కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

111వ అధ్యాయం

అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు

అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు

మత్తయి 24:3-51 మార్కు 13:3-37 లూకా 21:7-38

  • నలుగురు శిష్యులు ఒక సూచన అడిగారు

  • ఆ సూచన మొదటి శతాబ్దంలో, అలాగే భవిష్యత్తులో నెరవేరుతుంది

  • అప్రమత్తంగా ఉండడం ప్రాముఖ్యం

అది నీసాను 11 మంగళవారం, సాయంత్రం కావస్తోంది. యేసు భూమ్మీద విస్తృతంగా చేసిన పరిచర్య కూడా పూర్తి కావస్తోంది. ఆయన పగలంతా ఆలయంలో బోధించి, రాత్రిపూట బేతనియలో ఉండేవాడు. ప్రజలు ఎంతో ఆసక్తితో “ఆయన మాటలు వినడానికి పొద్దుపొద్దున్నే ఆలయానికి వచ్చేవాళ్లు,” కానీ ఇక వాళ్లకు ఆ అవకాశం దొరకదు. (లూకా 21:37, 38) ఇప్పుడు యేసు తన నలుగురు అపొస్తలులతో అంటే పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో ఒలీవల కొండ మీద ఉన్నాడు.

ఆ నలుగురు ఆయనతో ఏకాంతంగా మాట్లాడడానికి వచ్చారు. యెరూషలేము ఆలయం రాయి మీద రాయి నిలవకుండా నాశనమౌతుందని యేసు కాసేపటి క్రితమే చెప్పినదాని గురించి వాళ్లు ఆలోచిస్తున్నారు. అంతేకాదు, వాళ్ల మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. అంతకుముందు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.” (లూకా 12:40) “మానవ కుమారుడు బయల్పర్చబడే రోజు” గురించి కూడా యేసు వాళ్లకు చెప్పాడు. (లూకా 17:30) ఆ విషయాలకు, ఆలయం గురించి చెప్పిన విషయానికి ఏదైనా సంబంధం ఉండివుంటుందా? అపొస్తలులు కుతూహలంతో యేసును ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి? మాతో చెప్పు.”—మత్తయి 24:3.

మొదటిగా, కొండ మీద నుండి స్పష్టంగా కనిపిస్తున్న యెరూషలేము ఆలయం గురించి ఆలోచిస్తూ వాళ్లు అలా అడిగివుంటారు. రెండవదిగా, మానవ కుమారుని ప్రత్యక్షత గురించి కూడా వాళ్లు అడిగారు. ఆ సమయంలో వాళ్లకు, “గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూర దేశానికి” ప్రయాణమవ్వడం గురించి యేసు చెప్పిన ఉదాహరణ గుర్తొచ్చివుంటుంది. (లూకా 19:11, 12) చివరిగా, ‘వ్యవస్థ ముగింపులో’ ఏం జరుగుతుందో కూడా వాళ్లు అడిగారు.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు యేసు వివరంగా జవాబిచ్చాడు. అప్పటి యూదా వ్యవస్థ, అలాగే దాని ఆలయం ఎప్పుడు నాశనమౌతాయో తెలియజేసే ఒక సూచనను యేసు వాళ్లకు చెప్పాడు. అయితే ఆ సూచన, భవిష్యత్తులో జీవించే క్రైస్తవులకు కూడా ఉపయోగపడుతుంది. ఆ సూచన సహాయంతో, తాము యేసు “ప్రత్యక్షత” కాలంలో అలాగే ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో జీవిస్తున్నామని వాళ్లు గ్రహించగలుగుతారు.

సంవత్సరాలు గడుస్తుండగా, యేసు చెప్పిన ప్రవచనం నెరవేరడాన్ని అపొస్తలులు కళ్లారా చూశారు. అవును, ఆ ప్రవచనంలోని చాలా అంశాలు, వాళ్లు జీవించిన కాలంలో నెరవేరడం మొదలయ్యాయి. అందుకే 37 ఏళ్ల తర్వాత, అంటే సా.శ. 70 లో జీవిస్తూ అప్రమత్తంగా ఉన్న క్రైస్తవులు యూదా వ్యవస్థ, దాని ఆలయం నాశనం కాబోతున్నాయని గుర్తించారు. అయితే, సా.శ. 70 కల్లా యేసు చెప్పిన ప్రవచనంలో కొన్ని అంశాలు మాత్రమే నెరవేరాయి. మరి ఆయన రాజ్యాధికారంతో ప్రత్యక్షమయ్యే సమయాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు? దాని గురించి యేసు తన అపొస్తలులకు వివరించాడు.

యేసు ఇలా చెప్పాడు: ‘మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.’ (మత్తయి 24:6, 7) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి.” (లూకా 21:11) ‘ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసిస్తారు’ అని కూడా ఆయన తన శిష్యుల్ని హెచ్చరించాడు. (లూకా 21:12) అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి చాలామందిని మోసం చేస్తారని, అవినీతి పెరిగిపోతుందని, చాలామందిలో ప్రేమ చల్లారిపోతుందని చెప్పాడు. వాటన్నిటితో పాటు, “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది” అని కూడా ఆయన చెప్పాడు.—మత్తయి 24:14.

యేసు చెప్పిన ప్రవచనంలోని కొన్ని అంశాలు, రోమా సైన్యం యెరూషలేమును నాశనం చేయడానికి ముందు, అలాగే నాశనం చేస్తున్న సమయంలో నెరవేరాయి. కానీ ఆ ప్రవచనంలోని చాలా అంశాలు భవిష్యత్తులో నెరవేరతాయి. యేసు చెప్పిన ప్రాముఖ్యమైన ప్రవచనంలోని ఆ అంశాలు మనకాలంలో నెరవేరడం మీరు చూస్తున్నారా?

యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలోని ఒక అంశం ఏంటంటే, “నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు పవిత్ర స్థలంలో ఉండడం.” (మత్తయి 24:15) సా.శ. 66 లో “అసహ్యమైన వస్తువు” అంటే రోమా సైన్యాలు తమ విగ్రహాలకు సంబంధించిన ధ్వజాలతో లేదా పతాకాలతో పవిత్ర స్థలంలో కనిపించారు. వాళ్లు యెరూషలేమును చుట్టుముట్టి, దాని గోడల్లో కొన్నిటిని కూలగొట్టారు. (లూకా 21:20) ఆ విధంగా, “అసహ్యమైన వస్తువు” ఎక్కడైతే ఉండకూడదో అక్కడ, అంటే యూదుల “పవిత్ర స్థలంలో” నిలబడింది.

యేసు ఇంకా ఇలా చెప్పాడు: “అప్పుడు మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా.” సా.శ. 70 లో రోమన్లు యూదుల ‘పవిత్ర నగరమైన’ యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేసినప్పుడు ఎన్నో వేలమంది యూదులు చనిపోయారు. అది నిజంగా ఒక మహాశ్రమే. (మత్తయి 4:5; 24:21) యెరూషలేము గానీ, యూదా ప్రజలు గానీ ఇంతకుముందెన్నడూ అలాంటి నాశనాన్ని అనుభవించలేదు. ఆ నాశనంతో, వందల సంవత్సరాలుగా యూదులు పాటిస్తున్న ఆరాధనా విధానం కూడా అంతమైంది. యేసు చెప్పిన ప్రవచనం భవిష్యత్తులో పూర్తిగా నెరవేరినప్పుడు వచ్చే మహాశ్రమ ఇంకెంత భయంకరంగా ఉంటుందో కదా!

వ్యవస్థ ముగింపులో ధైర్యంగా ఉండడం

తన ప్రత్యక్షతకు, వ్యవస్థ ముగింపుకు సంబంధించిన సూచనను యేసు ఇంకా వివరిస్తున్నాడు. “అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడినవాళ్లను కూడా మోసం చేయడానికి” ప్రయత్నిస్తారని, వాళ్ల వెంట పరుగెత్తవద్దని యేసు తన అపొస్తలుల్ని హెచ్చరించాడు. (మత్తయి 24:24) అయితే ఎంచుకోబడినవాళ్లు మోసపోరు. ఎందుకంటే, అబద్ధ క్రీస్తులు కంటికి కనిపిస్తారు కానీ యేసు ప్రత్యక్షత అదృశ్యంగా జరుగుతుంది.

ఈ వ్యవస్థ ముగింపులో వచ్చే మరింత గొప్ప శ్రమ గురించి యేసు ఇలా చెప్పాడు: “సూర్యుడు చీకటిమయమౌతాడు, చంద్రుడు తన వెలుగు ఇవ్వడు, నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.” (మత్తయి 24:29) వణుకు పుట్టించే ఆ మాటలు విన్నప్పుడు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం జరుగుతుందో అపొస్తలులకు అర్థం కాకపోయినా, అది భయంకరంగా ఉంటుందని మాత్రం అర్థమైంది.

ఆ భయంకరమైన సంఘటనలకు ప్రజలు ఎలా స్పందిస్తారు? యేసు ఇలా అన్నాడు: “ప్రజలు భయం వల్ల, లోకం మీదికి రాబోతున్నవాటి గురించి ఎదురుచూడడం వల్ల సొమ్మసిల్లుతారు. ఎందుకంటే ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.” (లూకా 21:26) మానవ చరిత్రలో ఇంతకుముందెన్నడూ జరగని ఘోరమైన పరిస్థితుల గురించి యేసు వర్ణిస్తున్నాడు.

సంతోషకరమైన విషయం ఏంటంటే, “మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో” వచ్చినప్పుడు, అందరూ ఆ ప్రజల్లా బాధపడుతూ ఉండరని యేసు స్పష్టం చేశాడు. (మత్తయి 24:30) “ఎంచుకోబడినవాళ్ల” తరఫున దేవుడు కలగజేసుకుంటాడని యేసు ఇంతకుముందే చెప్పాడు. (మత్తయి 24:22) మరి ఆ నమ్మకమైన శిష్యులు యేసు చెప్తున్న భయంకరమైన సంఘటనలకు ఎలా స్పందించాలి? యేసు తన అనుచరుల్ని ఇలా ప్రోత్సహించాడు: “ఇవి జరగడం మొదలైనప్పుడు మీరు స్థిరంగా నిలబడి మీ తలలు ఎత్తుకోండి; ఎందుకంటే మీ విడుదల దగ్గరపడుతోంది.”—లూకా 21:28.

మరి యేసు చెప్పిన ఆ సమయంలో జీవించే శిష్యులు, అంతం దగ్గరపడిందని ఎలా గుర్తుపడతారు? యేసు చెప్పిన అంజూర చెట్టు ఉదాహరణ అందుకు సహాయం చేస్తుంది: “ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, లేతగా తయారై చిగురించగానే ఎండాకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది. అదేవిధంగా, ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించిపోదు.”—మత్తయి 24:32-34.

ఆ విధంగా, యేసు చెప్పిన సూచనలోని అనేక అంశాలు నెరవేరడం చూసినప్పుడు, అంతం దగ్గరపడిందని ఆయన శిష్యులు గుర్తుపట్టాలి. ఆ ప్రాముఖ్యమైన కాలంలో జీవించే తన శిష్యులకు యేసు ఈ సలహా ఇచ్చాడు:

“ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు. పరలోకంలోని దూతలకు గానీ, కుమారుడికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు. మానవ కుమారుడి ప్రత్యక్షత నోవహు రోజుల్లాగే ఉంటుంది. జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు. జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.” (మత్తయి 24:36-39) నోవహు కాలంలో జలప్రళయం భూవ్యాప్తంగా వచ్చినట్లే, మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా భూవ్యాప్తంగా జరుగుతుందని యేసు చెప్తున్నాడు.

ఒలీవల కొండ మీద యేసు చెప్తున్నవాటిని వింటున్న అపొస్తలులు, అప్రమత్తంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తప్పకుండా అర్థం చేసుకొనివుంటారు. యేసు ఇలా చెప్పాడు: “మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి. అతిగా తినడం వల్ల, అతిగా తాగడం వల్ల, జీవిత చింతల వల్ల మీ హృదయాలు ఎన్నడూ ఉక్కిరిబిక్కిరి కాకుండా చూసుకోండి. లేకపోతే ఆ రోజు అకస్మాత్తుగా ఒక ఉచ్చులా మీ మీదికి వస్తుంది. ఎందుకంటే అది భూమంతటా ఉన్న వాళ్లందరి మీదికి వస్తుంది. కాబట్టి, జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకొని మానవ కుమారుడి ముందు నిలబడగలిగేలా మీరు ఎప్పుడూ పట్టుదలగా ప్రార్థిస్తూ, మెలకువగా ఉండండి.”—లూకా 21:34-36.

తన ప్రవచనం కేవలం ఆ కాలానికి మాత్రమే పరిమితం కాదని యేసు మళ్లీ చెప్తున్నాడు. కేవలం రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరిగే సంఘటనల గురించి, యెరూషలేముకు లేదా యూదా జనాంగానికి జరిగేవాటి గురించి యేసు ప్రవచించట్లేదు. బదులుగా, “భూమంతటా ఉన్న వాళ్లందరి మీదికి” వచ్చే సంఘటనల గురించి యేసు మాట్లాడుతున్నాడు.

తన శిష్యులు అప్రమత్తంగా, మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు హెచ్చరిస్తున్నాడు. దాన్ని నొక్కిచెప్పడానికి ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు: “ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాత్రి ఏ సమయంలో దొంగ వస్తున్నాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే, అతను మెలకువగా ఉండి ఆ దొంగను ఇంట్లో చొరబడనివ్వడు. కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.”—మత్తయి 24:43, 44.

తన శిష్యులు సంతోషించదగ్గ ఒక విషయం గురించి యేసు చెప్పాడు. తన ప్రవచనం నెరవేరుతున్న కాలంలో, ఒక “దాసుడు” అప్రమత్తంగా, చురుగ్గా ఉంటాడని యేసు హామీ ఇచ్చాడు. అపొస్తలులు ఊహించుకోగల ఒక సన్నివేశాన్ని యేసు చెప్పాడు: “తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని వాళ్లమీద నియమించిన నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు? యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే, ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు! నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఆయన ఆ దాసుణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు.” ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడిగా తయారై తోటివాళ్లతో సరిగ్గా నడుచుకోకపోతే, యజమాని వచ్చి “అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు.”—మత్తయి 24:45-51; లూకా 12:45, 46 పోల్చండి.

అయితే, తన అనుచరుల్లో కొంతమంది చెడ్డవాళ్లుగా తయారౌతారని యేసు చెప్పట్లేదు. మరి శిష్యులకు ఆయన ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నాడు? వాళ్లు అప్రమత్తంగా, చురుగ్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని ఆయన మరో ఉదాహరణలో స్పష్టం చేశాడు.