కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

102వ అధ్యాయం

రాజు గాడిదపిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించాడు

రాజు గాడిదపిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించాడు

మత్తయి 21:1-11, 14-17 మార్కు 11:1-11 లూకా 19:29-44 యోహాను 12:12-19

  • యేసు విజయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించాడు

  • యెరూషలేము నాశనం గురించి ముందే చెప్పాడు

తర్వాతి రోజు, నీసాను 9 ఆదివారం. యేసు తన శిష్యులతో కలిసి బేతనియ నుండి యెరూషలేముకు బయల్దేరాడు. వాళ్లు ఒలీవల కొండ మీదున్న బేత్పగే దగ్గరికి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరితో ఇలా చెప్పాడు:

“కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే కట్టేసివున్న ఒక గాడిద, దానితోపాటు దాని పిల్ల మీకు కనిపిస్తాయి. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇవి ప్రభువుకు కావాలి’ అని మీరు చెప్పాలి, అప్పుడు అతను వెంటనే వాటిని పంపించేస్తాడు.”—మత్తయి 21: 2, 3.

యేసు మాటల వెనకున్న బైబిలు ప్రవచనాన్ని శిష్యులు గుర్తించలేకపోయారు. అయితే, అది జెకర్యా ప్రవచన నెరవేర్పని తర్వాత గ్రహించారు. దేవుడు వాగ్దానం చేసిన రాజు వినయస్థుడని, ‘ఆయన గాడిద మీద, అవును, గాడిదపిల్ల మీద’ యెరూషలేములోకి వస్తాడని జెకర్యా ప్రవచించాడు.—జెకర్యా 9:9.

ఆయన శిష్యులు బేత్పగేకు వచ్చి గాడిదను, దాని పిల్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ నిలబడి ఉన్నవాళ్లు, “మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. (మార్కు 11:5) ప్రభువు కోసం అని చెప్పినప్పుడు, వాటిని తీసుకెళ్లనిచ్చారు. యేసు శిష్యులు తమ పైవస్త్రాలను గాడిద మీద, దాని పిల్ల మీద వేశారు. అయితే యేసు గాడిదపిల్ల మీద కూర్చున్నాడు.

యేసు గాడిదపిల్ల మీద యెరూషలేముకు వస్తుండగా ప్రజలు పెద్దయెత్తున అక్కడికి వచ్చారు. చాలామంది తమ వస్త్రాలను దారిలో పరిచారు. కొంతమంది చెట్ల కొమ్మలు లేదా “పొలంలో నరికిన చెట్ల మట్టలు” తెచ్చి అక్కడ పరిచారు. తర్వాత వాళ్లు, “దేవా, ఈయన్ని కాపాడు! యెహోవా పేరున వస్తున్న ఈయన దీవించబడాలి! రాబోయే మన తండ్రైన దావీదు రాజ్యం దీవించబడాలి!” అని కేకలు వేశారు. (మార్కు 11:8-10) ఆ మాటలు వినగానే పరిసయ్యులకు కోపం వచ్చింది. వాళ్లు యేసుతో, “బోధకుడా, నీ శిష్యుల్ని గద్దించు” అన్నారు. అందుకు యేసు వాళ్లతో, “నేను మీతో చెప్తున్నాను, వీళ్లు నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు.—లూకా 19:39, 40.

యేసు యెరూషలేమును చూసి ఏడుస్తూ ఇలా అన్నాడు: “నువ్వే గనుక నీకు శాంతిని తెచ్చే విషయాల్ని అర్థం చేసుకొని ఉంటే ఎంత బావుండేది! కానీ ఇప్పుడవి నీ కళ్లకు కనబడకుండా దాచబడ్డాయి.” యెరూషలేము ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపించినందుకు చెడు పర్యవసానాలు అనుభవించాల్సిందే. అందుకే యేసు ఇలా చెప్పాడు: “నీ శత్రువులు పదునైన కర్రలతో నీ చుట్టూ ముట్టడిగోడ కట్టి, అన్నివైపుల నిన్ను చుట్టుముట్టి, నిన్ను ఆక్రమించుకునే రోజులు రాబోతున్నాయి. వాళ్లు నిన్నూ నీ పిల్లల్నీ నేలకేసి కొడతారు; నీలో రాయి మీద రాయి అనేదే లేకుండా చేస్తారు.” (లూకా 19:42-44) సా.శ. 70 లో యెరూషలేము నాశనమైనప్పుడు ఆ మాటలు నిజమయ్యాయి.

యేసు యెరూషలేముకు వచ్చినప్పుడు, నగరమంతా అల్లరల్లరిగా ఉంది. “ఈయన ఎవరు?” అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. “ఈయన ప్రవక్త అయిన యేసు, గలిలయలోని నజరేతుకు చెందినవాడు!” అని వాళ్లు అంటూ ఉన్నారు. (మత్తయి 21:10, 11) యేసు లాజరును పునరుత్థానం చేయడం చూసినవాళ్లు కూడా ఆ గుంపులో ఉన్నారు. వాళ్లు ఆ అద్భుతం గురించి పక్కనున్న వాళ్లకు చెప్తున్నారు. అప్పుడు పరిసయ్యులు తాము ఏమీ చేయలేకపోతున్నామని మదనపడుతూ ఇలా మాట్లాడుకున్నారు: “ఇదిగో! లోకమంతా ఆయన వెంట వెళ్లింది.”—యోహాను 12:18, 19.

యేసు యెరూషలేముకు రాగానే, అలవాటు ప్రకారం ఆలయంలోకి వెళ్లి బోధించాడు. అక్కడ గుడ్డివాళ్లను, కుంటివాళ్లను బాగుచేశాడు. ముఖ్య యాజకులు, శాస్త్రులు ఆ అద్భుతాల్ని చూశారు. “దేవా, దావీదు కుమారుణ్ణి కాపాడు” అని ఆలయంలో పిల్లలు అరవడం కూడా వాళ్లు విన్నారు. దాంతో వాళ్లకు కోపమొచ్చి, “వీళ్లు ఏమంటున్నారో వింటున్నావా?” అని యేసును అడిగారు. అందుకు యేసు, “‘పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు’ అనే మాటల్ని మీరు ఎప్పుడూ చదవలేదా?” అన్నాడు.—మత్తయి 21:15, 16.

యేసు ఆలయంలో జరుగుతున్న వాటన్నిటిని చూశాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి, తన శిష్యులతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. నీసాను 10 మొదలవ్వకముందే ఆయన బేతనియకు తిరిగెళ్లి, రాత్రి అక్కడ ఉన్నాడు.