కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

90వ అధ్యాయం

“చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే”

“చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే”

యోహాను 11:17-37

  • లాజరు చనిపోయాక యేసు వచ్చాడు

  • “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే”

యేసు పెరయ నుండి బయల్దేరి బేతనియ పొలిమేర్లకు చేరుకున్నాడు. ఆ ఊరు యెరూషలేముకు తూర్పున దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. లాజరు చనిపోయినందుకు అతని సహోదరీలైన మార్త, మరియ దుఃఖంలో ఉన్నారు. వాళ్లను ఓదార్చడానికి చాలామంది వచ్చారు.

యేసు ఊర్లోకి వచ్చాడని తెలియగానే, మార్త పరుగుపరుగున ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లింది. బహుశా తాను, తన సహోదరి నాలుగు రోజులుగా ఆలోచిస్తున్న విషయం గురించి చెప్తూ, మార్త యేసుతో ఇలా అంది: “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.” అంతమాత్రాన ఆమె ఆశలు వదులుకుందని అనలేం. ఎందుకంటే ఆమె ఇలా చెప్పింది: “ఇప్పటికీ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది.” (యోహాను 11:21, 22) యేసు ఇప్పటికీ తన సహోదరునికి సహాయం చేయగలడని ఆమె నమ్మింది.

యేసు ఇలా చెప్పాడు: “నీ సహోదరుడు లేస్తాడు.” అబ్రాహాముకు, మరితరులకు భూమ్మీద పునరుత్థానం చేయబడే నిరీక్షణ ఉంది. భవిష్యత్తులో జరిగే ఆ పునరుత్థానం గురించి యేసు మాట్లాడుతున్నాడని మార్త అనుకుంది. అది తప్పకుండా జరుగుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తూ ఆమె ఇలా అంది: “చివరి రోజున, చనిపోయినవాళ్లు బ్రతికించబడినప్పుడు అతను లేస్తాడని నాకు తెలుసు.”—యోహాను 11:23, 24.

అయితే, యేసు ఇప్పటికిప్పుడు ఏదైనా సహాయం చేయగలడా? మరణం మీద తనకు అధికారం ఇవ్వబడిందని గుర్తుచేస్తూ యేసు మార్తతో ఇలా అన్నాడు: “నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు; అంతేకాదు, ఇప్పుడు జీవిస్తూ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు.”—యోహాను 11:25, 26.

ఆ సమయంలో జీవిస్తున్న తన శిష్యులు ఇక ఎప్పటికీ చనిపోరని యేసు చెప్పట్లేదు. అంతెందుకు, తాను కూడా చనిపోవాల్సిందేనని యేసు ఒక సందర్భంలో అపొస్తలులతో అన్నాడు. (మత్తయి 16:21; 17:22, 23) తనమీద విశ్వాసం చూపిస్తే శాశ్వత జీవితం పొందవచ్చని ఆయన నొక్కి చెప్తున్నాడు. చాలామంది, పునరుత్థానం అయ్యాక దాన్ని పొందుతారు. అయితే, ఈ వ్యవస్థ ముగింపులో జీవించివుండేవాళ్లు ఎన్నటికీ మరణాన్ని రుచిచూడకపోవచ్చు. కాబట్టి యేసు మీద విశ్వాసం చూపించే ప్రతీఒక్కరు, అంటే పునరుత్థానమయ్యే వాళ్లు, హార్‌​​మెగిద్దోనును తప్పించుకునే వాళ్లు శాశ్వత జీవితాన్ని పొందవచ్చు.

అయితే “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే” అని చెప్పిన యేసు, నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజరుకు సహాయం చేయగలడా? యేసు మార్తను, “నువ్వు దీన్ని నమ్ముతున్నావా?” అని అడిగాడు. అప్పుడు ఆమె, “అవును ప్రభువా, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువు అని, లోకంలోకి రావాల్సిన వ్యక్తివి అని నేను నమ్ముతున్నాను” అంది. యేసు ఇప్పటికిప్పుడు ఏదోకటి చేయగలడనే నమ్మకంతో, మార్త హడావిడిగా ఇంటికెళ్లి తన సహోదరిని పక్కకు పిలిచి ఇలా చెప్పింది: “బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు.” (యోహాను 11:25-28) మరియ వెంటనే లేచి బయల్దేరింది. ఆమె లాజరు సమాధి దగ్గరికి వెళ్తుందనుకుని, మిగతావాళ్లు కూడా ఆమె వెనకాలే వెళ్లారు.

కానీ మరియ యేసు దగ్గరికి వెళ్లి, ఆయన పాదాల మీద పడి ఏడ్చింది. తన సహోదరిలాగే మరియ కూడా “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. ఏడుస్తున్న మరియను, మిగతావాళ్లను చూసి యేసు లోలోపల మూలిగాడు, చాలా బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. లాజరు అంటే యేసుకు ఎంత ప్రేమో అక్కడున్నవాళ్లకు అర్థమైంది. కానీ కొంతమంది ఇలా అన్నారు: “గుడ్డివాడికి చూపు తెప్పించిన ఈయన అతన్ని చనిపోకుండా ఆపలేకపోయేవాడా?”—యోహాను 11:32, 37.