కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

91వ అధ్యాయం

లాజరు తిరిగి బ్రతికాడు

లాజరు తిరిగి బ్రతికాడు

యోహాను 11:38-54

  • లాజరు పునరుత్థానం

  • యేసును చంపడానికి మహాసభ కుట్రపన్నడం

యేసు బేతనియ దగ్గర మార్త మరియల్ని కలిసిన తర్వాత, వాళ్లందరూ లాజరు సమాధి దగ్గరికి వెళ్లారు. అది ఒక గుహ, దాని ద్వారానికి అడ్డంగా ఒక రాయి పెట్టివుంది. యేసు, “ఆ రాయిని తీసేయండి” అని చెప్పాడు. ఆయన ఏం చేయబోతున్నాడో తెలీక, మార్త దానికి అభ్యంతరం చెప్పింది. ఆమె ఇలా అంది: “ప్రభువా, అతను చనిపోయి నాలుగు రోజులైంది, ఇప్పటికి శరీరం వాసన వస్తుంటుంది.” కానీ యేసు ఇలా అన్నాడు: “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా?”—యోహాను 11:39, 40.

దాంతో ఆ రాయిని తీసేశారు. తర్వాత యేసు ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు నా ప్రార్థనను ఎప్పుడూ వింటావని నాకు తెలుసు; అయితే నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మేలా వాళ్ల గురించే నేను ఈ మాట అన్నాను.” తాను దేవుని శక్తితోనే ఒక అద్భుతం చేయబోతున్నానని అక్కడున్నవాళ్లకు తెలియజేయడానికి ఆయన అందరి ముందు ప్రార్థించాడు. తర్వాత ఆయన బిగ్గరగా “లాజరూ, బయటికి రా!” అన్నాడు. అప్పుడు లాజరు బయటికి వచ్చాడు. అతని చేతులకు, కాళ్లకు వస్త్రాలు చుట్టి ఉన్నాయి. అతని ముఖానికి గుడ్డ చుట్టివుంది. యేసు ఇలా అన్నాడు: “అతని కట్లు విప్పి, అతన్ని వెళ్లనివ్వండి.”—యోహాను 11:41-44.

మార్త, మరియల్ని ఓదార్చడానికి వచ్చిన చాలామంది యూదులు ఆ అద్భుతాన్ని చూశారు, యేసు మీద విశ్వాసం ఉంచారు. కానీ కొంతమంది మాత్రం పరిసయ్యుల దగ్గరికి వెళ్లి, యేసు ఏం చేశాడో చెప్పారు. అప్పుడు పరిసయ్యులు, ముఖ్య యాజకులు మహాసభను సమావేశపర్చారు. అది యూదుల ఉన్నత న్యాయస్థానం. ప్రధానయాజకుడైన కయప కూడా అందులో ఒక సభ్యుడు. మహాసభ సభ్యుల్లో కొంతమంది ఇలా అన్నారు: “మనం ఏంచేద్దాం? ఈ మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఆయనమీద విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశాన్ని లాక్కుంటారు.” (యోహాను 11:47, 48) యేసు ‘ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని’ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయినా ఆ మహాసభ సభ్యులు, దేవుడు యేసును ఉపయోగించుకుని చేస్తున్న పనుల విషయంలో సంతోషించే బదులు తమ పదవి, హోదా గురించే ఎక్కువగా ఆలోచించారు.

లాజరు తిరిగి బ్రతికాడనే విషయం, పునరుత్థానాన్ని నమ్మని సద్దూకయ్యులకు మింగుడుపడలేదు. ఇప్పుడు సద్దూకయ్యుడైన కయప మాట్లాడుతూ ఇలా అన్నాడు: “మీకు అసలేమీ తెలీదు, దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించట్లేదా?”—యోహాను 11:49, 50; అపొస్తలుల కార్యాలు 5:17; 23:8.

కయప “తనంతట తాను” ఆ మాట చెప్పలేదు గానీ, అతను ప్రధానయాజకుడు కాబట్టి దేవుడే అతనిచేత అలా చెప్పించాడు. యూదా మతనాయకుల అధికారానికి, పలుకుబడికి అడ్డుగా మారుతున్న యేసును చంపించాలనేది కయప ఉద్దేశం. అయితే, కయప చెప్పిన ప్రవచనంలో యేసు మరణం గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, యేసు యూదుల కోసం మాత్రమే కాదుగానీ, “చెదిరివున్న” దేవుని పిల్లలందరి కోసం విమోచన క్రయధనంగా చనిపోతాడు.—యోహాను 11:51, 52.

మహాసభ మొత్తం యేసును చంపడానికి కుట్రపన్నేలా కయప మాటలు ఉసిగొల్పాయి. మహాసభ సభ్యుడూ యేసుకు సన్నిహితుడూ అయిన నీకొదేము, యేసుకు ఈ కుట్ర గురించి చెప్పివుంటాడా? ఏదేమైనా తాను చనిపోవాల్సిన సమయం ఇంకా రాలేదు కాబట్టి, యేసు యెరూషలేము పరిసర ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయాడు.