కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

100వ అధ్యాయం

పది మినాల ఉదాహరణ

పది మినాల ఉదాహరణ

లూకా 19:11-28

  • యేసు చెప్పిన పది మినాల ఉదాహరణ

యేసు యెరూషలేముకు వెళ్లాలి. కానీ ఆయన ఇంకా తన శిష్యులతోపాటు జక్కయ్య ఇంట్లోనే ఉండివుంటాడు. యేసు రాజుగా పరిపాలించే “దేవుని రాజ్యం” త్వరలోనే స్థాపించబడుతుందని శిష్యులు అనుకుంటున్నారు. (లూకా 19:11) వాళ్లు యేసు చనిపోబోతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోనట్లే, ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. దేవుని రాజ్యం రావడానికి ఇంకా చాలా సమయం ఉందని వాళ్లకు తెలియజేయడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు.

ఆయన ఇలా అన్నాడు: “గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూర దేశానికి ప్రయాణమయ్యాడు.” (లూకా 19:12) ఆ ప్రయాణానికి చాలా సమయం పడుతుంది. “గొప్ప ఇంట్లో పుట్టిన” ఆ వ్యక్తి యేసు, ఆయన వెళ్తున్న ‘దూర దేశం’ పరలోకం. అక్కడ తండ్రి ఆయనకు రాజ్యాధికారం ఇస్తాడు.

ఈ ఉదాహరణలో “గొప్ప ఇంట్లో పుట్టిన” వ్యక్తి ప్రయాణమయ్యే ముందు, పదిమంది దాసులకు ఒక్కో వెండి మినా ఇచ్చి, “నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయండి” అన్నాడు. (లూకా 19:13) వెండి మినాలు ఎంత విలువైనవంటే, పొలంలో పనిచేసే వ్యక్తి దాదాపు మూడు నెలలు కష్టపడితే ఒక్క మినా వచ్చేది.

ఉదాహరణలోని పదిమంది దాసులు తామేనని శిష్యులకు అర్థమైవుంటుంది, ఎందుకంటే అంతకుముందు యేసు వాళ్లను కోత పనివాళ్లతో పోల్చాడు. (మత్తయి 9:35-38) అయితే వాళ్లు సమకూర్చాల్సింది పంటను కాదుగానీ, దేవుని రాజ్యంలో యేసుతోపాటు పరిపాలించే మిగతా శిష్యుల్ని. అంతేకాదు, వాళ్లు ఇంకా ఎక్కువమందిని రాజ్య వారసులుగా చేయడానికి తమకున్న వాటిని ఉపయోగించాలి.

ఈ ఉదాహరణలో యేసు ఇంకా ఏ విషయాలు తెలియజేశాడు? ఆయన ఇలా చెప్పాడు: “పౌరులకు అతనంటే [గొప్ప ఇంట్లో పుట్టిన వ్యక్తి అంటే] ఇష్టం లేదు. కాబట్టి వాళ్లు అతని వెనక కొంతమంది రాయబారుల్ని పంపించి, ‘ఇతను మాకు రాజవ్వడం మాకు ఇష్టంలేదు’ అని వాళ్లతో చెప్పించారు.” (లూకా 19:14) యూదులకు యేసు అంటే ఇష్టం లేదని, కొంతమంది ఆయన్ని చంపాలనుకుంటున్నారని శిష్యులకు తెలుసు. ఆయన చనిపోయి పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత, యూదులు శిష్యుల్ని హింసిస్తారు. యేసు రాజవ్వడం తమకు ఇష్టంలేదని వాళ్లు ఆ విధంగా చూపిస్తారు.—యోహాను 19:15, 16; అపొస్తలుల కార్యాలు 4:13-18; 5:40.

“గొప్ప ఇంట్లో పుట్టిన” వ్యక్తి “రాజ్యాధికారం” పొంది తిరిగొచ్చే వరకు, ఆ పదిమంది దాసులు వాళ్లకిచ్చిన మినాల్ని ఎలా ఉపయోగిస్తారు? యేసు ఇలా చెప్పాడు: “కొంతకాలం తర్వాత అతను రాజ్యాధికారం సంపాదించుకొని తిరిగొచ్చాడు. అప్పుడు అతను తాను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో ఆ దాసుల్ని పిలిపించి, వాళ్లు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి మొదటి దాసుడు ముందుకొచ్చి, ‘ప్రభూ, నువ్విచ్చిన మినాతో నేను పది మినాలు సంపాదించాను’ అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని అతనితో, ‘శభాష్‌, మంచి దాసుడా! నువ్వు చాలా చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది నగరాల మీద నీకు అధికారం ఇస్తున్నాను’ అన్నాడు. అప్పుడు రెండో దాసుడు వచ్చి, ‘ప్రభూ, నీ మినాతో నేను ఐదు మినాలు సంపాదించాను’ అన్నాడు. యజమాని అతనితో, ‘నీకు కూడా ఐదు నగరాల మీద అధికారం ఇస్తున్నాను’ అని చెప్పాడు.”—లూకా 19:15-19.

ఆ దాసుల్లాగే శిష్యులు కూడా, ఇంకా ఎక్కువమందిని శిష్యులుగా చేసే పనిలో తమకున్న వాటన్నిటినీ ఉపయోగించాలి. అలాచేస్తే, ఆ యజమానిలాగే యేసు కూడా సంతోషిస్తాడని, తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడని నమ్మకంతో ఉండవచ్చు. నిజమే, శిష్యులందరికీ ఒకేలాంటి పరిస్థితులు, అవకాశాలు, సామర్థ్యాలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ, శిష్యుల్ని చేయడంలో వాళ్లు విశ్వసనీయంగా చేసే ప్రయత్నాల్ని, “రాజ్యాధికారం” పొందే యేసు గుర్తిస్తాడు, వాళ్లను ఆశీర్వదిస్తాడు.—మత్తయి 28:19, 20.

ఆ ఉదాహరణ చివర్లో యేసు ఏం చెప్పాడో గమనించండి. “అయితే ఇంకో దాసుడు వచ్చి ఇలా అన్నాడు: ‘ప్రభూ, ఇదిగో నీ మినా. దీన్ని నేను ఒక వస్త్రంలో చుట్టి దాచిపెట్టాను. నువ్వంటే నాకు భయం. ఎందుకంటే నువ్వు కఠినుడివి. నువ్వు జమ చేయనిదాన్ని తీసుకుంటావు, విత్తనిదాన్ని కోస్తావు.’ అప్పుడు యజమాని అతనితో ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నీ మాటల్ని బట్టే నేను నీకు తీర్పుతీరుస్తాను. నేను కఠినుడినని, జమ చేయనిదాన్ని తీసుకుంటానని, విత్తనిదాన్ని కోస్తానని నీకు తెలుసు కదా? అలాంటప్పుడు నువ్వు నా డబ్బును షావుకారు దగ్గర ఎందుకు జమ చేయలేదు? అలా చేసివుంటే, నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని కదా?’ తర్వాత ఆ యజమాని, దగ్గర్లో నిలబడివున్న వాళ్లతో ఇలా అన్నాడు: ‘ఇతని దగ్గర నుండి ఆ మినా తీసుకొని పది మినాలు ఉన్న అతనికి ఇవ్వండి.’”—లూకా 19:20-24.

తన యజమాని ఆస్తిని వృద్ధి చేయడంలో విఫలమైనందుకు, ఆ దాసుడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలించే సమయం కోసం అపొస్తలులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి, యేసు ఈ చివరి దాసుని గురించి చెప్పినదాన్ని బట్టి, కష్టపడి పనిచేయకపోతే ఆ రాజ్యంలో తమకు చోటు ఉండదని శిష్యులకు అర్థమైవుంటుంది.

కష్టపడి పనిచేసేలా యేసు మాటలు నమ్మకమైన శిష్యుల్ని ప్రోత్సహించాలి. చివరిగా యేసు ఇలా చెప్పాడు: “ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది; కానీ ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది.” అంతేకాదు, తాను “రాజుగా ఉండడం ఇష్టంలేని” శత్రువులు చంపేయబడతారని కూడా ఆయన అన్నాడు. తర్వాత ఆయన యెరూషలేముకు ప్రయాణం కొనసాగించాడు.—లూకా 19:26-28.