కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

119వ అధ్యాయం

యేసే మార్గం, సత్యం, జీవం

యేసే మార్గం, సత్యం, జీవం

యోహాను 14:1-31

  • యేసు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాడు

  • ఒక సహాయకుణ్ణి పంపిస్తానని మాటిచ్చాడు

  • యేసు కన్నా తండ్రి గొప్పవాడు

జ్ఞాపకార్థ ఆచరణ పూర్తయిన తర్వాత, యేసు ఇంకా తన అపొస్తలులతోపాటు మేడగదిలోనే ఉన్నాడు. ఆయన వాళ్లను ఇలా ప్రోత్సహించాడు: “ఆందోళన పడకండి. దేవుని మీద విశ్వాసం చూపించండి; నా మీద కూడా విశ్వాసం చూపించండి.”—యోహాను 13:36; 14:1.

తాను వెళ్లిపోతున్నందుకు ఆందోళన పడొద్దని యేసు తన నమ్మకమైన అపొస్తలులకు చెప్పాడు. దానికి గల కారణాన్ని ఆయన ఇలా వివరించాడు: “నా తండ్రి ఇంట్లో చాలా నివాసాలు ఉన్నాయి. . . . నేను వెళ్లి మీ కోసం స్థలం సిద్ధం చేశాక, మళ్లీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు.” ఆయన పరలోకానికి వెళ్లడం గురించి మాట్లాడుతున్నాడని వాళ్లకు అర్థంకాలేదు. తోమా ఇలా అడిగాడు: “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలీదు. మరి ఆ మార్గం ఎలా తెలుస్తుంది?”—యోహాను 14:2-5.

అప్పుడు యేసు, “నేనే మార్గం, సత్యం, జీవం” అన్నాడు. తండ్రి ఇంట్లోకి అంటే పరలోకంలోకి ప్రవేశించాలంటే యేసును, ఆయన బోధల్ని అంగీకరించి ఆయనలా జీవించడం ఒక్కటే మార్గం. యేసు ఇలా అన్నాడు: “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.”—యోహాను 14:6.

ఆ మాటల్ని శ్రద్ధగా వింటున్న ఫిలిప్పు ఇలా అడిగాడు: “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, అది చాలు.” అంతకుముందు మోషే, ఏలీయా, యెషయా దర్శనాల ద్వారా దేవుని మహిమను చూశారు. ఫిలిప్పు కూడా ఆ విధంగా దేవుని మహిమను చూడాలని కోరుకుంటుండవచ్చు. నిజానికి, ఆ దర్శనాల కన్నా గొప్ప రుజువు అపొస్తలుల కళ్ల ముందే ఉంది. అదేంటో వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నువ్వు నన్ను తెలుసుకోలేదా? నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” యేసు తండ్రి లక్షణాల్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు, కాబట్టి యేసును చూస్తే తండ్రిని చూసినట్లే. అయితే, కుమారుని కన్నా తండ్రే గొప్పవాడని చెప్పడానికి యేసు ఇలా అన్నాడు: “నేను మీతో చెప్పే విషయాలు నా అంతట నేనే చెప్పట్లేదు.” (యోహాను 14:8-10) యేసు ఎన్నో విషయాలు బోధించాడు, ఆయన ఆ ఘనతంతా తండ్రికే ఇవ్వడాన్ని అపొస్తలులు చూశారు.

యేసు అద్భుతాలు చేయడం, దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడం అపొస్తలులు చూశారు. ఇప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్తున్నాడు: “నామీద విశ్వాసం చూపించే వ్యక్తి కూడా నేను చేసే పనులు చేస్తాడు; అంతకన్నా గొప్ప పనులు కూడా చేస్తాడు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.” (యోహాను 14:12) అపొస్తలులు తనకన్నా గొప్ప అద్భుతాలు చేస్తారని యేసు చెప్పట్లేదు. బదులుగా వాళ్లు ఎన్నో ప్రాంతాల్లో, ఎక్కువమంది ప్రజలకు, చాలాకాలంపాటు మంచివార్త ప్రకటిస్తారని ఆయన చెప్తున్నాడు.

యేసు వాళ్లను ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోవట్లేదు. ఆయన వాళ్లకు ఇలా మాటిచ్చాడు: “మీరు నా పేరున ఏమి అడిగినా నేను చేస్తాను.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను తండ్రిని అడుగుతాను, మీతో ఎప్పటికీ ఉండేలా ఆయన మీకు ఇంకో సహాయకుణ్ణి ఇస్తాడు. అంటే సత్యాన్ని వెల్లడిచేసే పవిత్రశక్తిని మీకు ఇస్తాడు.” (యోహాను 14:14, 16, 17) వాళ్లు ఇంకో సహాయకుణ్ణి అంటే పవిత్రశక్తిని పొందుతారని యేసు వాళ్లకు హామీ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టే, వాళ్లు పెంతెకొస్తు రోజున పవిత్రశక్తిని పొందారు.

యేసు ఇలా అన్నాడు: “కొంత సమయం తర్వాత లోకం ఇక ఎప్పుడూ నన్ను చూడదు. కానీ మీరు నన్ను చూస్తారు; ఎందుకంటే నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారు.” (యోహాను 14:19) యేసు పునరుత్థానమై పరలోకానికి వెళ్లకముందు శిష్యులు ఆయన్ని చూస్తారు, అంతేకాదు భవిష్యత్తులో ఆయనతోపాటు పరలోకంలో ఉంటారు.

తర్వాత, యేసు వాళ్లకు ఈ సరళమైన సత్యాన్ని చెప్పాడు: “నా ఆజ్ఞల్ని అంగీకరించి, వాటిని పాటించేవాళ్లు నన్ను ప్రేమిస్తున్నారు. నన్ను ప్రేమించేవాళ్లను నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా వాళ్లను ప్రేమించి, నన్ను నేను వాళ్లకు స్పష్టంగా చూపించుకుంటాను.” అప్పుడు తద్దయి అనే పేరున్న అపొస్తలుడైన యూదా ఇలా అడిగాడు: “ప్రభువా, నువ్వు లోకానికి కాకుండా మాకే నిన్ను నువ్వు ఎందుకు స్పష్టంగా చూపించుకోవాలని అనుకుంటున్నావు?” అందుకు యేసు ఇలా అన్నాడు: “ఎవరైనా నన్ను ప్రేమిస్తే, అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. . . . నా మీద ప్రేమ లేనివాడు నా మాటల్ని పాటించడు.” (యోహాను 14:21-24) యేసే మార్గం, సత్యం, జీవం అని ఆయన అనుచరులు గుర్తించినట్లుగా లోకం గుర్తించదు.

యేసు వెళ్లిపోబోతున్నాడు కాబట్టి శిష్యులు ఆయన బోధించిన వాటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోగలరు? ఆయన ఇలా చెప్పాడు: “తండ్రి నా పేరున పంపించే సహాయకుడు అంటే పవిత్రశక్తి అన్ని విషయాల్ని మీకు బోధిస్తాడు, నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తుచేస్తాడు.” పవిత్రశక్తి సహాయంతో యేసు చేసిన వాటన్నిటిని అపొస్తలులు చూశారు కాబట్టి ఆ మాటలు వాళ్లకు ధైర్యాన్ని, ఊరటను ఇచ్చివుంటాయి. యేసు ఇంకా ఇలా అన్నాడు: “నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను . . . ఆందోళన పడకండి, భయపడకండి.” (యోహాను 14:26, 27) తండ్రి వాళ్లకు నిర్దేశాన్ని, కాపుదలను ఇస్తాడు కాబట్టి వాళ్లు ఆందోళన పడాల్సిన అవసరంలేదు.

దేవుని కాపుదలకు రుజువును వాళ్లు త్వరలోనే చూస్తారు. యేసు ఇలా చెప్పాడు: “ఈ లోక పరిపాలకుడు వస్తున్నాడు, అతనికి నా మీద ఎలాంటి పట్టూ లేదు.” (యోహాను 14:30) అపవాది యూదాలోకి ప్రవేశించి అతన్ని తన అదుపులో ఉంచుకోగలిగాడు. కానీ యేసులో పాపం, బలహీనత లేవు కాబట్టి సాతాను ఆయన్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పలేడు. అంతేకాదు ఆయన్ని మరణంలో బంధించి ఉంచలేడు. ఎందుకంటే తండ్రి ఆయన్ని పునరుత్థానం చేస్తాడు. ఆ నమ్మకంతోనే యేసు ఇలా అన్నాడు: “తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను.”—యోహాను 14:31.