కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

79వ అధ్యాయం

నాశనం ఎందుకు దగ్గరపడింది?

నాశనం ఎందుకు దగ్గరపడింది?

లూకా 13:1-21

  • రెండు విషాద సంఘటనల నుండి యేసు పాఠం నేర్పించాడు

  • నడుము వంగిపోయిన స్త్రీని విశ్రాంతి రోజున బాగుచేశాడు

దేవునితో తమకున్న సంబంధాన్ని పరిశీలించుకోమని యేసు ప్రజల్ని ఎన్నో విధాలుగా ప్రోత్సహించాడు. పరిసయ్యుని ఇంటి బయట ప్రజలతో చర్చించిన తర్వాత ఒక సందర్భంలో ఆయన మళ్లీ అలాగే చేశాడు.

కొంతమంది ఒక విషాద సంఘటన గురించి ఆయనకు చెప్పారు. వాళ్లు, “బలులు అర్పిస్తున్న గలిలయవాళ్లను [రోమా అధిపతి అయిన పొంతి] పిలాతు చంపించాడని” చెప్పారు. (లూకా 13:1) పిలాతు వాళ్లను ఎందుకు చంపించాడు?

పిలాతు యెరూషలేములోకి నీళ్లు రప్పించడానికి ఒక కాలువ నిర్మించాడు. అయితే దానికోసం ఆలయ ఖజానాలోని డబ్బు ఉపయోగించాడు. బహుశా కొంతమంది ఆలయ అధికారుల సహాయంతో పిలాతు ఆ డబ్బు తీసుకుని ఉంటాడు. అది నచ్చని వేలమంది యూదులు దాన్ని వ్యతిరేకించారు, దాంతో పిలాతు వాళ్లలో కొంతమందిని చంపించాడు. ఈ గలిలయవాళ్లు అలా చనిపోయినవాళ్లే అయ్యుంటారు. ఏదో పాపం చేసినందుకే వాళ్లు అలా చనిపోయారని యేసుతో మాట్లాడుతున్నవాళ్లు అనుకొని ఉంటారు. అయితే యేసు అది నిజం కాదన్నాడు.

యేసు, “వాళ్లకు ఇలా జరిగింది కాబట్టి గలిలయలోని మిగతావాళ్లందరి కన్నా వాళ్లు ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా?” అని అడిగి, కాదని జవాబిచ్చాడు. అయితే ఆయన ఆ సంఘటనను ఉపయోగిస్తూ వాళ్లను ఇలా హెచ్చరించాడు: “మీరు పశ్చాత్తాపపడకపోతే, వాళ్లలాగే మీరందరూ నాశనమౌతారు.” (లూకా 13:2, 3) తర్వాత యేసు ఈమధ్యే జరిగిన, అంటే ఆ కాలువ నిర్మాణంతో సంబంధం ఉన్న మరో విషాద సంఘటన గురించి మాట్లాడుతూ ఇలా అడిగాడు:

“సిలోయములో గోపురం కూలి చనిపోయిన ఆ 18 మంది, యెరూషలేములో నివసించే మిగతావాళ్లందరి కన్నా ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా?” (లూకా 13:4) వాళ్లు కూడా ఏదో తప్పు చేసినందుకే చనిపోయారని ప్రజలు అనుకుంటుండవచ్చు. యేసు మళ్లీ దానికి ఒప్పుకోలేదు. “అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు” జరుగుతాయని, బహుశా ఈ విషాదం కూడా అలాంటిదేనని యేసుకు తెలుసు. (ప్రసంగి 9:11) అయితే, ప్రజలు ఈ సంఘటన నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. యేసు ఇలా అన్నాడు: “మీరు పశ్చాత్తాపపడకపోతే, వాళ్లలాగే మీరందరూ నాశనమౌతారు.” (లూకా 13:5) యేసు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నొక్కి చెప్తున్నాడు?

ఎందుకంటే ఆయన ఇప్పుడు తన పరిచర్య చివర్లో ఉన్నాడు. దానిగురించి వివరిస్తూ యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒకతను తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును నాటించి, దానికి పండ్లు వస్తాయేమో అని చూస్తూ ఉన్నాడు; కానీ అవి రాలేదు. అప్పుడతను తోటమాలితో ఇలా అన్నాడు: ‘ఇదిగో మూడు సంవత్సరాలుగా ఈ అంజూర చెట్టుకు పండ్లు వస్తాయేమో అని నేను ఎదురుచూస్తూ ఉన్నాను, కానీ ఏమీ రాలేదు. దీన్ని నరికేయి! దీనివల్ల ఈ స్థలం ఎందుకు వృథా కావాలి?’ అప్పుడు తోటమాలి అతనితో ఇలా అన్నాడు: ‘అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగు. ఈలోగా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను. ఒకవేళ దానికి పండ్లు వస్తే మంచిదే. లేకపోతే దాన్ని నరికేయి.’”—లూకా 13:6-9.

మూడు సంవత్సరాలకు పైగా యేసు యూదుల్లో విశ్వాసం పెంపొందింపజేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ కొద్దిమంది మాత్రమే శిష్యులయ్యారు. వాళ్లు ఆయన కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు. తన పరిచర్యలోని ఈ నాలుగో సంవత్సరంలో ఆయన తన ప్రయత్నాల్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు యూదయలో, పెరయలో ప్రకటిస్తూ బోధించడం ద్వారా ఆయన ఒకవిధంగా యూదా అనే అంజూర చెట్టు చుట్టూ తవ్వి, ఎరువు వేస్తున్నాడు. మరి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? కేవలం కొద్దిమంది యూదులే స్పందించారు. ఒక గుంపుగా, యూదా జనాంగం పశ్చాత్తాపం చూపించలేదు, దానివల్ల ఇప్పుడు అది నాశనం అంచుల్లో ఉంది.

చాలామంది యూదులు స్పందించట్లేదన్న విషయం కొన్ని రోజుల తర్వాత ఒక విశ్రాంతి రోజున మళ్లీ స్పష్టమైంది. యేసు సమాజమందిరంలో బోధిస్తున్నాడు. చెడ్డదూత పట్టడం వల్ల 18 సంవత్సరాలుగా సగానికి వంగిపోయిన ఒకామెను ఆయన చూశాడు. యేసు కనికరం చూపిస్తూ ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు.” (లూకా 13:12) యేసు ఆమె మీద చేతులు ఉంచాడు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టింది.

అది చూసిన సమాజమందిర అధికారి కోపంతో, “పనిచేయడానికి ఆరు రోజులు ఉన్నాయి; అప్పుడు వచ్చి బాగవ్వండి, విశ్రాంతి రోజున కాదు” అన్నాడు. (లూకా 13:14) అతను యేసుకు అద్భుతాలు చేసే శక్తి లేదని అనలేదు. బదులుగా, విశ్రాంతి రోజున బాగవ్వడం కోసం వస్తున్న ప్రజల్ని నిందించాడు! అప్పుడు యేసు ఇలా తర్కించాడు: “వేషధారులారా, మీలో ప్రతీ ఒక్కరు విశ్రాంతి రోజున మీ ఎద్దును లేదా గాడిదను విప్పి, నీళ్లు పెట్టడానికి తీసుకెళ్తారు కదా? అలాంటప్పుడు 18 సంవత్సరాలుగా సాతాను చేత బంధించబడిన అబ్రాహాము కూతురైన ఈ స్త్రీని విశ్రాంతి రోజున విడుదల చేయకూడదా?”—లూకా 13:15, 16.

దాంతో వ్యతిరేకులు సిగ్గుపడ్డారు. కానీ ప్రజలు మాత్రం యేసు చేసిన గొప్ప పనులు చూసి ఎంతో సంతోషించారు. ఆయన అంతకుముందు గలిలయ సముద్రం దగ్గర, పడవలో ఉండి రాజ్యం గురించి చెప్పిన రెండు ఉదాహరణల్ని ఇక్కడ యూదయలో కూడా చెప్పాడు.—మత్తయి 13:31-33; లూకా 13:18-21.