కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

76వ అధ్యాయం

పరిసయ్యుని ఇంట్లో భోజనం చేశాడు

పరిసయ్యుని ఇంట్లో భోజనం చేశాడు

లూకా 11:37-54

  • వేషధారులైన పరిసయ్యుల్ని యేసు ఖండించాడు

యూదయలో ఒక పరిసయ్యుడు యేసును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయన వెళ్లాడు. అది బహుశా మధ్యాహ్న సమయం అయ్యుంటుంది. (లూకా 11:37, 38; లూకా 14:12 పోల్చండి.) పరిసయ్యులు భోజనం చేసే ముందు, ఆచారం ప్రకారం మోచేతుల వరకు కడుక్కుంటారు. అయితే యేసు అలా చేయలేదు. (మత్తయి 15:1, 2) మోచేతుల వరకు కడుక్కునే ఆచారం దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పని కాకపోయినా, అది దేవుడు చెప్పిందైతే కాదు.

యేసు ఆ ఆచారాన్ని పాటించకపోవడం చూసి పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అది గమనించి యేసు ఇలా అన్నాడు: “పరిసయ్యులారా, మీరు బయటికి శుభ్రంగా కనిపించి లోపల మురికిగా ఉన్న గిన్నెల్లాంటివాళ్లు. లోపల మీరు అత్యాశతో, దుష్టత్వంతో నిండివున్నారు. అవివేకులారా! బయటి వైపును చేసిన దేవుడే లోపలి వైపును కూడా చేశాడు కదా?”—లూకా 11:39, 40.

భోజనం చేసే ముందు చేతులు కడుక్కోకపోవడం తప్పు కాదు, వేషధారణే తప్పు. పరిసయ్యులు అలాగే ఇంకొందరు ఒక ఆచారంలా చేతులు కడుక్కుంటున్నారు కానీ, తమ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని కడుక్కోవడం లేదు. కాబట్టి యేసు వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు: “లోపల ఉన్నవాటిని దానధర్మాలుగా ఇవ్వండి. అప్పుడు మీకు సంబంధించిన ప్రతీది శుభ్రంగా ఉంటుంది.” (లూకా 11:41) అవును, ఇచ్చేది ఏదైనా ప్రేమతో ఇవ్వాలి, అంతేగానీ నీతిమంతుల్లా నటిస్తూ వేరేవాళ్లను మెప్పించడం కోసం ఇవ్వకూడదు.

అయితే శాస్త్రులకు, పరిసయ్యులకు ఇచ్చే గుణం లేదని కాదు. యేసు ఇలా అన్నాడు: “మీరు పుదీనలో, సదాపలో, కూరమొక్కల్లో ప్రతీదానిలో పదోవంతు ఇస్తారు కానీ న్యాయాన్ని, దేవుని ప్రేమను పట్టించుకోరు! నిజమే పదోవంతు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, కానీ ఆ మిగతా విషయాల్ని మీరు అశ్రద్ధ చేయకూడదు.” (లూకా 11:42) పంటలో పదోవంతు (దశమభాగం) ఇవ్వాలని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. (ద్వితీయోపదేశకాండం 14:22) అందులో ఆహారానికి రుచి తెచ్చే పుదీన, సదాప వంటి కూరమొక్కలు కూడా ఉన్నాయి. పరిసయ్యులు ఈ చిన్నచిన్న కూరమొక్కల్లో కూడా పదోవంతు ఇచ్చేవాళ్లు. అయితే అంతకన్నా ముఖ్యంగా న్యాయంగా నడుచుకోమని, అణకువగా ఉండమని ధర్మశాస్త్రం చెప్పింది. మరి వాళ్లు దాన్ని పాటిస్తున్నారా?—మీకా 6:8.

యేసు ఇంకా ఇలా చెప్పాడు: “పరిసయ్యులారా, మీకు శ్రమ! ఎందుకంటే సమాజమందిరాల్లో ముందువరుస స్థానాల్లో కూర్చోవడం, సంతల్లో నమస్కారాలు పెట్టించుకోవడం మీకు చాలా ఇష్టం. మీకు శ్రమ! ఎందుకంటే మీరు స్పష్టంగా కనిపించని సమాధుల లాంటివాళ్లు. మనుషులు వాటి మీద నడుస్తారు కానీ అవి ఉన్న సంగతే వాళ్లకు తెలీదు.” (లూకా 11:43, 44) అవును, ప్రజలు పొరపాటున సమాధుల మీద నడిస్తే ఆచారం ప్రకారం అపవిత్రులౌతారు. యేసు ఆ విషయాన్ని ఉపయోగిస్తూ పరిసయ్యుల అపవిత్రత బయటికి కనిపించదని స్పష్టం చేశాడు.—మత్తయి 23:27.

అప్పుడు ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, ఇలా అంటూ నువ్వు మమ్మల్ని కూడా అవమానిస్తున్నావు.” అయితే అతనిలాంటి వాళ్లు, తాము ప్రజలకు సహాయం చేయట్లేదని గ్రహించాలి. యేసు ఇలా అన్నాడు: “ధర్మశాస్త్రంలో ఆరితేరిన మీకు కూడా శ్రమ! ఎందుకంటే మీరు, మోయలేని బరువులు పెట్టి మనుషుల్ని కృంగదీస్తారు, కానీ మీ వేలితో కూడా వాటిని ముట్టుకోరు! మీకు శ్రమ! ఎందుకంటే మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు. కానీ మీ పూర్వీకులే వాళ్లను చంపారు.”—లూకా 11:45-47.

కల్పిత ఆచారాల్ని, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని తప్పుగా అన్వయించి సృష్టించిన ఆచారాల్ని యేసు ఇక్కడ బరువులు అంటున్నాడు. వీళ్లు ప్రజల కష్టాల్ని తీసేయకపోగా, మోయలేని బరువుల్లాంటి ఆచారాల్ని పాటించాలని అందర్నీ బలవంతం చేస్తున్నారు. వీళ్ల పూర్వీకులు, హేబెలుతో మొదలుపెట్టి ఎంతోమంది దేవుని ప్రవక్తల్ని చంపారు. ఇప్పుడు వీళ్లేమో ప్రవక్తల సమాధులు కడుతూ ప్రవక్తల్ని గౌరవిస్తున్నామని చూపించుకుంటున్నారు. నిజానికి వీళ్లు కూడా తమ పూర్వీకుల వైఖరినే చూపిస్తూ, వాళ్లలాగే ప్రవర్తిస్తున్నారు. దేవుని అతి గొప్ప ప్రవక్తను కూడా వాళ్లు చంపాలనుకుంటున్నారు. అందుకు దేవుడు ఈ తరంవాళ్లను బాధ్యులుగా ఎంచుతాడని యేసు చెప్తున్నాడు. దాదాపు 38 సంవత్సరాల తర్వాత సా.శ. 70 లో ఆయన అన్న మాట నిజమైంది.

యేసు ఇంకా ఇలా అన్నాడు: “ధర్మశాస్త్రంలో ఆరితేరిన మీకు శ్రమ! ఎందుకంటే, మీరు జ్ఞానపు తాళంచెవిని తీసుకెళ్లిపోయారు. మీరు లోపలికి వెళ్లలేదు, వెళ్లేవాళ్లను కూడా మీరు ఆపుతున్నారు!” (లూకా 11:52) నిజానికి వీళ్లు దేవుని వాక్య అర్థాన్ని విడమర్చి చెప్పాలి. కానీ దాన్ని తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం ప్రజలకు లేకుండా చేస్తున్నారు.

అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఎలా స్పందించారు? యేసు అక్కడ నుండి వెళ్లిపోతుంటే, వాళ్లు ఆయన్ని వ్యతిరేకిస్తూ కోపంతో ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన దగ్గర నేర్చుకోవాలని కాదుగానీ, ఆయన మాటల్లో తప్పుపట్టి ఆయన్ని బంధించాలని అలా చేశారు.