కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

99వ అధ్యాయం

గుడ్డివాళ్లను బాగుచేశాడు, జక్కయ్యకు సహాయం చేశాడు

గుడ్డివాళ్లను బాగుచేశాడు, జక్కయ్యకు సహాయం చేశాడు

మత్తయి 20:29-34 మార్కు 10:46-52 లూకా 18:35–19:10

  • యెరికో దగ్గర యేసు గుడ్డివాళ్లను బాగుచేశాడు

  • పన్ను వసూలుచేసే జక్కయ్య పశ్చాత్తాపం చూపించాడు

యేసు, ఆయనతోపాటు ప్రయాణిస్తున్నవాళ్లు యెరికోకు చేరుకున్నారు. అక్కడి నుండి యెరూషలేముకు వెళ్లడానికి దాదాపు ఒకరోజు పడుతుంది. యెరికోలో రెండు నగరాలు ఉన్నాయి. పాత నగరానికీ, రోమీయుల కాలంలో నిర్మించిన కొత్త నగరానికీ మధ్య దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం ఉంది. యేసు, ఆయనతో ఉన్న ప్రజలు ఆ రెండు నగరాల్లో ఒకదాని నుండి ఇంకోదానికి వెళ్తున్నప్పుడు, కళ్లులేని ఇద్దరు భిక్షగాళ్లు ఆ శబ్దం విన్నారు. వాళ్లలో ఒకతని పేరు బర్తిమయి.

యేసు అటుగా వెళ్తున్నాడని విని బర్తిమయి, అతనితోపాటు ఉన్న మరో గుడ్డివాడు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని కేకలు వేశారు. (మత్తయి 20:30) వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని కొంతమంది గద్దించారు, కానీ వాళ్లిద్దరూ ఇంకా గట్టిగా అరిచారు. ఆ కేకలు విన్న యేసు ఆగి, అరుస్తున్నవాళ్లను తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. వాళ్లు ఆ భిక్షగాళ్లలో ఒకతనితో ఇలా అన్నారు: “ధైర్యం తెచ్చుకో! లే; ఆయన నిన్ను పిలుస్తున్నాడు.” (మార్కు 10:49) అప్పుడు ఆ గుడ్డివాడు సంతోషంతో తన పైవస్త్రాన్ని తీసిపారేసి, టక్కున లేచి యేసు దగ్గరికి వెళ్లాడు.

“మీ కోసం నన్ను ఏం చేయమంటారు?” అని యేసు ఆ ఇద్దరు గుడ్డివాళ్లను అడిగాడు. వాళ్లు, “ప్రభువా, మాకు చూపు తెప్పించు” అని వేడుకున్నారు. (మత్తయి 20:32, 33) యేసు జాలిపడి వాళ్ల కళ్లను ముట్టుకున్నాడు. తర్వాత వాళ్లలో ఒకతనితో, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు. (మార్కు 10:52) ఆ ఇద్దరు గుడ్డివాళ్లకు చూపు వచ్చింది. దాంతో వాళ్లు దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు. జరిగింది చూసి అక్కడున్న ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతించారు. చూపు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు యేసును అనుసరించడం మొదలుపెట్టారు.

యెరికో గుండా వెళ్తున్నప్పుడు యేసు చుట్టూ ప్రజలు గుంపులుగుంపులుగా ఉన్నారు. అందరూ ఆ గుడ్డివాళ్లను బాగుచేసిన వ్యక్తి ఎవరో చూడాలనుకుంటున్నారు. వాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ యేసు మీద పడుతున్నారు. కొంతమందికి కనీసం ఆయన్ని చూసే అవకాశం కూడా దొరకట్లేదు. అలాంటివాళ్లలో జక్కయ్య ఒకడు. అతను యెరికోలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్ను వసూలుచేసే వాళ్ల మీద అధికారి. పొట్టిగా ఉండడం వల్ల అక్కడ జరుగుతున్నది అతనికి కనిపించట్లేదు. కాబట్టి అతను పరుగెత్తుకుంటూ వెళ్లి, యేసు వస్తున్న దారిలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడు. అక్కడినుండి అతనికి అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. యేసు అక్కడికి వచ్చి చెట్టు మీదున్న జక్కయ్యను చూసి, “జక్కయ్యా, త్వరగా కిందికి దిగు. ఇవాళ నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు. (లూకా 19:5) అతను వెంటనే కిందికి దిగి, ఈ ప్రత్యేకమైన అతిథిని ఆహ్వానించడానికి హడావిడిగా తన ఇంటికి వెళ్లాడు.

ప్రజలు అది చూసి గొణుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ల దృష్టిలో జక్కయ్య ఒక పాపి. అలాంటి వ్యక్తి ఇంటికి యేసు అతిథిగా వెళ్లడమేంటి అని వాళ్లు అనుకున్నారు. ఎందుకంటే, అతను పన్ను వసూలు చేసేటప్పుడు ప్రజల దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బు తీసుకుని ధనవంతుడయ్యాడు.

యేసు జక్కయ్య ఇంట్లోకి వెళ్లినప్పుడు, “ఈయన ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్లాడేంటి?” అని ప్రజలు గొణుక్కున్నారు. కానీ, జక్కయ్య పశ్చాత్తాపం చూపిస్తాడని యేసు నమ్మాడు. ఆయన నమ్మకాన్ని జక్కయ్య వమ్ము చేయలేదు. అతను నిలబడి యేసుతో ఇలా అన్నాడు: “ప్రభువా, ఇదిగో! నాకున్న వాటిలో సగం పేదవాళ్లకు ఇస్తాను. అంతేకాదు, ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా లాక్కొని ఉంటే, దానికి నాలుగు రెట్లు తిరిగిస్తాను.”—లూకా 19:7, 8.

తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నానని జక్కయ్య ఎంత చక్కగా చూపించాడో కదా! బహుశా, తన దగ్గరున్న పత్రాల ఆధారంగా యూదుల నుండి ఎంత వసూలు చేశాడో అతను తెలుసుకోగలడు. కాబట్టి అంతకు నాలుగు రెట్లు తిరిగిస్తానని మాటిచ్చాడు. ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే అది చాలా ఎక్కువ. (నిర్గమకాండం 22:1; లేవీయకాండం 6:2-5) అంతేకాదు, తన ఆస్తిలో సగం పేదవాళ్లకు ఇస్తానని కూడా జక్కయ్య మాటిచ్చాడు.

జక్కయ్య చూపించిన పశ్చాత్తాపానికి సంతోషించి, యేసు అతనితో ఇలా అన్నాడు: “ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఎందుకంటే ఇతను కూడా అబ్రాహాము కుమారుడే. తప్పిపోయిన దాన్ని వెతకడానికి, దాన్ని రక్షించడానికే మానవ కుమారుడు వచ్చాడు.”—లూకా 19:9, 10.

ఇంతకుముందు యేసు తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ చెప్తూ, యెహోవా నుండి దూరమైపోయిన వాళ్ల గురించి వివరించాడు. (లూకా 15:11-24) ఇప్పుడు తప్పిపోయి తిరిగొచ్చిన ఒక నిజమైన వ్యక్తి ఉదాహరణను ఆయన చూపించాడు. యేసు జక్కయ్య లాంటివాళ్ల మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు మతనాయకులు, వాళ్ల అనుచరులు ఆయన మీద గొణుక్కొని, ఆయన్ని విమర్శించే అవకాశం ఉంది. అయినప్పటికీ, యేసు మాత్రం తప్పిపోయిన అబ్రాహాము పిల్లల్ని వెతికి రక్షిస్తూనే ఉంటాడు.