కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

81వ అధ్యాయం

తండ్రితో ఐక్యంగా ఉన్నాడు, కానీ దేవుడు కాదు

తండ్రితో ఐక్యంగా ఉన్నాడు, కానీ దేవుడు కాదు

యోహాను 10:22-42

  • “నేను, తండ్రి ఒక్కటే”

  • దేవుణ్ణని చెప్పుకున్నాడనే ఆరోపణను తిప్పికొట్టాడు

సమర్పణ పండుగ (లేదా, హనుక్కా) కోసం యేసు యెరూషలేముకు వచ్చాడు. ఆలయాన్ని తిరిగి సమర్పించిన సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ఆ పండుగ జరుపుకునేవాళ్లు. వందకన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం సిరియావాళ్లు యెరూషలేమును స్వాధీనం చేసుకున్న తర్వాత సిరియా రాజు ఆంటియోకస్‌ IV ఎపిఫనెస్‌, ఆలయంలోని పెద్ద బలిపీఠం మీద అన్యమత బలిపీఠాన్ని కట్టించాడు. తర్వాత ఒక యూదా యాజకుని కుమారులు యెరూషలేమును తిరిగి స్వాధీనం చేసుకుని, ఆలయాన్ని మళ్లీ యెహోవాకు సమర్పించారు. అప్పటినుండి ప్రతీ సంవత్సరం కిస్లేవు నెల 25వ తేదీన ఈ పండుగ జరుపుకునేవాళ్లు. ఆ నెల మన క్యాలెండరు ప్రకారం నవంబరు, డిసెంబరు మధ్యలో వస్తుంది.

అది చలికాలం. యేసు ఆలయంలోని సొలొమోను మంటపంలో నడుస్తున్నాడు. యూదులు యేసును చుట్టుముట్టి, “నువ్వు ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహాల మధ్య ఉంచుతావు? నువ్వే క్రీస్తువైతే, ఆ మాట మాతో స్పష్టంగా చెప్పు” అని గట్టిగా అడిగారు. (యోహాను 10:22-24) యేసు వాళ్లతో, “నేను మీకు చెప్పాను, కానీ మీరు నమ్మట్లేదు” అన్నాడు. బావి దగ్గర సమరయ స్త్రీతో చెప్పినట్లు, తానే క్రీస్తునని యేసు వాళ్లకు సూటిగా చెప్పలేదు. (యోహాను 4:25, 26) అయితే, “అబ్రాహాము పుట్టకముందే నేను ఉన్నాను” అని చెప్పడం ద్వారా తానెవరో యేసు తెలియజేశాడు.—యోహాను 8:58.

క్రీస్తు ఏమేం పనులు చేస్తాడో లేఖనాలు ముందే చెప్పాయి. ప్రజలు వాటినీ, తాను చేస్తున్న పనుల్నీ పోల్చుకుని వాళ్లంతట వాళ్లే తనను క్రీస్తుగా గుర్తించాలని యేసు కోరుకున్నాడు. అందుకే, తానే మెస్సీయ అనే విషయం ఎవరికీ చెప్పొద్దని ఆయన తన శిష్యులతో అంటుండేవాడు. కానీ, తనను వ్యతిరేకిస్తున్న యూదులతో యేసు ఇప్పుడు సూటిగా ఇలా అన్నాడు: “నా తండ్రి పేరున నేను చేసే పనులే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీరు . . . నమ్మట్లేదు.”—యోహాను 10:25, 26.

యేసే క్రీస్తని వాళ్లు ఎందుకు నమ్మట్లేదు? యేసు ఇలా చెప్పాడు: “మీరు నా గొర్రెలు కాదు కాబట్టి నమ్మట్లేదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నాకు తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి. వాటికి నేను శాశ్వత జీవితం ఇస్తాను, అవి ఏ విధంగానూ ఎప్పటికీ నాశనం కావు. ఎవ్వరూ నా చేతిలో నుండి వాటిని లాక్కోరు. నా తండ్రి నాకు ఇచ్చిన ఆ గొర్రెలు మిగతా అన్నిటికంటే గొప్పవి.” తర్వాత, తండ్రితో తనకు ఎంత దగ్గరి సంబంధం ఉందో చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నేను, తండ్రి ఒక్కటే.” (యోహాను 10:26-30) యేసు భూమ్మీద ఉన్నాడు, తండ్రి పరలోకంలో ఉన్నాడు. కాబట్టి తాను, తన తండ్రి ఇద్దరూ అక్షరార్థంగా ఒకటని యేసు చెప్పట్లేదు. బదులుగా వాళ్లిద్దరి ఉద్దేశాలు ఒకటేనని, ఆ విధంగా వాళ్లు ఐక్యంగా ఉన్నారని చెప్తున్నాడు.

యేసు మాటలు యూదులకు చాలా కోపం తెప్పించాయి. దాంతో వాళ్లు యేసును చంపడానికి మళ్లీ రాళ్లు తీసుకున్నారు. అయితే ఆయన భయపడకుండా, “తండ్రి నాకు చెప్పిన ఎన్నో మంచిపనుల్ని నేను మీకు చూపించాను. వాటిలో ఏ పనిని బట్టి మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “మంచిపనుల్ని బట్టి కాదుగానీ, నువ్వు దేవుణ్ణి దూషించినందుకే నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం; నువ్వు . . . దేవుణ్ణని చెప్పుకుంటున్నావు” అన్నారు. (యోహాను 10:31-33) తాను దేవుణ్ణని యేసు ఎప్పుడూ చెప్పలేదు. అయినా వాళ్లు ఎందుకలా ఆరోపణ చేస్తున్నారు?

కేవలం దేవుడు మాత్రమే చేయగలడని వాళ్లు నమ్మే కొన్ని పనుల్ని, యేసు చేస్తానని చెప్తున్నాడు. ఉదాహరణకు, ‘గొర్రెలకు శాశ్వత జీవితం ఇస్తానని’ ఆయన అన్నాడు. నిజానికి ఏ మనిషీ అలా ఇవ్వలేడు. (యోహాను 10:28) ఆ అధికారాన్ని తన తండ్రి నుండి పొందానని యేసు అందరిముందు చెప్పినా, యూదులు దాన్ని పట్టించుకోలేదు.

వాళ్ల తప్పుడు ఆరోపణను తిప్పికొడుతూ యేసు ఇలా అన్నాడు: “మీ ధర్మశాస్త్రంలో [కీర్తన 82:6 లో], ‘“మీరు దేవుళ్లు” అని దేవుడు అన్నాడు’ అని రాయబడి ఉంది కదా? దేవుని వాక్యం ఖండించేవాళ్లనే ఆయన ‘దేవుళ్లు’ అని పిలిచినప్పుడు . . . తండ్రి పవిత్రపర్చి ఈ లోకంలోకి పంపించిన నేను, దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నందుకు ‘నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు’ అని అంటారా?”—యోహాను 10:34-36.

అవును, అన్యాయంగా నడుచుకున్న మానవ న్యాయమూర్తుల్ని కూడా లేఖనాలు “దేవుళ్లు” అని పిలిచాయి. అలాంటప్పుడు యేసు తాను “దేవుని కుమారుణ్ణని” చెప్పుకున్నందుకు ఈ యూదులు ఎలా తప్పుపడతారు? తర్వాత ఆయన ఈ మాట అన్నాడు: “నేను నా తండ్రి పనుల్ని చేయకపోతుంటే నన్ను నమ్మకండి. కానీ నేను వాటిని చేస్తుంటే, నన్ను నమ్మకపోయినా ఆ పనుల్ని నమ్మండి. అప్పుడు మీరు, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని, నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని గ్రహిస్తారు, స్పష్టంగా అర్థం చేసుకుంటారు.”—యోహాను 10:37, 38.

యూదులు ఆ మాటలకు ఒప్పుకోకపోగా, యేసును పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన మళ్లీ తప్పించుకున్నాడు. ఆయన యెరూషలేము నుండి యొర్దాను నది అవతలి ప్రాంతానికి వెళ్లాడు. దాదాపు నాలుగేళ్ల క్రితం యోహాను ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టింది అక్కడే. ఆ ప్రాంతం బహుశా గలిలయ సముద్రం దక్షిణ అంచుకు దగ్గర్లో ఉంది.

అక్కడ చాలామంది ప్రజలు యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు, అయితే యోహాను ఈయన గురించి చెప్పినవన్నీ నిజం.” (యోహాను 10:41) అలా, చాలామంది యూదులు యేసు మీద విశ్వాసం ఉంచారు.