంలో, అంతే విలువైన ఇంకో పాఠం నేర్పించాడు. ఒక శిష్యుడు ఆయన్ని ఇలా అడిగాడు: “ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టే, నువ్వు కూడా ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు.” (లూకా 11:1) యేసు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం కొండమీది ప్రసంగంలో ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. (మత్తయి 6:9-13) అయితే ఈ శిష్యుడు అప్పుడు అక్కడ లేడేమో. కాబట్టి యేసు ముఖ్యమైన అంశాల్ని మళ్లీ చెప్పాడు. తర్వాత పట్టుదలగా ప్రార్థించడం ఎంత అవసరమో వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు.

“మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. మీరు అర్ధరాత్రి వేళ అతని ఇంటికి వెళ్లి ఇలా అడిగారు: ‘స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు ఇవ్వు. నా స్నేహితుడు ఒకతను ప్రయాణిస్తూ ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు.’ కానీ అతను లోపలి నుండి ఇలా అన్నాడు: ‘నన్ను ఇబ్బందిపెట్టకు. తలుపు ఇప్పటికే తాళం వేసి ఉంది. నా చిన్నపిల్లలు నాతోపాటు మంచం మీద పడుకొని ఉన్నారు. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను.’ నేను మీతో చెప్తున్నాను, మీరు తన స్నేహితుడు అయినందుకు అతను మీకు ఏమీ ఇవ్వకపోయినా, మీరు పట్టుదలతో పదేపదే అడిగినందుకు అతను లేచి మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు.”—లూకా 11:5-8.

ఆ స్నేహితుడిలా యెహోవా కూడా మన విన్నపాల్ని పట్టించుకోడని యేసు చెప్తున్నాడా? లేదు. సాయం చేయడానికి ఇష్టపడని స్నేహితుడే, పట్టుదలగా అడిగినప్పుడు స్పందించాడు. అలాంటిది, ప్రేమగల మన పరలోక తండ్రి తన నమ్మకమైన సేవకులు మనస్ఫూర్తిగా చేసే విన్నపాలకు తప్పకుండా స్పందిస్తాడు అని యేసు చెప్తున్నాడు! ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను మీతో చెప్తున్నాను: అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది. అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు, వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది.”—లూకా 11:9, 10.

తర్వాత యేసు మానవ తండ్రుల్ని ఉదాహరణగా తీసుకుని, తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా స్పష్టం చేశాడు: “ఏ తండ్రైనా తన కుమారుడు చేపను అడిగితే పామును ఇస్తాడా? లేదా గుడ్డును అడిగితే తేలును ఇస్తాడా? మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతుల్ని ఇవ్వడం మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా పవిత్రశక్తిని ఇస్తాడో కదా!” (లూకా 11:11-13) మన తండ్రి మన ప్రార్థనలు విని, మన అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాడని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా!