కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

112వ అధ్యాయం

మెలకువగా ఉండడం గురించి పాఠం​—⁠పదిమంది కన్యలు

మెలకువగా ఉండడం గురించి పాఠం​—⁠పదిమంది కన్యలు

మత్తయి 25:1-13

  • పదిమంది కన్యల ఉదాహరణ

తన ప్రత్యక్షతకు, వ్యవస్థ ముగింపుకు సూచన ఏంటని అపొస్తలులు అడిగిన ప్రశ్నకు యేసు జవాబివ్వడం ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు ఆయన మరో ఉదాహరణ చెప్తూ వాళ్లకు ఒక తెలివైన సలహా ఇచ్చాడు. ఆ ఉదాహరణలోని విషయాలు నెరవేరడాన్ని యేసు ప్రత్యక్షతా కాలంలో జీవించేవాళ్లు చూస్తారు.

ఆయన ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు: “పరలోక రాజ్యాన్ని, దీపాలు పట్టుకొని పెళ్లికుమారుణ్ణి కలవడానికి వెళ్లిన పదిమంది కన్యలతో పోల్చవచ్చు. వాళ్లలో ఐదుగురు బుద్ధిలేని వాళ్లు, ఐదుగురు బుద్ధిగల వాళ్లు.”—మత్తయి 25:1, 2.

పరలోక రాజ్యంలో ప్రవేశించే తన శిష్యుల్లో సగం మంది బుద్ధిగల వాళ్లని, సగం మంది బుద్ధిలేని వాళ్లని యేసు చెప్పట్లేదు. బదులుగా, రాజ్యంలోకి ప్రవేశించేలా మెలకువగా ఉండాలో వద్దో నిర్ణయించుకునే సామర్థ్యం వాళ్లలో ప్రతీఒక్కరికి ఉందని ఆయన చెప్తున్నాడు. తన సేవకుల్లో ప్రతీఒక్కరు చివరివరకు నమ్మకంగా ఉండగలరని, తన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు పొందగలరని యేసు నమ్ముతున్నాడు.

ఈ ఉదాహరణలో పెళ్లికుమారుణ్ణి ఆహ్వానించడానికి, ఆ ఊరేగింపులో పాల్గొనడానికి పదిమంది కన్యలూ వెళ్లారు. పెళ్లికుమారుడు వచ్చి పెళ్లికూతుర్ని ఆమె కోసం సిద్ధం చేసిన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, దారిపొడవునా వెలుతురు ఉండేలా కన్యలు తమ దీపాలు పట్టుకుంటారు. అలా వాళ్లు అతన్ని గౌరవిస్తారు. మరి ఈ ఉదాహరణలోని పదిమంది కన్యలు అలా చేశారా?

యేసు ఇలా వివరించాడు: “బుద్ధిలేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు కానీ అదనంగా నూనె తీసుకెళ్లలేదు. అయితే బుద్ధిగల కన్యలు దీపాలతో పాటు బుడ్డీల్లో నూనె కూడా తీసుకెళ్లారు. పెళ్లికుమారుడు ఆలస్యం చేసేసరికి ఆ కన్యలందరూ కునికిపాట్లు పడి, నిద్రపోయారు.” (మత్తయి 25:3-5) వాళ్లు అనుకున్నంత త్వరగా పెళ్లికుమారుడు రాలేదు. అతను చాలా ఆలస్యం చేస్తున్నట్లు వాళ్లకు అనిపించింది. దాంతో వాళ్లు నిద్రలోకి జారుకున్నారు. యేసు మాటలు విన్న అపొస్తలులకు, ‘గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను దూర దేశానికి వెళ్లి కొంతకాలం తర్వాత రాజ్యాధికారం సంపాదించుకొని తిరిగిరావడం’ గురించి యేసు చెప్పిన ఉదాహరణ గుర్తొచ్చి ఉంటుంది.—లూకా 19:11-15.

పదిమంది కన్యల ఉదాహరణలో పెళ్లికుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో యేసు ఇలా వివరించాడు: “సరిగ్గా మధ్యరాత్రి, ‘పెళ్లికుమారుడు వచ్చేస్తున్నాడు! ఆయన్ని కలవడానికి వెళ్లండి’ అనే కేక వినిపించింది.” (మత్తయి 25:6) మరి కన్యలు సిద్ధంగా, మెలకువగా ఉన్నారా?

యేసు ఇలా చెప్పాడు: “అప్పుడు కన్యలందరూ లేచి తమ దీపాలు సిద్ధం చేసుకున్నారు. బుద్ధిలేని కన్యలు, ‘మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి, మీ దగ్గరున్న నూనెలో కొంచెం మాకు ఇవ్వండి’ అని బుద్ధిగల కన్యల్ని అడిగారు. అప్పుడు బుద్ధిగల కన్యలు, ‘ఈ నూనె మనందరికీ సరిపోదేమో. మీరు నూనె అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్లి కొనుక్కోండి’ అన్నారు.”—మత్తయి 25:7-9.

బుద్ధిలేని ఐదుగురు కన్యలు పెళ్లికుమారుడి రాకకోసం మెలకువగా, సిద్ధంగా లేరు. వాళ్ల దీపాల్లో సరిపడా నూనె లేకపోవడంతో వాళ్లు దాన్ని తెచ్చుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో యేసు ఇలా చెప్పాడు: “వాళ్లు కొనుక్కోవడానికి వెళ్తుండగా పెళ్లికుమారుడు వచ్చేశాడు. సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు, తర్వాత తలుపులు మూయబడ్డాయి. ఆ తర్వాత మిగతా ఐదుగురు కన్యలు కూడా వచ్చి, ‘అయ్యా, అయ్యా, మా కోసం తలుపు తెరువు!’ అన్నారు. అప్పుడు పెళ్లికుమారుడు, ‘నిజం చెప్తున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు.” (మత్తయి 25:10-12) సిద్ధంగా, మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో కదా!

ఆ ఉదాహరణలోని పెళ్లికుమారుడు యేసేనని అపొస్తలులు గ్రహించివుంటారు. ఎందుకంటే యేసు ఒక సందర్భంలో తనను తాను పెళ్లికుమారుడితో పోల్చుకున్నాడు. (లూకా 5:34, 35) మరి బుద్ధిగల కన్యలు ఎవరు? రాజ్యాన్ని పొందే “చిన్నమంద” గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీ నడుం కట్టుకొని సిద్ధంగా ఉండండి, మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి.” (లూకా 12:32, 35) కాబట్టి ఆ ఉదాహరణలోని కన్యలు తమ లాంటి నమ్మకమైన శిష్యుల్ని సూచిస్తున్నారని అపొస్తలులు గ్రహించేవుంటారు. ఆ ఉదాహరణ ద్వారా యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడు?

అదేంటో స్పష్టం చేస్తూ ఆయన ఇలా ముగించాడు: “అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.”—మత్తయి 25:13.

నమ్మకమైన అనుచరులు తన ప్రత్యక్షత విషయంలో ‘అప్రమత్తంగా ఉండాలని’ యేసు చెప్తున్నాడు. ఆయన వచ్చేసరికి వాళ్లు ఆ ఉదాహరణలోని ఐదుగురు బుద్ధిగల కన్యల్లా సిద్ధంగా, మెలకువగా ఉండాలి. అప్పుడే వాళ్లు తమ అమూల్యమైన నిరీక్షణ మీద మనసుపెడుతూ, తమ బహుమానాన్ని చేజార్చుకోకుండా ఉంటారు.