కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

75వ అధ్యాయం

నిజమైన సంతోషం ఎలా పొందవచ్చో యేసు చెప్పాడు

నిజమైన సంతోషం ఎలా పొందవచ్చో యేసు చెప్పాడు

లూకా 11:14-36

  • “దేవుని వేలితో” చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు

  • నిజమైన సంతోషానికి మూలం

యేసు ఇంతకుముందే, ప్రార్థన ఎలా చేయాలో మళ్లీ చెప్పాడు. తన పరిచర్యలో యేసు వేరే అంశాల్ని కూడా మరోసారి చెప్పాల్సి వచ్చింది. యేసు గలిలయలో అద్భుతాలు చేసినప్పుడు, చెడ్డదూతల అధిపతి సహాయంతోనే వాటిని చేస్తున్నాడని ఆయన్ని నిందించారు. ఇప్పుడు యూదయలో కూడా ఆయనపై అదే నింద వేశారు.

ఒకతను చెడ్డదూత పట్టడం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. యేసు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే, ఆయన్ని విమర్శించేవాళ్లు ఇంతకుముందులాగే మళ్లీ ఇలా అన్నారు: “ఇతను చెడ్డదూతల నాయకుడైన బయెల్జెబూలు సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు.” (లూకా 11:15) ఇంకొంతమంది యేసును మరిన్ని రుజువులు కోరుతూ, ఆయనే మెస్సీయ అని నిరూపించుకునేలా పరలోకం నుండి ఒక సూచన చూపించమన్నారు.

వాళ్లు తనను పరీక్షించడానికే అలా అడుగుతున్నారని యేసు గ్రహించి, ఇదివరకు గలిలయలో తనను విమర్శించినవాళ్లకు ఇచ్చిన జవాబునే మళ్లీ ఇచ్చాడు. ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే ఆ రాజ్యం నాశనమౌతుందని చెప్తూ ఇలా అన్నాడు: “సాతాను కూడా తన మీద తానే తిరగబడి విడిపోతే, అతని రాజ్యం ఎలా నిలుస్తుంది?” తర్వాత యేసు సూటిగా ఇలా అన్నాడు: “నేను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నది దేవుని వేలితో అయితే, నిజంగా దేవుని రాజ్యం మిమ్మల్ని దాటివెళ్లినట్టే.”—లూకా 11:18-20.

‘దేవుని వేలు’ అనే మాట విన్నప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు వాళ్లకు గుర్తుకు రావాలి. మోషే చేసిన అద్భుతాన్ని చూసి ఫరో రాజభవనంలో ఉన్నవాళ్లు, ‘ఇది దేవుని వేలు!’ అన్నారు. రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసింది కూడా ‘దేవుని వేలే.’ (నిర్గమకాండం 8:19; 31:18) ఇప్పుడు యేసు చెడ్డదూతల్ని వెళ్లగొడుతుంది, రోగుల్ని బాగుచేస్తుంది కూడా ‘దేవుని వేలితోనే,’ అంటే దేవుని పవిత్రశక్తితోనే. దేవుని రాజ్యానికి రాజుగా నియమించబడిన యేసు వాళ్ల కళ్లముందే అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి, దేవుని రాజ్యం నిజంగా ఆ శత్రువుల్ని దాటి వెళ్లిపోయింది.

ఆయుధాలు ధరించి తన ఇంటికి కాపలా కాస్తున్న ఒక బలమైన వ్యక్తిని, అంతకన్నా బలమైన వ్యక్తే ఓడించగలడు. అదేవిధంగా, యేసు చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడంటే, ఆయన సాతాను కన్నా బలవంతుడని అర్థమౌతుంది. అపవిత్ర దూత ఒక వ్యక్తిని వదిలివెళ్లడం గురించిన ఉదాహరణ కూడా యేసు మళ్లీ చెప్పాడు. చెడ్డదూత వదిలివెళ్లడం వల్ల ఏర్పడిన ఖాళీని అతను మంచి విషయాలతో నింపకపోతే, ఆ అపవిత్ర దూత ఇంకో ఏడు అపవిత్ర దూతల్ని తీసుకొస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చివరి పరిస్థితి మొదటి పరిస్థితికన్నా ఘోరంగా తయారౌతుంది. (మత్తయి 12:22, 25-29, 43-45) ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

యేసు చెప్తున్నది వింటున్న ఒక స్త్రీ బిగ్గరగా ఇలా అంది: “నిన్ను కని, పాలిచ్చిన స్త్రీ సంతోషంగా ఉంటుంది!” ప్రవక్తకు, ముఖ్యంగా మెస్సీయకు తల్లి కావాలని యూదా స్త్రీలు ఆశపడేవాళ్లు. కాబట్టి, ఇంత గొప్ప బోధకునికి తల్లి అయినందుకు మరియ సంతోషంగా ఉంటుంది అని ఆ స్త్రీ అనుకొని ఉండవచ్చు. అయితే ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారనే విషయంలో ఆమె అభిప్రాయాన్ని సరిదిద్దుతూ, యేసు ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!” (లూకా 11:27, 28) మరియకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలని యేసు ఎప్పుడూ చెప్పలేదు. ఒకరికి బంధువు అవడం వల్లో, ఏదో సాధించడం వల్లో కాదుగానీ దేవుని నమ్మకమైన సేవకులుగా ఉండడం వల్లే ఎవరైనా సంతోషంగా ఉంటారని యేసు చెప్తున్నాడు.

పరలోకం నుండి సూచన చూపించమని అడిగినందుకు, గలిలయలోని ప్రజల్ని గద్దించినట్లే యేసు వీళ్లను కూడా గద్దించాడు. “యోనాకు సంబంధించిన సూచన” తప్ప వేరే ఏ సూచనా వీళ్లకు ఇవ్వబడదని యేసు చెప్పాడు. మూడు రోజులు చేప కడుపులో ఉండడం ద్వారా, ధైర్యంగా ప్రకటించడం ద్వారా యోనా ఒక సూచనగా ఉన్నాడు. అతను ప్రకటించినప్పుడు నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. యేసు ఇలా అన్నాడు: “అయితే ఇదిగో! యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” (లూకా 11:29-32) అలాగే, తాను సొలొమోను కన్నా గొప్పవాడినని యేసు అన్నాడు. అతని తెలివైన మాటల్ని వినడానికి షేబ దేశపు రాణి వచ్చింది.

యేసు ఇలా చెప్పాడు: “దీపాన్ని వెలిగించిన తర్వాత ఎవ్వరూ దాన్ని దాచిపెట్టరు లేదా గంప కింద పెట్టరు కానీ దీపస్తంభం మీదే పెడతారు.” (లూకా 11:33) ఈ ప్రజలకు బోధించడం, వాళ్ల ముందు అద్భుతాలు చేయడం దీపపు వెలుగును దాచిపెట్టడంతో సమానమని యేసు చెప్తుండవచ్చు. వాళ్ల కన్ను ఒకేదానిపై దృష్టి నిలపలేదు కాబట్టి, యేసు చేస్తున్న పనుల ఉద్దేశాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు.—లూకా 11:34.

ఇంతకుముందే యేసు ఒకతనిలో నుండి చెడ్డదూతను వెళ్లగొట్టి, అతను మాట్లాడగలిగేలా చేశాడు. యెహోవాను మహిమపర్చేలా, ఆయన చేస్తున్నవాటి గురించి ఇతరులకు చెప్పేలా అది ప్రజల్ని కదిలించాలి. కానీ విమర్శకులు అలా చేయలేదు. అందుకే యేసు వాళ్లను ఇలా హెచ్చరించాడు: “అప్రమత్తంగా ఉండండి, మీలో ఉన్న వెలుగు చీకటి కావచ్చు. మీ శరీరమంతా వెలుగుమయమై దానిలోని ఏ భాగమూ చీకటిగా లేకపోతే, ఆ వెలుగు ఒక దీపం ఇచ్చే వెలుగంత ప్రకాశవంతంగా ఉంటుంది.”—లూకా 11:35, 36.