కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

114వ అధ్యాయం

క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు, మేకలకు తీర్పు తీరుస్తాడు

క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు, మేకలకు తీర్పు తీరుస్తాడు

మత్తయి 25:31-46

  • గొర్రెల, మేకల ఉదాహరణ

యేసు ఇంకా ఒలీవల కొండ మీదే ఉన్నాడు. తన ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏంటని అపొస్తలులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యేసు పదిమంది కన్యల ఉదాహరణ, తలాంతుల ఉదాహరణ చెప్పాడు. ఆయన చివరిగా గొర్రెల, మేకల ఉదాహరణ చెప్పి ఆ జవాబును ముగించాడు.

యేసు ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు: “మానవ కుమారుడు తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుంటాడు.” (మత్తయి 25:31) ఆ ఉదాహరణలోని ముఖ్యమైన వ్యక్తి యేసే అని అర్థమౌతుంది. ఎందుకంటే, “మానవ కుమారుడు” తానేనని ఆయన చాలాసార్లు చెప్పాడు.—మత్తయి 8:20; 9:6; 20:18, 28.

ఈ ఉదాహరణలోని విషయాలు ఎప్పుడు నెరవేరతాయి? యేసు “తన తేజస్సుతో దేవదూతలందరితో” కలిసి వచ్చి, “తన మహిమాన్విత సింహాసనం మీద” కూర్చున్నప్పుడు నెరవేరతాయి. “మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో” తన దేవదూతలతో కలిసి “ఆకాశ మేఘాల మీద రావడం” గురించి యేసు అంతకుముందు కూడా చెప్పాడు. అది ఎప్పుడు జరుగుతుంది? “శ్రమ ముగిసిన వెంటనే” జరుగుతుంది. (మత్తయి 24:29-31; మార్కు 13:26, 27; లూకా 21:27) కాబట్టి భవిష్యత్తులో యేసు తన మహిమతో వచ్చినప్పుడు ఆ ఉదాహరణలోని విషయాలు నెరవేరతాయి. అలా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు?

యేసు ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు . . . వచ్చినప్పుడు . . . అన్నిదేశాల వాళ్లు ఆయన ముందు సమకూర్చబడతారు. గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెల్ని వేరుచేసినట్టు ఆయన, ప్రజల్ని రెండు గుంపులుగా వేరుచేస్తాడు. గొర్రెల్ని తన కుడివైపున, మేకల్ని తన ఎడమవైపున ఉంచుతాడు.”—మత్తయి 25:31-33.

కుడి వైపున్న గొర్రెలకు ఏం జరుగుతుందో యేసు చెప్పాడు: “అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాళ్లతో ఇలా అంటాడు: ‘నా తండ్రి దీవించినవాళ్లారా, రండి. ప్రపంచం పుట్టిన దగ్గర నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యానికి వారసులు అవ్వండి.’” (మత్తయి 25:34) గొర్రెలు ఎందుకు రాజు ఆమోదాన్ని పొందారు?

రాజు ఇలా వివరించాడు: “ఎందుకంటే, నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టారు; నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇచ్చారు. నేను పరాయివాడిగా ఉన్నప్పుడు నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించారు; బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు మీరు నా బాగోగులు చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు.” ‘నీతిమంతులైన’ గొర్రెలు మేము ఇవన్నీ ఎప్పుడు చేశామని రాజును అడిగారు. దానికి రాజు ఇలా జవాబిచ్చాడు: “ఈ నా సహోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేసిందేదైనా నాకు చేసినట్టే.” (మత్తయి 25:35, 36, 40, 46) వాళ్లు ఆ మంచి పనులన్నీ చేసింది పరలోకంలో కాదు, ఎందుకంటే అనారోగ్యంతో, ఆకలితో ఉండేవాళ్లు అక్కడ ఉండరు. కాబట్టి అవి, భూమ్మీదున్న క్రీస్తు సహోదరుల కోసం చేసిన మంచి పనులే అయ్యుండాలి.

ఎడమ వైపున్న మేకలకు ఏం జరుగుతుందో యేసు చెప్పాడు: “తర్వాత ఆయన [రాజు] తన ఎడమవైపున ఉన్నవాళ్లతో ఇలా అంటాడు: ‘శపించబడినవాళ్లారా, నా దగ్గర నుండి వెళ్లిపోండి. అపవాదికి, అతని చెడ్డదూతలకు సిద్ధం చేయబడిన నిత్యాగ్నిలోకి వెళ్లండి. ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టలేదు; నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇవ్వలేదు. నేను పరాయివాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఇంట్లోకి ఆహ్వానించలేదు; నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వలేదు; నాకు ఆరోగ్యం బాలేనప్పుడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకోలేదు.’” (మత్తయి 25:41-43) ఆ తీర్పు సరైనదే, ఎందుకంటే భూమ్మీదున్న క్రీస్తు సహోదరులతో దయగా వ్యవహరించడంలో మేకలు విఫలమయ్యారు.

భవిష్యత్తులో జరిగే ఆ తీర్పు వల్ల వచ్చే పర్యవసానాలు శాశ్వత కాలం ఉంటాయని అపొస్తలులు అర్థం చేసుకున్నారు. యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “ఆయన [రాజు] వాళ్లతో ఇలా అంటాడు: ‘నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఈ నా సహోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేయలేదు కాబట్టి నాకూ చేయనట్టే.’ వీళ్లు శాశ్వతంగా నాశనమౌతారు, కానీ నీతిమంతులు శాశ్వత జీవితాన్ని పొందుతారు.”—మత్తయి 25:45, 46.

అపొస్తలులు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబులో ఎన్నో పాఠాలున్నాయి. క్రీస్తు అనుచరులు తమ ఆలోచనా విధానాన్ని, పనుల్ని పరిశీలించుకోవడానికి అవి సహాయం చేస్తాయి.